-నిన్న ఐటీఐఆర్‌కు ధోకా.. నేడు ఆర్సీఎఫ్
-కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదు
-ఆర్టీఐ చట్టం కింద రైల్వే శాఖ సమాధానం
-పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ తుంగలోకి
-కోచ్ ఫ్యాక్టరీ మా రాజ్యాంగ హక్కు
-పార్లమెంట్‌లో ఈ విషయంపై నిలదీస్తాం
-మా హక్కు కోసం ఏ పోరాటానికైనా సిద్ధం
-ఇది రైల్వేలను పూర్తిగా ప్రైవేటుపరం చేసే కుట్ర
-కేంద్రం నిర్ణయంపై మంత్రి కేటీఆర్ ఫైర్
కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం తెలంగాణకు మరోసారి ధోకా ఇచ్చింది. ఇప్పటికే ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్రం.. తాజాగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టే యోచన లేదని ప్రకటించింది. రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన పరిశ్రమ విషయంలో చేతులెత్తేసింది. పార్లమెంట్ సాక్షిగా పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను ఎప్పుడు ప్రారంభించనున్నారంటూ సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ సమాధానమిచ్చింది. దేశంలో ఎక్కడా ప్రస్తుతానికి గానీ లేదా భవిష్యత్తులోగానీ రైల్వేశాఖకు కోచ్ ఫ్యాక్టరీల అవసరమే లేదని పేర్కొంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న కోచ్‌ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని పెంచి కోచ్‌లు తయారు చేస్తున్నామని, అందువల్ల కాజీపేటలో కొత్త కోచ్ ఫ్యాక్టరీకి అవకాశం లేదని స్పష్టం చేసింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్రం చెప్పడంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన వాటిని కూడా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ నిర్ణయంతో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల తన వ్యతిరేకతను మరోసారి బయటపెట్టుకున్నదని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన హామీని తిరస్కరించే లేదా మాట మార్చే హక్కు బీజేపీకి లేదని స్పష్టంచేశారు. తమ హక్కుల కోసం పోరాడి సాధించుకుంటామని తేల్చి చెప్పారు.
ఇప్పటికే హైదరాబాద్ నగర ఐటీ అభివృద్ధిని అడ్డుకునేలా ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్రం.. ఇప్పుడు కాజీపేట రైల్వే ప్రాజెక్టు అవసరం లేదని చెప్పడం తెలంగాణ ప్రజలను మోసగించడమేనని మండిపడ్డారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకొని కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా విస్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టుల విషయంలో పదేపదే సంప్రదింపులు జరుపుతున్నా, కేంద్రంలోని బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేదని, ప్రతిసారి తెలంగాణకు కేంద్రం నుంచి రిక్తహస్తమే ఎదురవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
150 ఎకరాల భూమి ఇచ్చాం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్వయంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేశారని, పలుమార్లు ప్రభుత్వం తరఫున లేఖలు కూడా రాశామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కోచ్ ఫ్యాక్టరీకి అవసరమైన స్థల సేకరణ కూడా పూర్తిచేశామని తెలిపారు. అత్యంత విలువైన 150 ఎకరాల భూమిని మరో ప్రభుత్వ శాఖ నుంచి సేకరించి రైల్వేశాఖకు అప్పగించామని చెప్పారు. అయినప్పటికీ కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్రం ఇప్పుడు చెప్పడం దారుణమని మండిపడ్డారు.
బడ్జెట్‌లో ప్రతిసారి అన్యాయమే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులకు నిధుల విడుదలలో ప్రతి బడ్జెట్‌లోనూ కేంద్రం అన్యాయమే చేస్తున్నదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి బడ్జెట్ కేటాయింపుల్లోనూ గుండు సున్నానే దక్కుతున్నదన్నారు. ‘తెలంగాణలో పలు రైల్వే ప్రాజెక్టులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. 8 రైల్వే లైన్లు, సర్వే దశలో ఉన్న 3 లైన్లు, 4 కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే డివిజన్, రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు వంటి డిమాండ్లకు కేంద్రం నుంచి కనీస స్పందన లేదు. ఈ సంవత్సరానికి ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రంలోని రైల్వేలైన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేంద్రం గొప్పగా చెప్పుకొంటున్న బుల్లెట్ ట్రైన్, హైస్పీడ్ రైల్వేలైన్ల విషయంలోనూ తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. ఇది కేంద్ర వివక్ష పూరిత వైఖరికి నిదర్శనం. హైదరాబాద్ వంటి మహానగరానికి కూడా బుల్లెట్/స్పీడ్ ట్రైన్లు కేటాయించకపోవడం ఈ వివక్షకు తార్కాణం’ అని విమర్శించారు.
