ఆ పాలన అంత సక్కగుంటే ఎన్టీయార్ పార్టీ ఎందుకు పెట్టాల్సివచ్చింది?
ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్న కాంగ్రెసోళ్లకు సిగ్గుండాలె
కరువులు..ఆత్మహత్యలు.. రక్తపాతాలు..మతకల్లోలాల చీకటిరోజులే
పెండింగ్ ప్రాజెక్టులంటూ పేరు పెట్టిందే కాంగ్రెస్
ఇప్పుడు 24 గంటల కరెంటే వద్దంటున్నరు
రైతుబంధు దుబారానట.. ధరణిని తీసేస్తరట
అదే జరిగితే పదేండ్ల కష్టం బూడిదలో పన్నీరే!
వాల్మీకి బోయల్ని బీసీల్లో కలిపింది కాంగ్రెస్సే
దేశంలో నీటి తీరువాలేని ఏకైక రాష్ట్రం మనదే
అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ప్రజాఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
సీఎం కేసీఆర్ ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రసంగాల్లో పదును పెంచారు. నిన్నటివరకు తెలంగాణ నాడు-నేడు-రేపును వివరించే ప్రయత్నం చేసిన కేసీఆర్.. ఇప్పుడు ప్రతిపక్షం తీరును ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. గత గాయాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్, బీజేపీని చీల్చిచెండాడుతున్నారు.
మొన్న చేర్యాల సభలోనూ.. నిన్న అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి సభల్లోనూ పాత కేసీఆర్ కనిపించారు. రైఫిల్‌రెడ్డి బాగోతాన్ని చేర్యాల సభలో ప్రజలకు వివరించినట్టే.. ఇందిరమ్మ రాజ్యపు చీకటిరోజుల్ని పాలమూరు సభలో గుర్తుచేశారు. కాంగ్రెస్ గతకాలపు పాపాలను, ఇప్పటి మాయ మాటలను గులాబీ దళపతి వివరిస్తుంటే.. ప్రజలనుంచి విశేష స్పందన కనిపించింది. ప్రతి మాటకూ చప్పట్లు, ఈలలతో సభా ప్రాంగణాలు హోరెత్తాయి.
కాంగ్రెస్ గొప్పగా ప్రచారం చేస్తున్న ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు అనుభవించింది ఆకలి బతుకులేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. నిత్యం మత కల్లోలాలు, ఎన్‌కౌంటర్లే ఉండేవని గుర్తుచేశారు. అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. ‘ఇందిరమ్మ రాజ్యంలో మన్నుండెనా? వాళ్లు చెప్పే ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులు తప్పితే ఏం లేకుండె. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే రూ.2 కిలోల బియ్యం పెట్టారు. ఇందిరమ్మ రాజ్యమే మంచిగుంటే రూ.2కు కిలో బియ్యం ఎందుకు పెట్టేవాళ్లు? ఇందిరమ్మ రాజ్యంలో నిత్యం ఎన్‌కౌంటర్లే. మనోళ్లను కాల్చిచంపిడ్రు. ఇందిరమ్మ రాజ్యంలోనే హైదరాబాద్‌లో మతోకల్లోలాలైనయ్. రక్తపాతం అయ్యింది. అలాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ తెస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నరు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పాలనపై చర్చించండి
ప్రజాస్వామ్యంలో కావాల్సింది ఫ్యాక్షనిస్టులు, దాదాగిరీ, గుండాగిరీ కాదని, ఒకరినొకరు చంపుకునే నీచ సంస్కృతి కాదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తే మంచి ఆలోచన చేసి ఓట్లు వేయాలని, ఓటును సక్రమంగా వినియోగించుకోకుంటే ఐదేండ్లపాటు గోస పడతామని హెచ్చరించారు. ఓటేసే ముందు రాయేదో రత్నమేదో గుర్తించాలని సూచించారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల గుణగణాలతోపాటు, వారి వెనుక ఉన్న పార్టీల చరిత్రను చూడాలని, కోరారు. ‘కాంగ్రెస్ 50 ఏండ్లపాటు రాష్ట్రంలో, ఢిల్లీలో అధికారంలో ఉన్నది. మరి కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది? బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో ఏం జరిగింది? అనేది చర్చించి, విచక్షణతో ఓటేయండి’ అని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మీద జరిగిన దాడులు, దోపిడీ, రైతాంగం ఏవిధంగా నష్టపోయిందో అందరికీ తెలుసని అన్నారు. ‘తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేసిన పొరపాటు వల్ల 58 ఏండ్లు గోసపడ్డాం. ఎవరూ మన బాధలను తీర్చలేదు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర అనేక ప్రాజెక్టులకు పెండింగ్ పేరుపెట్టి చేతులు దులుపుకున్నరు. ఆర్డీఎస్ హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో ప్రారంభమైంది. ఇక్కడ ఇది 80 వేల ఎకరాలకు పారాలి. కానీ తెలంగాణ వచ్చేనాటికి మొత్తం పోయింది. రాయలసీమ నాయకులు తూములు బద్దలు కొట్టి అక్రమంగా నీళ్లు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి చూశారు తప్ప ఎవరూ ఏం చేయలేదు. పదవులను తమ స్వార్థానికి వాడుకున్నారు’ అని ధ్వజమెత్తారు.
