-ప్రభుత్వం అండగా ఉంటుంది.. ఆత్మహత్యలొద్దు -రైతుల ఫిర్యాదులకు త్వరలోనే హెల్ప్‌లైన్: హరీశ్‌రావు
కరువు కాటు నుంచి రైతన్నను ఆదుకోవడానికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవలసిన అవసరంలేదని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో గ్రామాల వారీగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపడుతామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతమున్న 100రోజుల పనిదినాలను 150రోజులకు పెంచాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాస్తున్నామన్నారు.
పరిశ్రమలకు తగ్గించైనా ఖరీఫ్ పంటకు ఏడుగంటల విద్యుత్‌ను సరఫరా చేయాలని ఆదేశించామన్నారు. రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, రైతుల ఫిర్యాదులను స్వీకరించి వారికి సలహాలు, సూచనలివ్వడానికి హెల్ప్‌లైన్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించామని తెలిపారు. కరువు కాలంలో ఇవ్వాల్సిన ఇన్‌ఫుట్‌సబ్సిడీని వెంటనే అందిస్తామని చెప్పా రు. కరువు కారణంగా రైతులు నిరాశతో ఆత్మహత్యలు చేసుకోకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర లభించేలా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించామని పేర్కొన్నారు. రైతుల వద్ద పత్తిని సరైన ధరకు కొనుగోలు చేయడానికి ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ, మార్క్‌ఫెడ్ వంటి ఏజెన్సీలు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.