Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కర్షక దేవాలయాలు

కూటికి గోస. నీటికి గోస. విత్తనాలకు గోస. ఎరువులకు గోస. కరెంటుకు గోస. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకూ గోస. మార్కెట్లో కొనే దిక్కుండదు. కొన్నా కష్టానికి తగ్గ ధర రాదు. ఆరు దశాబ్దాల సమైక్య పాలనలో వ్యవసాయం అంటే భరోసా లేని బతుకులు. ఆకలిచావులు, ఆత్మహత్యలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆరేండ్ల క్రితం వరకు పరిస్థితి ఇది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రాతిపదికే రైతుల కష్టాలు, కన్నీళ్లు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, వ్యవసాయం బాగుంటేనే పల్లెలలో దానిచుట్టూ అల్లుకున్న వృత్తులు బాగుంటాయన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడం, రైతు కుటుంబాలకు భరోసానివ్వడం మీద దృష్టి సారించారు.

ప్రపంచానికి అన్నం పెట్టేది రైతు. అలాంటి రైతు తన వృత్తికి దూరమైతే సమాజ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఇంతటి కీలక రంగాన్ని అభివృద్ధి పరచాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదట దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు అందించారు. మిషన్‌ కాకతీయ పథకం కింద తెలంగాణలోని గొలుసుకట్టు చెరువులను పునర్నిర్మించారు. వీటితో పాటు నూతన ప్రాజెక్టుల మూలంగా సాగునీటి రాకతో తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల స్వరూపం మారిపోయింది. ఇన్నాళ్లూ బతుకుదెరువుకు వలసెల్లిన మనుషులే కాదు పక్షులు కూడా తిరిగి గ్రామాలకు చేరుకున్నాయి.

రైతుకు వెన్నుదన్నుగా నిలిచి రైతు తన కష్టానికి తనే ధర నిర్ణయించుకోవాలన్న ఉద్దేశంతో రైతుబంధు సమితులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి రైతువేదికలను నిర్మిస్తున్నది. ఇవి కేవలం భవనాలు కావు. రైతాంగం భవిష్యత్‌ నిర్మాణ వేదికలు.

రాష్ట్రమంతటా భూగర్భజలాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఉచిత చేపపిల్లలు అందించడంతో మత్స్యకారులకు ఉపాధి లభించడమే కాకుండా సామాన్యులకు బలవర్ధకమైన ఆహారం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రం మత్స్యసంపదలో దేశంలో అగ్రగామిగా నిలిచింది. గొర్లు, పశుపోషణకు సమృద్ధిగా మేత, నీరు అందుబాటులో లభిస్తుండటంతో ఆ రంగంలో ఉపాధి పెరిగింది. వరుసగా వస్తున్న పంటలు, కుదుటపడ్డ వ్యవసాయం మూలంగా యంత్రసామగ్రి భారీగా పెరిగింది. మనుషుల దైనందిన కార్యక్రమాల విస్తరణ గణనీయంగా పెరిగింది. తెలంగాణ తలసరి ఆదాయం 2013- 14 ఆర్థిక సంవత్సరంలో రూ.1.12 లక్షలు ఉండగా, 2018- 19 నాటికి రూ.2.28 లక్షలకు చేరింది.

సాగు అంటే లాభసాటి కాదన్న రైతాంగంలో ఆత్మవిశ్వాసం నింపాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు పెట్టుబడి సాయం అందించే రైతుబంధు పథకాన్ని మొదలుపెట్టారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.28,305.91 కోట్లు రైతుల ఖాతాలలో జమచేశారు. ఈ వానకాలంలో 57.98 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7285.70 కోట్లు జమయ్యాయి. దీపావళి తరువాత యాసంగికి సంబంధించిన నిధులు కూడా విడుదలవుతాయి. రైతు కుటుంబాలలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏ కారణం వల్ల మరణించినా రూ.5 లక్షలు అందించే రైతుబీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 37080 మంది రైతులకు రూ.1854 కోట్లు అందించారు. క్షేత్రస్థాయిలో రైతులకు సాగుకు సంబంధించిన సలహాలు ఇచ్చేందుకు ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించారు. తెలంగాణ ఏర్పడేనాటికి 707 మంది ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులను 2604కు పెంచారు. పాత 707 మందికి తోడు కొత్తగా 1526 మందిని శాశ్వత, మిగిలినవారిని తాత్కాలిక పద్ధతిన నియమించారు.

