-రేపు అర్ధరాత్రి నుంచే ఆవిర్భావ ఉత్సవాలు -పీపుల్స్ ప్లాజాలో గులాబీ శ్రేణుల వేడుకలు -పల్లెల్లో, పట్నాల్లో సంబురాలకు కార్యాచరణ -హైదరాబాద్‌లో 120 సెంటర్లలో గంటసేపు పటాకుల మోత -సువాసనలు వెదజల్లనున్న పటాకులు -తొలి సీఎంగా ప్రమాణం చేయనున్న కేసీఆర్ -పెరేడ్ గ్రౌండ్‌లో భారీ ఉత్సవాలు -జీహెచ్‌ఎంసీ పరిధిలో బల్దియా యాక్షన్‌ప్లాన్ -సందర్శకులకు ప్యారడైజ్ బిర్యానీ, చాట్‌బండార్
జూన్ 2న ఉదయం 7.30 గంటలకు గన్‌పార్క్‌లో అమరులకు కేసీఆర్ నివాళులు 8.15 గంటలకు రాజ్‌భవన్‌లో తెలంగాణ తొలి సీఎంగా ప్రమాణం.. అటు తర్వాత తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లికి పూజలు
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం
జూన్ 2న ఉదయం 7.30గంటలకు గన్‌పార్క్‌లో అమరులకు కేసీఆర్ నివాళులు
8.15 గంటలకు రాజ్‌భవన్‌లో తెలంగాణ తొలి సీఎంగా ప్రమాణం..
అటు తర్వాత తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లికి పూజలు
10.40 గంటలకు పెరేడ్ గ్రౌండ్‌లో స్వరాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు హాజరు..
మధ్యాహ్నం 12.57 గంటలకు సీఎంగా పదవీబాధ్యతల స్వీకరణ.. ఆ వెంటనే క్యాబినెట్ సమావేశం
అరవయ్యేళ్ల చిమ్మచీకట్లు చీల్చుకుంటూ అర్ధరాత్రి తెలంగాణ సూరీడు పొద్దుపొడువనున్నాడు! కలబడి నిలబడిన నాలుగున్నర కోట్ల జాతికి శుభాకాంక్షలు తెలుపనున్నాడు! నవోదయానికి నాంది పలుకనున్నాడు! తెలంగాణ తల్లి దాస్యశంఖలాలు తెంచేందుకు నింగికేగిన అమరులు భానుడి కిరణాలుగా పురిటిగడ్డను ముద్దాడనున్నారు! ఆ నవోదయానికి తరుణం ఆసన్నమైంది! ఆ వెలుగులకు వేడుకలూ సిద్ధమవుతున్నాయి! జూన్ 2.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. వాడావాడా.. ఊరూవాడా.. పల్లె.. పట్నం.. అంతా ముస్తాబవుతున్నది. పిల్లాపాప.. ఆడా..మగా.. అంతా జోర్‌దార్‌గా సంబురాలు జరుపుకునేందుకు తయారవుతున్నారు! ఆదివారం అర్ధరాత్రి నుంచే యావత్ తెలంగాణలో స్వరాష్ట్ర వేడుకలు ప్రారంభంకానున్నాయి. ప్రజల ఆకాంక్ష కోసం అలుపెరగని పోరాటం సాగించి జయకేతనం ఎగురవేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 2న ఒకవైపు ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ తొలి సీఎంగా ప్రమాణం చేస్తుండగా.. మరోవైపు తెలంగాణ జాతి యావత్తు ఉత్సవాల్లో పాల్గొనేలా గులాబీదళం ఏర్పాట్లలో మునిగితేలుతోంది.
