-విజయాలకు పొంగిపోం.. అపజయాలకు కుంగిపోం -టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

టీఆర్‌ఎస్ పార్టీ విజయాలకు పొంగిపోదని, అపజయాలకు కుంగిపోదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. మంగళవారం దుబ్బాక ఉప ఎన్నిక ఫలితా లు వెలువడిన అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్టీని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించిన మంత్రి హరీశ్‌రావు, ఇతర నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌ఎస్ అప్రతిహత విజయాలను నమోదుచేసిందన్నారు. గతేడాది హుజూర్‌నగర్ ఎన్నికల్లోనూ ఘనవిజయం సొంతం చేసుకున్నట్టు గుర్తు చేశారు. దుబ్బాకలో ఆశించిన ఫలితాలు రాలేదని, ఓటమికి గల కారణాలను లోతుగా సమీక్షించుకుంటామని పేర్కొన్నారు. దుబ్బాక ఓటింగ్ సరళి.. తమను అప్రమత్తం చేసిందన్నారు. మా నాయకులకు ఒక హెచ్చరికగా భావిస్తామని తెలిపారు. ప్రజాతీర్పును శిరోధార్యంగా భావించి పార్టీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రభుత్వ, పార్టీపరంగా చేసే ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా తొట్రుపాటు లేకుండా అమలుచేస్తామని, ప్రజలకు మరింత చేరువవుతామని వెల్లడించారు.

ప్రజాతీర్పును శిరసావహిస్తాం దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నానని పేర్కొన్నారు. టీఆర్ ఎస్‌కు ఓటువేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కృతజ్ఞ తలు. దుబ్బాకలో ఓటమి కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకొంటాం. మా లోపాలను సవరించుకొంటాం. ఓటమి పాలైనప్పటికీ టీఆర్‌ఎస్ పక్షాన, నా పక్షాన దుబ్బాక ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకొంటా. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక అభివృద్ధికి, ప్రజలకు, కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుంది’ అని అన్నారు.
– మంత్రి హరీశ్‌రావు