-ఇప్పుడు కండ్లముందు కనిపిస్తున్నది -ఈరోజు హృదయపూర్వక సంతోషం కలిగింది -గొప్ప సాఫల్యత సాధించిన భావనకు లోనయ్యా -సముద్రాన్ని తలపించేలా ఎస్సారార్ -తిలకించి, పులకించిన ముఖ్యమంత్రి కేసీఆర్ -గంగమ్మకు సీఎం జలహారతి.. పూజలు -కాళేశ్వరం పూర్తయితే సజీవంగా మానేరు నది -ఎస్సారెస్పీతో సంబంధం లేకుండా రెండు పంటలకు నీళ్లు -సిరిసిల్ల ప్రాంతం మరో పాపికొండలు కాబోతున్నది -మానేరుపై 29, మూలవాగుపై 10 చెక్‌డ్యామ్‌లు కడుతాం -1,230 కోట్లతో చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి పాలనా అనుమతులు -కరీంనగర్ జిల్లాకు కరువు పీడ తొలిగిపోయింది -కాంగ్రెస్, బీజేపీ నాయకులకు భౌగోళిక పరిస్థితులపై అవగాహన లేదు.. సాంకేతిక పరిజ్ఞానం సున్న -తీగలగుట్టపల్లి వద్ద మీడియాతో సీఎం కేసీఆర్

తాను కలలుగన్న తెలంగాణ ఇప్పుడు కండ్లముందు కనిపిస్తున్నదని, హృదయపూర్వక సంతోషం కలిగిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. మిడ్‌మానేరు ప్రాజెక్టుపై నిలబడి పూజచేస్తున్నప్పుడు గొప్ప సాఫల్యత సాధించిన భావనకు గురయ్యానన్నారు. సోమవారం శ్రీరాజరాజేశ్వర (మధ్య మానేరు) జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా సందర్శించారు. ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి వద్ద మానేరుపై నిర్మించిన బ్రిడ్జిపై కొద్దిసేపు ఆగారు. సముద్రాన్ని తలపిస్తున్నట్టు ఉన్న ఎస్సారార్ బ్యాక్‌వాటర్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యారు. శభాష్‌పల్లి వంతెనపై తన కాన్వాయ్‌ని నిలిపిన సమయంలో ప్రాజెక్టు నీళ్లను తనివితీరా చూశారు. బ్రిడ్జికి ఇరువైపులా కనుచూపు మేర నీరు కనిపించడంతో ఉప్పొంగిపోయారు. ఈ సమయంలో తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలనుద్దేశించి.. ‘నేను కలలుగన్న తెలంగాణ కండ్లముందు కనిపిస్తున్నది’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
వేములవాడకు వెళ్లి రాజరాజేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడినుంచి మిడ్‌మానేరు డ్యామ్ వద్దకు చేరుకుని కాళేశ్వరం జలాలకు పూజలుచేశారు. రిజర్వాయర్ నీటిలో పూలు వదిలి, హారతి ఇచ్చారు. అనంతరం తీగలగుట్టపల్లికి చేరుకుని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం జలాలతో 365 రోజులూ మానేరునది సజీవంగా ఉంటుందని, ఎస్సారెస్పీతో సంబంధం లేకుండానే ఇక్కడ రెండుపంటలు పండుతాయని చెప్పారు. కరీంనగర్‌కు కరువు పీడ తొలిగిపోయిందన్నారు. జిల్లాలో మానేరుపై 29, మూలవాగుపై 10 చెక్‌డ్యామ్‌లు నిర్మించడానికి రూ.530 కోట్లు మంజూరుచేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

కండ్లముందు 110 టీఎంసీలు సిరిసిల్ల మరో పాపికొండలను మించినది కాబోతున్నది. అద్భుత పర్యాటకప్రాంతంగా తీర్చిదిద్దుతాం. మిడ్‌మానేరు విజయవంతంగా పూర్తయిన సందర్భంలో సుమారు 50, 60 టీఎంసీలు కాళేశ్వరం కింద ఎస్సారెస్పీతో సంబంధం లేకుండా ఎత్తిపోసుకున్నం. ఫలితంగా ఎంఎండీ, ఎల్‌ఎండీ ఫుల్‌గా ఉన్నాయి. దీనిద్వారా ఎస్సారెస్పీతో సంబంధం లేకుండా దిగువన కొత్త ఆయకట్టు, గౌరవెల్లి ఆయకట్టు కలుపుకొని రెండుపంటలు పండుతాయి. ఈ రెండు డ్యాంలలో 50 టీఎంసీలు, కాళేశ్వరం బరాజ్‌లలో 60 టీఎంసీలు కలుపుకొని.. 110 టీఎంసీల నీళ్లు ఉంటయి. వినియోగించలేని, డెడ్‌స్టోరేజీ కింద 20 టీఎంసీలు మినహాయించినా 90 టీఎంసీలు వాడుకోవచ్చు. అదనంగా 12 నెలలు ప్రాణహిత, గోదావరిలో డిసెంబర్‌లో 17 టీఎంసీలు, జనవరిలో 10 టీఎంసీలు వస్తాయి.
శాశ్వతంగా కరువు పీడ తొలిగింది ఈ పాంతానికి శాశ్వతంగా కరువు పీడ తొలిగిపోయింది. వర్షంచుక్క పడకున్నా రైతాంగం మొగులుకు మొఖం చూడకుండా నిశ్చింతగా.. అద్భుతంగా రెండుపంటలు పండించుకునే అవకాశం లభించింది. ఈ విషయాన్ని 2001 ఏప్రిల్‌లో కరీంనగర్ ఎస్సార్ కాలేజీలో జరిగిన తొలి సింహగర్జన సభలోనే చెప్పాను. వరంగల్, కరీంనగర్, కొంతమేర నిజామాబాద్, దిగువన ఖమ్మం జిల్లాల్లో పెద్ద కరువు ఉంటది. గోదావరి ఒరుసుకొని పారే జిల్లాల్లో కరువు ఉండటం అహేతుకం. కాళేశ్వరం జలాల మొదటి లబ్ధిదారులుగా ఈ జిల్లాలు ఉంటయి. సస్యశామలం అవుతయి. తెలంగాణ సాకారమైతే గోదావరి డెల్టాల కంటే అద్భుతంగా ఈ జిల్లాలు ఉంటాయని ఆ రోజు చెప్పిన.

1230 చెక్‌డ్యాంలకు అనుమతులు రాష్ట్రాన్ని అనేక విషయాల్లో, ప్రత్యేకంగా సాగునీటిరంగం విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్స్‌రే కండ్లతో చూసింది. చాలా జిల్లాల్లో ఆ జిల్లాల సోకాల్డ్ సీనియర్ నాయకులకు, గొప్పోళ్లమని డంబాలు కొట్టే నాయకులకు తెలియదు. రాష్ట్రవ్యాప్తంగా ఉండే వాగులు, వంకలు, ఉపనదులపై 1230 చెక్‌డ్యామ్‌లు నిర్మించడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో సింహభాగం కరీంనగర్ జిల్లాకే వచ్చినయి. రెండేండ్లలో చెక్‌డ్యామ్‌లు నిర్మించాలనే టైమ్‌బౌండ్ కార్యక్రమం ఇది.
నాలుగు జీవధారలతో పాలుగారే జిల్లా కరీంనగర్ జిల్లాకు నీళ్లు వచ్చినయి. నీళ్లు చూసిన తర్వాత చిన్ననీటిపారుదల సీఈని పిలిచి సమీక్షించాను. అర్జంటుగా రెండు వాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి టెండర్లు పిలువమని చెప్పాను. మానేరుపై 29, మూలవాగుపై 10 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలుస్తారు. జూన్‌లో ఈ చెక్‌డ్యామ్‌లు నిండాలి. గోదావరి సజీవంగా ఉంటది.. కాకతీయ కాల్వ తొమ్మిదినెలలు సజీవంగా ఉంటది.. వరదకాల్వ కూడ సజీవంగా ఉంటది. మానేరువాగు కూడా సజీవ జలధార అయితది. ఈ నాలుగు జీవధారలతోని పాత కరీంనగర్ జిల్లా అద్భుతమైన, పాలుగారే జిల్లాలాగ ఉంటది. దానిని వచ్చే జూన్ తర్వాత చూడబోతున్నం. లోయర్‌మానేరు మధ్యమధ్యలో ఖాళీ అయి, నిండుతుంది. మిడ్ మానేరు ఎప్పుడూ అలానే ఉంటుంది. దీనికి మూడో టీఎంసీ కూడ వస్తుంది. ఇది పూర్తయితే మిడ్‌మానేరు ఒక నీటి ఖజానాలాగ ఉంటది.

మిడ్‌మానేరు నీళ్లు వస్తా ఉంటయి, పోతా ఉంటయి కానీ ఖాళీచేయం. ఎక్కడ ఎమర్జన్సీ ఉన్నా ఈ నీటిని సరఫరాచేస్తరు. ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, సిద్దిపేటలో ఐదు టీఎంసీలు తక్కువ పడ్డా ఇక్కడి నుంచే వాడుకుంటాం. అన్ని రకాల సందర్భాల్లో తాగునీటికి, సాగునీటికి గొప్పగా అదుకుంటది. ఎల్లంపల్లి ప్రాజెక్టు అనేకవాటికి నీటిని సరఫరా చేస్తుంటది. ఇక్కడినుంచి 75 టీఎంసీల కేటాయింపులు ఉన్నయి. ఇప్పుడున్న ఎన్టీపీసీ ప్రాజెక్టులే కాకుండా మరో నాలుగువేల మెగావాట్ల ఎన్టీపీసీ ప్రాజెక్టులు వస్తున్నయి. వాటికి ఇంకా ఎక్కువ నీళ్లు అవసరం. రామగుండంల ఎఫ్‌సీఐకి ఇంకా ఎక్కువ నీళ్లు అవసరం. ఎల్లంపల్లి నుంచే హైదరాబాద్‌కు ఏటా పది టీఎంసీలు సరఫరాచేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు మిషన్ భగీరథ కింద నీళ్లు ఎల్లంపల్లి నుంచే ఇస్తున్నం. ఎల్లంపల్లి నుంచి మూడో టీఎంసీ తరలింపు పనులు మార్చి, ఏప్రిల్‌కల్లా అయిపోతయి. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, మల్లన్నసాగర్ చాలా కీలకపాత్ర పోషించబోతున్నయి.
75-80 లక్షల ఎకరాల పంట.. కాళేశ్వరం ప్రాజెక్టు కింద రెండు పంటలు కలిపి 75-80 లక్షల ఎకరాలు పండుతాయి. భూగర్భ జలాల పెరుగదలతో మరో 15-20 లక్షల ఎకరాలు పండుతాయి. తెలంగాణ రైతాంగం రూ.40 వేల కోట్లు వెచ్చించి బోర్లువేశారు. దేశంలో ఎక్కడాలేనంత స్థాయిలో 24 లక్షల అధికారిక పంప్‌సెట్లు, మరో రెండు మూడు లక్షల అనధికారిక పంపుసెట్లు ఇక్కడ ఉంటాయి.
పాపికొండలను తలదన్నేలా సిరిసిల్ల కొండలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే లండన్ నగరంలో థేమ్స్ నది ఎలా సజీవంగా ఉంటదో మానేరు కూడా అలానే ఉంటది. గతంలో నేను వచ్చినప్పుడు ‘లండన్ నగరంలా మారుస్తా’ అంటే కొందరు ఏదేదో మాట్లాడారు. వాళ్లకు అర్థంలేదు, తాత్పర్యంలేదు. కాళేశ్వరం పూర్తయితే అద్భుతంగా ఉంటదని చెప్పిన. జూన్ తర్వాత అద్భుతం కనపడుతది. ఆ సన్నాసులకు కూడా కనపడుతది. కరీంనగర్, సిరిసిల్ల పట్టణాలు అద్భుత పర్యాటక ప్రాంతాలుగా తయారవుతయి. వేములవాడ పుణ్యక్షేత్రం, సిరిసిల్ల కొండలు, మిడ్‌మానేరు అందాలు.. వీటన్నింటినీ పర్యాటకశాఖకు అప్పగిస్తం. పాపికొండల నడుమ గోదావరి ఏ విధంగా కనపడుతదో సిరిసిల్ల దగ్గర ఆ విధంగా కనపడుతది. తేమశాతం పెరిగితే సిరిసిల్లకొండలు పాపికొండలను తలదన్నే కొండలవుతాయి. చాలా గొప్పగా ఉంది. నేను కండ్లారా చూశాను. చూడాలనే ఆ మార్గంగుండా వచ్చిన. కేసీఆర్‌గా ఏ తెలంగాణను కలగన్నానో ఆ తెలంగాణ కనపడుతున్నది. రెండేండ్లుపోతే పచ్చదనం పరిఢవిల్లుతది.
కరీంనగర్ జిల్లాలో 46 వాగులు కరీంనగర్ జిల్లాలో 46 వాగులు ఉన్నయి. చొప్పదండి నియోజకవర్గంలో మోతేవాగు, సజ్జలవాగు, ధర్మపురిలో పెద్దవాగు, కోనేటివాగు, ఎల్లమ్మగడ్డవాగు, చిలుకవాగు, మానేరువాగు, కాల్వలవాగు, హుజురాబాద్ నియోజకవర్గంలో శంభునిపల్లివాగు, శనిగరంవాగు, పెద్దవాగు, అనంతారంవాగు, జగిత్యాలలో పెద్దవాగు, సద్దెలవాగు, కరీంనగర్ నియోజకవర్గంలో ఇరుకుళ్లవాగు, నగునూరువాగు, పెద్దపల్లిలో మానేరువాగు, కోరుట్లలో కేశవపట్నంవాగు, బిక్కవాగు ఉన్నయి. మానకొండూరులో మానేరువాగు, మోడి తుమ్మెదవాగు, పిల్లగుండ్లవాగు, పిల్లివాగు, పెద్దవాగు అక్కడ ఉన్నయి. మంథనిలో ఆరేవాగు, బొక్కలవాగు, బొగ్గులవాగు ఉన్నయి. పెద్దపల్లిలో హుస్సేన్‌మియావాగు, నక్కలవాగు ఉన్నయి. రామగుండంలో లోతువాగు ఉన్నది. సిరిసిల్లలో మానేరువాగు, మూలవాగు, చిట్టివాగులున్నయి. వేములవాడలో కోరుట్లవాగు, నక్కవాగులున్నయి. పిచ్చి మాటలు, చిల్లర మాటలు మాట్లాడేవారికి ఈ వాగులు ఉన్నట్లు కూడా తెలియదు.
సీపేజ్ ఉంటేనే డ్యాం సేఫ్ కాంగ్రెస్, బీజేపీ నాయకులకు భౌగోళిక పరిస్థితులపై అవగాహన లేదు. సాంకేతిక పరిజ్ఞానం సున్న. విషయపరిజ్ఞానం అంతకన్న తెలువదు. తెలిసి పరిజ్ఞానంతో మాట్లాడినా సంతోషపడవచ్చు. కానీ వారికి తెలుసుకుందామనే ఆలోచనలేదు. మిడ్‌మానేరు నింపుతున్నం. దానికో పద్ధతి, ప్రొటోకాల్ ఉంటయి. మిడ్‌మానేరులో మొదట మూడు టీఎంసీలు తెచ్చి ఎనిమిది నెలలు పరిశీలించాం. ఆ తర్వాత ఐదే టీఎంసీలు తెచ్చినం. వీటిని దాదాపు సంవత్సరం అపినం. ఆ తర్వాత 15 టీఎంసీల లెవల్‌కు తీసుకపోయినం. ఒక దగ్గర కొద్దిగా ఎక్కువ సీపేజ్ వచ్చింది. నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ దగ్గర కూడా సీపేజ్ ఉంటది. సీపేజ్ ఉంటేనే డ్యాం సేఫ్‌గా ఉంటది. అది వీళ్లకు (కాంగ్రెస్, బీజేపీ నాయకులు) తెలువదు. సింగూరు దగ్గర సీపేజీయే లేదు. అక్కడ ప్రెజర్ ఈజ్ ఆఫ్ వాల్స్ అని మనమే బోర్లువేశాం.
ప్రతి డ్యాం కట్ట కింద సీపేజ్ కెనాల్ కనపడుతది. అదికూడా తెలియకుండా.. ఏదో తప్పు జరిగినట్లు, కొంపలు అంటుకున్నట్లు మాట్లాడుతున్నారు. పిటీ ఏందంటే.. అరిచినవాళ్లు కాంగ్రెస్‌వాళ్లు. అది కట్టింది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే. జైళ్ల వెయ్యాలంటే కాంగ్రెసాయననే వెయ్యాలి. ఆ సోయి కూడా వారికిలేదు. డ్యాం, బరాజ్, రిజర్వాయర్ల మీద లోడ్ వేసినప్పుడు వైబ్రేషన్స్, ప్రత్యేక సౌండ్స్ వస్తయి. వాటన్నంటినీ మెజర్‌చేస్తరు. ఉండాల్సినదానికంటే ఎక్కువ ఉన్నదంటే సరిచేస్తరు. అన్ని ప్రాజెక్టుల్లో ఇవి సహజమే. ప్రాజెక్టులపై ఎన్ని కేసులు వెయ్యాల్నో అన్ని కేసులు వేశారు. ఇంకా వేస్తునే ఉన్నరు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిరోజు కేసు వేస్తూనే ఉన్నరు. ఇది బాధ కలిగిస్తుంది. ఈ చిల్లర రాజకీయాలు, ఆటంకాలు సృష్టించినా చిత్తశుద్ధితో మా ప్రయత్నం మేము చేసుకుంటా పోయినం. నీటిపారుదలరంగంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా.. ఎవరు ఏమిచేసినా పురోగమిస్తూనే ఉంటం. రూ.1230 కోట్లతో 46 వాగుల మీద 210 చెక్ డ్యాంలు నిర్మిస్తం.

