ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ముక్తకంఠంతో తిప్పి కొట్టేంద్దుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను గెలిపించాలని కోరుతూ శుక్రవారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు మండలంలో మంత్రి ఈటల రాజేందర్, హన్మకొండలోని కల్యాణి ఫంక్షన్ హాల్లో తెలంగాణ వడ్డెర మహాసభలో కడియం శ్రీహరి, భూపాలపల్లిలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జఫర్‌ఘడ్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలంలో ప్రచారంలో మంత్రి ఈటల మాట్లాడుతూ గ్రామాల్లోకి వచ్చే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గతంలో కడియం శ్రీహరికి ఇచ్చిన మోజార్టీకంటే, ఎక్కువ మెజార్టీతో దయాకర్‌ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.

-ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి: మంత్రి ఈటల రాజేందర్ -కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నాన్‌లోకల్: డిప్యూటీ సీఎం కడియం -ఓట్లడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదు: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి -కళాకారుడిని ఎంపీగా ఆశీర్వదించాలి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి -వరంగల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా భారీగా ప్రచారం
సీఎంకు మద్దతుగా నిలవాలి: డిప్యూటీ సీఎం కడియం ఉప ఎన్నికలో పోటీచేస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు జిల్లావాసులు కాదని, వాళ్లు నాన్‌లోకలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. హన్మకొండలోని కల్యాణి ఫంక్షన్ హాల్లో తెలంగాణ వడ్డెర మహాసభ సంఘం రాష్ట అధ్యక్షుడు గుంజ సాంబారావు అధ్యక్షతన జరిగిన సభలో కడియం మాట్లాడారు. రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించిన ఉద్యమకారుడు పసునూరి దయాకర్‌కు సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వటంతో పాటు నిరుపేదకావడంతో ప్రచార ఖర్చుల కోసం రూ.70 లక్షల చెక్కు అందించారని చెప్పారు. స్థానికుడైన దయాకర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్ పాలనకు మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ న్యాయమైనదన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకరారం అందిస్తామన్నారు. సభలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, అర్బన్ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్, వడ్డెర నేతలు పాల్గొన్నారు.
పార్టీలో పనిచేసినవారికి గుర్తింపు: మంత్రి పోచారం పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అరవై ఏండ్లలో జరగని అభివృద్ధిని 16 నెలల్లో చేసి చూపుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలకు ఈ అభివృద్ధి కనబడడం లేదా అని నిలదీశారు. భూపాలపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. జెండా మోసిన వారికి తప్పకుండా పార్టీ అండగా ఉంటుందని చెప్పడానికి ఎంపీ అభ్యర్థిగా పసునూరి దయాకర్‌ను ఎంపికేనిదర్శనమన్నారు. బీజేపీ అభ్యర్థి సంపాదన కోసం అమెరికా వెళ్లారని, కాంగ్రెస్ అభ్యర్థిది ఈ జిల్లానే కాదన్నారు.
వాళ్లు ఓడిపోయి మళ్లీ వారి స్థానాలకే వెళతారని జోస్యం చెప్పారు. అరవై ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలన పాపాలను తెలంగాణ ప్రభుత్వం కడిగేస్తున్నదని చెప్పారు. దేశం మెచ్చేలా పాలిస్తున్న టీఆర్‌ఎస్‌కు ప్రజలు అండగా నిలువాలని, టీర్‌ఎస్ అభ్యర్థి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉప ఎన్నికల విజయంతో మిగతా పార్టీల దిమ్మతిరగాలన్నారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, కడారి నవనీతరావు, యూత్ రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రదీప్, సిరికొండ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌కే ఓట్లు అడిగే హక్కు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సామాన్య కళాకారుడైన పసునూరి దయాకర్‌ను ప్రజలంతా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో ఎంపీగా ఆశీర్వదించాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. జఫర్‌ఘడ్‌లో ఎమ్మెల్యే టీ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌లో ఉద్యమకారుడిగా, తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిగా పసునూరి దయాకర్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎనలేని కృషి చేశాడన్నారు. పసునూరి దయాకర్ స్థానికుడని, వల్ల ఈ ప్రాంత సమస్యలపై అవగాహన కలిగి ఉన్నాడన్నారు. ప్రజలతో మమేకమయ్యే దయాకర్‌ను ఆశీర్వదించి, పార్లమెంట్‌కు పంపించాలని కోరారు.