Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

జన ప్రభంజనం

-స్వతంత్ర రాష్ట్రంగా బతుకుదామా? ..
-ఢిల్లీకి తాకట్టు పెడుదామా? ..
-ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్న
-తొలి క్యాబినెట్ భేటీలోనే 42 నిర్ణయాలు
-అదీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఘనత ఇవ్వని హామీలనూ అమలుచేస్తున్నం
-తెలంగాణ శాశ్వతంగా ధనిక రాష్ట్రంలా ఉండాలె కేకే నాయకత్వాన మ్యానిఫెస్టో కమిటీ
-మరోసారి టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆశీర్వదించాలి
-త్వరలోనే రాజకీయ నిర్ణయాలు ఉంటాయి
-విపత్కర పరిస్థితుల్లో ప్రస్థానం ప్రారంభించాం
-ఏవి అత్యవసరమో ఆ పనులు మొదట తీసుకున్నం
-తెలంగాణ బాధల నుంచి వచ్చిందే కల్యాణలక్ష్మి
-నేతన్నలను కడుపుల పెట్టుకుని కాపాడుకుంటమని చెప్పినం
-ఇప్పుడు నేతన్న ముఖంలో వెలుగు చూస్తున్నం
-పారిశ్రామికవృద్ధి, ఐటీ వృద్ధి మాత్రమే.. అభివృద్ధి కాదు..
-గొర్రెలు, బర్రెలు పెంచుడు కూడా పెద్ద వృత్తే..
-రెండో విడుత పంట పెట్టుబడి సాయం నవంబరులో
-టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం రైతుబంధు
-పెంచిన సంపదను ప్రజలకు పంచుతాం
-అన్నివర్గాల ప్రజలు బాగుంటేనే నిజమైన వికాసం
-ఇప్పుడున్న పింఛన్లు కొంత పెంచుతాం
-కేసీఆర్ సీఎంగా ఉండటం వల్లే కొలువుల్లో 95% రిజర్వేషన్
-రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతీపశక్తులు
-మోసపోతే గోసపడుతం.. వాటిని వింటే ఇబ్బంది పడుతం
-ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

ఢిల్లీకి చెంచాగిరీ చేసే గులాములుగా ఉందామా? లేక తెలంగాణ గులాబీలుగా ఆత్మగౌరవంతో బతుకుదామా? తెలంగాణకు సంబంధించిన రాజకీయ నిర్ణయాలు, విధాన నిర్ణయాలు ఢిల్లీలో జరుగాలా? లేక తెలంగాణలోనా? స్వతంత్ర రాష్ట్రంగా బతుకుదామా? ఢిల్లీకి తాకట్టు పెడుదామా? అని అని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలను ప్రశ్నించారు. అధికారం మన దగ్గరుంటే ఆత్మగౌరవంతో ఉంటామని, ఢిల్లీకి బానిసలుగా ఉండటం భవిష్యత్తు తరాలకు మంచిది కాదన్నారు. తమిళ సోదరులు ఎలా ఆత్మగౌరవంతో బతుకుతున్నారో.. అదే బాటలో తెలంగాణ నడువాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు చివరి సంవత్సరంలో కార్యక్రమాలు చేపడితే.. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలోనే 42 నిర్ణయాలు తీసుకున్నదని గుర్తుచేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని హామీలనూ అమలుచేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. రాష్ట్రం సాధించిన ప్రగతి మొత్తం మీ కండ్ల ముందే ఉన్నదని అన్నారు. తక్షణ ఉపశమన చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు సరిపోవని, శాశ్వతంగా, బ్రహ్మాండంగా తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండాలంటే.. ప్రజలకు శాశ్వత ప్రయోజనం కల్పించే పథకాలను అమలుచేయాలని చెప్పారు.

ఈ మేరకు పార్టీ సీనియర్ నేత కే కేశవరావు నాయకత్వంలో మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటుచేస్తామని, రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారం అప్పగిస్తే చేయబోయే కార్యక్రమాలను అందులో వివరిస్తామని తెలిపారు. మరోసారి టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని ప్రజానీకాన్ని కోరారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతీపశక్తులు అడ్డుకుంటున్నాయన్న కేసీఆర్.. వాటన్నింటినీ అధిగమించి, సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని, రాబోయే రెండేండ్లలో తెలంగాణలో కోటి ఎకరాలలో నీళ్లను చూపిస్తానని ధీమా వ్యక్తంచేశారు. ఇప్పటికే 22 వేల గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయని, ఓట్లు అడిగే దానికంటే ముందే.. కృష్ణా, గోదావరి నీళ్లతో మా ఆడబిడ్డల పాదాలు కడుగుతామని పునరుద్ఘాటించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో టీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రగతినివేదన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. నాలుగేండ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించిన సీఎం.. మళ్లీ అవకాశం ఇస్తే మరిన్ని పథకాలు అమలుచేస్తామని ప్రకటించారు. త్వరలోనే రాజకీయ నిర్ణయాలు ఉంటాయన్నారు. సభావేదిక వద్దకు 6.23 గంటలకు చేరుకున్న సీఎం.. వేదికపై ఏర్పాటుచేసిన అమరవీరుల స్తూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం లక్షలాదిగా హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, ప్రగతినివేదనసభకు ప్రపంచం నివ్వెరపోయేలా ప్రజలు వచ్చారన్నారు. ఇది జనమా.. ప్రభంజనమా.. అనే విధంగా రాష్ట్రంలోని గిరిజన గూడేలు, లంబాడా తండాల నుంచి, మారుమూల పల్లెలనుంచి తరలివచ్చిన అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు వందనాలు తెలిపారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఆత్మగౌరవంతో బతుకుదాం
ఆత్మగౌరవంతోని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్న టీఆర్‌ఎస్ ఉన్నయి. మనకు ఏం గావాల్నో.. ఏం మంచో ఇక్కన్నే నిర్ణయాలు తీసుకుంటున్నం. కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాంలుగా ఉందాం.. ఢిల్లీ చక్రవర్తులకు సామంతులుగా ఉందామని చెప్తున్నయి. తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు, కళాకారులు, కవులు ఆలోచన చేయాలే. తెలంగాణకు సంబంధించిన నిర్ణయాధికారం తెలంగాణలో ఉండాల్నా.. ఢిల్లీ దొరల కింద ఉండాల్నా? అధికారం మన దగ్గరుంటే ఆత్మగౌరవంతో ఉంటాం. అదే ఢిల్లీ పాలకుల వద్ద ఉంటే, అసెంబ్లీ టికెట్లు కూడా తెలంగాణలో ఇయ్యరు. ఢిల్లీ గుమ్మాల కాడ కాపలా కాసి తెచ్చుకోవాలే. చెంచాగిరి చెయ్యాలే. ఢిల్లీకి చెంచాగిరి చేసే గులాంలమైదామా? లేక తెలంగాణ గులాబీలుగా స్వతంత్ర జీవితం గడుపుదామా? దయచేసి ప్రజలు ఆలోచించాలే. ఎట్టి పరిస్థితుల్లో బానిసలం కాకూడదు. మనకు మనమే ఉండాలె. మన తమిళ సోదరులు బ్రహ్మాండంగా ఏ విధంగా తమిళం గొప్పతనాన్ని కాపాడుకుంటూ, ఏ ఇతర పార్టీలు రాకుండా వారే ఏ విధంగా వాళ్ల రాష్ర్టాన్ని ఆత్మగౌరవంతో పరిపాలించుకుంటున్నరో అదే మార్గంలో తెలంగాణ కూడా ఒక్కటిగా ఉందాం. ఢిల్లీకి మనం బానిసలం, గులాంలం కావద్దు. అది మన భవిష్యత్‌తరాలకు మంచిది కాదు. నిర్ణయాధికారం మన చేతుల్లో ఉండాలని మనవిచేస్తున్న. ఆనాడు 19 ఏండ్ల కింద ఉద్యమానికి బయలుదేరిన్నాడు.. మాట తప్పితే, మడమ తిప్పితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన. మీరు అధికారం ఇస్తే ఎంత గొప్పగా ప్రభుత్వాలు పనిచేయవచ్చో మీకు అమలుచేసి చూపించినాను. మళ్లీ ప్రజలు దీవిస్తే అద్భుతంగా కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణగానీ, సమూలంగా పేదరికం నిర్మూలించడంగానీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు విరివిగా పెంచడంగానీ.. వీటన్నిటినీ భగవంతుని దయతో తప్పకుండా సాధించిపెడుతాను. మీ ఆశీర్వచనం ఉండాలి.

19 ఏండ్లనాటి జ్ఞాపకాలు కండ్లముందు కనిపిస్తున్నయి
ఈ సభను చూస్తుంటే 19 ఏండ్లనాటి జ్ఞాపకాల దొంతరలు కండ్లముందు కనిపిస్తున్నాయి. 2000 సంవత్సరం. ఆనాటి సీఎం ఎడాపెడా కరంటు చార్జీలు పెంచితే.. తెలంగాణ రైతాంగానికి ఏం చేయాలో తోచని పరిస్థితి. అసలే ఇబ్బందుల్లో ఉన్న రైతులకు మీరు పెంచిన కరంటు చార్జీలు ఉరితాళ్లవంటివి. ఈ ప్రతిపాదనలు వాపస్ తీసుకోవాలి.. లేదంటే తెలంగాణ రైతులు బతకలేరు అని ఆనాడు సీఎంను తెలంగాణ బిడ్డగా బహిరంగలేఖలో కోరాను. మీరు మొండిగా పోతే.. ఈ సమైక్యరాష్ట్రంలో మా కష్టాలు తీరవని, మా తెలంగాణ కోసం కొట్లాడుతామని, ఉద్యమాన్ని ప్రారంభిస్తానని చెప్పాను. ఏం చేయగలుగుతారులే తెలంగాణ అమాయక ప్రజలు.. ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతాం.. లాఠీచార్జీలుచేస్తాం.. కాల్చిపారేస్తాం అనే అహంకారంతో ఉన్నరు ఆనాటి పాలకులు. వచ్చే 20 ఏండ్లు తామే అధికారంలో ఉంటామన్న అధికారమదంతో విర్రవీగిన నాటి ప్రభుత్వం.. నా మాటలు ఖాతరుచేయలేదు. చాలామందికి 2001 ఏప్రిల్ 25న తెలంగాణ ఉద్యమం మొదలైందని తెలుసు. కానీ ఉద్యమం రగిలింది కరంటు చార్జీల పెంపుతో. నేను రాసిన బహిరంగలేఖతో ఆనాడే ఉద్యమానికి బీజం పడింది.

ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు
తొమ్మిది, పది నెలలపాటు విపరీతమైన మేథోమథనం! ఏంచేయాలి? ఏం చేయగలం? మన అసహాయస్థితి ఇంతేనా! గుడ్లలో నీళ్లు గుడ్లలోనే కుక్కుకోవాలా? ప్రత్యామ్నాయం లేదా? ఎక్కని కొండ లేదు.. మొక్కని బండలేదు. వేలమందిని స్వయంగా సంప్రదించాను. వేలమందితో విపరీతమైన మేథోమథనం చేశాం. గత్యంతరం లేదు.. తెలంగాణ రావాల్సిందే అనే స్థిర నిర్ణయానికి వచ్చాం. కానీ మార్గం ఏమిటి? కారుచీకటి! నా వెంట పిడికెడు మంది వ్యక్తులు. గుండె దిటవుచేసుకుని, భగవంతుడిని స్మరించుకుని, ధర్మం.. న్యాయం ఉంటే తప్పక తెలంగాణ సమాజం విజయం సాధిస్తుందని, హింసలేని ఉద్యమాన్ని చేపట్టాలని, రాజకీయ పంథాలోనే తెలంగాణ సాధించాలని సంకల్పించి ఆ బాట పట్టాం. ఆ ఉద్యమంలో మీరంతా పాత్రధారులే. ఎన్నో త్యాగాలు, ఎన్నో రాజీనామాలు, ఎన్నో ఉపఎన్నికలు, ఢిల్లీ యాత్రలు! పక్షి తిరిగినట్టు నేను తెలంగాణ మొత్తం తిరిగిన. అంతా భాగస్వాములు కావడంతో ఉప్పెన సృష్టించినం. మొదట వాగ్దానం చేసిన ఢిల్లీ పెద్దలు.. వీళ్లు ఏం చేయలేరులే అనే అహంకారంతో ఉద్యమాన్ని కాలరాసే కుట్రచేశారు.

గులాబీ జెండా పని అయిపోయిందని ప్రచారం మొదలుపెట్టారు. ఆనాడు తెలంగాణలో ఉన్న అధికారపార్టీ పెద్దలు, ఇతర పార్టీల పెద్దలు తెలంగాణ ఎక్కడ వస్తదని అవహేళనచేశారు. కానీ మనం ఏనాడూ ధైర్యం వీడలేదు. ఈ రోజు కరీంనగర్ ఎంపీగా ఉన్న వినోద్‌కుమార్, నేను ఒకసారి హుస్నాబాద్ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నం.. రాత్రి మూడు అయితుంది! సార్ ఏమైతది ఈ పోరాటం? ఎక్కడిదాకా పోతది? అని వినోద్ నన్ను అడిగారు. మన మొండి పట్టుదల, ధైర్యంపైన ఆధారపడతది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం దీన్ని కొనసాగించగలిగితే.. ఒకనాటికి తెలంగాణ సమాజం మొత్తం ఒక దిక్కే నిలబడి, బరిగీసి మరీ తెలంగాణ కావాలని దేశాన్ని అడుగుతది. ఆరోజుదాకా మనం పనిచేయాలని అప్పడు చెప్పాను. యావత్ ప్రజానీకం మద్దతుతో 2001న జలదృశ్యంలో పిడికెడు మందితో నేను ఒక ప్రతిజ్ఞ తీసుకున్నను.. ప్రాణంపోయినా మడమ తిప్పను, ఉద్యమబాట వీడను, ఎత్తిన జెండా దింపను. ఒకవేళ దించితే నన్ను రాళ్లతో కొట్టండి అని చెప్పిన. నా మాటలు తెలంగాణ ప్రజలు విశ్వసించారు.. అద్భుతాలు చేశారు.

ఎంతో ప్రయాసపడి 36 పార్టీలను ఒప్పించిన
నేను కొన్నాళ్లు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 36 పార్టీల వద్దకు ఒకటి పదిసార్లు.. ఇరువైసార్లు తిరిగి తెలంగాణకు మద్దతు కోరేవాడిని. ఒక్క కమ్యూనిస్టు పార్టీని ఒప్పించడానికి ఢిల్లీలో సీపీఐ కేంద్ర కార్యాలయంలో బర్దన్‌గారిని 38సార్లు కలిశాను. నువ్వేమైనా పిచ్చోడివా? అన్నరు. అవును నేను తెలంగాణ పిచ్చోడిని.. మీ దయ అని చెప్పిన. దాంతో ఆయన మిస్టర్ రావ్.. నవ్ యూడోంట్ రిలెంట్. ఓకే.. ఐవిల్ సపోర్ట్ యూ అన్నరు. ఈ విధంగా 36 పార్టీల మద్దతు కూడగట్టిన. 14 ఏండ్ల కఠోర శ్రమ తర్వాత తెలంగాణ మనకు వచ్చింది.

విపత్కర పరిస్థితుల్లో మన ప్రస్థానం మొదలైంది
కొత్త సంసారం. ఆర్థిక పరిస్థితి తెల్వదు. అధికారులు ఆరేడు నెలలవరకు లేరు. జిల్లాల పరిస్థితి చూస్తే.. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 15 లక్షలమంది రైతులు బతుకుదెరువు కోసం వలసపోయారు. కులవృత్తులు ధ్వంసమయ్యాయి. చెరువులన్నీ తాంబాళాల్లా తయారయ్యాయి. కాలిపోయే మోటర్లు.. కరిగిపోయే వైర్లు! చాలా భయంకరమైన పరిస్థితి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మన ప్రస్థానం ప్రారంభించాం. ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాం. ఏవి అత్యవసరమో ఆ పనులు మొదటగా తీసుకున్నం.

ఇప్పటి పథకాలు.. 2006లో పురుడు పోసుకున్నవి
ఢిల్లీలో నేను ఉండే ఇంట్లో ఒకరోజు జయశంకర్‌సార్, నేను, విద్యాసాగర్‌రావుగారు మాట్లాడుకుంటున్నం. రాత్రి ఒంటిగంట అయింది. ఇంకేం కూర్చుంటరు సార్.. పడుకోండి. తెలంగాణ వచ్చినంక ఆలోచిద్దాం.. అని విద్యాసాగర్‌రావు అన్నరు.. అన్నా.. మీకు అలసట ఉంటే పండుకోండి అని చెప్పిన. నేను, జయశంకర్‌సార్ కూర్చున్నం. నేను చెప్తా పోతున్న.. సార్ రాసుకుంటూ పోతున్నరు. మళ్లీ మూడున్నరకు విద్యాసాగర్‌రావుగారికి మెలకువ వచ్చి.. ఇంకా పండుకోలేదా? అనడిగారు. అట్లా ఆ రోజు ఆలోచనల్లో.. తెలంగాణలో భూగర్భజలాలు అడుగంటినయి. 600 ఫీట్లువేసినా బోర్లలో నీళ్లు రావట్లేదు. తెలంగాణవస్తే వెంటనే చెరువులు బాగుచేసుకోవాలనుకున్నం. అలా 2006-07లోనే చేసిన మథనంలోంచి పుట్టిందే మిషన్‌కాకతీయ. అప్పటి సమైక్యాంధ్ర సీఎం ఒక కట్టెపట్టి టీవీల చూపిచ్చిండు. తెలంగాణ వస్తే అంధకారం అయితదన్నడు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో అద్భుతమైన ప్లానింగ్‌చేసి, అహోరాత్రాలు శ్రమించి 24 గంటలు దేదీప్యమానంగా వెలిగే తెలంగాణను సాధించుకున్నం. దేశంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. రాబోయే రోజుల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చి, రెప్పపాటు కూడా కరంటు పోనివ్వను.

మొట్టమొదటి క్యాబినెట్‌లోనే 42 నిర్ణయాలు
చాలా పార్టీలు చివరి సంవత్సరంలో కార్యక్రమాలు పెడుతయి. కానీ.. మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే 42 నిర్ణయాలు తీసుకున్నం. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవేకాదు.. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలే కాకుండా ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పని 76 అంశాలను అమలుచేస్తున్నం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి పని మీ సొంత అనుభవంలో ఉంది. కరంటు ప్రతి ఇంటికి 24 గంటలు వస్తున్నది. ప్రతి రైతుకు వ్యవసాయానికి కూడా వస్తున్నది.

సమైక్య దొరలకు కనికరం రాలేదు
కమర్షియల్ చార్జీలు తొలగించి విద్యుత్ రాయితీలు ఇవ్వాలని నాయీబ్రాహ్మణ సోదరులు 40, 50 ఏండ్లు అడిగినారు. కానీ.. సమైక్య దొరలకు కనికరం రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో సెలూన్లకు కమర్షియల్ క్యాటగిరీ తీసేసి, అగ్వకు విద్యుత్ అందిస్తన్నం. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా గురుకులాలు ప్రవేశపెట్టినం. అక్కడ చదువుకునేది అందరూ మీ బిడ్డలే. రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ విధానంలో 12 వరకే కాదు.. పీజీ వరకు ఉచిత విద్య అందిస్తం.

గిరిజనులే వారి తండాలు పాలించుకుంటరు
మావా నాటే.. మావా రాజ్.. (మా తండాలో.. మా రాజ్యం) అని గోండులు అడిగినా, లంబాడీలు, కోయలు అడిగినా ఏ ప్రభుత్వమూ మన్నించలేదు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం గిరిజన గ్రామపంచాయతీలు ఏర్పాటుచేసింది. రాబోయే పంచాయతీ ఎన్నికల తర్వాత మూడు వేలమంది గిరిజన ప్రజలు వారి తండాలను వాళ్లే ఏలుకుంటరు.

శాశ్వత ప్రయోజనం కల్పించే పథకాలు అమలుచేయాలి
పింఛన్లను ఎక్కడికి తీసుకుపోయినమో మీకు తెలుసు. ఏమేం జరిగిందో.. ఎన్ని కార్యక్రమాలున్నయో తెలుసు. ఇవి సరిపోవు. వీటితోపాటు శాశ్వతంగా, బ్రహ్మాండంగా తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండాలంటే.. ప్రజలకు శాశ్వత ప్రయోజనం కల్పించే పథకాలు అమలుచేయాలి.

నీళ్లివ్వకుంటే ఓట్లడగనని చెప్పిన
వచ్చే ఎలక్షన్లలోపు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ఇచ్చి, నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడుగ.. ఎలక్షన్లకు రాను అని చెప్పిన. ఈ మాటలు చెప్పాలంటే ఖలేజా ఉండాలే. దేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ అధ్యక్షుడు.. ఏ సీఎం చెప్పలే. కానీ, కేసీఆర్ చెప్పినాడు. నేనీరోజు గర్వంగా ప్రకటిస్తా ఉన్న. ఈ రోజు సాయంత్రానికి 22 వేల గ్రామాలకు శుద్ధి చేసిన నీళ్లు అందుతున్నయి. ఇంకో 1300 గ్రామాలు మిగిలున్నయి. వాటికి రాబోయే ఏడెనిమిది రోజులల్లో నీళ్లు చేరుతయి. ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం 46% పూర్తయింది. మార్చి, ఏప్రిల్ దాకా గడువు ఉన్నా, వచ్చే దీపావళి వరకూ.. ఎన్నికలకంటే ఆర్నెల్లముందే.. మనం ఓట్లు అడిగే దానికంటే ముందే.. ఇంటింటికీ నల్లాతోని కృష్ణా, గోదావరి నీళ్లు వస్తయి. మా ఆడబిడ్డల పాదాలు ఆ నీళ్లతో కడిగి చూపిస్తం. ఇది అద్భుతమైన విజయం. 11 రాష్ట్రాల వాళ్లు వచ్చి చూసిపోయినారు. మా దగ్గర కూడా పెట్టుకుంటామని చెప్తున్నరు. నీతిఆయోగ్‌తోపాటు దేశవిదేశాలవారు మిషన్‌భగీరథను పొగుడుతున్నరు.

పాలమూరుకు రివర్స్ మైగ్రేషన్
పాలమూరు జిల్లా నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి.. ఇరవై ఐదేండ్లు, ముప్పయ్యేండ్ల నుంచి మూలుగుతా ఉండే. ఆ జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, అక్కడి పార్లమెంట్ సభ్యుడు జితేందర్‌రెడ్డిలు నాతో జగడాలు చేసి.. మా ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలని అడిగినారు. డబ్బులు కేటాయించి.. ఈరోజు నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పట్టుదలతో పనిచేస్తే.. పాలమూరు జిల్లాలో తొమ్మిది లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చినం. పాలమూరు రైతులు తిరిగి మహబూబ్‌నగర్‌కు వలస పోతా ఉన్నరు.

4.5 ఏండ్లలో రూ.1,980 కోట్లు వచ్చినయ్..
భవిష్యత్తు ఇంకా ఉంది. మంచి ఫలితాలు వచ్చినయ్. ఆర్థికంగా ముందుకు పోతా ఉన్నం. చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలున్నయి ఇండియాలో. చాలా పెద్దపెద్దవారున్నరు. పెద్దపెద్ద మాటలు మాట్లాడేవాళ్లూ ఉన్నరు. ఇక్కడ నిబద్ధతతో పనిచేస్తా ఉన్నం కాబట్టి ఇండియాలో నంబర్‌వన్‌గా ఉన్నం. 17.17% వృద్ధిరేటుతో, గత నాలుగేండ్లుగా దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిచాం. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఐదునెలల ఆర్థిక ప్రగతి 17.83 శాతంగా ఉంది. తెలంగాణ రోజురోజుకి, సంవత్సరం సంవత్సరానికి అద్భుతంగా పెరుగుతూ.. బ్రహ్మాండంగా ఆదాయం పెంచుకుంటున్నది. ఎట్ల సాధ్యమైతది? అదే అధికారులు. గంధర్వులు ఎవరు ఆకాశంకెల్లి రాలే. ఇదే రాజకీయ నాయకులే. కానీ, దృక్పథం మారితే.. కమిట్‌మెంట్ పెంచితే ఫలితాలు ఎలా ఉంటాయనటానికి చిన్న ఉదాహరణ చెప్తా. కొంతమంది నాయకులు సిగ్గులేకుండా ఇసుక మీద మాట్లాడుతా ఉంటారు. వాస్తవానికి పదేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని పది జిల్లాల్లో ఇసుక మీద వచ్చిన మీద లాభం కేవలం రూ.9.60 కోట్లు మాత్రమే. నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.1,980 కోట్లు. రాజకీయ అవినీతి నిర్మూలించి.. పనిచేస్తే ఫలితాలు ఇలా ఉంటాయి. కచ్చితంగా ప్రజలు ఆశించే రీతిలో అద్భుతంగా ఇంకా ముందుకు తీసుకుని పోతాం. కచ్చితంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన సంపదను ప్రజలకు పంచుతాం.

అన్నివర్గాల ప్రజలు బాగుంటేనే నిజమైన వికాసం
అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అదే నిజమైన వికాసం. మైనార్టీలు చాలా దుర్భిక్షంలో, పేదరికంలో ఉన్నరు. ఇయ్యాల కేంద్రం దేశంలో 29 రాష్ట్రాల్లోని మైనార్టీలకు పెట్టిన బడ్జెట్ నాలుగు వేల కోట్లు. తెలంగాణలో మైనార్టీల అభివృద్ధికి మన ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ రెండు వేల కోట్ల రూపాయలు. ఇదీ మన చిత్తశుద్ధికి నిదర్శనం. జరిగిన ప్రగతి, అభివృద్ధి మీ కండ్ల ముందే ఉన్నది. మీ ఊళ్లలో ఉంది. తవ్విన కాకతీయ చెరువులు మీ ఊళ్లలోనే ఉన్నయ్. కాలిపోకుండా ఉన్న మోటర్లు మీ ఊర్లలోనే ఉన్నయి. నాణ్యమైన కరంటు మీ ఇండ్లల్లోకే వస్తా ఉన్నది. మీ ఇండ్లలకు ఇరవై నాలుగు గంటలు కరంటు అందుతున్నది. కృష్ణా, గోదావరి నీళ్లు భగీరథతో వస్తా ఉన్నయి. కాలువలు తవ్వుతా ఉన్నరు. ప్రాజెక్టులు కడతా ఉన్నరు. అన్నీ మీ ప్రత్యక్ష అనుభవంలో ఉన్నయి. అందుకే డప్పు కొట్టి చాటి చెప్పుకునే అవకాశం లేదు. ఫేస్‌బుక్కుల్లో, అక్కడక్కడా గ్రామాలకు వెళ్లి టీవీల వాళ్లు అడిగినప్పుడు.. మళ్లా కేసీఆర్ రావాలే.. మాకు చేపలు ఇచ్చినారు.. గొర్రెలు ఇచ్చినారు.. కరంటు బాగుంది.. రోడ్లు బాగుపడ్డాయి.. ఇలా రకరకాలుగా ప్రజలు చెప్తున్నరు. ఇది ప్రజావాణి.

ఆదాయం పెంచుకుందాం
భవిష్యత్తు బ్రహ్మాండంగా కావాలి. అద్భుతమైన తెలంగాణ కావాలి. కచ్చితంగా సంక్షేమం పెరుగాలి. రాష్ట్ర ఆదాయం విషయంలో మొదట్లో భయపడ్డాం. ఇప్పుడు ఆ అవసరం లేదు. అద్భుతంగా ఆదాయం పెంచుకుందాం. ఇంకా కష్టపడి.. శ్రమించి ఆ ఆదాయం పేదలకు పంచుకుందాం. పింఛన్లు కొంత పెంచుతాం. నిరుద్యోగ సోదరుల గురించి తప్పకుండా ఆలోచన చేద్దాం. అందరినీ ఆదుకుందాం.

మన బిడ్డలకే 95 శాతం రిజర్వేషన్
తెలంగాణ వచ్చిన రోజు గుండెలనిండా నేనెంత సంతోషపడ్డనో.. ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకే 95% రిజర్వేషన్లు వచ్చినప్పుడు అంతే సంతోషపడ్డ. ప్రధాని ఊగిసలాడుతుంటే.. నేనే వెళ్లి అడిగిన. చేస్తావా? చస్తావా? నరేంద్రమోదీ చెప్పు.. మా పంచాయతీయే దీనిమీద ఉండే అని చెప్పి.. రాజ్యాంగబద్ధంగా మా హక్కు అని చెప్పి.. మొన్ననే రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చుకున్నం. ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఉద్యోగం మన బిడ్డకే వస్తది. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఒకవేళ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే లేకపోతే.. కేసీఆరే ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ 95% రిజర్వేషన్లు సాధ్యమయ్యేదా? ఇది తెలంగాణ ప్రజల పట్ల, యువత పట్ల టీఆర్‌ఎస్‌కున్న నిబద్ధత. భవిష్యత్తులో కోటి ఎకరాల తెలంగాణ సాకారం కావాలి. కచ్చితంగా చూస్తాం. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ భాసిల్లాలే. అద్భుతమైన పరిశ్రమలు, ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధికావాలే. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అపారంగా పెరుగాలే. వాటన్నింటినీ భవిష్యత్తులో బ్రహ్మాండంగా పెంచుకుంటం. సంక్షేమాన్ని మరింత పెంచాలే. ఇప్పుడున్న పింఛను, భృతి కొంచెం పెంచాలే. గొప్పగా సంపదను పేదలు పెంచుకుంటున్నరు. స్టడీగా ఇది కంటిన్యూ కావాలి. అధికారుల స్థయిర్యం దెబ్బతినకూడదు. గ్రోత్ కర్టెయిల్ కావొద్దు. అవన్నీ జరుగాలంటే హై కమిట్‌మెంట్‌తో చేయాలి.

అందరికీ ధన్యవాదాలు
ఈరోజు చాలామంది మిత్రులు రాలేకపోయినారు. హెలికాప్టర్లో వస్తుంటే ఔటర్ రింగురోడ్డు మీద చూసినాను.. 30,40 వేల వాహనాల్లో కనీసం నాలుగైదు లక్షల ప్రజానీకం వాహనాల్లో ఉండిపోయినారు. సాధ్యమైనంతవరకు స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు, మిత్రులు విస్తృత ఏర్పాట్లుచేశారు. స్థానిక మంత్రి మహేందర్‌రెడ్డి రాత్రింబవళ్లు కష్టపడి చాలా చక్కటి ఏర్పాట్లు చేసినారు. శక్తిమేరకు 600 ఎకరాలు ఇపుడు మీరు కూర్చున్న స్థలం సభాప్రాంగణం చేసినం. ఇది కూడా ఇయ్యాల సరిపోలేదు. వాహనాలు రాలేకపోయాయి. భవిష్యత్‌లో ఇంక పెద్దగా ఆలోచించి ఇంకా పెద్దగా చేసుకుందాం. రాష్ట్ర నలుచెరుగుల నుంచి నవ్వుతూ, సంతోషంగా తరలివచ్చి అద్భుతమైన పనిచేసినారు. ఇబ్రహీంపట్నం కార్యకర్తలు, నాయకులకు, మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు మీకందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి సభ విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు నా తరఫున, పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. జై తెలంగాణ.

అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతీపశక్తులు
కొన్ని మూకలు, ప్రతీపశక్తులు ప్రాజెక్టులపై కేసులు వేస్తున్నయి. కొంతమంది కేసీఆర్‌ను గద్దె దించుడే తమ రాజకీయ లక్ష్యమని మాట్లాడుతున్నరు. ఇదేం దిక్కుమాలిన లక్ష్యం రా బాబు? మేం గెలుస్తే ఇది చేస్తం.. బంగ్లా తెస్తం.. కరంటు తెస్తం.. ప్రజలకో కాల్వ తెస్తం.. అని చెప్పాలిగానీ, కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమా? ప్రతీపశక్తులు, ప్రగతి నిరోధకశక్తులు, స్వార్థశక్తులు ఎప్పటికీ ఉంటాయి. వాళ్ల స్వార్థ ప్రయోజనాలకోసం అనేక మాటలు చెప్తారు. అవాకులు చెవాకులు పేలుతారు. వాటన్నిటితో మోసపోతే గోసపడుతం. వాటిని వింటే ఇబ్బంది పడుతం. కనుక ప్రజలు ఆలోచించాలి. జరిగిన ప్రగతి మీ కండ్ల ముందు ఉన్నది. నిర్ణయాలు ఇక్కడే జరుగతా ఉన్నయి.

కోటి ఎకరాలకు నీళ్లు ఇస్త
కోటి ఎకరాలకు నీళ్లు తెస్తా అని చెప్పిన.. ఇప్పటికే పనులు కొన్ని సగమైనయి.. కొన్ని 80% అయినయి. పాలమూరు, కాళేశ్వరం, సీతారామ, దేవాదుల, ఈ మధ్యనే మల్కాపూర్ రిజర్వాయర్.. వీటన్నింటినీ పూర్తిచేసి, రాబోయే రెండేండ్లలో తెలంగాణలో కోటి ఎకరాలలో నీళ్లను చూపిస్తా. రైతులు బతకలేక ఉన్నరు. మీదికి చూడ్నీకి పటేల్ అంటరు.. భుజం మీద తువ్వాలేసుకొని తిరుగుతడు రైతు. కానీ.. తెలంగాణలో అప్పులేని రైతే లేడు. అందుకోసం ప్రవేశపెట్టిందే రైతుబంధు పథకం. వాళ్లకు పెట్టుబడి ఇయ్యాలే.. కరంటు ఉచితంగా ఇయ్యాలే.. ప్రాజెక్టుల్ల నీళ్లు రావాలే.. నాలుగైదేండ్లు నీళ్లు వచ్చి రెండు పంటలు, మూడు పంటలు పండితే రెండు, మూడు లక్షల అప్పులు తీర్చుకుని.. వాళ్ల జేబుల్ల రెండు లక్షలు ఉండేలా తయారైతరు. భూముల విషయంలో రైతుల బాధలు అందరికీ తెలుసు. అందుకోసమే.. 80 ఏండ్ల నుంచి ఎవరు ముట్టుకోని రికార్డులను ప్రక్షాళన చేసి, పాసుబుక్కులు ఇచ్చాం. వాటి ఆధారంగానే రైతుబంధు చెక్కులు ఇచ్చాం. రైతులు ఎక్కడా దరఖాస్తు పెట్టుకోలే.. దండం పెట్టలే. ఎవరికీ ఏకాన లంచం ఇయ్యలే.. మీ ఊరికే మీ ఎమ్మెల్యే, మీ మంత్రి వచ్చి.. మీ చేతుల్లో చెక్కులు పెట్టినారు. రెండో పంట డబ్బులు నవంబరులో వస్తయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం..తెలంగాణ రైతాంగం ధనవంతులయ్యేవరకు ఆ కార్యక్రమాన్ని పట్టుదలతో కొనసాగిస్తాం. దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ రైతు కుటుంబం వీధినపడొద్దని రైతుబీమా పథకం అమలుచేస్తున్నం. నిన్ననే పోచారం చెప్పారు.. 365 మంది రైతులకు రూ.5 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. నాలుగైదు రోజుల్లోనే ఎక్కౌంట్లలో డబ్బులు పడతా ఉన్నయి. రుణమాఫీ చేసుకున్నం.

సమైక్య పాలకుల ఏలుబడిలో తెలంగాణలో జీవన విధ్వంసం
సమైక్య పాలకుల ఏలుబడిలో జరిగిన తెలంగాణ జీవన విధ్వంసం అంతాఇంతా కాదు. కూలిపోయిన కులవృత్తుల బాధ వర్ణనాతీతం. ఒక రోజు రాత్రి కరీంనగర్ జిల్లా పర్యటన చేసి, సిరిసిల్ల మీదుగా హైదరాబాద్ వస్తుంటే, ఆత్మహత్యలు చేసుకోకండి, ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు అని అప్పటి జిల్లా కలెక్టర్ గోడలపై రాయించారు. అది చూసి కుమిలిపోయి ఏడ్చినం. చేనేత కార్మికులు వృత్తికోల్పోయి.. ఒకటే రోజు ఏడుగురు ఆత్మహత్యలు చేసుకున్నరు. ఆనాటి సీఎంను.. అయ్యా.. ఒక్క 50వేలు ఆ కుటుంబాలకు సాయం చేయండి అని దండంపెట్టి అడిగినా ఇవ్వలేదు. నువ్వు ఇయ్యకపోతే మేం భిక్షాటన చేసి ఇస్తామని చెప్పినం. వీధుల్లో జోలెలు పట్టుకుని, నాలుగు లక్షలు జమ చేసి, ఇంటికో 50వేలు ఇచ్చి కాపాడుకున్నం. సిరిసిల్లలో ఒకటేరోజు 11 మంది చేనేత కార్మికులు చనిపోతే, టీఆర్‌ఎస్ పక్షాన ఒక ట్రస్ట్ పెట్టి రూ.50 లక్షలు ఇచ్చి ఆదుకున్నం. ఆనాడు సభలో నేను నేతన్నల్లారా చచ్చిపోకండి. తెలంగాణ వచ్చేదాకా బతకండి.. తెలంగాణ వస్తే మిమ్మల్ని కడుపుల పెట్టుకుని కాపాడుకుంటాం అని చెప్పిన.

ఇప్పుడు నేతన్న మొఖంలో వెలుగు చూస్తున్నం. పేద ప్రజలకు ఇచ్చే బతుకమ్మ చీరెలు, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా పేదలకు ఇచ్చే దుస్తులు, విద్యార్థుల యూనిఫాంలు.. ఈ ఆర్డర్లు వాళ్లకు ఇచ్చి వారిని ఆదుకుంటున్నం. నెలకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఆదాయం వచ్చేలా చేసుకున్నం. కొంత భద్రత వచ్చింది. కానీ చేసుకుంది తక్కువ. ఇంకా చేయాల్సింది ఉంది. ఆనాడు ఉన్న సమైక్యపాలకులు చీప్‌లిక్కర్ లాబీలకు తలొగ్గి మన గీత కార్మికుల పొట్టగొట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వందల కల్లు దుకాణాలు మూసేయించారు. మీరు చిన్నబోవద్దు గీతన్నలారా.. తెలంగాణ వచ్చిన వెంటనే వాటిని పునరుద్దరిస్తాం అని ఆనాడే చెప్పాను. అదేవిధంగా పునరుద్ధరించుకున్నం. వృత్తిపనులు బాగుపడాలి. పారిశ్రామికవృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీవృద్ధి మాత్రమే.. అభివృద్ధి అని నయా ఆర్థికవేత్తలు చెప్తుంటారు. కానీ కంప్యూటర్, హార్డ్‌వేర్లే కాదు.. గొర్రెలు, బర్రెలు పెంచుడు కూడా పెద్ద వృత్తే.. ఇప్పటివరకు 70 లక్షల గొర్రెలు పంపిణీచేసినం. వాటికి 30 లక్షల పిల్లలు పుట్టినయి. కోటి గొర్రెలు యాడ్ అయినవి. గొల్లకురుమల సోదరులు వాళ్ల ప్రతిభతోటి సంపాదించిన డబ్బు రూ.1500 కోట్లు.

రాబోయే రోజుల్లో రాజకీయ నిర్ణయాలు
రాజకీయపరమైన నిర్ణయాలు త్వరలోనే మీ ముందుకు రాబోతున్నయి. ఆ కార్యాచరణ అంతా ఆ సందర్భంగా నేను ప్రకటిస్తాను. చాలామంది పేపర్లు, టీవీలు రాసినాయి. రాజకీయం గురించి ఈ సభలో ఏమైనా చెప్తారా? శాసనసభను ఎప్పుడు రద్దు చేస్తారు? అనే విషయాలపై ఆసక్తి రేపినారు. నేను ఒక్కటే మనవి చేస్తున్న. రాజకీయంగా రాష్ట్రానికి, టీఆర్‌ఎస్‌కు, తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు ఏది మంచి నిర్ణయమైతే అది తీసుకోండని మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నాకు అప్పచెప్పినారు. రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు. కేసీఆర్ కొత్త పథకాలు ప్రకటిస్తారని కూడా మీడియా వాళ్లు రాశారు. అది ధర్మం కాదు. నేను ప్రభుత్వాధినేతగా ఉన్న కాబట్టి.. మాటలు చెప్పి చేయకుండా ఉండకూడదు. అధికారంలో ఉన్నం కాబట్టి.. మాట అన్నామంటే అది చేయాలి. త్వరలోనే పెద్దలు కేశవరావు అధ్యక్షతన ఒక మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటుచేస్తాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాం అనేది మ్యానిఫెస్టోలో పెడతాం. అధికారంలోకి వచ్చాక వాటిని చిత్తశుద్ధితో అమలుచేస్తాం.

టీఆర్‌ఎస్ బిడ్డలే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని ప్రజలు నమ్మారు
తెలంగాణ వచ్చిన వెంటనే ఒక విచిత్రమైన పరిస్థితి. ఎన్నికలకు పోవాలి. ప్రజలు ఏం ఆలోచిస్తున్నరో ఎవరికీ తెలియదు. మిత్రులంతా ఇంతచేసి ఈనగాచి నక్కలపాలు చెయ్యొద్దు అన్నరు. రాష్ర్టాన్ని ఇతరులకు అప్పగించొద్దు.. ప్రజలను నమ్ముకుని మనమే ఒంటరి పోరాటానికి పోదామని చెప్పారు. 2014 ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి వెళ్లినా టీఆర్‌ఎస్ బిడ్డలే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మనల్ని దీవించి, తెలంగాణను బాగు చేయాలని ప్రజలు అవకాశం ఇచ్చారు.

తెలంగాణ బాధల నుంచి వచ్చిందే కల్యాణలక్ష్మి
పాలు అమ్మే రైతులకు లీటరుకు రూ.4 ఇన్సెంటివ్‌గా ఇస్తున్నం. 2.11 లక్షలమంది పాడి రైతులకు సబ్సిడీ మీద బర్రెలు సరఫరాచేస్తున్నం. మొత్తంగా రాష్ట్రంలో 465 కార్యక్రమాలు అమల్లో ఉన్నయి. ఉద్యమంలో వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి మంత్రి చందూలాల్, నేను, ఇతర మిత్రులు వస్తున్నం. ఒక తండా కాలిపోయిందని తెలిసి.. పరామర్శించడానికి వెళ్తే.. ఒక వ్యక్తి ఏడుస్తున్నడు. ఆయన పేరు బానోతు కీమానాయక్. ఏమైందని అడిగితే… బిడ్డ పెండ్లికి రూ.50వేలు తెస్తే అవి కాలిపోయినయి. నేను గూడ పెట్రోలు వోసుకొని కాలవెట్కుంట అంటూ ఏడుస్తున్నడు. నేను ధైర్యం చెప్పి, బాధవడకు.. నీ బిడ్డ పెండ్లికి సాయం చేస్త.. పెండ్లికి వస్త అని చెప్పిన. రూ.లక్ష నేనే పంపించి, పెండ్లికి పోయిన. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేకమంది దళిత, పేద బిడ్డల పెండ్లిళ్లు చందాలు వసూలుచేసి చేయించిన. పేదల ఆర్తి, దుఃఖం.. ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అనే భాధల నుంచి వచ్చిన పథకమే కల్యాణలక్ష్మి.

అందరికీ ధన్యవాదాలు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత
ప్రగతి నివేదన సభకు హాజరైన ప్రతి ఒక్కరికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, సభకు లక్షల సంఖ్యలో హాజరైనవారందరికీ సభ ముగిసిన తరువాత ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. సభకు వచ్చినవారంతా తమ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీ కవిత కూడా సభకు హాజరైన అశేష జనవాహినికి, కార్యకర్తలకు ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

సభ హైలైట్స్
-ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరిన సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆయనకు చేతులు ఊపుతూ స్వాగతం పలికారు.
-మ్యానిఫెస్టోలో లేని పథకాలను సైతం అమలు చేశామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సమయంలో ప్రజలు చప్పట్లు కొట్టారు.
-ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ నల్లానీరు, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నమూనా నిర్మాణాల గురించి సభా వేదికపై చేసిన ప్రదర్శన సభికులను ఆకట్టుకుంది.
-ఢిల్లీకి గులాములుగా ఉందామా.. తెలంగాణ గులాబీలుగా ఉందామా అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు ప్రజలు గులాబీలుగానే ఉంటామంటూ పెద్ద ఎత్తున నినదించారు.
-ఉద్యోగాల భర్తీలో విప్లవాత్మక నిర్ణయమైన జోనల్ వ్యవస్థను తాను సాధించుకున్న వచ్చిన తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించినప్పుడు సభికులు హర్షామోదం వ్యక్తంచేశారు.
-ఉదయం నుంచి సభ ప్రారంభమయ్యేవరకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కీలకంగా సమన్వయం చేశారు.
-1500 ఎకరాలను పార్కింగ్‌కు కేటాయించారు. ఆర్టీసీ, ప్రైవేట్, డీసీఎంలు, మినీ ఆటోలు, కార్లు, బైక్‌లతో పార్కింగ్ స్థలాలు నిండి పోయాయి. కలెక్టరేట్ పక్కన ఉన్న వందల ఎరాల్లోని జాక్‌పాట్ వెంచర్, టీఎస్‌ఐఐసీ భూములు, ఫ్యాబ్‌సిటీ భూముల్లో వేలకొద్దీ వాహనాలను పార్కింగ్ చేశారు. చాలామంది ప్రజలు పార్కింగ్ స్థలాల్లోనే స్నానాలుచేసి, వంటావార్పుతో భోజనాలు చేశారు.
-ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో కూర్చునే సందు లేకపోవడంతో కొందరు బస్సుల టాప్‌పైన కూర్చుని సభకు తరలివచ్చారు. సీఎం ప్రగతి నివేదన సభకు హాజరై మాట్లాడుతున్న సమయంలో కూడా బస్సులు, డీసీఎంలు వస్తూనేఉన్నాయి. కొంగరకలాన్‌కు చేరుకునే బెంగళూరు, రావిర్యాల ఔటర్ రింగ్‌రోడ్డు, నాగార్జునసాగర్ రహదారిపైనే ట్రాఫిక్‌జాం వల్ల వాహనాలు నిలిచిపోయాయి. భద్రాచలం, ఖమ్మం, వైరా, నల్లగొండ, కోదాడ ప్రాంతాలకు చెందిన 50 వేల మంది సభకు హాజరుకాలేకపోయారు.
-నాలుగేండ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించేలా ప్రగతి నివేదిక కరపత్రాలను పంచిపెట్టారు.

కేసీఆర్ దొరుకడం మన అదృష్టం
మనమందరం నిజంగా అదృష్టవంతులం. అల్లాహ తాలా నే (ఆ భగవంతుడు) కేసీఆర్ లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా అందించారు. ఇది మన అందరి అదృష్టం. దేశంలోనే గంగా, జమునా తహేజీబ్‌కు తెలంగాణ నిదర్శనంగా నిలిచింది. మైనార్టీల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు వార్షిక బడ్జెట్‌లో కేటాయించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి బడ్జెట్ మైనార్టీలకు కేటాయించలేదు. -డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

మ్యానిఫెస్టోను వంద శాతం అమలుచేశాం
రైతును రాజును చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఉచిత విద్యుత్, ఎరువులు అందించారు. రైతు బంధు, రైతు బీమాతో లబ్ధి చేకూర్చారు. ఈ పథకాలు ఫలితాలను ఇవ్వడంతోనే వేల ట్రాక్టర్లలో రైతులు సభకు తరలివచ్చారు. ప్రధానమంత్రి మొదలుకొని పలు రాష్ర్టాలు మన పథకాలను అధ్యయనం చేసి అమలు చేస్తున్నారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వంద శాతం అమలుచేశాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే అభివృద్ధిని కొనసాగిస్తాం. -కడియం శ్రీహరి, ఉపముఖ్యమంత్రి

ప్రజలే రాజులు.. అందుకే ఈ నివేదన
తెలంగాణ పాలనలో పారదర్శకత, నిజాయతీ ఉండబట్టే ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అందుకే కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు నివేదించేందుకు ఈ సభ ఏర్పాటుచేశాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా దాదాపు 500 పథకాలను అమలుచేస్తున్నాం. ఇంకొక 5 ఏండ్లలో బంగారు తెలంగాణ సాధిస్తాం. దాన్ని కొనసాగించేందుకు మరో పదేండ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలి. – ఎంపీ కే కేశవరావు

ఇంత పెద్ద సభ సంతోషకరం
ఇంత పెద్ద ఎత్తున సభ జరుగటం సంతోషకరంగా ఉంది. రెండు, మూడురోజుల నుంచి వివిధ రకాలుగా జనాలు దూరం సైతం లెక్కచేయకుండా వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రజలకు ఎంత అభిమానం ఉందో అర్థమవుతున్నది. ప్రగతి నివేదన సభకు ఇంత పెద్ద సంఖ్యలో తరలిరావటంతోనే వాటన్నింటినీ ప్రజలు సంతోషంగా ఆమోదించారనే విషయం అర్థమవుతున్నది. – మంత్రి మహేందర్‌రెడ్డి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.