-ప్రచారం చేసే ధైర్యంలేకనే బాబు ముఖం చాటేసిండు -డిపాజిట్ కూడా రాదనే కిషన్‌రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నడు -మంత్రి హరీశ్ ధ్వజం.. టీఆర్‌ఎస్‌లోకి కురుమ సంఘం నేత మల్లేశం
మెదక్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే ధైర్యం లేకనే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖం చాటేస్తున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లేస్తే చంద్రబాబు, వెంకయ్యనాయుడు, సిన్మా యాక్టర్ లాంటి సీమాంధ్ర నాయకులు బలపడి తెలంగాణపై పెత్తనం చెల్లాయిస్తారని హెచ్చరించారు.
సీమాంధ్ర నేతలు చంద్రబాబు, వెంకయ్యనాయుడు, సిన్మా యాక్టర్ కలిసి జగ్గారెడ్డికి టికెట్ ఇప్పించుకున్నరు. మరి ఒక్కరు కూడా మెదక్ వచ్చి ప్రచారం చేస్తలేరెందుకు? చంద్రబాబూ.. దమ్ముంటే మెదక్‌లో ప్రచారం చెయ్. నీ సత్తా ఏందో తెలుస్తది. చివరకు ప్రచారంలో చంద్రబాబు బొమ్మ కూడా దాచిపెడుతున్నరు. ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు తెలంగాణ మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నరు అని స్పష్టం చేశారు. హరీశ్‌రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశంతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాల్సిన ఆవశ్యకతను గుర్తించి, బంగారు తెలంగాణ సాధనకు చాలామంది టీఆర్‌ఎస్‌లో చేరుతుండటం సంతోషకరమన్నారు. మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలోని ఇతర పార్టీల నాయకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రచారం చేస్తున్నరు. ఎక్కడ చెల్లనోళ్లు, ఓడిపోయినోళ్లు అక్కడికొచ్చి సుద్దులు చెబుతున్నరు అని విమర్శించారు.
మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిలబడదామనే చూశారని, డిపాజిట్ రాదని తెలిసి జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాములునాయక్, ఎల్బీనగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్, మెదక్ జిల్లా నాయకుడు నరేంద్రనాథ్, రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు పుట్ట పురుషోత్తం పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతల బండారం బయటపెడుతం: నాయిని అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు చేసిన అవినీతి, అక్రమాల బాగోతాన్నంతా బయటపెడుతామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ కంచుకోటగా మారిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని పార్టీ నేత నోముల నర్సింహయ్య అన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్‌లో చేరినట్లు చెప్పారు.