Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కాళేశ్వరం డ్యాష్‌బోర్డు

-శాస్త్రీయ ప్రాతిపదికపై ప్రాజెక్టు ఆపరేషన్‌
-ఒక్క క్లిక్‌తో ప్రాజెక్టు సమగ్ర స్వరూపం
-టెక్నాలజీతోనే మోటర్ల నిర్వహణ
-మూడు చోట్ల కమాండ్‌ కంట్రోల్‌రూంలు
-గోదావరి, ప్రాణహితపై రెయిన్‌ గేజ్‌లు
-డ్యాష్‌బోర్డులోనే ఆయకట్టు వివరాలు
-కంప్యూటర్‌ తెరపై సంపూర్ణ సమాచారం

దట్టమైన అడవులు, కొండలను చీల్చుకుంటూ పరవళ్లు.. వంపులు తిరుగుతూ, హొయలు ఒలుకుతూ తెలంగాణలోకి అడుగిడింది మొదలు గోదారమ్మ ప్రతి అడుగూ ఒక అద్భుతమే. కాళేశ్వర ప్రాజెక్టును ఒకేసారి చూసేందుకు వేలకన్నులు సరిపోవు. గోదావరి గమనాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో కుదించే యత్నం.. కాళేశ్వరం మొత్తం కనుసన్నల్లోనే ఇమిడించే యజ్ఞం మొదలైంది.

అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును శాస్త్రీయ ప్రాతిపదికన నిర్వహించేలా (ఆపరేషన్‌) సాంకేతిక తెరకు రూపకల్పన జరుగుతున్నది. ఒక భారీప్రాజెక్టుపై‘డ్యాష్‌బోర్డు’ను రూపొందించడం దేశంలో ఇదే ప్రథమం.

ఒక ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రణాళిక అవసరం. అదే అనేకప్రాజెక్టుల సమాహారంగా రూపుదిద్దుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణకు కేవలం ప్రణాళిక సరిపోదు. అందుకు భారీవ్యూహం కావాలి. అటు ప్రధాన గోదావరి.. ఇటు ప్రాణహిత.. నడుమ కడెం.. ఎప్పుడు వరద ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించాలి. వర్షపాతం, వరద రాకను ముందే పసిగట్టాలి. రోజుకు 2-3 టీఎంసీల జలాలను ఎత్తిపోసే అనేకదశల్లో ఉన్న భారీమోటర్లను సక్రమంగా నిర్వహించాలి. ఎక్కడ ఏ చిన్న మార్పు జరిగినా అందుకనుగుణంగా వ్యవస్థ అంతటిలోనూ ఆ మేరకు మార్పు చేసేలా అప్రమత్తం కావాలి.

సమాచారాన్ని ఒకేచోట కేంద్రీకృతం చేసి ఎప్పటికప్పుడు వ్యూహ రచనతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ చేపట్టాలి. ఈ వానకాలంలో రోజుకు మూడు టీఎంసీల చొప్పున ఎత్తిపోయాలని నిర్ణయించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జలాలు కొండపోచమ్మసాగర్‌ వరకు తరలించనున్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌ ముందుగానే అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొనేలా ఒక పకడ్బందీ సాంకేతిక వ్యవస్థతో ‘డ్యాష్‌బోర్డు’ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ మేరకు ముగ్గురు ఈఎన్సీలతో ఏర్పాటైన కమిటీ ప్రస్తుతం ఆ ప్రక్రియలో నిమగ్నమైంది.

ప్రాజెక్టు నిర్వహణపై శాస్త్రీయ పర్యవేక్షణ
ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే జలాలు ఎంతో విలువైనవి. డిమాండ్‌, కచ్చితంగా ఎత్తిపోయాల్సిన పరిస్థితుల్లోనే మోటర్లను నడపాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాప్‌ ఇప్పటికే జన బాహుళ్యంలో బాగా ప్రచారం పొందింది. ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న డ్యాష్‌బోర్డును ఆ మ్యాప్‌కు అనుగుణంగా తయారుచేస్తున్నట్టు సమాచారం. గోదావరి ఎక్కడ ఎంత పారుతుంది? ఏ పంపుహౌజ్‌ల్లో జలాలు ఎంతమేర ఎత్తిపోస్తున్నారు? అనే వివరాలను మ్యాపు రూపంలోనే పొందుపరచనున్నట్టు తెలిసింది.

