-సహాయ చర్యలు ముమ్మరం చేయండి -ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ, చలివేంద్రాలు ఏర్పాటు -వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆపద్బంధు -ఉదయం, సాయంత్రమే ఉపాధిహామీ పనులు -గురుకులాలకు భవనాలు సమకూర్చండి -జిల్లా కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ -ఎంసీహెచ్ఆర్డిలో ఐదు గంటల సమీక్ష -ఖరీఫ్‌కు ముందే మిషన్ భగీరథ పైప్‌లైన్లు -మిషన్ కాకతీయ మార్గదర్శకాలలో మార్పులు -పత్తి సాగు తగ్గేలా సోయాబీన్‌కు ప్రోత్సాహం -హరితహారం సైనికులకు అవార్డులు

రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తీవ్ర వర్షాభావం కారణంగా కరువు, తాగునీటి ఎద్దడి, భూగర్భజలాలు ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయని, అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయని సీఎం చెప్పారు. ఈ సమస్యలను అధిగమించడానికి ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు ఎక్కడైనా ఆహారం కోసం ఇబ్బందులు పడే పరిస్థితి కనుక ఉంటే తక్షణమే స్పందించి ఆదుకోవాలన్నారు. దుర్భిక్షం కారణంగా పశువులకు గ్రాసం, నీరు కొరత రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటికి అధిక ప్రాధాన్యమివ్వాలని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మంచినీరు అందని ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతున్నందున అన్ని ప్రాంతాలలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులోకి తేవాలని, విస్తృతంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పనులు కల్పించేందుకు చేపట్టిన ఉపాధి హామీ పనులను ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే చేయించాలని, ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పగటిపూట చేయించరాదని సూచించారు.
వడగాలుల ప్రభావానికి గురై మరణించినవారి కుటుంబాలకు ఆపద్బంధు పథకం ద్వారా సహాయం అందించాలని, అందుకోసం 65 ఏండ్ల లోపువారికే ఆపద్బంధు వర్తింపు అన్న నిబంధనను తొలగించాలని సూచించారు. ఈసారి వర్షాలు సాధారణ స్థాయిని మించి కురిసే అవకాశమున్నందున అందుకు తగిన రీతిలో ఖరీఫ్ పంటలకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పత్తి పంట నుంచి ఇతర పంటలవైపు రైతుల దృష్టిని మళ్లించాలని సూచించారు. తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో శుక్రవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాలను సమీక్షించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన సమావేశం 5 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు కీలకమైన సూచనలు చేశారు. ముఖ్యనిర్ణయాలు తీసుకున్నారు. మరో నెలన్నరపాటు ఇదే స్థితి.. రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్నదని, మరో నెల నుంచి నెలన్నర వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశముందని సీఎం తెలిపారు. ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవడానికి నిర్థిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. వడగాలుల ప్రభావానికి ప్రజలు లోనుకాకుండా ఉండేందుకు అన్ని ప్రాంతాలలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, విస్తృతంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మంచినీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్లను రంగంలోకి దించాలని అందుబాటులో ఉన్న వనరులనుంచి నీటిని తరలించాలని సూచించారు. ఇక ఎట్టి పరిస్థితిలో ఉపాధిహామీ పనులను మధ్యాహ్నం వేళ కొనసాగించరాదని ఆదేశించారు. ఉదయం పదిన్నరగంటల వరకు ఆ తర్వాత సాయంత్రం నాలుగున్నర తర్వాత మాత్రమే పనులను చేపట్టాలని సూచించారు. వడదెబ్బ మందులను అందుబాటులో ఉంచాలని అదేశించారు.
పత్తిసాగు తగ్గేలా ప్రణాళిక.. పత్తి ఎగుమతులపై రాయితీలను రద్దు చేస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ పంట పరిస్థితి ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో పత్తి ధర బాగా పడిపోతుందని అన్నారు. అందువల్ల రాష్ట్రంలో పత్తికి బదులుగా మన వాతావరణ పరిస్థితులకు అనువైన ప్రత్యామ్నాయ పంటలకు రైతులను సిద్ధం చేయాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 42లక్షల ఎకరాలలో పత్తి వేస్తున్నారని, ఆ సాగు విస్తీర్ణాన్ని కనీసం 15నుంచి 20కి తగ్గించాల్సిన అవసరముందన్నారు.
