స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి బోనాల పండుగ ఒక సంబుర సందర్భం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిక్రితం ప్రారంభమైన ‘కేసీఆర్ కిట్స్’ పథకం గురించి నాలుగు మంచి మాటలు పంచుకోవాలి. అనేక విషయాల్లో ఇది సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతోందని చెప్పాలి.ఒక రెండు అంశాల్లోనైతే ముఖ్యమంత్రిని మనసారా అభినందించడం కనీస ధర్మం అంటే అతిశయోక్తి కాదు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అన్ని విషయాల్లో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసే పథకాలు చేపట్టింది. అందులో కేసీఆర్ కిట్స్ ఒకటి. ఇది ఒక రకంగా ప్రభుత్వ బాధ్యతను పునరుద్ఘాటించే పథకం. దశాభ్దాల జీవన విధ్వంసం స్థానే నవ తెలంగాణలో సరికొత్త చరిత్రను తిరగ రాసే ప్రయత్నం. ఆ దిశగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు పునరంకితం అవడం విశేషం. మారుటి తల్లి వంటి ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ‘నేనున్నాను గదా’ అంటూ తన వైపుకు బిడ్డలను తిప్పుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ఇప్పుడు సకల సౌకర్యాలకు, అత్యున్నత ప్రమాణాలకి నెలవుగా మారుతూ స్వరాష్ట్రంలో ‘స్వపరిపాలన’కు సరైన అర్థం చెబుతున్నాయి.
నవజాత తెలంగాణ
అవును మరి. స్వరాష్ట్రంలో మహిళలు, శిశువుల ఆరోగ్యం, వారి భద్రత గురించి కేసీఆర్ కిట్స్ పేరిట ప్రారంభం అయిన ‘అమ్మ ఒడి’ ఒక నూతన భరోసాను అందించడం మొదలయింది. ఏడాదిక్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమంతో ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రసవాల సంఖ్య అనూహ్యంగా పెరిగాయి. అలాగే, సహజ ప్రసవాల సంఖ్య కూడా పెరగుతున్నాయి. బిడ్డలకు టీకాలు వేయించడంలో కూడా అమిత శ్రద్ధ కాన వస్తున్నది. తొలుత పెద్ద ఆసుపత్రి నుంచి మొదలయి ఇప్పుడు మారుమూల ఉన్న ప్రాథమిక ఆసుపత్రుల్లో కూడా ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. అందుకు అధికారుల నిరంతర పర్యవేక్షణ ఒక కారణం కాగా మొత్తంగానే ప్రభుత్వ వైద్య సౌకర్యాల పెంపుకు కూడా తగిన చర్యలు తీసుకోవడం ప్రజల మెప్పు పొందేలా చేసింది. దీంతో బడుగు, బలహీన వర్గాలే కాదు, మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి కుటుంబాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వస్తున్నారు. నిజంగానే ‘అమ్మ ఒడి’లో సేద తీరి, . నిశ్చింతగా ప్రసవాలు చేసుకొని, సుమారు రెండు వేల రూపాయల విలువైన వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ తో ఇంటికి వెళుతున్నారు. గర్భిణిగా నమోదు చేసుకున్న నాటి నుంచి నవ మాసాలు నిండేలోగా మొత్తం నాలుగు విడతల్లో, ఆడ శిశువు అయితే 13 వేలు, మగ శిశువు అయితే 12 వేలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో నుంచి డ్రా చేసుకొని ఖర్చులకు వాడుకుంటున్నారు.
ఒక కార్యక్రమం అతి స్వల్ప కాలంలో ప్రజల్లో గొప్ప విశ్వాసాన్ని నెలకొల్పి, ఒక ప్రభుత్వ విభాగంఫై నిండు విశ్వాసాన్ని కలిగిస్తూ ఆరోగ్య తెలంగాణకు ఆలంభనగా మారడాన్ని గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. కాగా, ఈ పథకం వల్ల వస్తోన్న మార్పుల్లో ఒక రెండు అంశాలు చెప్పుకోవలసిందే.
మొదటగా కుటుంబ సంబంధాల్లో ఆధిపత్య వైఖరిని నిదానంగా సవరిస్తున్న పథకంగా ‘కేసీఆర్ కిట్’ ఒక చిరు విప్లవమే తెస్తున్నది. అందుకు ఒక ఉదాహరణ అత్తగారి వైఖరిలో మార్పు తెస్తుండటం.
అత్తగారి వైఖరి మారెను!
