Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

జలసౌధలో మంత్రి హరీశ్ ఆకస్మిక తనిఖీ

-సమయపాలన పాటించాలని ఆదేశం -నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిక -పనిచేసేవారిని ప్రోత్సహిస్తామని వెల్లడి

Harish Rao

నీటిపారుదల శాఖ కేంద్ర కార్యాలయమైన జలసౌధలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయం 10.10 గంటలకు జలసౌధకు వచ్చిన మంత్రి.. 11.30 గంటల వరకూ అక్కడే ఉన్నారు. జలసౌధలోని అన్ని కార్యాలయాల్లో తిరుగుతూ ఉద్యోగులు, అధికారులు సకాలంలో విధులకు హాజరవుతున్నారా? లేదా? ఫైళ్ల పరిష్కారం ఏ స్థాయిలో ఉంది? పరిసరాల పరిశుభ్రత పరిస్థితి ఏమిటి? తదితర అంశాలను పరిశీలించారు. వివిధ సెక్షన్లకు చెందిన దాదాపు 20శాతం ఉద్యోగులు 11.30కి కూడా రాకపోవడాన్ని గమనించారు.

బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చినప్పటికీ ఉద్యోగులు, అధికారులలో ఇంకా కొంతమంది నిర్లక్ష్యం వహించడంపట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటిపారుదల అంతర్రాష్ట్ర విభాగం, పరిపాలనా విభాగం, లైబ్రరీలో ఉద్యోగులు, అధికారులు సగం మంది సమయపాలన పాటించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. ఇటీవలే పదవీవిరమణ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఒకరు తనకు పెన్షన్ రావడం లేదని, అధికారులు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కష్టాలను చెప్పుకుని కంటతడి పెట్టారు.

దీంతో మంత్రి ఆయన పెన్షన్‌ను తక్షణమే మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాలని తన వెంట ఉన్న నీటిపారుదల శాఖ పరిపాలనా విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ్‌రెడ్డిని ఆదేశించారు. అంతటితో ఆగక సంబంధిత ఎఫ్-సెక్షన్‌కు వెళ్లి, అక్కడ సమస్య ఏమిటో అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సంబంధించిన ఫైళ్లను సత్వరమే పరిష్కరించడానికి ఉగ్యోగులు, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని స్పష్టం చేశారు. ఫైళ్ల పెండింగ్ అనే సమస్య లేకుండా చూడాలని తేల్చిచెప్పారు.

పలు విభాగాల్లో ఫైళ్లు గుట్టలు గుట్టలుగా పడేసి ఉండటం పై మంత్రి వాకబు చేశారు. జలసౌధలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు కూడా కార్యాలయాలు కేటాయించడం వల్ల స్థల సమస్య ఏర్పడిందని అధికారులు మంత్రికి వివరించారు. కొన్ని టేబుళ్లు శుభ్రంగా ఉండకపోవడం గమనించిన మంత్రి ఎవరో వచ్చి చేయాలని ఏం ఉంది? ఎవరి టేబుల్ వాళ్లు శుభ్రం చేసుకోవచ్చు కదా! అని ఉద్యోగులను ప్రశ్నించారు. అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో, అంకితభావంతో పనిచేసి, ప్రభుత్వ పథకాలు ప్రజల దరి చేర్చడానికి ప్రయత్నించాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం పై దృష్టి సారించాలని హరీశ్ సూచించారు.

అధికారులు అంకితభావంతో పనిచేయకపోతే ప్రాజెక్ట్‌ల వ్యయాలు పెరిగి ప్రభుత్వ ఖజానాకు భారమవుతుందని అన్నారు. ప్రభుత్వం మంచిగా పనిచేసే ఉద్యోగులను, అధికారులను ప్రోత్సహిస్తుందని, అదే సమయంలో నిర్లక్ష్యాన్ని చూస్తూ సహించేదిలేదని స్పష్టం చేశారు. కొన్నిరోజుల్లో మళ్లీ తనిఖీకి వస్తానని, అప్పుడు లోపాలు కనిపించవద్దని మంతి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు, అధికారుల సమస్యలను కూడా ఆయన ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.