వాల్మీకి బోయలను గిరిజనుల్లో కలుపుతాం
పాత మహబూబ్‌నగర్ జిల్లాలో వాల్మీకి బోయలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వారికి కాంగ్రెస్సే అన్యాయం చేసిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘బోయలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు. ఎస్టీ జాబితాలో ఉన్న బోయలను బీసీల్లో కలిపారు. ఆ బోయలను మళ్లీ ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. నరేంద్రమోదీ ప్రభుత్వం దానిని కిందపడేసి కూర్చున్నది తప్ప కదులుతలేదు. వాల్మీకి బోయలకు హామీ ఇస్తున్నా.. ఈ టర్మ్‌లో తప్పకుండా కేంద్రంపై పోరాటం చేసైనా వాల్మీకి బోయలను మళ్లీ గిరిజనులుగా ప్రకటింపజేస్తం’ అని భరోసా ఇచ్చారు.
ఇందిరమ్మ రాజ్యమా తోకమట్టనా?
కాంగ్రెస్ గత పాలనలో ఎక్కడ చూసినా ఆకలి కేకలు, అరాచకాలేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఏమైంది మన బతుకు? అనాడు చేసింది చాలక మళ్లా ఇయ్యాల సిగ్గు, శరం లేకుండా ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెప్తున్నరు. ఏముండె ఇందిరమ్మ రాజ్యంలో మనం చూడలేదా! ఎన్టీ రామారావు పార్టీ పెట్టి రూ.2 కిలో బియ్యం ఇచ్చేదాకా ఆకలి బతుకులే కదా? అంత ఎండి చచ్చినం. పేదల బాధలు పట్టించుకున్నోడు ఎవ్వడూ లేడు. తెలంగాణను ఆగం పట్టించి బతుకును నాశనం చేశారు. ఇందిరమ్మ రాజ్యమా తోకమట్టనా! 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? ఆకలిచావులే కదా? నక్సలైట్ల ఉద్యమాలే కదా? ప్రజలను కాల్చి చంపుడే కదా? ఎన్‌కౌంటర్లే కదా? ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెడుతుండె? అంత సుభిక్షంగా ఉంటే రూ.2 కిలో బియ్యం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? అంటే ఇందిరమ్మ రాజ్యమంత దరిద్ర రాజ్యం ఇంకోటి లేకుండెనని అర్థమైతుంది కదా? ఆ కాలమంతా దోపిడీ చేసిన్రు తప్ప ప్రజలను పట్టించుకోలె. కరువున్నది అని చెప్పి మహబూబ్‌నగర్‌లో సిగ్గులేకుండా గంజి కేంద్రాలు పెట్టిన్రు. తెలంగాణకు వాళ్లు పెట్టిన పేరు వెనకబడ్డ ప్రాంతం. గరీబు ప్రాంతం. జొన్నలే పండించుకోవాలె.. వడ్లు పండయ్ అని మాట్లాడిన్రు. పదేండ్ల కింద కూడా ఇదే మాట్లాడిన్రు. మీకు నీళ్లు రావు, తెలివి లేదన్నరు’ అని నిప్పులు చెరిగారు.