పరాయి పాలనలో ఉన్న కరెంటు కష్టాలు కేసీఆర్‌ పాలనలో దూరమయ్యాయి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే తొలిసారి వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటును అందించి రైతన్నకు బాసటగా నిలిచారు. ఈ ఆరేండ్లలో రైతులకు ఉచిత కరెంటు కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.26,728 కోట్లు భరించింది. రైతు పండించిన పంటలను వందశాతం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చేదానితో సంబంధం లేకుండా దేశంలోని ఇతర రాష్ర్టాలకు భిన్నంగా ఇక్కడ కొనుగోలు చేపడుతున్నారు. గత ఏడేండ్లలో రూ. 27,718 కోట్ల మేర రైతుల రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసింది. ఇటీవల కరోనా సంక్షోభంలోనూ దాదాపు రూ.30 వేల కోట్లతో వరి, మక్కజొన్న, పప్పుశనగ, జొన్నలు, పొద్దు తిరుగుడు పంటలను కొనుగోలు చేసింది. మహారాష్ట్ర తరువాత అత్యధిక రుణాలు మాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణనే. ఈ విషయాన్ని స్టేట్‌ ఫైనాన్సెస్‌ సంస్థ స్వయంగా ప్రకటించింది. తెలంగాణ వచ్చిన వెంటనే రూ.800 కోట్ల నీటితీరువా బకాయిలను రద్దుచేసిన కేసీఆర్‌, తెలంగాణలో ఇక నీటితీరువా ఉండదని ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో ఆరేండ్లలో తెలంగాణలో వ్యవసాయరంగ స్వరూపమే మారిపోయింది. 2014- 15లో వానకాలం, యాసంగిలో కలిపి కోటీ 31 లక్షల 33 వేల ఎకరాలు సాగుచేస్తే ఈ ఏడాది ఈ ఒక్క వానకాలంలోనే కోటీ 42 లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగయ్యాయి. గత యాసంగిలో తెలంగాణ ఏకంగా దేశానికే అన్నపూర్ణగా అవతరించింది. భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం ధాన్యంలో ఒక్క తెలంగాణ నుంచి అందినదే 54 శాతం. మిగతా రాష్ర్టాల నుంచి లభించింది 46 శాతం. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థనే వెల్లడించింది. మొత్తం దేశంలో 119 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా, 64.16 లక్షల మెట్రిక్‌ టన్నులు తెలంగాణ నుంచి అందాయి. కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా రైతుకే ప్రాధాన్యం. తెలంగాణ ఆవిర్భావం వరకు రైతన్నల ఓ కన్ను వానకోసం.. ఓ కన్ను అప్పుకోసం ఎదురుచూసేది. విత్తనం దొరకదు.. దొరికితే వేసిన విత్తనం మొలవదు.. మొలిస్తె పూతవట్టదు. పట్టినా పంట చేతికి వచ్చేది అనుమానం. అన్ని సక్కగుంటే కరెంటు ఉంటదో? ఉండదో?.. అన్ని అనుమానాలు. అన్ని గండాలను దాటుకుని పంట చేతికొస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర ఉండదు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ నిర్ణయాలతో రైతులు ధైర్యంగా పంటలు పండిస్తున్నారు. మార్కెట్‌కు వెళ్తే దళారులు ఏం చేస్తారోననే ఆందోళన లేదు. నేరుగా ప్రభుత్వమే మద్దతుధరకు పంటలను కొనుగోలు చేస్తున్నది. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగ, వ్యవసాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్లకు ఎర్ర తివాచీ పరుస్తున్నది. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. కేంద్ర విధానం ఎలా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం రైతు అనుకూల నిర్ణయాలతో ముందుకు సాగుతున్నది.

రైతుకు వెన్నుదన్నుగా నిలిచి రైతు తన కష్టానికి తనే ధర నిర్ణయించుకోవాలన్న ఉద్దేశంతో రైతుబంధు సమితులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి రైతువేదికలను నిర్మిస్తున్నది. ఇవి కేవలం భవనాలు కావు. రైతాంగం భవిష్యత్‌ నిర్మాణ వేదికలు. రైతుబంధు సమితులతో రైతులను సంఘటితం చేసిన ప్రభుత్వం రైతువేదికలతో వారిని మరింత సాధికారత దిశగా తీసుకువెళుతుంది. తెలంగాణలోని 2601 క్లస్టర్లలో రైతువేదికలు ప్రారంభం కానున్నాయి. సాగుకు సమగ్ర సూచనలు రైతులకు తెలియజేయడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పంటలకున్న డిమాండ్‌ తదితర వివరాలను వారికి చేరవేసేందుకు రైతువేదికలు ఉపయోగపడతాయి. ప్రభుత్వం సూచించిన నియంత్రిత సాగును రైతులు అనుసరిస్తున్నరు. ప్రభుత్వం మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటల గురించి అధ్యయనం చేసి రైతులకు సూచనలు ఇస్తున్నది. రైతువేదికల రాకతో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మరింత మారిపోనున్నది. వ్యవసాయ అనుకూల నిర్ణయాలతో దేశానికి ఆదర్శంగా నిలిచి వివిధ రాష్ర్టాలకు మార్గదర్శకులైన కేసీఆర్‌ రైతువేదికలతో మరో చారిత్రక మలుపునకు కారణమవుతున్నారు.

(వ్యాసకర్త: వ్యవసాయశాఖ మంత్రి) శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.