సీఎం జిల్లా పర్యటనలంటే అధికారులతో సమీక్షలనే ఇప్పటిదాకా జనానికి తెలిసింది! ఏదో బంగళాలో కూర్చొని.. ఆదేశాలు జారీచేస్తారనే పత్రికల్లో చదివింది! కనిపించని అద్దాల కారుల్లో కూర్చొని రయ్య్‌న దూసుకుపోయే కాన్వాయ్‌లే మొన్నటిదాకా కనిపించినది! అదపాదడపా ఎంపిక చేసిన కొద్దిమందితో నమస్కారాలు.. వినతిపత్రాల స్వీకరణలకే ఇన్నాళ్లూ పరిమితమైంది!! కానీ.. ఆ అభిప్రాయాలను.. పటాపంచలు చేశారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు! జననేత అంటే ఏమిటో నిరూపించిన సీఎం.. జనంవద్దకే వెళ్లారు!

-పేదల మధ్యకు ప్రజానేత -కలిసి కూర్చొని.. బాధలు ఆలకించి..సమస్యల పరిష్కారానికి తక్షణ ఉత్తర్వులు -మేడారాన్ని తలపిస్తున్న సీఎం పర్యటన -రెండో రోజూ మురికివాడలకు కేసీఆర్ -మరో రెండురోజులూ వరంగల్‌లోనే -పునాదిరాయి వేసే తిరిగివెళ్తానని వెల్లడి -పది కోట్లతో అర్చక భవన్‌కు హామీ -భూపాలపల్లి నియోజకవర్గంపై వరాలజల్లు -రాజకీయ పునరేకీకరణకు పిలుపు జనంలోకి వెళ్లటమంటే.. జనంలో ఒకడిగా కూర్చొని.. ఇంటి పెద్దగా వారి సాదకబాధకాలు ఆలకించి.. పరిష్కారానికి అప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడమేనని కొత్త నిర్వచనం చెప్పారు! ఈ అపురూప సన్నివేశాలతో వరంగల్ జిల్లా రెండోరోజూ పులకించిపోయింది. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం.. శుక్రవారం కూడా మురికివాడల పర్యటనలతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మురికివాడల్లేని వరంగల్‌ను ఆవిష్కరిస్తానని ప్రతినబూనారు. నడవడానికీ దారుల్లేని ఆరు మురికివాడలను ఆదర్శ.. అధునాతన కాలనీలుగా మార్చుతానని భరోసా ఇచ్చారు.
ఆ కాలనీలకు దగ్గరుండి శంకుస్థాపన చేయించి మరీ జిల్లా దాటుతానని ప్రకటించారు. శని, ఆదివారాలు కూడా నగరంలోనే ఉండి.. చెప్పిన కార్యక్రమాలు పూర్తిచేసుకుని మరీ వెళతానని స్పష్టం చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే సమస్యల అంతు చూద్దాం. మనకేం కావాలో.. అవి ఎట్లా మనదగ్గరికి రావాలో.. ఇన్నాళ్లు ఎందుకు రాలేదో చూద్దాం.. అవో మనమో తేల్చుకుందాం అంటూ పంతం పట్టారు. సీఎం పర్యటన.. నాలుగు రోజులపాటు సాగే మేడారం జాతరను గుర్తు చేస్తూ.. అభివృద్ధి జాతరగా కొనసాగుతున్నది!
బిజీబిజీగా సీఎం: జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం సీఎం బిజీబిజీగా గడిపారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన తన జనమమేకం.. రాత్రి పొద్దుపోయే దాకా.. ఎక్కడా అలసట లేకుండా కొనసాగింది. క్షణక్షణం జనం పక్షం వహించిన సీఎంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త చరిత్రను ఓరుగల్లులో లిఖించారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక జిల్లాలో వరుసగా నాలుగు రోజులు ఉండి జనం సమస్యలు తీర్చేదాకా ఇక్కడినుంచి కదలనని, సమస్యల అంతు చూసిన తరువాతే రాజధానికి వెళతానని ప్రకటించిన దాఖలాలులేవు.
పునాది రాయి వేసే వెళతా ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా రెండో రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దీనదయాళ్ నగర్, ప్రగతినగర్, అంబేద్కర్ నగర్ మురికివాడల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలను కలియదిరిగారు. జనం సమస్యల్ని ఓపిగ్గావిన్నారు. వారి ఇండ్లలోకి వెళ్లారు. వారితో మమేకం అయ్యారు. ఇండ్లు లేనివారికి ఇండ్లు కట్టిస్తా. అడ్వకేట్స్ కాలనీల్లా అన్ని సదుపాయాలుండే బస్తీలుగా మారుస్తా. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు. ఇప్పుడు ఎలక్షన్లు లేవు. ఎలక్షన్లు వచ్చినపుడు చూసుకుందాం. ఇప్పుడైతే మన బతులు బాగు చేసుకునే ఉపాయం ఆలోచిద్దాం.
సమస్యలపైనే ఇప్పుడు యుద్ధం. వరంగల్ టౌన్‌లో 150నుంచి 160 స్లమ్స్ ఉన్నాయి. స్లమ్‌లెస్ సిటీగా వరంగల్‌ను తీర్చిదిద్దుకుంటాం. వన్ ప్లస్ వన్‌గా మంచి ఇండ్లు కట్టుకుందాం. దానికి మీరందరూ సహకరించాలి. ఇవ్వాళ ఇల్లు కట్టాలంటే కనీసం నాలుగు లక్షలు కావాలి. నేను అధికారులతో మాట్లాడి అన్నీ ఏర్పాట్లు చేస్తా. ఎల్లుండి నేనే దగ్గరుండి కొత్తకాలనీకి పునాది రాయి వేసే ఇక్కడి నుంచి పోత. ఆ సంగతేందో తేల్చుకుందాం. మీరు రేపు, ఎల్లుండి ఎక్కడికీ పోవద్దు. మీ దగ్గరికే అధికారులు వస్తరు. మీ ఇంటి ముందట ఫొటోలు తీస్తరు. రిజిస్టర్‌లో రాస్తరు.
కాలనీ కమిటీ ఒకటి వేస్తరు. మన బతుకులు బాగు పడాలంటే కొంచెం టైం పడ్తది. అప్పటిదాకా ఓపిక అవసరం అని ఆయన కాలనీ వాసులకు తన ఆలోచనలు వివరించి.. నిర్ణయాలను వెల్లడించారు. ప్రగతినగర్‌లో, అంబేద్కర్ నగర్‌లోనూ ఇదే రీతిగా మురికివాడల్లో కలియదిరిగారు. అర్హులైనవారికి పింఛన్లు ఇచ్చే పోతానని విస్పష్టంగా ప్రకటించారు. అక్కడి నుంచి అర్చక సమాఖ్య నిర్వహించిన సదస్సుకు హాజరైన సీఎం.. హైదరాబాద్‌లో పది కోట్ల రూపాయలతో అర్చక భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని ఆరు వేలకు పెంచుతామని ప్రకటించారు.
భూపాలపల్లిపై వరాల జల్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోకవర్గంపై సీఎం వరాలజల్లు కురిపించారు. ఇంత పెద్ద నియోజకవర్గానికి డివిజన్ కేంద్రం లేదా? డివిజన్ కేంద్రానికి పోవాలంటే 60కిలోమీటర్లు పోవాలా? ఇదెక్కడి పాలన? కలెక్టర్ రేపటిలోగా నాకు డివిజన్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే.. వెంటనే రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తా అని చెప్పారు.
రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాలి రాష్ట్ర పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణ సాధనలో పార్టీలకతీతంగా అందరు కలిసి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ శక్తుల పునరేకీరణ జరగాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.
కలెక్టరేట్‌లో మూడు గంటలపాటు సమీక్ష కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సీఎం సమాలోచన చేశారు. రోడ్లు, గృహ నిర్మాణాలు, పింఛన్లు, ఆహార భద్రతకార్డులు తదితర అంశాలపై మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిపారు. ముఖ్యంగా రెండు రోజులుగా మురికివాడలను తిరిగిన సీఎం.. అక్కడి ప్రజల స్థితిగతులు, మౌలిక సదుపాయలను స్వయంగా తెలుసుకున్నారు. ఆ సమయంలో ప్రజలు మొరపెట్టుకున్న కష్టాలు తీర్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.