ఇప్పుడే తెలంగాణ తొవ్వకు వచ్చింది
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలోనే తెలంగాణ ఓ తొవ్వకు వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. అనాడు జరిగిన అన్యాయాలన్నీ ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామని వివరించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలను సామాజిక బాధ్యతగా ఆదుకోవాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2 వేల పెన్షన్ ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో దానిని రూ.5 వేలకు పెంచుతామని వెల్లడించారు. ‘వందల్లో ఉన్న పింఛన్‌ను వేలల్లోకి తీసుకుపోయింది బీఆర్‌ఎస్ పార్టీ. దళిత బిడ్డల కోసం దళితబంధు తెచ్చాం. కంటి వెలుగు ద్వారా 80 లక్షల మందికి ఉచితంగా అద్దాలు ఇచ్చాం. అమ్మ ఒడి వాహనాలు పెట్టి ఆడబిడ్డలను ఇంటినుంచే తీసుకుపోయి ప్రసవం చేయించి, కేసీఆర్ కిట్టు ఇచ్చి, ఆర్థిక సాయం అందించి, మళ్లా ఇంటివద్ద దిగబెడుతున్నాం. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగు నీటిని అందిస్తున్నాం. ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుండటంతో గంగపుత్రులు, ముదిరాజ్‌లు రూ.33 వేల కోట్ల విలువైప చేపలు ఉత్పత్తి చేశారు. యాదవ సోదరులకు లక్షలాది గొర్రెలు పంపిణీచేశాం. ఒక్క కులం, ఒక్క వర్గం అనకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేశాం. నీటి తీరువా రద్దు చేశాం. 24 గంటల కరెంటును ఫ్రీగా ఇస్తున్నాం. పెట్టుబడికి రైతుబంధు ఇస్తున్నాం. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందిస్తున్నాం. రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. రాబోయే రోజుల్లో రైతుబంధును కూడా రూ.16 వేలకు పెంచుతాం. ఇంత మంచి పరిపాలన కొనసాగించుకుంటే లాభం జరుగుతుంది. లేదంటే నష్టపోతాం. పదేండ్లుగా చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని’ అని హెచ్చరించారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దళారులదే రాజ్యం
రాష్ట్రంలో మళ్లీ పటేల్, పట్వారీ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ‘ప్రజలు కట్టే పన్నులన్నీ వేస్టుగా రైతుబంధు పేరుతో ఇస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. రైతుబంధు వేస్టా? పీసీసీ అధ్యక్షుడేమో 24 గంటల కరెంటు వేస్ట్ అంటున్నాడు. 3 గంటలే సరిపోతుందని మాట్లాడుతున్నాడు. మరి 3 గంటల కరెంటు సరిపోతుందా? 3 గంటలకు పొలం ఎట్లా పారుతదని అడిగితే 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకోవాలంటున్నారు. ఆ మోటర్ పెట్టుకునేందుకు డబ్బులు ఎవరు ఇయ్యాలె? ఎన్నివేల కోట్లు కావాలి? రాహుల్‌గాంధీ, భట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేతలందరూ ధరణిని కూడా తీసేస్తామని బాజాప్తా చెప్తున్నారు. ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతుబీమా, పంట కొనుగోలు డబ్బులు ఎలా వస్తయ్? ఎవరు ఇంటికి తెచ్చివ్వాలి? నాడు పట్టాదారు పాస్‌బుక్‌లో పదుల సంఖ్యలో కాలాలు ఉంటే.. అవన్నీ తీసేయించి ఒక్క పట్టాదారు కాలమ్ మాత్రమే ఉంచి.. భూమిపై రైతుకు మాత్రమే పూర్తి హక్కులు కల్పిస్తూ ధరణిని తెచ్చినం. ఇప్పుడు మళ్లీ కౌలుదారు కాలం, కబ్జాదారు కాలం పెడుతరట. వీటి ద్వారా కౌలుదారులు, రైతులకు పంచాయితీ పెట్టి వ్యవసాయాన్ని పడావు చేసే కుట్ర చేస్తున్నారు’ అని విమర్శించారు.
