ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలుపుతామని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గచ్చిబౌలి ఐటీ కారిడార్ సెక్టార్‌లోని ఇన్ఫోసిస్-ఐఎస్‌బీ వద్ద ఏర్పాటుచేసిన ప్రపంచస్థాయి అత్యాధునిక ఎస్కలేటర్ ఫుట్‌ఓవర్ బ్రిడ్జీ (ఎఫ్‌వోబీ), ఏటీఎం సదుపాయం గల ఎయిర్ కండీషన్డ్ బస్‌షెల్టర్, అత్యాధునిక నిఘా కెమెరాలను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీరంగం ద్వారా రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ప్రత్యక్షంగా, 12 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని చెప్పారు.
-ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు: ఐటీ మంత్రి కేటీఆర్ -ఐటీ కారిడార్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం -గచ్చిబౌలిలో ఎస్కలేటర్ ఎఫ్‌వోబీ, ఏసీ బస్సు షెల్టర్ ప్రారంభం

సీఎం కేసీఆర్ ఐటీ రంగం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఇప్పటికే ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల భద్రత కోసం మహిళా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటుచేశామని, రాబోయే రోజుల్లో ఐటీ కారిడార్‌ను సురక్షితంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇక్కడ మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వ కృషి చేస్తున్నదన్నారు. మెట్రోరైలు అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుందని చెప్పారు. మరో వెయ్యి ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఐటీ కారిడార్ అభివృద్ధిలో భాగంగానే పీపీపీ విధానంలో రూ.3కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఎస్కలేటర్‌తో కూడిన ఎఫ్‌వోబీ, ఎయిర్ కండీషన్డ్ బస్ షెల్టర్లను ప్రారంభించామని చెప్పారు. ఇక్కడ మరిన్ని ఎఫ్‌వోబీలు, బస్ షెల్టర్లు నిర్మించి మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనలో మెరుగైన చర్యలు చేపట్టడంతో ఇండియా టూడే బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవార్డు ఇచ్చిందని చెప్పారు. మరింతగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఐటీ కారిడార్‌లో మరో నాలుగు ఎఫ్‌వోబీలు, 10 వరకు ఏసీ బస్‌షెల్టర్లను నిర్మిస్తున్నామని చెప్పారు.
ఈ ప్రాంతంలో 11 రోడ్లను విస్తరించడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు వివరించారు. రహదారులు, రవాణా వ్యవస్థతోపాటు అన్ని మౌలిక వసతులు ఉంటే.. మరిన్ని ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చేందుకు వీలుందన్నారు. టీఎస్‌ఐఐసీ-ప్రకాశ్ ఆర్ట్స్ సంస్థ పీపీపీ విధానంలో ఈ ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని నిర్మించాయి. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్‌గౌడ్, టీఎస్‌ఐఐసీ ఈడీ నర్సింహారెడ్డి, నిర్మాణ సంస్థ ప్రకాశ్ ఆర్ట్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.