తెలంగాణ అవిర్భావ దినోత్సవం, కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే టి.పద్మారావు అన్నారు. జూన్ 2న తెలంగాణవాదులందరికీ పండుగ రోజన్నారు. అదే రోజున తెలంగాణ తొలి సీఎంగా టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం చేయనున్నందున నగరంలో పండగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ఐదు జిల్లాల కలెక్టర్లు జూన్ 2 సెలవు దినంగా ప్రకటించినట్లు సమాచారం ఉందని, మిగిలిన వారు కూడా ప్రకటించే అవకాశం ఉందన్నారు. తెలంగాణవాదులందరూ జూన్ 2వ తేదీన సంబురాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలో కేసిఆర్‌కు స్వాగతం పలికేందుకు నాలుగైదు వందల భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిటిలో 61 చోట్ల ప్రత్యేకంగా స్టేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నెక్లెస్ రోడ్డులోని పిపుల్స్ ప్లాజా వద్ద 25 మంది ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని బాణాసంచాలు కాల్చి సంబరాలు నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రేటర్ పరిధిలోని చారిత్రత్మక కట్టడాల వద్ద విద్యుత్ కాంతులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్ రహదారుల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2న సంబురాలు అంబరాన్ని తాకనున్నాయి. గ్రేటర్‌లోని 61 చోట్ల భారీ సంఖ్యలో బాణాసంచా పేల్చేందుకు ఏర్పాట్లు చేశారు. తారాజువ్వలు.. క్రాకర్లు.. రాకెట్లు దూసుకెళ్లనున్నాయి. బాణాసంచాల ద్వారా పూలవర్షం, సువాసన జల్లులు వెదజల్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరహా బాణా సంచా ప్రత్యేకంగా తయారు చేయించినట్లు ఎమ్మెల్యే పద్మారావు తెలిపారు.