-తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు 85 సీట్లు -రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ -మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీదే అధికారం -ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడి
ఏ సర్వే అయినా.. వాటన్నింటి క్రోడీకరణలైనా.. తేల్చి చెప్తున్నది ఒక్కటే! తెలంగాణలో కారుదే జోరు! తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు రానున్న ఎన్నికల్లో 85 సీట్లు తథ్యమని ఇటీవల టీమ్‌ఫ్లాష్, వీడీఏ అసోసియేట్స్, సీవోటర్, ఐటీటెక్ గ్రూప్, టైమ్స్‌నౌ సంస్థలు నిర్వహించిన సర్వేలను క్రోడీకరిస్తూ మంగళవారం ఎన్డీటీవీ వెల్లడించిన పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ ఫలితాల్లో తేలింది. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు 60 స్థానాలు అవసరం. అంటే సాధారణ మెజార్టీ కంటే అధిక స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోబోతున్నదని అర్థమవుతున్నది.
కాంగ్రెకు 18, బీజేపీకి ఐదు, ఎంఐఎంకు ఏడు స్థానాలు లభిస్తాయని పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ అంచనావేసింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో నవంబర్-డిసెంబర్‌లలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ స్పష్టంచేసింది. ఛత్తీస్‌గఢ్‌లో చాలా స్వల్ప తేడాతో కాంగ్రెస్ గెలుపు సొంతం చేసుకుంటుందని పేర్కొంది. మూడు పర్యాయాలుగా ప్రభుత్వంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తెలిపింది.
తిరుగులేని విజయం ఖాయం: కేటీఆర్ ఎన్డీటీవీలో వచ్చిన ఫోల్ ఫలితాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్‌చేశారు. మరో పోల్.. ఈసారి ఎన్డీటీవీ.. మూడింట రెండొంతులకుపైగా మెజార్టీతో టీఆర్‌ఎస్‌కు తిరుగులేని విజయం ఖాయమని సంకేతాలిచ్చింది. టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని పేర్కొంటూ గడిచిన మూడు వారాల వ్యవధిలో వచ్చిన ఐదవ తటస్థ మీడియా/ఏజెన్సీ సర్వే ఇది అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.