తెలంగాణ సమాచార, సాంకేతిక రంగానికి మణిమకుటమైన ఐటీఐఆర్(ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పనులపై ఐటీ మంత్రి కేటీఆర్, సాంకేతిక శాఖ కార్యదర్శి హరిప్రీత్‌సింగ్‌లతో సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కేంద్రం నిర్దేశించినట్టుగానే 2025లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం కతనిశ్చయంతో ఉన్నట్లు అధికారులకు సీఎం తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, దానికి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు కార్యాచరణను రూపొందించాలని సూచించారు. ద్వితీయ శ్రేణీ నగరాల్లోనూ ఐటీ పార్కులను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, అలాగే ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది.