తెలంగాణ వాటర్‌గ్రిడ్ పనులను వేగంగా పట్టాలెక్కించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల డిప్యూటేషన్‌లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. మొదటి ఆరు గ్రిడ్ల టెండర్ల ప్రక్రియను జనవరి 30 వరకు పూర్తి చేసి, ఫిబ్రవరి 10 నుంచి పనులు ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు.

-జనవరి 30నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి -ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల డిప్యూటేషన్లు రద్దు -592 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఆమోదం -ఉద్యోగులకు వాహనం, ల్యాప్‌టాప్ సౌకర్యం -డిసెంబర్‌లో నల్లగొండ జిల్లాలో సీఎం శంకుస్థాపన -పనుల పురోగతిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష మంగళవారం ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో వాటర్‌గ్రిడ్ పనులపై చీఫ్ ఇంజనీర్లు, సూపరిండెంట్, ఇతర ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే నెలలో నల్లగొండ జిల్లా మునుగోడులో వాటర్ గ్రిడ్ పనులకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేయనున్న పైలాన్ డిజైన్‌ను త్వరగా రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రిడ్ పనుల్లో పాల్గొనే ఉద్యోగులకు ప్రభుత్వం వాహన, లాప్‌టాప్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఖాళీగా ఉన్న 592 ఉద్యోగాలను భర్తీ చేయడానికి కూడా ఆమోదం లభించిందని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఎస్‌ఈలతో సమీక్ష నిర్వహించి భూసేకరణ వివరాలను రెండు, మూడు రోజుల్లో అందజేయాలని ఆదేశించారు. 26 గ్రిడ్‌ల పరిధిలో వీడియో కాన్ఫరెన్స్‌తో సహా అన్ని వసతులతో కూడిన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం, సీఎం, మంత్రి పేషీల నుంచి ప్రాజెక్టు కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని, అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తారని, 15 రోజులకోసారి తనతోపాటు అధికారులు పర్యవేక్షిస్తామని తెలిపారు.
అవసరమైన నిపుణులను జాతీయ స్థాయిలో ప్రకటనలిచ్చి నియమించుకోవాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జీ రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ సీ సురేందర్ రెడ్డి, సీఈ బాబూరావు, సాంకేతిక సలహాదారు ఉమాకాంత్‌రావు, వివిధ జిల్లాల ఎస్‌ఈలు పాల్గొన్నారు.