Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కబ్జాలపై మూడోకన్ను

భూఅక్రమార్కుల విషయంలో మూడోకన్ను తెరువాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెవెన్యూ అధికారులకు సూచించారు.ప్రభుత్వ భూమిని ముట్టుకోవాలంటే భయపడాలని.. అక్రమార్కులు ఎవరైనా ఉపేక్షించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు ఉంటే సత్వరం క్రమబద్ధీకరించుకోవాలని.. లేదంటే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టంచేశారు. భూఅక్రమార్కుల ఆటకట్టించడానికి త్వరలో పటిష్ఠమైన చట్టాన్ని తీసుకొస్తామని సీఎం తెలిపారు. సచివాలయంలో ప్రభుత్వ భూములపై గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. పేదల పట్ల ఔదార్యంగా ఉంటూనే అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని వారికి సూచించారు.

-భూఅక్రమార్కుల ఆటకట్టించడానికి త్వరలో పటిష్ఠమైన చట్టం -అక్రమ నిర్మాణాలుంటే సత్వరం క్రమబద్ధీకరించుకోవాలి -రెగ్యులరైజ్ కానివాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది: సీఎం -ప్రతి అంగుళం భూమికి పత్రాలుండాల్సిందే -ప్రభుత్వభూమిని తాకాలంటే భయపడాలి -పేదల గుడిసెలు దౌర్జన్యంగా కూల్చేశారు -పెద్దల ఆక్రమణపై పెదవి విప్పలేదు -అధికారులు పేదల పక్షం వహించాలి -నేను ఎవరి ఒత్తిడికీ లొంగను -నన్ను బద్నాం చేసినా భయపడేది లేదు -ప్రభుత్వ భూములపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

KCR-review-with-officials

హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే ముఠాలు ఉన్నాయి. నకిలీ స్టాంపులు, నకిలీ స్టాంపు పేపర్లు, నకిలీ సర్టిఫికెట్లు పుట్టించేవారున్నారు. వాటితో ప్రభుత్వ భూములపై హక్కులు పొందుతున్నారు. అలా వేల సంఖ్యలో కోర్టు కేసులు ఉన్నాయి. ఇక అలాంటి అక్రమాలకు తెరపడాలి. గత ప్రభుత్వాలు వారిపై ఉదాసీనంగా వ్యవహరించాయి. కులతత్వం, ప్రాంతీయతత్వం, రాజకీయాభిమానాలను చాటాయి. కానీ మా ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించదు. అక్రమాలను సహించదు. భూ ఆక్రమణలకు పాల్పడేవారు ఎవరనేది మాకు అనవసరం. వారంతా శిక్షార్హులే. వారికోసం పైరవీలు చేసే ఖర్మ ప్రభుత్వానికి పట్టలేదు. భూ కబ్జాలకు పాల్పడ్డవారు ఏపార్టీకి చెందిన వారైనా.. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నా వదలొద్దు. వారిపైనా కేసులు నమోదు చేయాలి అని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టంచేశారు. ఇప్పటికే ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు జరిపితే వాటిని రెగ్యులరైజ్ చేయాలని.. క్రమబద్ధీకరించుకోకపోతే వాటిని స్వాధీనం చేసుకొని ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి భూములు పొంది వాటిని వ్యాపారాల కోసం వినియోగించుకొంటున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏదైనా చేద్దామంటే జాగ దొరకకుండా చేశారు. కానీ ఆక్రమణదారులు మాత్రం సులువుగా వేల ఎకరాలు కబ్జా చేశారు. పేదలు గుడిసెలు వేసుకొంటే దౌర్జన్యంగా కూల్చేశారు.

అదే పెద్దలు భూములు ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తే మాత్రం అడుగలేదు అని గత ప్రభుత్వాల విధానాలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలోనూ అదే తంతు కొనసాగితే రాష్ట్రం సాధించిన ప్రయోజనం నెరవేరదని అభిప్రాయపడ్డారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పేదల పక్షపాతిగా వ్యవహరిస్తూనే అక్రమార్కుల విషయంలో మూడోకన్ను తెరువాలని సూచించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి విషయంలో నేను కఠినంగా ఉంటే కొందరికి గిట్టదు. నన్ను బద్నాం చేయాలని చూస్తారు. అయినా నేను భయపడను. వెనుకకు తగ్గను. నన్నెవరూ ఒత్తిడికి గురిచేయలేరు. నాకు స్వప్రయోజనాలు లేవు. ప్రభుత్వ భూములను కాపాడటమే లక్ష్యం. పేదలకు మేలు చేయాలి. హైదరాబాద్ నగరానికి పట్టిన జబ్బు, గబ్బు వదలాలి. అదే నా లక్ష్యం, ప్రభుత్వ ఉద్దేశం. చిత్తశుద్ధితో అర్థం చేసుకోవాలి అని రెవెన్యూ అధికారులను కేసీఆర్ కోరారు.

పేదల పట్ల ఔదార్యం నగరంలో అర్బన్‌ల్యాండ్ సీలింగ్ ద్వారా సమకూరిన మిగులు భూములు, ప్రభుత్వ భూములు రెండు రకాలుగా కబ్జాకు గురయ్యాయి. గ్రామాల్లో పని దొరకక ఉపాధి కోసం తలదాచుకోవడానికి గుడిసెలు, రేకుల షెడ్డులు వేసుకొని జీవిస్తున్న వారు ఒకరకం. అలాగే కబ్జా చేసి వ్యాపార సముదాయాలు, అపార్టుమెంట్లు నిర్మించిన వారు రెండో రకం. అయితే మొదటిరకం వాటిపై ఔదార్యాన్ని చాటాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. నాలాలపై ఇండ్లు నిర్మించుకున్న వారిని ఖాళీ చేయించి హైదరాబాద్ మహానగరాన్ని ముంపు నుంచి కాపాడాలన్నారు. అయితే అలా ఖాళీచేయించినవారికి మరోచోట ఇండ్లు నిర్మించే ప్రణాళికలు రూపొందించాలన్నారు.

నగరంలో 50 నైట్‌షెల్టర్ల నిర్మాణం పొట్టచేత పట్టుకొని హైదరాబాద్‌కు వలసొచ్చిన నిలువ నీడలేని వారికి ఆశ్రయం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నగరంలో సుమారు రెండు లక్షల కుటుంబాలు గుడిసెలు, రేకుల షెడ్డులు వేసుకొని ఇరుకు ఇండ్లల్లో నివసిస్తున్నారు. వారికి మెరుగైన ఆవాసాలు ఏర్పాటుచేయాలి. ఆ మాత్రం కూడా నీడలేకుండా లక్షన్నర కుటుంబాలు ఉన్నాయి. వారంతా రైల్వే ప్లాట్‌ఫారాలు, ఫుట్‌పాత్‌లపై పడుకుంటున్నారు. అలాంటి వారికి రాత్రివేళ ఆశ్రయం కల్పించేందుకు వెంటనే నగరంలో 50 నైట్‌షెల్టర్లు నిర్మించాలి అని కేసీఆర్ ప్రతిపాదించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు మీనా, శ్రీధర్.. సికిందరాబాద్ ఆర్డీవో రఘురాంశర్మ, షేక్‌పేట తహసీల్దార్ కే చంద్రకళ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.