ప్రైవేటు పరం చేసే కుట్ర.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైల్వేలను ప్రైవేట్‌పరం చేస్తూ భవిష్యత్ తరాలకు ద్రోహం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘భారతదేశ రవాణా వ్యవస్థకు గుండెకాయలాంటి రైల్వేను సంపూర్ణంగా ప్రైవేటీకరించే దిశగా కేంద్రం కుటిల యత్నాలు చేస్తున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యంత రద్దీ ఉన్న 12 క్లస్టర్లను గుర్తించి, 109 ప్రధాన రైలుమార్గాలను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల రైల్వేలు సుమారు రూ.63 వేల కోట్ల వార్షిక ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉన్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న ఏడు రైల్వే ప్రొడక్షన్ యూనిట్లను అత్యంత చౌకగా ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైల్వేలైన్లతోపాటు రైల్వేస్టేషన్లను సైతం ప్రైవేట్‌పరం చేస్తూ.. సాధారణ ప్రజలకు ప్రవేశం లేకుండా చేస్తున్నది’ అంటూ ధ్వజమెత్తారు.

అక్కడ ఉత్సాహం.. ఇక్కడ తాత్సారం జాతీయ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ఉత్సాహపడుతున్న కేంద్రం.. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే కార్యక్రమాల నిర్వహణలో మాత్రం ఎనలేని తాత్సారం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు, రోడ్డు విస్తరణ వంటి ప్రజా సంక్షేమ కార్యకలాపాలకు కావాల్సిన స్థలాన్ని అడిగితే మాత్రం ఎనలేని తాత్సారం చేస్తున్నది. రైల్వే భూములను ప్రైవేటుపరం చేసేందుకు మాత్రం అత్యంత ఉత్సాహం చూపుతున్నది’ అని విమర్శించారు.
ప్రశ్నార్థకంగా యువత భవిష్యత్ రైల్వేను ప్రైవేటుపరం చేయడంద్వారా రైల్వేస్టేషన్లపై ఆధారపడిన లక్షలమంది ఉద్యోగుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘ఉద్యోగుల పొట్ట కొట్టడమే కాదు.. రైల్వే ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న రైల్వే నుంచి కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇకపై రావు’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటూ గగ్గోలు పెడుతున్న బీజేపీ నాయకులు.. కేంద్రం అనుసరిస్తున్న విధానంపై సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తాము లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తే.. బీజేపీ మాత్రం కోట్ల మంది ఉద్యోగులకు, యువతకు అన్యాయం చేస్తున్నదని విమర్శించారు.
నిర్ణయం మారకుంటే ఆందోళనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదన్న వైఖరిని కేంద్రం మార్చుకోవాలని, లేదంటే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ తగిన కార్యాచరణ చేపడుతుందని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై తమ ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తారని, సభలోనే ఆందోళన చేపడుతారని చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడటం కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టంచేశారు.
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే: బీ వినోద్‌కుమార్ హన్మకొండ: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై రాష్ర్టాన్ని మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన కోచ్ ఫ్యాక్టరీని అప్పట్లో ప్రధానిగా ఉన్న రాజీవ్‌గాంధీ పంజాబ్‌కు తరలించారని, ఇప్పుడు బీజేపీ అసలు ఫ్యాక్టరీనే అవసరంలేదని అంటున్నదని ధ్వజమెత్తారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అన్నారు. కానీ ఈ రెండు పార్టీలు వారిని నమ్మించి నట్టేట ముంచాయని ఆరోపించారు. రైల్వేను అంబానీ, అదానీ చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతున్నదన్నారు. చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. బీజేపీ ఓ ఝూటా పార్టీ అని, అనేక సంస్థలను ప్రైవేటీకరిస్తున్న కేంద్రం.. రైల్వేను కూడా అమ్ముకొనే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.
ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు: ఎర్రబెల్లి కాజీపేటకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదన్న కేంద్ర ప్రభుత్వం వైఖరిపై రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం ముఖం పెట్టుకొని వరంగల్ ప్రజలను ఓట్లు అడుగుతారని నిలదీశారు. బీజేపీ అంటే భారతీయ బొంకుడు పార్టీ అని తేలిపోయిందని ఎద్దేవాచేశారు.