రాష్ట్రంలోని జిల్లా దవాఖానలన్నింటినీ సూపర్ స్పెషాలిటీలుగా మారుస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మా రెడ్డి వెల్లడించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా పరిగిలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
జిల్లా దవాఖానలన్నింటినీ సూపర్ స్పెషాలిటీలుగా మార్చడంతోపాటు పేదలకు ప్రైవేటుకు దీటుగా ఉచితంగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యమందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని జిల్లా దవాఖానల్లో త్వరలోనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లు, డయాలిసిస్, క్యాన్సర్ కేంద్రాలను నెలకొల్పి వైద్య సేవలను విస్తృతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల దవాఖానలుగా, సివిల్, ఏరియా దవాఖానలను 100 పడకలుగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. సూపర్ స్పెషాలిటీలుగా మార్చే జిల్లా దవాఖానల్లో వెయ్యి పడకలుగా మార్పుచేసి పేదలకు ఉచితంగా అన్ని రకాల సేవలు అందేలా చూస్తామన్నారు.
-త్వరలో ఐసీయూ, డయాలిసిస్, క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు
-వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి
వైద్య పరీక్షలు చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న పేదలకు ఉచితంగానే వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులకు కూడా ఉచితంగా వైద్యమందించే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని, త్వరలోనే నివేదికను అందజేస్తామన్నారు. సమావేశంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ నాయకుడు మల్కిరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.