శాస్త్రీయంగా నిర్వహణ
ఈ డ్యాష్‌బోర్డు వల్ల కేవలం నిర్ణయాలే కాకుండా ప్రాజెక్టు నిర్వహణ కూడా శాస్త్రీయంగా కొనసాగుతుంది. తద్వారా భారీ మోటర్లకు సాంకేతికంగా చిన్నసమస్య రాకుండా ముందుగానే అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. ఎక్కడైనా చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా, ఒక్కసారిగా ట్రిప్‌ అయినా, సర్జ్‌పూల్స్‌లో నీటిమట్టాలు ఒకేసారి పడిపోయినా వెంటనే అలారం (డ్యాష్‌బోర్డులో ఎర్ర కలర్‌ ఇండికేషన్‌) ద్వారా అప్రమత్తం చేస్తారు. వెంటనే మోటరును నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఈ డ్యాష్‌బోర్డులో భాగంగా ప్రాజెక్టు పరిధిలోని ఏయే ప్రాంతాల్లో పంటల సాగు (క్రాప్‌ ప్యాటర్న్‌) ఎలా ఉందనే వివరాలు కూడా ముందుగానే నమోదై ఉంటాయి. తద్వారా ఆయా మార్గాల్లో ఎంత నీటి అవసరాలు ఉంటాయనేదానిపై అంచనా ఉంటుంది.

ప్రాథమికంగా ఆ వివరాలు
-ఎగువప్రాంతాల్లో నమోదయ్యే వర్షపాతాన్ని తెలుసుకొనేందుకు ఎప్పటికప్పుడు భారత వాతావరణ కేంద్రం వివరాలను సేకరించి, విశ్లేషిస్తారు. దీంతోపాటు ప్రత్యేకంగా మరికొన్ని రెయిన్‌ గేజ్‌లు కూడా ఏర్పాటుచేయనున్నారు. ఈ వివరాలు ఎప్పటికప్పుడు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్స్‌ (సీసీసీ)కు అందుతాయి.
-అటు గోదావరి, ఇటు ప్రాణహితతోపాటు ప్రధాన వాగులు, వంకలపైనా వరద పరిమాణాన్ని తెలుసుకునేందుకు గేజ్‌లు (ప్రవాహ కొలమానికలు) ఏర్పాటుచేయనున్నారు.
-బరాజ్‌లు, జలాశయాలకు ఎంత వరద వస్తుంది.. దిగువకు, కాలువలకు ఎంత పోతుందనేది (ఇన్‌ఫ్లో-అవుట్‌ఫ్లో) గుర్తించేందుకు సెన్సార్లు అమరుస్తారు. నీటినిల్వను నమోదు చేసేందుకూ అధునాతన పరికరాలు ఏర్పాటుచేస్తారు.
-పంపుహౌజ్‌ల్లో ఎన్ని మోటర్లు నడుస్తున్నాయి? ఒక్కో మోటర్‌ నుంచి ఎన్ని క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నది? అనే వివరాల్ని ఎప్పటికప్పుడు సీసీసీకు అందుతాయి. దీంతో ప్రతి పంపుహౌజ్‌లోనూ స్కాడా (సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విసైషన్‌) ఉంటున్నందున ఆ వివరాల్ని కూడా సీసీసీకు అనుసంధానిస్తారు.
ప్రాజెక్టు పరిధుల్లోని కాలువల్లో ప్రవాహంపై కూడా సెన్సార్లు అమరుస్తారు.
-ఈ వివరాలన్నింటితోపాటు భారత వాతావరణ కేంద్రం, కేంద్ర జలసంఘం నుంచి సమాచారం మొత్తం ఎప్పటికప్పుడు సీసీసీకి చేరుతాయి. వాటిని పలుకోణాల్లో విశ్లేషించి అవసరమైనవాటితో డ్యాష్‌బోర్డులో ఒక బిగ్‌డాటాను రూపొందిస్తారు. ఈ శాస్త్రీయ వివరాల ఆధారంగా ప్రాజెక్టు నిర్వహణపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొంటారు.
-ఇందుకోసం మూడుచోట్ల కంట్రోల్‌ కమాండ్‌ సెంటర్లు ఏర్పాటుచేయనున్నారు. ఒకటి హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉండగా.. మిగిలిన రెండింటిని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది కమిటీ నిర్ణయించనున్నది.

