Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

65 ఏండ్ల దరిద్రం కాంగ్రెస్‌ను మళ్లీ దరిచేరనీయొద్దు

-కేసీఆర్‌ బొండిగ పిసికే కుట్ర
-బీఆర్‌ఎస్‌ అధినేతపై మోదీ, రాహుల్‌గాంధీ పగ
-దేశంలో విస్తరిస్తారని బీజేపీ, కాంగ్రెస్‌కు భయం: కేటీఆర్‌
-షేర్లు, తీస్మార్‌ఖాన్లు ఎంతమంది వచ్చినా ప్రజలే మా ధైర్యం
-తెలంగాణ తలరాతను రాసే ఎన్నికలివి
-65 ఏండ్ల దరిద్రం కాంగ్రెస్‌ను మళ్లీ దరిచేరనీయొద్దు
-మహిళలను ఏడిపించే కుసంస్కారం కమలం పార్టీది
-ఉమక్క ఉసురు బీజేపీకి తగులుతుంది
-కథలాపూర్‌ ప్రజా ఆశీర్వాద సభ, పలుచోట్ల ఎన్నికల రోడ్‌షోలలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

తెలంగాణ గొంతుక, 52 కిలోల సీఎం కేసీఆర్‌ను ఖతం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. కేసీఆర్‌పై ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ పగబట్టారని, తెలంగాణలో గెలిస్తే బీఆర్‌ఎస్‌ దేశమంతా విస్తరిస్తుందని, ఆయన బొండిగ పిసికేందుకు చూస్తున్నారని అన్నారు.

అమిత్‌షాలు, యోగీలు, బోగీలు, 16 మంది సీఎంలు, షేర్లు, షేర్‌ఖాన్లు, బబ్బర్‌షేర్లు, తీస్‌మార్‌ఖాన్లు తెలంగాణకు వస్తున్నారని, అయినా రాష్ట్ర ప్రజలే తమ ధైర్యమని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో వేములవాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ బుధవారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభ, రుద్రంగి, కోనారావుపేట, వేములవాడ, తంగళ్లపల్లిలో నిర్వహించిన ఎన్నికల రోడ్‌షోలలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. నియోజకవర్గ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావును గెలిపించాలని పిలుపునిచ్చిన ఆయన.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

నవంబర్‌ 30న జరిగే ఎన్నికలు తెలంగాణ తలరాతను రాసే ఎన్నికలని, ప్రజలు అన్ని విధాలుగా ఆలోచించి, మేలు చేసే వారికి మద్దతు తెలపాలని కోరారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతిలో పెట్టాలో ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనదని అన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో రెండేండ్లు కరోనా సావగొట్టిందని, పార్లమెంట్‌, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలు అంటూ మరో ఏడాది కాలం పోయిందని, కేవలం ఆరున్నర ఏండ్ల కాలంలోనే సరైన పాలన సాగిందని వివరించారు. ఆరున్నర ఏండ్ల పాలనలో తెలంగాణ బాగైందా? చెడిపోయిందా? ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

నాడు 29 లక్షల మందికి రూ.200 చొప్పున పింఛన్‌ ఇస్తే, ఇప్పుడు 46 లక్షల మందికి రూ.2 వేల పెన్షన్‌ ఇస్తున్నామని గుర్తుచేశారు. గతంలో ఏ ప్రభుత్వమైనా బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇచ్చే ఆలోచన చేసిందా? అని అడిగారు. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు ప్రజలందరికీ ఇప్పటికీ గుర్తుకున్నాయని తెలిపారు. ప్రజలు తియ్యటి, పుల్లటి మాటలకు మోసపోవద్దని హితవు చెప్పారు.

గోదావరి నీళ్లను వేములవాడకు తీసుకువచ్చి, కరెంట్‌ కష్టాలు సీఎం కేసీఆర్‌ తీరిస్తే, కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ మాటలు వింటూ మళ్లీ వాళ్ల పాలన నాటి దిక్కుమాలిన రోజులకు వెళ్దామా? అని ప్రజలను ప్రశ్నించారు. అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాని మోదీ మోచేతికి బెల్లం పెట్టి నాకించినట్టు చేశారని విమర్శించారు. రూ.400గా ఉన్న సిలిండర్‌ ధరను రూ.1,200కు పెంచారని మండిపడ్డారు.

అయితే, 13.5 లక్షల మందికి కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేసి, ప్రతి ఆడబిడ్డను మేనమామలాగా సీఎం కేసీఆర్‌ దీవించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.3 వేలు ఇచ్చే సౌభాగ్యలక్ష్మి పథకాన్ని అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు ‘కేసీఆర్‌ బీమా.. ప్రతి ఇంటికి దీమా’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల పోరాటాన్ని ఢిల్లీ దొరలు, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే పోరాటంగా భావిస్తున్నట్టు వెల్లడించారు.

కేటీఆర్‌ వాహనం తనిఖీ చేసిన పోలీసులు
రుద్రంగి, నవంబర్‌ 15: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ వాహనాన్ని బుధవారం పోలీసులు తనిఖీ చేశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభను ముగించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో నిర్వహించే రోడ్‌ షోకు వస్తుండగా రుద్రంగి చెక్‌పోస్ట్‌ వద్ద కేటీఆర్‌ వాహనాన్ని, కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు పోలీసులకు కేటీఆర్‌ పూర్తి సహకారం అందించారు.

కేటీఆర్‌ చెప్పిన తేలు కథ
ఈ సందర్భంగా కేటీఆర్‌ తేలు కథను ఉదహరించారు. ‘ఓ ఇంట్లో భార్యాభర్తలిద్దరు మాట్లాడుకుంటున్నరు. అప్పుడే పైనుంచి భార్యపై తేలుపడింది. నా మీద తేలుపడ్డది అని భర్తకు చెప్పడంతో ఆయన బయటకు పరుగుపెట్టడం మొదలు పెట్టాడట. దీంతో భార్య ఎందుకు బయటకు వెళ్తున్నావని భర్తను ప్రశ్నించగా, తేలును చంపే మొగోళ్లను తోలుకు వచ్చేందుకు వెళ్తున్నా అన్నాడట. అట్లా ఉంది బీజేపీ, కాంగ్రెస్‌ తీరు’ అని ఎద్దేవా చేశారు. ఇక్కడి బీజేపీ, కాంగ్రెసోళ్లు మొనగాళ్లే అయితే ఢిల్లీవాళ్లతో ఏం పని? ఇక్కడే కొట్లాడొచ్చు కదా? అని చురకలు అంటించారు.

వేములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా
వేములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లను అభివృద్ధి చేసినట్లు వేములవాడను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. తుల ఉమక్క లాంటి ఉద్యమకారిణిని అవమానించి, బీఫాం ఇవ్వకుండా ఏడిపించిన బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పాలని, ఆ పార్టీకి డిపాజిట్‌ రాకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమక్కకు గతం కంటే మంచి పదవి ఇచ్చే పూచీ తనదేనని అన్నారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, వేములవాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, జగిత్యాల జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌ దావ వసంత, వైస్‌చైర్మన్‌ వొద్దినేని హరిచరణ్‌రావు, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, నాగం భూమయ్య, జవ్వాజి రేవతి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.