-ఉద్యమంలో కష్టపడ్డవారందరికీ న్యాయం చేస్తారు -కేసీఆర్ ఆలింగనమే నా జీవితంలో సంతోషకరమైన రోజు -టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
పార్టీ సిద్ధాంతాలను నమ్మి కష్టపడి పనిచేసేవారికి తప్పనిసరిగా మంచి జరుగుతుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కష్టనష్టాలకోర్చి తనతో నడిచిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గతంలోనే చెప్పారని, చెప్పిన మాటను ఆచరణలో చూపిస్తున్నారని కొనియాడారు.
సీఎం ఇచ్చిన మాట తప్పరని తెలిపారు. గురువారం శాసనమండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం ప్రభాకర్‌కు టీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆత్మీయ సత్కారం జరిగింది. నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈ సభకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ మీడియాకే ముందు తెలిపారని, ఆ తర్వాత తనను దగ్గరకు పిలిచి ఆలింగనం చేసుకున్నారన్నారు. ఆ రోజే తన జీవితంలో అత్యంత సంతోషకరమైనదని తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాలో కొంతమందిని కూర్చోబెట్టుకొని కొన్ని ముచ్చట్లు చెప్పారు. పద్నాలుగేళ్ల ఉద్యమంలో నా వల్ల మంచి, చెడులు, తీపి, చేదులన్నీ ఉన్నాయని, ఇకముందు నావాళ్లకు, నాతో కష్టపడిన ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా ఊరుకోను అన్నారు. ముఖ్యమంత్రి అయిన పదిపదిహేను రోజుల్లోనే నాయిని, రాములునాయక్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. నాకు న్యాయం చేయాలని ఆయన మనసులో ఎంతో ఉన్నా సందర్భం కోసం చూశారు. మాట చెప్పి దానిపై నిలబడ్డారు.
అదేరీతిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, పథకాలు చిత్తశుద్ధితో కచ్చితంగా అమలు చేస్తారు అని తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన ఈ బాధ్యతను చిత్తశుద్ధితో పూర్తి చేస్తానన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి వారధిలా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో ముందుంటానని తెలిపారు. మానుకోడూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కార్యకర్తలు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, ఆవేశాన్ని అణచుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
దళిత, గిరిజనులకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో 22 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా చాలా అవకాశాలు దొరుకుతాయన్నారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ వెన్నంటి ఉండి, అడుగులో అడుగు వేసిన ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కడం తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్ పార్టీతో పాటు కార్యకర్తలకు దక్కిన అరుదైన గౌరవమన్నారు. నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్ ప్రమాణం టీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నియమితులైన ఆయనతో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ గురువారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మండలి డిఫ్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.