పత్తికి బదులుగా సోయాబీన్, మొక్కజొన్న పంటలను ప్రోత్సహించాలని. ఆ విత్తనాలను వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పత్తిసాగును తగ్గించేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి చెప్పారు. రాష్ట్రంలో చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా రైతులందరికీ సబ్సిడీపై సోయాబీన్ విత్తనాలను సరఫరా చేయాలని సీఎం సూచించారు. ఖరీఫ్‌కు అవసరమయ్యే విత్తనాలను ముందుగానే తెచ్చుకుని నిల్వ ఉంచాలని సూచించారు. గోదాములలో విత్తనాలు, ఎరువులను పుష్కలంగా నిల్వ ఉంచాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే నాలుగు లక్షల టన్నుల ఎరువులను బఫర్ స్టాక్‌గా నిల్వ ఉంచినట్లు మార్కెటింగ్‌శాఖ ఎండీ.శరత్ చెప్పారు. అధిక దిగుబడినిచ్చే సేలం పసుపును సాగుచేయాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
వ్యవసాయ శాఖపై మరింత బాధ్యత.. ప్రాజెక్ట్‌లు పూర్తయితే సాగువిస్తీర్ణం పెరుగుతుందని, ఆ క్రమంలో వ్యవసాయశాఖపై బాధ్యత బాగా పెరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక విస్తరణ అధికారి ఉండేలా సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖలో అధికారులకు పదోన్నతులివ్వాలని, అగ్రికల్చర్ ఆఫీసర్‌లను అగ్రానమిస్టులుగా తీర్చిదిద్దాలన్నారు. పంట రుణ మాఫీ పథకం కింద మూడో విడత నిధులు మంజూరవుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అసలైన అర్హులకు రుణమాఫీ అందుతున్నదా.. లేదా? అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఆడిటర్ల సహకారంతో బ్యాంకు ఖాతాలను పరిశీలించాలని సూచించారు.
ఈ ఏడాది భారీ వర్ష సూచన ఈ సంవత్సరం వానాకాలంలో వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణశాఖ నివేదిక చెబుతున్నందున అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈసారి ఖరీఫ్‌లో 106శాతం వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం వస్తున్నదని పేర్కొన్నారు. మే 15న వాతావరణ శాఖ తాజా అధ్యయన నివేదిక వెల్లడి కానుందని చెప్పారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను తెలుసుకుని అవసరాన్నిబట్టి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
హరితహారంలో అవార్డులు.. గత ఏడాది వర్షాలు సరిగా లేక హరితహారం కార్యక్రమంలో అనుకున్న స్థాయిలో మొక్కలను పెంచలేకపోయామని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే వానాకాలంలో ఆ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. వివిధ నర్సరీలలో ఇప్పటికే 46కోట్ల 30లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కార్యక్రమంలో భాగస్వాములను చేసి ఒక ఉద్యమంగా చేపట్టాలని సూచించారు. మొక్కలను నాటడానికి గుంతలు తీసే కార్యక్రమాన్ని ఉపాధిహామీకి లింకు చేయాలని పేర్కొన్నారు.
ఆర్‌ఓఎఫ్ ఆర్ భూముల్లో యూకలిప్టస్ మొక్కలను నాటాలని సూచించారు. ఇండ్లకు ప్రధానంగా పండ్లమొక్కలను పంపిణీ చేయాలన్నారు. మొక్కలు నాటి, పెంచే విషయంలో స్ఫూర్తిదాయక పాత్ర పోషించే వారికి హరితమిత్ర అవార్డులను ఇచ్చేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. హరిత రక్షణ కమిటీల సమావేశాలను ఏర్పాటు చేయాలని మంత్రి జోగురామన్న అధికారులకు సూచించారు.