నీటిపారుదలశాఖ అధికారులతో జిల్లా ఎమ్మెల్యేల సమావేశం పెద్దపల్లి నియోజకవర్గం అంతా టెయిల్‌ఎండ్ వరకు నీళ్లు పొయ్యేటట్లు చేసినం. కాల్వశ్రీరాంపూర్‌కు, ఓదెలకు నీళ్లు రావట్లేదని నాకు చెప్పుతుండేది. ఇప్పుడు ఆ ప్రాంతాలన్నిటికీ నీళ్లుపోతున్నాయి సార్ అని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సంతోషంగా చెప్పారు. రామగుండం ఎమ్మెల్యే చందర్ కూడా మా దగ్గర కొంతప్రాంతానికి నీళ్లురాట్లేవు అని చెప్పిండ్రు. కొద్దిటైంలోపలనే అక్కడికికూడా నీళ్లువస్తయి. రామగుండం, కాల్వశ్రీరాంపూర్‌లలో టెయిల్‌ఎండ్స్ కూడా కవర్ చేస్తున్నం. ఇక్కడినుంచి నీళ్లు సూర్యాపేటకు కూడా పోతుండటం సంతోషకర విషయం. నేను సూర్యాపేట పోయినప్పడు అక్కడివాళ్లు ‘సార్.. మార్చిదాకా నీళ్లు ఇవ్వాలి’ అని అడిగితే ‘ఇంకో పదిరోజులు కూడా ఇస్తరు. ప్రాజెక్టులు కట్టుకున్నదే మనకోసంకదా..’ అని నేను చెప్తే ఎంతో సంతోషపడ్డరు. మహబూబాబాద్, డోర్నకల్ టెయిల్‌ఎండ్స్‌లో గత 30 ఏండ్ల నుంచి నిండని చెరువులు ఇప్పుడు నింపుకొంటున్నం. అదే ప్రాసెస్‌లో ఇక్కడా చెక్‌డ్యాంలు నిర్మించుకునేందుకు, టెయిల్‌ఎండ్స్ బ్యాలెన్స్ వర్క్‌లు అతి తొందరగా చేసుకునేందుకు కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధి కారులతో వారంలోపే హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించ బోతున్నాం. బడ్జెట్‌లోపే ఇది పూర్తిచేస్తే పనులకు నాలుగైదొందల కోట్ల బడ్జెట్ పెట్టుకునే అవకాశం ఉంటది.
జీవితంలో గొప్ప సాఫల్యం.. ఈరోజు నాకు హృదయపూర్వక సంతోషం కలిగింది. మిడ్‌మానేరు ప్రాజెక్టుపై నిలబడి పూజచేస్తున్నప్పుడు చాలా ఆనందమేసింది. జీవితంలో గొప్ప సఫలత్వం సాధించిన భావన కలిగింది. ఇంత పెద్ద గోదావరి.. సూమారు 46 మంచి వాగులు ఉండి కూడా ఈ జిల్లా కరువు కాటకాలకు నిలయమైంది. దుబాయి, బొంబాయికి ప్రజలు వలస పోయారు. 700 నుంచి 900 అడుగులకు బోర్లువేసే పరిస్థితి. కరంట్ కోతలు నిత్యకృత్యం. కరంట్ బాధ తాళలేక జమ్మికుంటలో భిక్షపతి అనే పిల్లోడు చనిపోయిండు. సిరిసిల్లలో చేనేత కార్మికులు చనిపోయిండ్రు. ‘చావులు పురిష్కారం కాదు.. చావకండి’ అని అప్పటి జిల్లా కలెక్టర్ గోడలపై రాయించారు. వాటిని ఒకరోజు చూసి.. 60, 70 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత ఈ నినాదాలనా మనం చూసేదని కండ్ల నీళ్లు తీసుకుంటపోయినం.
గొప్ప సంతోషంతో తిరిగి వెళుతున్నా కరీంనగర్ జిల్లా ప్రజలు గొప్పవాళ్లు. 2001 సింహగర్జన నుంచి నేటివరకు తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేయడంలో ఎప్పడూ ప్రథమ పంక్తిలో ఉన్న జిల్లా. ఈ జిల్లాలో ఇంత అద్భుతమైన నీటి సదుపాయం కలుగటం చాలా సంతృప్తి కల్గిస్తున్న విషయం. అందుకే దీన్ని స్వయంగా చూడాలని వచ్చాను. చాలా గొప్ప సంతోషంతో తిరిగి వెళుతున్నా. చెక్‌డ్యాంల నిర్మాణంలో స్థానిక మీడియా సహకారం ఉండాలి. ప్రజలను ఎడ్యుకేట్ చేసి చెక్‌డ్యాంలతో కలిగే లాభాలను మీ వార్తల ద్వారా ప్రజలకు వివరించాలని కోరుతున్నా.