ఢిల్లీ గద్దలు వాలుతున్నయ్
పదేండ్లు కష్టపడి పాలమూరు కష్టాలు తీర్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘రైతులను కాపాడి ఇవాళ తెలంగాణ ఓ దరికి తెచ్చాం. సాగునీరు అందించడం ద్వారా పాలమూరు నుంచి కరువు జిల్లా ముద్రను శాశ్వతంగా చెరిపివేసినం. మళ్లా ఇవాళ ఢిల్లీ గద్దలన్నీ వాలుతున్నాయి. ఇందిరాగాంధీ వారసుడు రాహుల్‌గాంధీ కొల్లాపూర్‌కు వచ్చిండు.. ఎందుకు గడ్డి కోయడానికా? మళ్లా మనకు ముళ్ల కిరీటం పెట్టడానికా? మళ్లా తెలంగాణను ఆగంబట్టించి, కరెంటు బందు పెట్టించేందుకా కాంగ్రెస్ తిరిగేది? అడ్డమైన కథలన్నీ చెప్తరు. 50 ఏండ్లు ఏం చేయలె. మంచిగా ఎయిర్ కండీషనర్ల పన్నరు. ప్రజలు బొంబాయి పోయెట్టు చేసిండ్రు. పదేండ్లు తండ్లాడి ఒక తొవ్వకు తెచ్చిన తెలంగాణను కాంగ్రెస్ పాలకులు ఎడారి చేస్తరు. ఇది ఓట్ల పంచాగమే కాదు. బతుకుదెరువు పంచాగం. ఢిల్లీ నుంచి వచ్చే కాంగ్రెసోడికి, బీజేపీ వాడికి తెలంగాణపై ప్రేమ ఎందుకు ఉంటుంది? అన్ని సిద్ధమయ్యాక యాళ్లకు వచ్చి నేను వడ్డన చేస్త అన్నట్టు ఉన్నది. ఇవి ఓట్లు కావు. తెలంగాణ బతుకుదెరువు పోరాటం. మన బతుకు, తలరాత రాసే ఓట్లు. ఆషామాషిగా ఏస్తే ఆగమాగం అవుతాం’ అని హెచ్చరించారు. ఎన్నికల్లో బీసీలు చైతన్యం చూపాలని పిలుపునిచ్చారు. ‘బీసీ మిత్రులకు నా వినతి ఒక్కటే.. రానిచోట బీసీలకు టికెట్లు రాలేదు. వచ్చిన చోటైనా గెలిపించుకోవాలె. ఈ విషయంలో బీసీలు చైతన్యం చూపించాలి. గంపెడుమంది బీసీలు ఉన్నారు. బీసీ బిడ్డలు ఎలా ఓడిపోతారు? బీసీ ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆలోచించి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలి’ అని సీఎం కేసీఆర్ కోరారు.
జనార్దన్‌రెడ్డి గెలుపు ఖాయం
నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. ‘జనార్దన్‌రెడ్డి డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. సొంత డబ్బుతో పేదసాదల సామూహిక వివాహాలు జరిపిస్తడు. నాగర్‌కర్నూల్ నిజాం జమానాలో జిల్లాగా ఉండే. కాంగ్రెస్‌సోళ్లు ఆగం చేసిండ్రు. తెలంగాణ వచ్చాకే నాగర్ కర్నూల్ జిల్లా అయ్యింది. జీవకళ వచ్చింది. మంచిగ పంటలు పండుతున్నయి. గతంలో మార్కండేయ లిప్టు అడిగితే మంజూరుచేశాం. ఈ లిఫ్ట్ ప్రారంభమయ్యింది. నార్లాపూర్ పంపులు నీళ్లు దుమికాయి. వట్టెం రిజర్వాయర్ మీ పక్కనే ఉన్నది. మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినం. వట్టెం రిజర్వాయర్ నింపితే 40- 50 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. గతంలో మెడికల్ కాలేజీ ఇచ్చినం. నెల రోజుల్లోనే జీవో ఇచ్చి ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తం. నాగర్‌కర్నూల్‌ను అభివృద్ధిచేసే బాధ్యత నాది. ఇవన్నీ ఇదే తరహాలో కొనసాగాలంటే మర్రి జనార్దన్‌రెడ్డిని గెలిపించాలి’ అని సీఎం కేసీఆర్ కోరారు.
