-పారదర్శకంగా ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్లింపు: మంత్రి హరీశ్‌రావు – పాలమూరును చంద్రబాబు దత్తత తీసుకుని దగా చేశారు – జిల్లా ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్ల కేటాయింపులు అబద్ధం – నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా..: జూపల్లి కృష్ణారావు సవాల్

మిషన్ కాకతీయలో చెరువు పనుల బిల్లుల చెల్లింపు ఆన్‌లైన్‌లో జరుగుతుందని, దీని వల్ల జవాబుదారీతనం పెరుగుతుందని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలోని అక్కల్‌దేవి చెరువులో పునరుద్ధరణ పనులను ప్రారంభించి మాట్లాడారు. లింగగిరికి చెందిన దొడ్డ రాంమోహన్‌రావు రూ.1.5 కోట్లు వెచ్చించి గ్రామంలోని మూడు చెరువులను బాగుచేసి రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని తలపెట్టారని కొనియాడారు. విరాళం ఇచ్చినందుకు ఒక చెరువుకు నానమ్మ కమలమ్మ పేరు, మరో చెరువుకు తెలంగాణ కోసం అసువులుబాసిన కానిస్టేబుల్ కిష్టయ్య పేరు పెట్టాలని రాంమోహన్‌రావు సూచించారని మంత్రి తెలిపారు. గతంలో చెరువులకు నిధులు కేటాయిస్తే ఆ పనులు జరుగకుండానే కాంట్రాక్టర్లు, అధికారుల జేబులు నింపుకునేవారన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో రైతుల కడుపు నింపేందుకే చెరువుల నిధులతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుకే చెరువులకు కేటాయించిన ప్రతిపైసా చెల్లింపు ఆన్‌లైన్‌లోనే ఉంటుందన్నారు.
అమెరికా నుంచైనా, ఏ ఊరి నుంచైనా ఏ పనికి ఎంత బిల్లు చెల్లించారో తెలుసుకునే వీలుందని చెప్పారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, బానోత్ శంకర్‌నాయక్, తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ వాకాటి కరుణ, ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, అర్బన్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, పాల్గొన్నారు. పోలీసులు దత్తత తీసుకున్న స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నష్కల్‌లోని నాగులకుంట పనులను వరంగల్ రేంజ్ డీఐజీ బీ మల్లారెడ్డి, ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా ప్రారంభించారు.
కొనసాగిన పునరుద్ధరణ పనులు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ చెన్నయ్య చెరువు పనులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, బల్మూరు మండలం తుమ్మెన్‌పేట పెద్దచెరువు పనులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, చిన్నచింతకుంట మండలం దుప్పల్లి కొత్త చెరువు, దమగ్నాపూర్ ఊర చెరువు పనులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్, తూప్రాన్ మండలం తిమ్మారెడ్డిపల్లి చెరువుల్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, జిల్లా ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో దత్తత తీసుకున్న వెల్దుర్తి మండలం చెట్లపల్లి ఊరచెరువు పనులను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్‌బొజ్జా, ఎస్పీ సుమతి, జిన్నారం మండలం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డి మండలం బ్యాతోల్, పసలువాడీల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, చెన్నూర్ మండలంలో చీఫ్‌విప్ నల్లాల ఓదెలు, లోకేశ్వరం మండలంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పనులకు శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలంలో విప్ గొంగిడి సునీతారెడ్డి, నార్కట్‌పల్లి మండలంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పనులు ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలంలో ఎమ్మెల్యే షిండే, నందిపేట్‌లో ఆర్మూర్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు.

ఆంధ్రబాబు..చంద్రబాబు అబద్ధాలు చాలు: జూపల్లి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తుంటే, కండ్లున్నా చూడాలేని కబోధిలా ఆంధ్రాబాబు అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.. పాలమూరును దత్తత తీసుకొని పదేండ్లు దగా చేశారని చంద్రబాబుపై పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు, కల్వకుర్తి మండలాల్లో చెరువు పనులు ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. ఇటీవల పాలమూరుకు వచ్చిన చంద్రబాబు జిల్లా ప్రాజెక్టుల కోసం రూ.10వేల కోట్లు ఖర్చు చేసిన్నట్లు చెప్పారని, నిరూపిస్తే పాలమూరు గడియారం చౌరస్తా, అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. రికార్డులతో సహా లెక్కలు తీసుకొస్తానని, దమ్ముంటే టీడీపీ నేతలు సవాల్ స్వీకరిస్తారించేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. పా ల మూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వొదంటూ ఢిల్లీకి లేఖ రాసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.