-వారసత్వ సంపదకు నష్టం కలుగనీయం -మురికివాడలు నగరానికి శాపాలు -శాటిలైట్ టౌన్‌షిప్‌లతో పరిష్కారం -మెట్రోపొలిస్ సదస్సులో సీఎం కేసీఆర్

మానవీయ కోణంలో, వారసత్వ సంపదకు విఘాతం కలుగకుండా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. టర్కీలోని ఇస్తాంబుల్ తరహాలో చారిత్రక సంపదకు విఘాతం కలగని అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు. మురికివాడలను శాపంగా ఆయన అభివర్ణించారు.
గురువారం మధ్యాహ్నం పదకొండో మెట్రోపొలిస్ సదస్సు ముగింపు సమావేశంలో సీఎం ప్రసంగించారు. ఈ నగరం చారిత్రక, వారసత్వ సంపదకు ఆటంకం కలగకుండా అభివృద్ధి చేయొచ్చని ప్రపంచానికి నిరూపించి చూపింది. హైదరాబాద్ చారిత్రక నగరం. అందుకు పాత నగరమే ఓ సజీవ సాక్ష్యం. అందుకే మానవీయ కోణంలో అభివృద్ధిని సాధిస్తాం అని ఆయన ప్రకటించారు. మెట్రోపొలిస్ సదస్సు నిర్మాణాత్మక, లోతైన చర్చలను పంచుకునేందుకు ఒక చక్కటి వేదికగా నిలిచిందని ప్రశంసించారు. వలసలతో నగరాల్లో జనాభా గణనీయంగా పెరుగుతుంది. కానీ భూమి పెరగదు.
దీంతో భూమిని శాస్త్రీయ, న్యాయ పద్ధతుల్లో వినియోగించుకోవాల్సిన అవసరముంది. మురికివాడలనేవి నగర జీవనంలో ఒక మచ్చలాగా ఉన్నందున.. హైదరాబాద్‌ను మురికివాడలరహిత నగరంగా చేసేందుకు కృషి చేస్తున్నాం అని సీఎం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నగరాలు కూడా మురికివాడలరహితంగా మారి, కొత్తగా ఒక్క మురికివాడకూడా ఏర్పాటుకాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శాటిలైట్ టౌన్‌షిప్‌ల ద్వారా మురికివాడలను నివారించవచ్చని చెప్పారు. ఈ సదస్సులో నగరాలు, స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించి… హైదరాబాద్‌లో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారని ఆశిస్తున్నానని అన్నారు.
గొప్ప ఆతిథ్యం లభించింది తెలంగాణ ప్రభుత్వం, జీహెజ్‌ఎంసీ నిర్వాహకుల నుంచి సదస్సుకు హాజరైన ప్రతినిధులకు గొప్ప ఆతిథ్యం లభించిందని జోహెన్స్‌బర్గ్ ఎగ్జిక్యూటివ్ మేయర్, మెట్రోపొలిస్ కాంగ్రెస్ కో-ప్రెసిడెంట్ పార్క్ టావు అన్నారు. మెట్రోపొలిస్ యూత్ ఆవిష్కరణకు ఈ సదస్సు దోహదపడిందన్నారు. పట్టణ సుపరిపాలన, సామాజిక, ఆర్థికాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు సహకరిస్తుందన్నారు.
ఇందులో వచ్చిన ఫలితాలతో (ఇన్‌పుట్స్) వచ్చే ఏడాది జరగనున్న మెట్రోపొలిస్ సదస్సుకు ఎజెండా రూపొందిస్తామని ప్రకటించారు. ఈనెల ఏడో తేదీన మొదలైన ఈ సదస్సులో ఇప్పటివరకు 40 అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. ప్రముఖ వక్తలు ఏయే అంశాలపై ప్రసంగించారో వివరించారు. అనంతరం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి అందరికీ కృతజ్ఙతలు (వోటాఫ్ థాంక్స్) తెలిపారు. వాతావరణ మార్పులు అనే అంశంపై సాంకేతిక చర్చతో శుక్రవారం సదస్సు ముగియనుంది. అనంతరం ప్రతినిధులు సాయంత్రం వరకు తొమ్మిది సాంకేతిక పర్యటనలు చేయనున్నారు. దీంతో కొత్త రాష్ట్రంలో తొలి అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా ముగియనుంది.
కఠిన నిర్ణయాలతో కాలుష్య నియంత్రణ కఠిన నిర్ణయాలతోనే కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని మెట్రోపొలిస్ సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సియోల్ పాటించిన విధానాన్ని వివరించారు. కాలుష్య కోరల్ని అణిచేందుకు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారో పరిశోధక విద్యార్థి డాక్టర్ యూజిన్ ఛాయ్ తెలిపారు.
సదస్సులో భాగంగా గురువారం మెగా సిటీస్ – సియోల్ షేరింగ్ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సియోల్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధక విద్యార్థి యూజిన్ మాట్లాడుతూ.. గ్యాసోలైన్ వినియోగంపై 1986లోనే నిషేధం విధించినట్లు చెప్పారు. ముఖ్యంగా వాతావరణంలో సల్ఫర్‌డయాక్సైడ్‌ను నియంత్రణలోకి తెచ్చేందుకు 1981లోనే ఇంధనాల్లో సల్ఫర్ వినియోగంపై నియంత్రణ విధించారు. 1988 నుంచి తక్కువ పరిమాణంలో సల్ఫర్ ఉన్న ఇంధనాలు, ఎల్‌ఎన్‌జీలను ప్రభుత్వమే సరఫరా చేసింది. 1991 నుంచి వాహన చట్టాలను సవరించి కఠినతరం చేసింది. తక్కువ పరిమాణంలో కాలుష్యం వెదజల్లే వాహనాలను అందుబాటులోకి తెచ్చి వాటి వినియోగాన్ని ప్రోత్సహించింది అని తెలిపారు. వైపరీత్యాల నిర్వహణపై మరో విద్యార్థి యంగ్ షిన్ ప్రసంగించారు.
గతంలో వివిధ రకాల వైపరీత్యాలను చవిచూసిన సియోల్… ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రత్యేకంగా రక్షణ చర్యలపై మాస్టర్ ప్లాన్ రూపొందించింది. భద్రతా చర్యలకు ప్రణాళిక వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసింది. జాతీయ భద్రతా నిర్వహణ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించింది. ప్రతి ఐదు సంవత్సరాలకు సవరించేలా ప్రణాళిక తయారు చేసింది అని వివరించారు.