కాకతీయ, భగీరథ ఆవశ్యకత ఇదే.. ఈ సారి ఉష్ణాగ్రతలు తీవ్రంగా ఉన్నందున భూగర్భజలాలు మరింత అడుగంటి మంచినీటి కొరతతో పాటు ఇతర పర్యావరణ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని సీఎం చెప్పారు. పర్యావరణ సమతుల్యత లోపించడం వల్ల తరుచూ ఇలాంటి పరిస్థితి వస్తుందన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులకు మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ వంటి పథకాలే సమాధానమని సీఎం స్పష్టం చేశారు.
ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఆ రెండు పథకాల ఆవశ్యకతను తెలుపుతున్నాయని అన్నారు. ఎంత వేగంగా మిషన్ కాకతీయ పూర్తి చేసుకోగలిగితే అంత త్వరగా చెరువులు, కుంటలు నిండి భూగర్భజల మట్టాలు పెరుగుతాయని అన్నారు ఇక మిషన్ భగీరథ పూర్తయితే మంచినీటికి కటకటలాడే స్థితి ఏర్పడదని అన్నారు. ఇంత కరువులోనూ సిద్దిపేటలో తాగునీటి సమస్య లేదని గుర్తు చేశారు. రాష్ట్రమంతటా అదే పరిస్థితి రావాలని సీఎం ఆకాంక్షించారు.
ఖరీఫ్‌కి ముందే భగీరథ పైప్‌లైన్‌లు… ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయభూముల్లో మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు పడి పంటలు వేస్తే పనిచేయడం సాధ్యపడదని హెచ్చరించారు. జిల్లాల వారీగా ఇన్‌టేక్ వెల్స్ పైప్‌లైన్‌ల నిర్మాణాలు, పవర్ స్టేషన్‌లు, పంప్‌హౌజ్ నిర్మాణాలు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాట్ల వంటి అంశాలపై సీఎం కలెక్టర్లతో సమీక్షించారు. ఎస్‌డబ్ల్యుఆర్ పైప్‌లైన్‌ల నిర్మాణానికి అటవీ అనుమతులను వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
మిషన్ కాకతీయ మార్గదర్శకాలలో మార్పులు మొదటి విడత చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పూర్తిచేసి రెండో విడత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తీవ్ర వర్షాభావం వల్ల చాలా చెరువులు ఎండిపోయాయని, ఈ పరిస్థితిని కూడా మనకు అనుకూలంగా మలుచుకొని పెద్ద ఎత్తున పూడిక తీత కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ విషయంలో కలెక్టర్లు అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచి పరిపాలన, సాంకేతిక పరమైన అనుమతులను వేగంగా ఇవ్వాలని నిర్దేశించారు. ప్రతి ఒక్క చెరువు పనికీ ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని, ఈ మేరకు రెండో దశ పనులకు సంబంధించి మార్గదర్శకాలను మార్పులు చేయాలని సూచించారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రహదారుల నిర్మాణం వంటి కార్యక్రమాలను ఏకకాలంలో చేపట్టడానికి అన్ని శాఖల అధికారులను కలెక్టర్లు సమన్వయపరిచాలని సీఎం సూచించారు. చాలా శాఖల్లో ఒకే సారి భారీస్థాయిలో నిర్మాణపనులు జరుగుతున్నందున యంత్రసామాగ్రి కొరత ఏర్పడే పరిస్థితి ఉందని సీఎం అంచనా వేశారు. ఈ మేరకు ముందుగానే పనులకు అవసరమయ్యే యంత్రసామాగ్రి, మానవవనరులను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఏ శాఖలో ఎంత పనిచేయగలరో శాస్త్రీయంగా అంచనా వేసుకుని పని విభజన చేసుకుంటే మంచిదన్నారు.
గురుకుల పాఠశాలల ఏర్పాట్లు చూడండి.. ఈ విద్యాసంవత్సరం నుంచి మైనార్టీలు, ఎస్‌సీ,ఎస్‌టీల కోసం 250 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నందున వాటికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. భవనాలు నిర్మించేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా అద్దెభవనాలలో గురుకుల పాఠశాలలను నడపాలని సూచించారు.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల మాదిరిగానే కొత్త గురుకులాలను నడుపుతామన్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి , తలసాని శ్రీనివాస్‌యాదవ్, జోగురామన్న తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్లతో పాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, ఎంసీహెచ్‌ఆర్డీ డైరెక్టర్ జనరల్ వినోద్‌కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.