హర్షవర్ధన్‌రెడ్డిని గెలిపించండి
కాంగ్రెస్ పాలనలో కొల్లాపూర్ ప్రాంతంలో ప్రజలకు తాగటానికి నీళ్లు కూడా లభించలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘కొల్లాపూర్ గడ్డ పరిస్థితి ఏంది? పెద్ద కొత్తపల్లి, చిన్నంబావి మండలాలకు నేరుగా బొంబాయి బస్సులే ఉండె. ఇయ్యాల తెలంగాణలో ఏటా 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి. కొల్లాపూర్‌లోనే లక్షా 27 వేల ఎకరాల్లో వడ్లు పండుతున్నాయి. మరి గతంలోని లేని వడ్లు ఇప్పుడు ఏడికెళ్లి వచ్చాయి? ఎవరు తెచ్చారు? అంటే కాంగ్రెస్ పాలనలో మనం ఎంత మోసపోయామో, దగాపడ్డామో అర్థం చేసుకోవాలె. తెలంగాణను సర్వనాశం చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడగడానికి సిగ్గు శరం లేదు. ఏ మొఖం పట్టుకుని ఓట్లు అడుగుతున్నరు? నాడు కనీసం మంచినీళ్లు ఇయ్యలె’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ బీఆర్‌ఎస్ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి ఏం పనిచేసిండు? ఇంతకు ముందుకు ఉన్నాయన ఏం పని జేసిండు మీకు తెల్వదా? పోలీసులకు పట్టిచ్చుడు, కేసులు పెట్టుడు. కక్ష తీర్చుకునుడు. ముఠాలు కట్టుడు. ఇది తప్ప వేరే పనేమైనా చేసిండా? ఐదేండ్లు మంత్రిగా ఉండె. అందుకే మీరు కోపానికి వచ్చి ఓడగొట్టిండ్రు. మళ్లా ఇప్పుడు కొత్త వేషం వేసుకుని వస్తున్నరు. కాంగ్రెస్ వాళ్లకు ఎందుకు ఓటేయాలి? హర్షవర్ధన్‌రెడ్డి హైలెవల్ కెనాల్ కావాలని కోరుతున్నరు. ఇటీవలనే పాలమూరు లిఫ్ట్‌ను ప్రారంభించినం. పాత మహబూబ్‌నగర్ జిల్లాకు అన్నం పెట్టే ప్రాజెక్టు అది. ఒకసారి వచ్చిందంటే ఈ జిల్లా మొత్తం బంగారు తునక అయితది. పాత మహబూబ్‌నగర్ మొత్తం 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతయ్. ఇదంతా సాఫీగా సాగాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కోరారు.
విజయుడు గెలిస్తే సామాన్యుడు గెలిచినట్టే
బీఆర్‌ఎస్ గెలిస్తేనే అలంపూర్ మరింత అభివృద్ధి సాధిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఆర్డీఎస్ మీద తుమ్మిళ్ల ఎత్తిపోతలను కట్టుకున్నాం. మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒకటి కావాలి. చిన్నోనిపల్లి త్వరగా పూర్తికావాలె. ఎట్లయితే తుమ్మిళ్ల రిజర్వాయర్ 10 నెలల్లో కట్టామో.. అలాగే నెట్టెంపాడు 99, 100 ప్యాకేజీలను పూర్తి చేస్తాం’ అని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నిజాయితీగల మనిషి అని, ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయుడిని గెలిపించాలని, అలంపూర్ అవసరాలన్నీ తీర్చుతానని హామీ ఇచ్చారు. గతంలో 100 పడకల వైద్యశాల, బస్సులు కావాలని కోరారని, అవన్నీ పూర్తి చేశామని చెప్పారు. రూ.14 కోట్లతో ఆర్డీఎస్ కాలువల పూడిక తీత పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అలంపూర్‌కు కరువు అనేది రాకుండా చూసే బాధ్యత తనది అని భరోసా ఇచ్చారు. విజయుడు గెలిస్తే సామాన్యుడు గెలిచినట్టేనని పేర్కొన్నారు.
