-సమైక్యవాదం వినిపించినందుకు క్షమాపణ చెప్పు – అప్పుడే నీకు ఉప ఎన్నికల్లో ఓట్లడిగే హక్కుంటుంది -భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టీకరణ

తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతు పలికినందుకు మెదక్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తప్పు చేశాను.. ఇక ముందు ఎన్నడూ అలాంటి తప్పు చేయను.
అని చేసిన తప్పులన్నింటికీ పశ్చాత్తాపపడుతూ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మెదక్ జిల్లా ప్రజలకు జగ్గారెడ్డి బహిరంగా క్షమాపణలు చెప్పాలి. అప్పుడే జగ్గారెడ్డికి మెదక్ జిల్లా ప్రజల ఓట్లు అడిగే హక్కు ఉంటుంది అని స్పష్టం చేశారు.
ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సిద్దిపేటలో వివిధ కులసంఘాల నేతృత్వంలో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఇస్తే సంగారెడ్డిని బీదర్‌లో కలుపాలని కోరిన వ్యక్తికి తెలంగాణ రాష్ట్రంతో పనేందని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని ఇక్కడి ప్రజల ఓట్లు అడుగుతున్నాడని నిలదీశారు. జగ్గారెడ్డికి ఓటు వేయడమంటే బెజవాడ బాబుకు వేయడమే అవుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ నాయకులు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిప్ప ప్రభాకర్, కాముని నగేశ్, పూజల వేంకటేశ్వర్‌రావు, శేషు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.