తెలంగాణలో తొలి కాన్పు సాధారణంగా తల్లిగారు చేసి పంపుతారు. మలి కాన్పు అత్తవారింట్లో జరుగుతుంది. ఇప్పుడు రోజులు మారాయి. ఇండ్లల్లో కాన్పులు తక్కువే అయ్యాయి. ఎందుకైనా మంచిదని హాస్పిటల్స్ కి వెళ్ళక తప్పడం లేదు. అయితే, కుటుంబ సంబంధాల్లో కోడలు విషయంగా తల్లిగారి ఇంటిపై అత్తగారిదే ఫై చేయి అని అందరికీ తెలిసిందే. ఈ కారణంగా తొలి కాన్పు జరిపే తల్లి గారి ఇంటిఫై అనధికార హుకుం ఒకటి ఉండనే ఉంటుంది. దాంతో ఆర్థికంగా ఉన్నా లేకపోయినా ఏదో విధంగా ప్రైవేటు ఆసుపత్రిలోనే తమ బిడ్డ ప్రసవానికి తల్లి గారు ఏర్పాట్లు చేసుకోవడం తప్పడం లేదు. ఐతే, ఈ వైఖరిలో చెప్పుకోదగిన మార్పు రావడానికి ‘కేసిఆర్ కిట్స్’ ఒక ముఖ్య కారణంగా మారుతోందని మీకు తెలుసా?
అవును మరి. గాంధీ ఆస్పత్రి లో కేసీఆర్ కిట్స్ నోడల్ ఆఫీసర్ డా.పి.రజని రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, తమ హాస్పిటల్లో సాధారణంగా అత్తవారు అధికంగా తమ కోడళ్ళను జాయిన్ చేయిస్తుంటారని అన్నారు. ఇందుకు కారణం, తొలి కాన్పు తల్లిగారు చేపిస్తారు. ముందే చెప్పినట్లు ప్రైవేటు హాస్పిటల్లలో చేపించి ఉంటారు. అక్కడ సిజేరియన్ అవడం మామూలే. ఇప్పుడు మల్లీ సిజేరియన్ చేయవలసిందే కనుక…కొన్ని సార్లు హైరిస్క్ కేసుల వల్ల కూడా మలి కాన్పు కోసం ఇక్కడికి వస్తారని వివరించారు.
“ఇదమిద్దంగా ‘ఇదీ’ అని అనలేము గాని ఉన్నమాట చెప్పాలంటే అటు డబ్బులు ఆదా, ఇటు సౌకర్యాలకు సౌకర్యాలు. కనుక రెండో కాన్పు కోసం అత్తగారింటి వారు గాంధి ఆసుపత్రికి రావడం అధికం” అని చెప్పారావిడ.అయితే, కేసీఆర్ కిట్స్ పథకం ప్రారంభం అయ్యాక తల్లి గారు ధైర్యం చేసి ప్రభుత్వ ఆసుపత్రి లో కాన్పు చేయిస్తున్నారని ఆవిడ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఖరి పెరుగుతున్నదని వివరించారు. ఇందుకు ఒక కారణం ప్రభుత్వ ప్రచారం పెరగడం, అధికారుల నిరంతర పర్యవేక్షణ, అలాగే, నాలుగు విడతల్లో పన్నెండు, పదమూడు వేల రూపాయల సహాయం అందడం. దానికి తోడు, శిశువుకు అత్యవసరంగా ఉపయోగపడే రెండు వేల విలువైన సరంజమా కిట్ ద్వారా పొందడం.
మొత్తంగా ప్రభుత్వం ‘కేసీఆర్ కిట్స్’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా సౌకర్యాల పెంపు ఫై దృష్టి పెట్టింది. దాంతో తల్లి గారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే తప్పు పట్టే పరిస్థితి మునుపటిలా లేదు.ఇదొక కొత్త సంగతి. నిజంగానే ఇదొక సానుకూల మార్పు. ఇదొక్కటి చాలు, ఈ పథకం ఏర్పడకుండానే ప్రజల జీవన విధానంలో పెను మార్పు తెస్తోందని చెప్పడానికి. కాగా, భర్తల్లోనూ ఈ పథకం చెప్పుకోదగిన మార్పు తేవడం రెండో విషయం.
భర్తల వైఖరిలోనూ మార్పు మొదలయింది!