కమిట్‌మెంట్ ఉన్న నాయకుడు జైపాల్‌యాదవ్
కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ మంచి కమిట్‌మెంట్ ఉన్న నాయకుడని సీఎం ప్రశంసించారు. ‘జైపాల్ యాదవ్ నా వెంటపడి రెండు డిస్ట్రిబ్యూటరీ కాల్వలు మంజూరు చేయించుకున్నడు. ఒకనాడు కరువు ప్రాంతంగా ఉన్న కల్వకుర్తిలో వాటితో 90 వేల ఎకరాలు సస్యశ్యామలం అయ్యాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతంలో లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తాం. మొత్తం కల్వకుర్తిలో రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందబోతున్నాయి. కల్వకుర్తికి త్వరలో రింగ్‌రోడ్డు రాబోతున్నది. 40 తాండాలను పంచాయతీలు చేశాం. ఫార్మాసిటీ కూడా మీ చెంతకే వస్తుంది. జైపాల్ యాదవ్ నాకు పాతమిత్రుడు. నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి. జైపాల్ యాదవ్‌ను గెలిపించే బాధ్యత మీదే. ఆయన కోరిన విధంగా కల్వకుర్తి నియోజకవర్గానికి లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లు ఇప్పించే బాధ్యత నాది’ అని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
ఇందిరమ్మరాజ్యమా.. తోకమట్టనా!
50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? ఆకలిచావులే కదా? ఎన్‌కౌంటర్లే కదా? ఇందిరమ్మ రాజ్యం అంత సక్కగుంటే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెడుతుండె? అంత సుభిక్షంగా ఉంటే రూ.2 కిలో బియ్యం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? అంటే ఇందిరమ్మ రాజ్యమంత దరిద్ర రాజ్యం ఇంకోటి లేకుండెనని అర్థమైతుంది కదా? ఇప్పుడు అసొంటి రాజ్యం మళ్లా తెస్తమంటున్న కాంగ్రెసోళ్లకు కొంచెమైనా సిగ్గుందా?
– సీఎం కేసీఆర్
రైతులను కాపాడి ఇవాళ తెలంగాణ ఓ దరికి తెచ్చాం. సాగునీరు అందించి పాలమూరుపై కరువు జిల్లా ముద్రను శాశ్వతంగా చెరిపివేసినం. మళ్లా ఇవాళ ఢిల్లీ గద్దలన్నీ వాలుతున్నాయి. ఇందిరాగాంధీ వారసుడు రాహుల్‌గాంధీ కొల్లాపూర్‌కు వచ్చిండు.. ఎందుకు గడ్డి కోయడానికా? మళ్లా మనకు ముళ్ల కిరీటం పెట్టడానికా? మళ్లా తెలంగాణను ఆగంబట్టించి, కరెంటు బందు పెట్టించేందుకా కాంగ్రెస్ తిరిగేది?
– సీఎం కేసీఆర్
ఢిల్లీ నుంచి వచ్చే కాంగ్రెసోడికి, బీజేపీ వాడికి తెలంగాణపై ప్రేమ ఎందుకు ఉంటుంది? అన్ని సిద్ధమయ్యాక యాళ్లకు వచ్చి నేను వడ్డన చేస్త అన్నట్టు ఉన్నది. ఇవి ఓట్లు కావు. తెలంగాణ బతుకుదెరువు పోరాటం. మన బతుకు, తలరాత రాసే ఓట్లు. ఆషామాషిగా ఏస్తే ఆగమాగం అవుతాం. బీసీ మిత్రులకు నా వినతి ఒక్క టే.. రానిచోట బీసీలకు టికెట్లు రాలేదు. వచ్చిన చోటైనా గెలిపించుకోవాలె. ఈ విషయంలో బీసీలు చైతన్యం చూపించాలి.
– సీఎం కేసీఆర్