Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఐటీని విస్తరిస్తాం

-పాలమూరును అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం -ఈ జిల్లాపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం -అప్పనపల్లి ఆర్వోబీ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్

KTR 005

సాంకేతిక రంగంలో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి వద్ద నిర్మించిన ఆర్వోబీని ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఐటీరంగం అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని, ఐటీని అన్నిప్రాంతాలకు విస్తరించి అభివృద్ధి చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన పాలమూరు జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీఇచ్చారు. పాలమూరు జిల్లా అంటే తనకెంతో అభిమానమని, 2006లో ఉద్యమానికి ఈ జిల్లా కార్యక్షేత్రమైందన్నారు. స్వరాష్ట్రంలో అధిక లాభం పొందేది ఈ జిల్లానేనని వెల్లడించారు. ఇక్కడి నుంచి కేసీఆర్ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన సమయంలోనే రాష్ట్రం ఏర్పాటవడంతో ఈ జిల్లా చరిత్రలో నిలిచిపోయిందన్నారు.

అందుకే పాలమూరు జిల్లా అంటే కేసీఆర్‌కు ఎంతో ఇష్టమని, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారని వివరించారు. పది జిల్లాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. సీమాంధ్రుల పాలనలో అన్యాయానికి గురైన జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. జూరాల- పాకాల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపట్టి సాగునీరు అందించే బృహత్తర ప్రణాళిక తయారవుతోందని తెలిపారు. ఇవి పూర్తయితే 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

సీఎం దృష్టికి జడ్చర్ల-పాలమూరు రహదారి విస్తరణ పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న తాగునీటి పథకాలను సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకొని నీటిఎద్దడి లేకుండా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పాలమూరుకు బైపాస్ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. జడ్చర్ల-పాలమూరు రహదారిని నాలుగులైన్లుగా విస్తరించే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖ తరఫున రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తానన్నారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు సీఎం పెద్దపీట వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పాలమూరు జిల్లాలోనే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఏపీ అనే పదం పోయి, ఆ స్థానంలో తెలంగాణ అని వచ్చింది. కానీ ఎంపీ జితేందర్‌రెడ్డి పేరుకు ముందు మాత్రం ఇంకా ఏపీ అనే ఉన్నది అని మంత్రి ఛలోక్తి విసరడంలో సభలో నవ్వులు విరిశాయి. అంతకుముందు ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జూపల్లి కష్ణారావు, సీ లక్ష్మా రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలు జగదీశ్వర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.