పోరాటాలు ఫలించాయి! ఆకాంక్షలు నెరవేరాయి! సంబురాలు అంబరాన్నంటేలా మన రాష్ట్రానికి స్వాగతం పలుకుదాం.. ఇప్పుడు తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు! స్వరాష్ట్రానికి ఎలా స్వాగతం పలుకాలో చర్చించుకుంటున్నారు! జూన్ 1 అర్ధరాత్రి నుంచే వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు సిద్ధమవుతూనే.. రాష్ట్ర అవతరణ వేడుకలకూ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి పీపుల్స్ ప్లాజా వద్ద గులాబీ శ్రేణులు పెద్దఎత్తున సంబురాలు నిర్వహించనున్నారు. ఇక్కడ భారీ స్థాయిలో పటాకులు కాల్చి ఆనందం పంచుకోనున్నారు. ఇందుకోసం ముంబైలో ప్రత్యేకంగా పటాకులను తయారుచేయిస్తున్నారు. హైదరాబాద్‌లోని 150 సెంటర్లను మొత్తం గులాబీమయం చేస్తున్నారు. పూర్తిగా గులాబీ తోరణాలతో అలంకరిస్తున్నారు. జూన్ 2న 120 సెంటర్లలో ఉదయం గంటపాటు పటాకులు కాల్చనున్నారు. 50-60 అడుగుల ఎత్తయిన కేసీఆర్ భారీ కటౌట్లను 25 సెంటర్లలో ఏర్పాటు చేయనున్నారు.
వెయ్యికి పైగా హోర్డింగ్‌లు, 100 సెంటర్లలో స్టేజీలు ఏర్పాటుచేసి సాంస్కృతిక కార్యక్రమాల కోసం డీజే సౌండ్‌ను వినియోగించనున్నారు. జూన్ 2 ఉదయం నుంచి స్వీట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఇక ప్రతి గ్రామంలో, మండల కేంద్రంలో జాతీయ జెండాను, టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయాలని శ్రేణులకు దిశానిర్దేశంచేసింది.
8.15గంటలకు సీఎంగా కేసీఆర్ ప్రమాణం: జూన్ 2న ఉదయం 7.30 గంటలకు కేసీఆర్ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు. అనంతరం 8.10 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకొని 8 గంటల 15నిమిషాలకు సీఎంగా ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. అక్కడి నుంచి పెరేడ్‌గ్రౌండ్‌లో ఉదయం 10.40 గంటలకు జరగనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటారు. పెరేడ్‌గ్రౌండ్‌లో ఉత్సవాలు ముగిసిన తర్వాత ఇంటికి చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 12.57 గంటలకు కేసీఆర్ సచివాలయంలోని సమతా బ్లాక్‌లో సీఎంగా పదవీబాధ్యతలు చేపడతారు. అటు తర్వాత ఇదే బ్లాక్‌లోని మూడో అంతస్తులో గల క్యాబినెట్ సమావేశమందిరంలో కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.
సిటీలో హోరెత్తనున్న ఉత్సవాలు: జూన్ 2న హైదరాబాద్‌లో కేసీఆర్ ప్రయాణించే ప్రాంతాల్లో ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు గ్రేటర్ టీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లుచేస్తున్నారు. పెరేడ్‌గ్రౌండ్, రాజ్‌భవన్ మార్గాల్లో భారీ కటౌట్లు సిద్ధంచేస్తున్నారు. ఆటపాటలతో స్వాగతం పలకనున్నారు. గ్రేటర్ పరిధిలోని చారిత్రత్మక కట్టడాలైన చార్మినార్, శిల్పరామం, కాచిగూడ రైల్వేస్టేషన్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, క్లాక్‌టవర్, నాంపల్లి రైల్వే స్టేషన్లతోపాటు పలు ముఖ్యమైన కట్టడాల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 2 వేడుకలకు వచ్చే సందర్శకులకు ఆహార ప్యాకెట్లు, మంచినీళ్లు అందుబాటులో ఉంచనున్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రతి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎల్‌ఈడీలను ఏర్పాటుచేస్తున్నారు. నగరంలో ప్రతిసెంటర్‌లో స్వాగత తోరణాలను సిద్ధంచేస్తున్నారు.
సువాసనలు పంచనున్న పటాకులు: గ్రేటర్ హైదరాబాద్‌లో స్వరాష్ట్ర ఆవిర్భావ సంబురాలు అంబారాన్ని తాకేలా టీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తున్నది. ఆదివారం అర్ధరాత్రి నుంచే రకరకాల పటాకులతో ఆకాశంలో వెలుగులు విరబూయించనున్నారు. పటాకుల ద్వారా పూల వర్షం, సువాసన వెదజల్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరహా పటాకులను ముంబైలో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు.
ప్రభుత్వపరంగానూ..: గ్రేటర్ హైదరాబాద్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు బల్దియా అధికారులు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లుచేస్తున్నారు. వేడుకల కోసం యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ప్రజలు భారీస్థాయిలో వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
రోడ్లను శుభ్రపర్చడంతోపాటు ప్రధాన కూడళ్లు, పార్కులతోపాటు ముఖ్యమైన ప్రదేశాల్లో వేదికలు ఏర్పాటుచేసి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు, నగరమంతా విద్యుత్ కాంతులు, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ డివైడర్లకు రంగులు వేయిస్తున్నారు. బల్దియా ఆధ్వర్యంలో గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద భారీ వేదికను ఏర్పాటుచేయడంతోపాటు ఆ పరిసర ప్రాంతాలన్నీ విద్యుత్ దీపాలతో మెరిసిపోయేలా చూడాలని నిర్ణయించారు. సెంట్రల్ మీడియన్లు, ఫుట్‌పాత్‌లకు రంగులు వేయించడమే కాకుండా సెంట్రల్ మీడియన్లలోని మొక్కలు, చెట్లపై మిరిమిట్లుగొలిపే లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన పార్కులు, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, అసెంబ్లీ, రాజ్‌భవన్ రోడ్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో సైతం ఈ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
సందర్శకులకు ప్యారడైజ్ బిర్యానీ: వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో బిర్యానీ, మంచినీటి ప్యాకెట్లను కూడా ఇవ్వాలని బల్దియా నిర్ణయించింది. ప్యారడైజ్ నుంచి మినీ బిర్యానీ ప్యాకెట్లు చేయించి పంచాలని, చాట్ భండార్లను కూడా ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకుంది. ట్యాంక్‌బండ్ చుట్టూ భారీస్థాయిలో పటాకులు పేల్చేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాబోయే సీఎం కేసీఆర్ చిత్రపటాలతో కూడిన హోర్డింగులను ప్రధాన ప్రాంతాల్లో నెలకొల్పనున్నారు. నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని సూచించే కొటేషన్లు హోర్డింగులపై రాయించారు.
పెరేడ్ గ్రౌండ్ ముస్తాబు: జూన్ 2న పెరేడ్‌గ్రౌండ్‌లో ప్రభుత్వపరంగా పలు కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోలీసుల గౌరవవందనం కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు దీపాలంకరణ చేస్తారు.
అసెంబ్లీ, సచివాలయంతో పాటు కమిషనరేట్లు, డైరెక్టరేట్ కార్యాలయాలను కూడా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. జిల్లాల్లోనూ కలెక్టర్లు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనున్నారు. ఉదయమే జెండా ఎగురవేయడం, అవార్డుల ప్రదానం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు పెద్ద ఎత్తున ఉత్సవాలకు సిద్ధం అవుతున్నారు. వరంగల్‌లో ఇప్పటికే స్మృతిచిహ్నాన్ని సిద్ధం చేస్తున్నారు. ఓరుగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో దీని చైర్మన్‌గా ఉన్న కలెక్టర్ కిషన్ మొత్తం పనులను పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో జరుగుతున్న ఏర్పాట్లను కమిషనర్ సోమేశ్‌కుమార్ శుక్రవారం పర్యవేక్షించారు. జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లకు బాధ్యతలు అప్పగించి లోపాలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు.
4న గజ్వేల్‌కు కేసీఆర్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం మొదటి పర్యటనను తన నియోజకవర్గానికే పెట్టుకున్నారు. జూన్ 4న ఆయన గజ్వేల్‌కు వెళ్లనున్నారు.