-అధికార వికేంద్రీకరణ దిశగా చర్యలు -త్వరలో సర్పంచ్‌లకు శిక్షణ: మంత్రి కేటీఆర్
గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్ సేవలను విస్తృత పరిచేందుకు ఈ-పంచాయతీల రూపకల్పనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని, పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తామని పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. మంగళవారం కరీంనగర్ జెడ్పీలో మన మండలం-మన ప్రణాళికలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 1200 తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
అధికారాల వికేంద్రీకరణ జరగుతుందని, అవగాహన కల్పించేందుకు మంత్రి నుంచి సర్పంచ్‌స్థాయి ప్రతినిధుల వరకు దశలవారీగా శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. కరీంనగర్‌లో ఐటీ పార్కు ఏర్పాటుపై ఒక సంస్థతో చర్చలు జరుపుతున్నామన్నారు. పట్టణ జనాభా నాలుగు లక్షలు దాటినందున రెండు తహసీల్దార్ కార్యాలయాల డిమాండ్ ఉందని, కరీంనగర్ మండలానికి ప్రత్యేకంగా తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. దక్షణాది రాష్ర్టాల్లో మిగులు విద్యుత్‌లేదని,నిజామాబాద్ నుంచి ఉత్తరాదికి లైన్ ఏర్పాటు చేసి కొరత తీర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నదన్నారు. ఐదేండ్లల్లో మిగులు విద్యుత్ రాష్ర్టాల జాబితాలో తెలంగాణను చేర్చేలా సీఎం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సిరిసిల్ల నుంచి వేములవాడకు నాలుగులైన్ల రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు సిరిసిల్ల మీదుగా నాలుగులైన్ల రోడ్డు విస్తరణకు ప్రయత్నిస్తామన్నారు.ఎమ్మెల్యే గంగుల, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఇన్‌చార్జి కలెక్టర్ పాల్గొన్నారు.