రాష్ట్ర రాజధానిలో కాన్పులకు పేరొందిన ‘జడ్జి ఖాన’( పెట్లబుర్జు ఆసుపత్రి) కు అధికంగా వచ్చేది పాతబస్తీ లోని ముస్లిం ప్రజానీకం…అలాగే హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న జిల్లాల్లోని గిరిజన మహిళలు. వీరి వెంట పురుషులు తోడుగా రావడం ఇటీవలి పరిణామమే. ఇది కేసీఆర్ కిట్స్ పథకం వల్ల కనిపిస్తున్న రెండో మార్పు.చిత్రంగా ఉంటుంది గానీ నిజం. కేసీఆర్ కిట్స్ పథకం వల్ల గర్భిణీలకు మున్నెన్నడూ లేని గౌరవం దక్కుతోంది. వారికి ఇంటా బయటా అదరణ పెరుగుతోంది. ఇపుడిప్పుడే భార్య వెంట భర్త వచ్చి పరీక్షలు చేయించడం కూడా కనిపిస్తోంది. కాన్పు అయ్యాక ఇంటికి తల్లీ బిడ్డలను శ్రద్ధగా తీసుకెళ్లడం, తదుపరి టీకాలు వేయించడానికి తిరిగి తీసుకు రావడమూ హైదరాబాద్ లోని ‘జడ్జి ఖాన’లో కానవస్తున్న విశేషం. ఇది వరకు కాన్పు అంటే అది తల్లి సమస్యే అన్నట్లు ఉండేది. ఇపుడిపుడు అది దంపతుల ఇరువురి బాధ్యత గా గుర్తింపులోకి రావడం ఒక విశేషం. ఇందుకు కేసీఆర్ కిట్స్ పథకం ఒక కారకంగా మారడం చెప్పుకోదగిన విషయం.
“ఒక మహిళ పేరిట బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి అంటే అనివార్యంగా ఆమెను ఒక వ్యక్తిగా గౌరవించడం మొదలవుతుంది. ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకోవడం, ఇతరత్రా ఆమెను బాగా చూసుకోవడం మొదలవుతుంది. ఆర్థిక స్వాత్రంత్రం ఏ విధంగా చూసినా స్త్రీలకు అది వరకు లేని వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. ఆమె పేరిట ఒక బ్యాంక్ అకౌంట్, అందులో కొన్ని డబ్బులు పడటం అంటే తాత్కాలికంగా అయినా అది స్త్రీ ఉనికి పట్ల గౌరవం పెంచుతుంది. ఇటీవలి మాసాల్లో కనిపిస్తున్నది చిన్నదే అయినా అది చెప్పుకోదగిన మార్పు” అని పెట్ల బుర్జు (జడ్జి ఖానా) ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.నాగమణి అన్నారు.
తమ ఆసుపత్రిలోనే భర్తల వైఖరిలో మార్పు గమనిస్తున్నానని, అది మరింత స్పష్టంగా మరికొన్ని మాసాల్లో మిగతా చోట్ల కూడా చూస్తామని అన్నారావిడ. “భార్యను కాన్పు వరకు చూసుకోవడమే గగనంగా ఉండే మహిళకు తన భర్త టీకాలు వేయించడానికి మళ్లీ ఆసుపత్రికి తీసుకు రావడం సంతృప్తిని కలిగిస్తోంది. ఇలాంటి అనుభవాలు మాకు కూడా మొదటిసారి “ అన్నారావిడ.“ప్రైవేటు ఆసుపత్రి లో వేలకు వేలు పోయడం తప్పడమే గాక అదనంగా ఆర్ధిక సహాయం దొరకడం నిరుపేదలనే కాదు, మధ్య తరగతి వారినీ ఆకర్షిస్తున్నది. పన్నెండు పదమూడు వేలు అంటే గిరిజన, ముస్లిం మహిళలకు తక్కువేమీ కాదు” అన్నారావిడ.“అదీ గాక, ఈ పథకాన్ని మొదటి, రెండవ కాన్పులకే వర్తించడం వల్ల దీర్గకాలికంగా కుటుంబ నియంత్రణకు పురికొల్పుతుందని, అది పరిమిత కుటుంబం పట్ల సానుకూలతకు దోహదపడుతుందని కూడా ఆమె అభిప్రాయ పడ్డారు.
ముఖ్యమంత్రి మానస పుత్రిక ఏమైనా, ఒక కార్యక్రమం అతి స్వల్ప కాలంలో ప్రజల్లో గొప్ప విశ్వాసాన్ని నెలకొల్పి, ఒక ప్రభుత్వ విభాగంఫై నిండు విశ్వాసాన్ని కలిగిస్తూ ఆరోగ్య తెలంగాణకు ఆలంభనగా మారడం నిజంగానే ఈ పథకం విశిష్టత. దీనికి తోడు సామాజికంగా అనేక మార్పులను కారణం కావడం అదనపు ఘనత. ఇందుకు వైద్య సిబ్బందిని, అధికారులను అభినందించాలి. ముఖ్యంగా శ్రీ శిశు శాఖ కమిషనర్ వాకాటి కరుణ గారిని చెప్పుకోవాలి. అంతకన్నా ముందు ఈ పథకానికి అమిత ప్రాధ్యాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి.
ఇప్పటికే మహిళలు కేసీఆర్ ను గుండెల్లో పెట్టుకొంటున్నారు. నిండు దీవెనలు అందిస్తున్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా మేలు చేసే నాయకత్వాన్ని ఎవరు మాత్రం అభినందించరు?
శభాష్ కేసీఆర్ సార్.
Source Link: https://goo.gl/pCb7td