శాస్త్రీయంగా నిర్ణయాలు
-ప్రధాన గోదావరి, మానేరు, కడెం, ప్రాణహితతోపాటు స్థానికంగా ప్రధానవాగుల నుంచి వచ్చేవరదను అంచనావేస్తూ ప్రాజెక్టు నిర్వహణను చేపట్టాల్సి ఉంటుంది. ఆ ప్రకారం.. శ్రీరాంసాగర్‌కు మంచి ఇన్‌ఫ్లోలు నమోదయితే మొదటిలింక్‌ (లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంపుహౌజ్‌లు), రెండోలింక్‌ (నందీ, గాయత్రీ పంపుహౌజ్‌)లోని మోటర్లతోపాటు ఎస్సారెస్పీ పునర్జీవం మోటర్లు నడపరు. నాలుగోలింక్‌ (శ్రీరాజరాజేశ్వర జలాశయం) నుంచి మిగిలిన వాటిల్లో అవసరానికి అనుగుణంగా మోటర్లు నడుపుతారు.
-కడెం నుంచి మాత్రమే వరద వస్తే మొదటి లింక్‌ మోటర్లు నడపరు. రెండోలింక్‌, ఇతర లింక్‌ల్లోని మోటర్లను నడుపుతారు. అవసరానికి అనుగుణంగా ఎస్సారెస్పీ పునర్జీవ మోటర్లు కూడా ఆన్‌చేస్తారు.
-కడెంతోపాటు సరస్వతి బరాజ్‌కు మంచి ఇన్‌ఫ్లో నమోదైతే మొదటిలింక్‌లోని లక్ష్మీ పంపుహౌజ్‌ మోటర్లు నడపకుండా.. సరస్వతి, పార్వతి పంపుహౌజ్‌ల ద్వారా జలాలను ఎల్లంపల్లికి తరలిస్తారు. ఆపై రెండోలింక్‌, ఇతర లింక్‌ల్లోని మోటర్లు, అవసరానికి అనుగుణంగా ఎస్సారెస్పీ పునర్జీవ మోటర్లు నడుపుతారు.
-శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి ఇలా ఎక్కడా వరద రాకుండా ప్రాణహితలో మాత్రమే వరద ఉంటే కాళేశ్వరంలోని అన్ని లింక్‌ల పరిధిలోని మోటర్ల ద్వారా అవసరానికి అనుగుణంగా నీటిని ఎత్తిపోస్తారు.
-అకస్మాత్తుగా ఎగువప్రాంతాల్లో భారీవర్షాలు పడినట్లయితే ఆ వరద ప్రాజెక్టులకు చేరేందుకు కనీసం రెండురోజులు పడుతుంది. దీంతో అందుకనుగుణంగా అవసరంలేనిచోట్ల మోటర్లను నిలిపివేస్తారు. అవసరం ఉన్నచోట్ల మోటర్లను సిద్ధం చేసుకుంటారు.
-ఇలా బిగ్‌డాటా ఆధారంగా కాళేశ్వరంలోని ఏ లింక్‌ పరిధిలో ఎన్ని మోటర్లు నడపాలనే దానిపై అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఆదేశాలు జారీచేస్తారు.
వరదను బట్టి మోటర్లు నడిచే లింక్‌లు..

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.