140 కిలోమీటర్లు సజీవ గోదావరి కరీంనగర్ జిల్లాకు లక్ష్మి, సరస్వతి, పార్వతి బరాజ్‌లు, వీటికి కలిసిన శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్.. అన్నీ కలిపి 140 కిలోమీటర్ల గోదావరి 365 రోజులూ సజీవంగా ఉంటుంది. కరీంనగర్ జిల్లాకు ఇది అద్భుత జీవధార. ఈ రోజు నేను వస్తుంటే జిల్లెళ్ల, నేరెళ్ల తదితర గ్రామాల్లో రైతాంగం అద్భుతంగా భూగర్భ జలాలు పెరుగుతున్నయని చెప్పారు. గోదావరి నది మొత్తం కలిపితే.. 250 కిలోమీటర్లు అవుతుంది. పాత కరీంనగర్ వరకే ప్రత్యేకంగా 140 కిలోమీటర్ల సజీవ, శాశ్వత జలధార ఉంటది. కరీంనగర్ జిల్లాలో కాకతీయకాల్వ మెట్‌పల్లి సమీపంలోని దమ్మన్నపేట వద్ద మొదలై.. వరంగల్ జిల్లా హసన్‌పర్తి చేరుకునే దాక 200 కిలోమీటర్లు పారుతుంది. ఈ 200 కిలోమీటర్ల పొడవునా రెండుపంటలు పండుతయి. సుమారు తొమ్మిదినెలలు ఈ కాల్వ పారుతూనే ఉంటది. ఇది ఒక సజీవ జలధార. 160 కిలోమీటర్ల నిడివి వరదకాల్వ 365 రోజులూ నిండే ఉంటది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద వరదకాల్వ ఎప్పుడూ నింపే ఉంటుంది కాబట్టి దాన్ని అద్భుతంగా వినియోగిస్తం.
కమిట్‌మెంట్ ఉన్నది మాకే ఈ జిల్లాలో పొడవైన మానేరు నది ఉన్నది. అప్పర్‌మానేరు నుంచే లెక్క తీసుకుంటే అప్పర్‌మానేరు, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు నుంచి మంథని వద్ద గోదావరిలో కలిసేవరకు 181 కిలోమీటర్లు ఈ నది ఉన్నది. గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈటల రాజేందర్ లాస్ట్‌టర్మ్‌లో నాతో మాట్లాడి మూడు చెక్‌డ్యామ్‌లు కూడా కట్టారు. అంతకుమించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇది రాష్ట్రంలో పొటెన్షియల్ జిల్లా. అద్భుతమైన పరిస్థితి ఈ జిల్లాలో రావాలి. అవకాశం ఎక్కువ. బాధ్యత లేనోడు.. తెలిసినోడు, తెలియనోడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటరు. కానీ రాష్ట్రంపై ఏ పార్టీకీ లేనంత కమిట్‌మెంట్ మాకు ఉన్నది. మేం ఉద్యమకారులం. కష్టపడ్డం.. రాష్ట్రాన్ని సాధించినం. ఎక్కడా ఎవడూ దిక్కులేనినాడు మేం జెండాలేపి, కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చినం. కాబట్టి మాకు కమిట్‌మెంట్ ఎక్కువ ఉంటది.
తెలంగాణ ఏ ఇంచు అయినా మాదే తెలంగాణను ఎక్స్‌రేలాగా ప్రతి ఇంచును పరిశీలిస్తాం. అంత అవగాహనతో పోతాం. మాకో కమిట్‌మెంట్ ఉంది. పనులుచేసే దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నడా.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడా.. అని చూడలేదు. తెలంగాణ ఏ ఇంచు అయినా మాదే. రాజకీయ వివక్షలేకుండా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఊరుకు నీళ్లు ఇస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చెరువు పనులు చేపట్టాం. చెక్‌డ్యాంలు కూడా నియోజకవర్గాలు అనే తేడా లేకుండా మంజూరుచేశాం. – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు