-స్వర్ణయుగానికి బాటలు వేద్దాం: కేసీఆర్ -మీరు కార్యసాధకులు.. త్యాగధనులు.. స్ఫూర్తిమంతులు -బంగారు తెలంగాణ గమ్యాన్ని చేరేదాకా పులిబిడ్డలై పనిచేయండి -కార్యకర్తలు, నేతలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం -రాజధానిలో ఘనంగా టీఆర్‌ఎస్ ప్లీనరీ… -తెలంగాణ ప్రజలకే నా జీవితం అంకితం -తెలంగాణకు కరెంటు పీడపోయింది.. ఇక కోతలుండవ్ -దామరచర్ల పవర్‌ప్లాంటుకు పదిరోజుల్లో శంకుస్థాపన -కుంభమేళ లెక్క గోదావరి పుష్కరాలు నిర్వహిస్తం -తల తెగిపడ్డా ఇచ్చిన మాట తప్ప.. రెండేండ్లలో లక్ష ఉద్యోగాలు -ఈ రెండు, మూడు నెలల్లో కార్యకర్తలకు పదవుల్లో అవకాశాలు

టీఆర్‌ఎస్ కార్యకర్తలు గొప్ప కార్యసాధకులు.. గొప్ప త్యాగధనులు.. గొప్ప స్ఫూర్తిమంతులు.. అందుకే ఈ ఉద్యమాన్ని ఇంత దూరం తీసుకురాగలిగినం. నాటి జలదృశ్యంనుంచి నేటి జనదృశ్యందాకా బ్రహ్మాండంగా రాగలిగనం అని టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా కార్యకర్తలు ఇదే తరహాలో పనిచేయాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమల్లో మీరే కథానాయకులని అన్నారు. పులిబిడ్డలై పనిచేయాలని పిలుపునిచ్చారు. తన జీవితం తెలంగాణ ప్రజలకే అంకితమన్న కేసీఆర్.. అందరం కలిసి బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడేవరకూ అవిశ్రాంతంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లు సమరం నడిపిన టీఆర్‌ఎస్.. రాష్ట్రం సాధించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌లో ఘనంగా ప్లీనరీ నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడిగా వరుసగా ఎనిమిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్.. ప్లీనరీని ఉద్దేశించి అధ్యక్షోపన్యాసం చేశారు. దాదాపు గంటపాటు ప్రసంగించిన ఆయన తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని వివరిస్తూ, ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రతినిధులను ఉత్తేజపరిచారు.
సమరోత్సాహం నింపేలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. తన ఏకగీవ్ర ఎన్నికను ప్రకటించిన ఎన్నికల కమిటీ చైర్మన్ నాయిని నర్సింహారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈసారైనా విముక్తి చేస్తారనుకుంటే మళ్లీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని అన్నారు. నర్సన్నా.. ఈసారి అయినా నన్ను విముక్తి చేస్తారా! అంటే.. గవర్నమెంట్ రానీ.. వచ్చినంక ఇడిసిపెడతమన్నరు. మళ్ల ఈసారి గూడ నన్నే పెట్టిండ్రు. సంతోషం. ఫర్వాలేదు.. ముందుకు పోవాలె.. కార్యక్రమాలు జరగాలె. అనుకున్న బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడాలె అన్నారు. కేసీఆర్ ప్రసంగం ఇలా సాగింది.. అనేక త్యాగాలు, అనేక లాఠీచార్జీలు, అనేక జైళ్లు.. నిర్బందాలు, అనేక ఉద్యమ పరంపర.. గల్లీనుంచి ఢిల్లీదాకా ఉద్యమాలు.. జలదృశ్యం నుంచి జనదృశ్యంవరకు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత, గౌరవం ఎవరికైనా దక్కుతదంటే.. అది కేవలం టీఆర్‌ఎస్ కార్యకర్తలకే. టీఆర్‌ఎస్ కార్యకర్తల చరిత్ర సుస్థిరమైన స్థానంలో శాశ్వతంగా ఉంటుంది. ఈ రోజు ఇదంతా సాధ్యమైందంటే కర్తలు, నిర్ణేతలు, పోరాట యోధులు, త్యాగధనులు మీరే. మీ కష్టంతోనే తెలంగాణ సాకారమైంది. ఒక్కడుగా కేసీఆర్ బయలు దేరిండు.. చివరికి లక్షలాదిమంది సైన్యంగా తయారయ్యాం. భారత రాజకీయ వ్యవస్థను ఒప్పించి.. మెప్పించినం. ఎన్ని ఆరోపణలొచ్చినా,ఎన్ని నిందలు వేసినా అదిమి పట్టుకుని, ఉద్యమ బాట వీడకుండా పురోగమించినం కాబట్టే తెలంగాణ సాధించినం.
మంచిగ ఎవరు చెప్పినా స్వీకరించినం ఈ రోజు మూడున్నర నాలుగు గంటలకే నిద్ర లేచిన. ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. ఏందిరా కార్యక్రమం పెట్టుకుంటే ఉరుముతా ఉందని బాధపడిన. చూస్తే రాళ్ల వాన లేదు. దేవుడా కార్యక్రమం బాగా జరగాలి అని దండం పెట్టుకుని పేపర్లు ముందర వేసుకుని చదువుతుంటే బుద్ధా మురళి వ్యాసం ఆంధ్రభూమిలో వచ్చింది. మాకు సరైన మార్గనిర్దేశం చేసినందుకు ధన్యవాదాలు. ఉద్యమంలో, పాలనలో అనేకమంది సలహాలు, సూచనలిచ్చారు. మంచిగ ఉన్నయి స్వీకరించి అమలు చేసుకుంటూ పోయినం. కేశవరావుగారు మొన్న కళాకారుల సమావేశంలో నా స్పీచ్ విన్నరు. ప్లీనరీ కార్యక్రమాలు ఫైనల్ చేసేందుకు ఆయన ఇంటికి వెళితే.. కేసీఆర్ నీవు అంత ఆవేశపడ్డవు. ఏడుపే తక్కువ ఉండే. నీ కళ్లలో నీళ్లు కనపడ్డయి. ఎందుకంత బాధ కలిగింది? అని అడిగారు. ఆ రోజు తమ్ముడు రసమయి స్టేజీపై దుఖంతో కళ్ల నీళ్లు పెట్టుకున్నడు. కళాకారులతో 11-12నెలలుగా గ్యాప్ వచ్చింది. వారందరిని కలిస్తే ఒకసారి సినిమా రీల్ తిరిగినట్లు 14ఏళ్లుగా ఉన్న జ్ఞాపకాలు వచ్చి కళ్లలో నీళ్లు తిరిగినయి.
ముఖ్యమంత్రులనూ ఎదుర్కొన్నం ఎంత అపనమ్మకం, ఎన్ని జోకులు మన మీద! ఓటమి చూసినం. విజయాలు చూసినం. అనేక మంది ముఖ్యమంత్రులను ఎదుర్కొన్నం. ఎక్కడా మడమ తిప్పలేదు. ఒక సందర్భంలో నేను చిన్నబోయి కూర్చుంటే.. మా నాయిని నర్సన్న వచ్చి.. దాని బిషాత్ ఏందన్న.. ముందుకు పోవాలే. పో రాటం అంటే అంతిమం దాకా పోవాలని చెప్పిండు. 1969 ఉద్యమకారుడు ఆయన. అక్కా చెల్లెళ్లు అండగా నిలబడ్డరు. ఒకసారి జెండా కిందపెడితే జన్మలో తెలంగాణ రాదు. వస్తే మనతోనే రావాలని చెప్పినారు. అట్లనే తెచ్చుకున్నం. శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, స్వర్ణ, యాదిరెడ్డి, ఇషాంత్ అనేక మంది బిడ్డలు తెలంగాణకోసం తమ ప్రాణాలు బలి పెట్టారు. అమరులకు సెల్యూట్ చేస్తున్న. అమరవీరుల కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం.
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం చేస్తున్నం తెలంగాణ ఏపీలో ఉన్నప్పుడు యాస బాగలేదని, భాష రాదని, సంస్కృతిలేదని అవహేళన చేశారు. ఈ రోజు తెలంగాణ వచ్చాక సాంస్కృతిక పునరుజ్జీవం జరుగుతున్నది. తెలంగాణ చరిత్రకు అద్దంపట్టే గొల్కోండపై స్వాతంత్య్ర దినోత్సవాన జెండా ఎగురవేశాం. ఇంతకాలం ఈ సోయి ఎక్కడ పోయిందంటే.. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నరు కాబట్టి సోయి రాలేదు. ఇప్పుడు తెలంగాణ అచ్చింది కాబట్టి కాకతీయరెడ్డి రాజులు కట్టించిన గోల్కోండ కోట మీద తొలి జెండా ఎగురవేశాం. బతుకమ్మ, బోనాలు పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించాం.
అద్బుతంగా కొమురం భీం స్మారకం… ఒకనాడు కొమురంభీం విగ్రహాన్ని ప్రతిష్టిద్దామంటే కాంగ్రెస్ పాలనలో ఆ విగ్రహాలను పోలీస్ స్టేషన్లలో పెట్టారు. అదే ఉద్యమకారుడి కోసం నేనే సీఎంగా జోడేఘాట్ వెళ్లి విగ్రహానికి సెల్యూల్ చేశా. రూ.25కోట్లతో భీం స్మారకాన్ని ప్రపంచం అబ్బురపోయేలా ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తున్నం. పీవీ నర్సింహారావు ప్రధాని అయ్యి తెలంగాణకు కీర్తి తెచ్చిన బిడ్డ. ఆయనను సొంత పార్టీ కాంగ్రెస్ కూడా గౌరవించలే. కానీ మనం అధికారికంగా పీవీ జయంతి నిర్వహించినం. ప్రొఫెసర్ జయశంకర్ పేరును వ్యవసాయవర్సిటీకి.. కొండా లక్ష్మణ్ పేరును హార్టీకల్చర్ వర్సిటీకి, విప్లవ కాళోజీ పేరు వరంగల్ వైద్య యూనివర్సిటీకి పేరు పెట్టినం. వెటర్నరీ వర్సిటీకి పీవీ పేరు పెట్టుకున్నం. చరిత్రలో నిలిచిపోయేలా.. కళలు, సంస్కృతికి అద్దం పట్టేలా.. అంతా అబ్బురపోయేలా 14ఎకరాల్లో ఇందిరాపార్క్ సమీపంలో బ్రహ్మాండమైన తెలంగాణ కళాభారతి నిర్మిస్తున్నం. త్వరలో శంకుస్థాపన చేస్తా. యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నం. త్వరలోనే దివ్యక్షేత్రంగా గుట్ట తయారవుతుంది.
బలహీన వర్గాల సంక్షేమానికే పెద్దపీట తెలంగాణ రాష్ట్రంలో పేదలు, దళితులు ఉన్నరు. వారి పరిస్థితి బాగుపడలే. గిరిజనులు చాలా పేదరికంలో ఉన్నరు. బీసీలున్నరు. నోమాటిక్ (సంచార) బీసీలు ఎస్సీలకంటే దుర్భరంగా ఉన్నరు. స్వర్ణకారులున్నరు. ముదిరాజ్‌లకు ఎద్దు ఎవుసం లేదు. బీసీ, మైనారిటీ, క్రిస్టియన్, సిక్కు సోదరులు ఉన్నరు. ముస్లిం సోదరుల పరిస్థితి ఇంక దిగజారింది. ఆ జాతుల్లో వెలుగు రావాలే. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువ. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, వాళ్ల సంక్షేమానికి పెద్దపీట వేశాం. కులం మతం తేడాలేకుండా 34లక్షల రైతు కుటుంబాలకు లక్ష చొప్పున రుణమాఫీ చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది.17వేల కోట్లు ఎక్కువ ఖర్చయినా.. మాట ఇచ్చామంటే అమలు చేయాలి కాబట్టి చేశాం.
కాంగ్రెస్ నేతల కాళ్లకింద భూమి కదులుతుంది పింఛన్లపై కాంగ్రెస్ నాయకుల మాటలు విచిత్రంగా ఉన్నయి. హైదరాబాద్ పరిసరాల్లో ఫార్మా, సినిమా,ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సిటీలు ఎక్కడ రావాలో పరిశీలించేందుకు హెలికాప్టర్‌లో తిరిగితే.. సీఎం హెలికాప్టర్ దిగు. భూమి మీదికి దిగు. సరే కిందికి దిగిన! వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పాదయాత్ర చేసిన. బస్తీ బస్తీ, గల్లీ గల్లీ తిరిగితే.. సీఎం నీవు ఏమైన కౌన్సిలర్‌వా? కార్పొరేటర్‌వా? అన్నరు. మీద తిరిగితే ఆ పాట.. కింద తిరిగితే ఈ మాట.. ఏం అనాలో అర్థంకాని పరిస్థితుల్లో వారి కాళ్లకింద భూమి కదిలిపోయి అవాకులు చెవాకులు చెబుతున్నరు. కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకుల్లారా.. మీ జీవితంలో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే ఆలోచన ఏనాడైనా చేసిండ్ల? ఓట్లకోసం కాకుండా రెండు పూటలా పప్పు పులుసు తినేలా పింఛన్లు ఇస్తున్నం. 32లక్షల మందికి నెలకు వెయ్యి వస్తున్నది. ఎక్కడ పోయిన సంతోషంగా ఉన్నరు. అది కాంగ్రెస్ నాయకులకు గిట్టుబాటుగాదు. నిన్న మహబూబ్‌నగర్‌లో ఎవరైతే అవాకులు, చెవాకులు మాట్లాడారో వారిని అడుగుతున్న. 50 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నయి. ఒక్కనాడన్న బీడీకార్మికుల బాధలుపట్టించుకున్నరా? బీడీకార్మికులు మా దగ్గరికి రాలేదు. ధర్నాలు చేయలేదు. కానీ.. 3.70 లక్షల మంది కార్మికులకు నెలకు వెయ్యి భృతి ఇస్తున్నం. మనను ఎవరూ అడగలేదు. మ్యానిఫెస్టోలోనూ చెప్పలే. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీమ్‌లు పెట్టుకున్నాం. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం యువతుల పెళ్లిళ్లకు రూ.51వేలు అందిస్తున్నం.
సన్న బియ్యం చాంపియన్ ఈటల రేషన్ బియ్యంపై సీలింగ్ పెట్టి.. 20కిలోల బియ్యం ఇచ్చేవారు. దీన్ని తీసేసినం. పెట్టే అన్నమేదో పేదలకు కడుపు నిండా పెట్టాలని ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున కుటుంబంలో ఎందరుంటే అందరికీ ఇస్తున్నం. ఇందుకు గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది రూ.900కోట్లు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చుచేస్తున్నది. కాంగ్రెస్ నేతలు దొడ్డ దొరలు. చాలా పెద్దవాళ్లు. వారి హయాంలో హాస్టళ్లలో సన్నబియ్యం పెట్టే బుద్ధి, ఆలోచన వారికి రాలేదు.. నేను, రాజేందర్ సన్నగా ఉన్నాం. ఆయన హాస్టళ్లలో తిని చదువుకున్నరు. అందుకే ఆయనకు ఈ ఆలోచన వచ్చింది. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా జీవో ఇయ్యాలని చెప్పిన.. జీవో ఇచ్చి హాస్టళ్లలో సన్న బియ్యం అన్నం పెడుతున్నాం. తెలంగాణ ఆర్థిక మంత్రి నా తమ్ముడు ఈటలకే ఈ ఘనత దక్కుతుంది. ఈ పథకానికి చాంపియన్ ఈటల. పేదల గురించి ఆలోచించేవారు మా ప్రభుత్వంలో ఉన్నరు.
తెలంగాణకు కరెంటు కోతల పీడలేనట్లే.. పెద్దలు కేశవరావు చెప్పినరు. నవ్వు కూడా వస్తది. 2014లో.. అప్పుడే ఎలక్షన్ అయిపోయింది. మొదటి శాసనసభ సమావేశాలు పెట్టుకున్నం. తొలుత సమావేశాలు పెట్టుకున్నపుడు ఏం జరుగుతది? ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తరు. ఆ సందర్భంగా సభలో కాంగ్రెస్, టీడీపోళ్లు కరెంటు కోతలను వెంటనే ఎత్తివేయాలి అని నినాదాలు చేసినరు. అంతకు ముందు ఎవరున్నరు? పదేండ్లు కాంగ్రెస్, 17 ఏండ్లు టీడీపీ. తెల్లారను కూడా తెల్లారలె. మేం గోషి కూడ సర్దుకోకముందే.. ఎత్తేయాలన్నరు. నేన్జెప్పిన ఎత్తేస్తంరా నాయనా… మీలాగ మేం చేయం. కష్టపడతమని చెప్పిన. మీ అందరికి కూడా ఒక కాగితం ఇచ్చినరు. అందుల తెలంగాణల 4320 మెగావాట్ల థర్మల్ పవర్ ఉందని చెప్పినరు. మేం అల్రెడీ రూ.91,500 కోట్ల నిధులు సమకూర్చుకున్నం. రాబోయే మూడేండ్లలో 24వేల మెగావాట్లకు తీసుకుపోతం. ఆరోజు అసెంబ్లీలో నేను ఇదే చెప్తే… ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇదేమన్న మాయా మశ్చీంద్రనా, అద్భుతమా? చేస్తె అద్భుతమే అన్నరు. జానారెడ్డిగారూ.. టీఆర్‌ఎస్ చేసేదంతా అద్భుతమే ఉంటదని నేన్జెప్పిన. ప్రజలే మాకు బాస్‌లు. వాళ్లకేం కావాల్నో మాకు తెలుసు. కచ్చితంగా వాళ్ల కల నెరవేర్చేందుకు అహోరాత్రాలు కష్టపడతమని చెప్పినం.
డబ్బులు సమకూర్చినం.. జాగ తెచ్చినం. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్‌టైం. అందుకు కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్‌కు మనందరి తరఫున ధన్యవాదాలు చెబుతున్న. ఏ సీఎం గానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ సాధించని విధంగా నల్లగొండ జిల్లా దామరచర్లలో అల్ట్రా మెగాపవర్ ప్లాంటు.. దేశంలోనే అత్యధిక కరెంటును ఒకే స్థానంలో ఉత్పత్తి చేసేటటువంటి యాదగిరి నర్సన్న పవర్ ప్లాంటుకు పదిరోజుల్ల శంకుస్థాపన చేయబోతున్న. 6600 మెగావాట్ల కరెంటును అక్కడ ఉత్పత్తి చేయబోబోతున్నం. అయిపోయింది.. ఇక తెలంగాణకు కరెంటు పీడ పోయింది. కరెంటు కోతల్లేవు, కరెంటు కోతలుండయి. అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎక్కాలు, కందిళ్లు, ఎండిపోయిన వరి కంకులు వచ్చేవి. కానీ ఈసారి ఎవరూ కందిళ్లు తీసుకురాలె. కారణమేంది? కరెంటు సక్కగున్నది. పంటలు ఎండబెట్టుకోలె, బతికించుకున్నం. పరిశ్రమలకు, ఇండ్లకు 24 గంటల కరెంటు ఇస్తున్నం. దేశంలోని, రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలారా.. మీ పరిశ్రమలను విస్తరించండి. అద్భుతంగ కరెంటు సరఫరా ఉంటది. బయట ఉన్నవాళ్లు తెలంగాణకు తరలిరండి. మంచి పాలసీ ఉంది, కరెంటుంది. నీళ్లున్నయి. భూములున్నయి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని పెద్దలు చెప్పిండ్రు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్ల ఎట్ల పనిచేస్తుందో చెప్పడానికి కరెంటు సరఫరా ఒక్కటే నిదర్శనం.
బ్రహ్మాండంగ మిషన్ కాకతీయ పనులు… ఇయ్యాల కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎవరైతె పెద్ద నోరు పెట్టుకొని, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నరో… వారు ఒక్కనాడైనా ఒక్క చెరువుల తట్టెడు మట్టి తీసిండ్రా? మీరు నిజమైన తెలంగాణ బిడ్డలే అయితే ఆ రోజే ముఖ్యమంత్రుల మెడలు ఎందుకు వంచలేదు? కనీసం ఎంపీ ల్యాడ్స్, ఎమ్మెల్యే ల్యాడ్స్ నుంచి ఒక్క చెరువునైనా చేసిండ్రా? చెయ్యలె! మీరు చెయ్యరు. మీకా సోయి లేదు. ఇయ్యాల మాకు సోయి ఉంది. అదే మిషన్ కాకతీయ. తెలంగాణకు అన్నం పెట్టిన, ప్రపంచానికే వాటర్ షెడ్ నేర్పిన కాకతీయ రెడ్డి రాజులు 11వ శతాబ్దంలనె ఈ చెరువుల నిర్మాణం చేసిండ్రు. ఆ తర్వాత గోల్కొండ నవాబులు, ఆసఫ్‌జాహీలు కొనసాగించినరు. మేం అదే చేస్తున్నం.
తెలంగాణలో 46,500 చెరువులుంటే.. ఏడాదికి 9వేల చొప్పున మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తీసుకున్నం. బ్రహ్మాండంగ జరుగుతున్నయి. నేను రోజూ పేపర్ల ఫొటోలు, వార్తలు చూస్తున్న. ఈ మధ్య ఒకాయన నాకు ఒక జోక్ చెప్పిండు. అన్నా… మీ మంత్రి కావాలన్నా, మీ జడ్పీ ఛైర్మన్ కావాలన్నా… మీ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కావాలన్నా దొరుక్తలేరు అన్నడు. పెద్ద చెరువో, చిన్న చెరువో.. మంత్రి ఎక్కడున్నడ్రా అంటె పెద్ద చెరువు కాడున్నడు. ఎమ్మెల్యే పాత కుంటకాడ ఉన్నడు. ఎమ్మెల్యేలు, మంత్రులంతా ఈ నెల రోజుల నుంచి చెరువులు, కుంటలు పట్టుకుని తిరుగుతున్నరు.
అడగకుండానే అంగన్‌వాడీల వేతనాల పెంపు అంగన్‌వాడీలు గతంలో హైదరాబాద్ వస్తే గుర్రాలతో తొక్కించారు. కానీ.. అంగన్‌వాడీలు మా దగ్గరికి చలో అసెంబ్లీ అని రాలే. మేమే పిలిపించి, అన్నంపెట్టి, వారితో నాలుగు గంటలు మాట్లాడా. కష్టంసుఖం తెలుసుకుని జీతాలు పెంచినం.
నవ్విన నాప చేను పండింది… ఎన్నో కలలు నెరవేర్చుకోవాలని తెలంగాణ తెచ్చుకున్నం. ఆనాడు పాట నేనే రాసిన. చాలా పాడుకున్నం. గోదారి, కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలె… పచ్చని మాగాణాల్లో పసిడి పంట పండాలె… సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె… స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె… ఇయాల ఆ స్వర్ణయుగం, బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నం.
కేసీఆర్ అన్ని సంగతులు చెబుతుండు… కార్యకర్తల సంగతి చెప్పట్లేదు అని! (సభలో భారీఎత్తున హర్షధ్వానాలు రావడంతో పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో ఇగజూసిండ్రా… అంటూ స్టేజీ మీదున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు అందరికీ ఇదో హెచ్చరిక. మమ్మల్ని మంచిగ చూసుకోండి. లేకుంటె మీ సంగతి చూసుకుంటమంటున్నరు.. అని కేసీఆర్ అన్నారు) చరిత్రలోనే ఎప్పుడు లేనివిధంగ కార్యకర్తలు సభ్యత్వం చేసిండ్రు. గర్వపడుతున్నా. మీకెన్ని దండాలు పెట్టినా తక్కువే. 50 లక్షల మంది చేరినరు. నేను గతంలో వేరే పార్టీల పనిచేసిన. నాయకులు డబ్బులు కట్టేవాళ్లు, ప్రజలు డబ్బులు కట్టేవాళ్లు కాదు. కానీ ఈసారి ఒక్క నాయకుడు కూడా జేబుల నుంచి డబ్బులు కట్టకుండా రూ.10 కోట్ల సభ్యత్వ రుసుం తెలంగాణభవన్‌కు వచ్చింది. అందుల కార్యకర్తల ఇన్సూరెన్స్‌కు రూ.నాలుగున్నర కోట్లు కట్టేసినం. ఎవరికి ఏ ప్రమాదమొచ్చినా రూ.2 లక్షల సాయం అందుతది.
కుంభమేళలా గోదావరి పుష్కరాల నిర్వహణ… గత పుష్కరాల్లో ధర్మపురి వెళ్లా. అంతకు ముందు పుష్కరాలపై అసెంబ్లీలో వాదన. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు అడిగినారు. ఎందన్నా గీ పుష్కరాల్లో ఉద్యమం అన్నరు. ఉన్న పంచాయితీ అంత గాడనే ఉందని చెప్పిన. గోదావరి పారుతదే మా దగ్గర. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి రాష్ట్రంలోకి వచ్చేదే మా ప్రాంతంలో. 500-600కి.మీ. మా దగ్గర పారాక.. 50కి.మీ. ఆంధ్రాలో పారుతది. మరి పుష్కరాలు మీ దగ్గర నిర్వహించాలా? మా దగ్గర నిర్వహించాలా? కానీ మా దగ్గర నిర్వహించరు మీరు. గోదావరంటే రాజమండ్రి.. కృష్ణాపుష్కరమంటే విజయవాడ. 12ఏళ్ల క్రితం నేను గొంతు విప్పి.. గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు అద్భుత పుణ్యక్షేత్రాలున్నాయి. సరస్వతి అమ్మవారు బాసరలో.. ధర్మపురిలో లక్ష్మీనర్సింహస్వామి, కాళేశ్వరంలో శివాలయం, భద్రాచలంలో రాముడు కొలువు దీరి ఉన్నారు.
ఇంత పుణ్యక్షేత్రాలు మా దగ్గర ఉంటే.. ఒక్క పుణ్యక్షేత్రం కూడా లేని రాజమండ్రిలో ఎలా నిర్వహిస్తరు? అని అడిగితే.. అక్కడినుంచి బ్రాహ్మణ మిత్రులు మేల్కొన్నరు. పుష్కరాలు మా దగ్గర జరిగితే గుండు గీసే మా నాయీ బ్రాహ్మణులకు పని దొరకదా? మా అయ్యగార్లకు పని దొరకదా? మా కొబ్బరికాయలు, వ్యాపారులకు గిరాకీ రాదా? అని నేను చెబితే తెలంగాణ సమాజం మరింత తేటపడ్డది. గత పుష్కరాల్లో ధర్మపురికి పుష్కరాలకు పోయి.. సామి మళ్లీ పుష్కరం లోపల తెలంగాణ ఏర్పాటు జేయి.. మళ్లా వచ్చి ధర్మపురి నర్సన్నకు పాదాభివందనం.. పాలాభిషేకం చేస్తా. గోదావరి తల్లికి నీ ఒడిలో మునిగి స్వర్ణ కంకణం సమర్పిస్తనని మొక్కిన. ఈ పుష్కరం వచ్చేసరికి తెలంగాణ సాకారమైంది. ధర్మపురికి పుష్కరాలకు వెళ్తా. తెలంగాణలో పుష్కరాలు కుంభమేళాను తలపించే రీతిలో నిర్వహిస్తం.
నీళ్లియ్యకపోతే వచ్చే ఎన్నికల్ల ఓట్లడిగేది లేదు తెలంగాణ వాటర్‌గ్రిడ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రామారావు నేతృత్వంలో అద్భుతంగ రూపుదిద్దుకున్నది. నాలుగేండ్లలో పూర్తిగా ప్రతి ఇంటికి నల్లా నీళ్లిస్తమని చెప్పిన. ఇయ్యకుంటె వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగమని చెప్పినం. ఇంత దమ్మున్న పార్టీ ఇండియాల్నే కాదు.. ప్రపంచంల ఎక్కడ లేదు. పట్టుబట్టి తెలంగాణ ఎట్ల తెచ్చినమో.. అపర భగీరధుల్లా ఇది కూడా అందరం కలిసి తేవాలె. కాంగ్రెసోళ్లు ఆలోచించలె. చెప్తనె అడ్డం పడతరు. అండ్ల ఒకాయన.. ఇంతగనం ఎందుకయా? రూ.10వేల కోట్లయితె ఊరుకో ఆర్‌ఓ మిషన్ పెట్టొచ్చు అంటడు. మరొకాయన రూ.8వేల కోట్లతో చేయొచ్చు అంటడు. ఇది నిజమే అయితే కాంగ్రెస్ నాయకులారా.. పోయిన పదేండ్లు మీరే ఉన్నరుగాదా. గా కుంతపని మీరు చేస్తే మాకెందుకు మిగులుతుండె? ఎక్కడకు పోయింది మీ జ్ఞానం? మీరు చేయరు.. మీకు చేతకాదు. మాది బూజుపట్టిన ధమాకు… మీరు కూడ అట్లనె ఉండాలనె పద్ధతుల మాట్లాడుతున్నరు.
మేం అట్ల ఉండం. మేం ప్రజల గురించి ఆలోచిస్తం. ఎన్ని కష్టాలు పడాల్నో పడి తప్పకుండ నెరవేరుస్తం. పౌరుషం ఉన్న బిడ్డలం కాబట్టి మీకు నీళ్లందించకపోతే ఓట్లు అడగంగాక అడగమని మరోసారి ప్రకటిస్తున్న. ఇది చిన్న పథకం కాదు. మీరందరు ఎక్కడివాళ్లక్కడ కథానాయకులు కావాలి. దాదాపు 26 ప్రాజెక్టుల నుంచి వచ్చే పైపులైన్లు 20వేలచోట్ల రైల్వే లైన్లు, ఒర్రెలు, వాగులు, కెనాల్స్, నదులు, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు దాటాలి. ఎక్కడ ఏ గ్రామంలో, మండలంలో ఈ పనులొచ్చినా… శివంగి బిడ్డల్లాగ, పులిబిడ్డల్లాగ మీరే నిలబడాలని కార్యకర్తల్ని కోరుతున్న. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలె. సగౌరవంగా మళ్లీ ఎలక్షన్ల ప్రజలను ఓట్లు అడగాలి.
దళితుల భూపంపిణీ నిరంతర కార్యక్రమం.. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయాలని నిర్ణయిస్తే.. ఎల్లుండి ఇస్తారా? అవుతల ఎల్లుండి ఇస్తారా? అని అంటరు. 50ఏండ్లలో మీరేం ఇచ్చారు? పావు ఎకరం, అర ఎకరం పనికి రాని భూమి పంచారు. భూమి పొందిన కుటుంబాలు విముక్తి కావాలే. ఇది నిరంతర కార్యక్రమం. హైదరాబాద్, విదేశాల్లో స్థిరపడిన వారు, భూస్వాములు ముందుకు వస్తే వారి భూములకు మంచి ధర ఇస్తాం. యశోద ఆస్పత్రి ఎండీ సురేందర్‌రావుది వరంగల్ జిల్లా నల్లబెల్లి. ఆయన తనకున్న 12ఎకరాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. డబ్బులు అడిగారు. నీకెందుకు డబ్బులు.. కోటీశ్వరుడివికదా? అంటే మీరిచ్చిన డబ్బులు మా ఊరి పంచాయితీ అకౌంట్‌లో వేసి గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తామని అన్నారు. ఇలా చాలామంది వస్తున్నరు.
అందరినీ కడుపుల పెట్టుకుంటున్నం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సోదరులు ఉద్యమంలో ప్రపంచమే అబ్బురపడే విధంగ సకల జనుల సమ్మె చేసినరు. ఏటా రూ.6500 కోట్ల భారం అయినా వాళ్లకు 43% ఫిట్‌మెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా ఆదుకున్నం. మైనార్టీ సోదరులకు గత ప్రభుత్వాలు 100 కోట్లు, 200 కోట్లు ఇస్తె ఎక్కువ. కానీ ఎన్నికల ముందు చెప్పినట్లు ఈ బడ్జెట్‌లో రూ.1033 కోట్లు పెట్టినం. లాయర్లకు 100 కోట్లు విడుదల చేసినం. జర్నలిస్టు మిత్రులకు రూ.10 కోట్లు ప్రకటించి, ఆ మొత్తాన్ని వాళ్ల ఖాతాలో జమచేసినం. అందరికి మించి తెలంగాణ కళాకారుల బిడ్డలకు సెల్యూట్ చేస్తున్న. ఉద్యమ సమయంలో అటుకులు తిన్నరో, అన్నం తిన్నరో. ఎండకు వానకు ఊరూరా తిరిగి ప్రజలను చైతన్య పరిచినరు. అందుకే వాళ్లను సాంస్కృతిక సారధులుగా బాజాప్తా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగ గుర్తించి, గౌరవించుకున్నం. ఈ రోజు వాళ్లు మళ్లీ తెలంగాణ పునర్నిర్మాణంలో బ్రహ్మాండమైన పాటగా ఉండాలి. నేన్జెప్పిన.. తమ్ముడూ.. నేను ఉన్నా.. లేకున్నా.. బంగారు తెలంగాణ సాధించే వరకు మీ డప్పు మోత ఆగొద్దు.. గజ్జ మోత ఆగొద్దు… గొంతు ఆగొద్దు.. అని చెప్పిన
ఒకచో మేళంబవళించు.. మార్కెట్ కమిటీలు, దేవస్థానం కమిటీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల నియామకం రాబోయే రెండు, మూడు నెలల్లో పూర్తి చేస్తం. మీ అందరికీ పదవులొస్తయి. ఎనకటికో కవి రాసినరు… ఒకచో మేళంబవళించు, ఒకచో నొప్పారు బూసెజ్జపై, ఒకచో శాఖములారగించు, ఒకచో ఉత్కృష్ణశాలినగరం అన్నరు. కార్యసాధకులు అటుకులు తిన్నమా, అన్నం తిన్నమా, నేల మీద పన్నమా, పరుపు మీద పన్నమా అని ఆలోచించరు. మీరందరూ అట్లాంటి కార్యసాధకులే. అందరం కలిసి ముందుకు పోదాం.. బంగారు తెలంగాణ గమ్యం ముద్దాడే వరకు అవిశ్రాంత పోరాటం చేద్దాం.
తల తెగిపడ్డా… ఇచ్చిన మాట తప్ప.. రాబోయే సంవత్సరంలో కేజీ టు పీజీ విద్యావిధానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మా నిరుద్యోగ సోదరులకు హామీ ఇస్తున్న. కేసీఆర్ మాట ఇస్తే.. తల తెగిపడ్డా కూడా తప్పడు. నిరాశ పడకండి. త్వరలో మీ కల నెరవేరుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు వంద శాతం రెగ్యులరైజ్ చేసి తీరతం. ఉద్యోగుల పంపిణీ అయిపోయిన తెల్లారే జీవో తెస్తం. రాబోయే రెండేండ్లలో లక్ష మంది నిరుద్యోగులకు ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు కల్పిస్తం. డ్వాక్రా మహిళా అక్క చెల్లెళ్లకు వడ్డీలేని రుణం ఇప్పడిదాకా రూ.5 లక్షలే ఇస్తున్నరు… ఇయ్యాల్టి నుంచి కచ్చితంగ ఆర్డర్ జారీ చేసి ఆ రుణ పరిమితిని రూ.10 లక్షలు ఇచ్చే విధంగ చర్యలు తీసుకుంటం.
బదనాం చేస్తున్నరు.. నమ్మొద్దు.. పని గట్టుకొని తెలంగాణను బదనాం చేసే పేపర్లు, మనలో మనకే అపార్ధాలు సృష్టించే పేపర్లు ఇంకా కూడా ఇక్కడ ఉన్నయి. ప్రాణహిత-చేవెళ్లను ఎత్తేస్తమని దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నరు. దానిని ఎత్తివేస్తలేం. మార్పులు చేసుకుంటున్నం. ఎన్నికల సందర్భంగ చెప్పిన.. ఇది తెలంగాణ రాష్ట్రం, ఎవడు అడ్డమొస్తడో చూస్త.. ప్రాజెక్టుల దగ్గర కుర్చేసుకొని కూర్చుని కట్టిస్తనని చెప్పిన. రాబోయే నాలుగేండ్లలో ఇటు పాలమూరు, అటు గోదావరి.. ఉత్తర, దక్షిణ తెలంగాణకు నిజంగనె కూర్చేసుకొని కట్టిస్త. దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, ఎస్సెల్బీసీ ప్రాజెక్టులన్నింటినీ ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏడాదిన్నరలోపు పూర్తి చేస్తం.