Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఇందూరు భేరీ!

అణు బాంబు దాడులకు గురైన జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకిలను మించిన విధ్వంసం తెలంగాణలో ఆంధ్ర ముఖ్యమంత్రుల పాలనలో జరిగిందని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. తెలంగాణలో జరిగిన జీవన విధ్వంసంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు ఆయన సవాలు విసిరారు. ఆంధ్ర సీఎంల పల్లకీలు మోసిన మీకు తెలంగాణలో జరిగిన విధ్వంసం ఏం తెలుసు అంటూ నిప్పులు చెరిగారు.

KCR Nizamabad

ఉద్యోగుల ఆప్షన్ల విషయంలో టీ కాంగ్రెస్ వైఖరేమిటని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలే బాస్‌లని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన తేల్చి చెప్పారు. నిజామాబాద్ పట్టణంలో మంగళవారం రాత్రి ‘తెలంగాణ పునర్నిర్మాణ శంఖారావం’ బహిరంగసభలో కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాకు పలు వరాలు ప్రకటించారు. మోతెలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. జూన్ 2 తర్వాత ట్రాక్టర్లు కొనేవాళ్లు పన్ను కట్టొద్దని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేయిస్తామని భరోసా ఇచ్చారు. వివిధ అంశాలపై ఆయన ఏమన్నారో.. ఆయన మాటల్లోనే..

విధ్వంసం కనబడ్తలేదా పొన్నాల.. ఏం పొన్నాల లక్ష్మయ్యా.. తెలంగాణలో విధ్వంసం జరగలేదంటావా? హిరోషిమా, నాగసాకిలకంటే ఎక్కువ ధ్వంసమైంది. జీవన విధ్వంసం జరిగింది. ఏం? నీకళ్లకు కనబడ్తలేదా? ఆంధ్ర సీఎంల పల్లకీలు మోసినోళ్లు నంబర్ టూ గాళ్లు. ఎప్పుడైనా నంబర్‌వన్ అయిండ్రా? పల్లకీలు మోసినోళ్లేతప్ప పల్లకీలో కూర్చున్నోళ్లా మీరు? విధ్వంసం జరగలేదంటున్నవ్. జరిగిందని నేనంటున్నా. రా.. చర్చకు రా! బహిరంగ చర్చ ఏ జిల్లాలో పెట్టుకుందామో చెప్పు. ఆంధ్రనేతలకు సద్దులు కట్టినోళ్లు మీరు. సెటిలర్ల ఓట్లు అడిగేందుకు సిగ్గులేదా? వాళ్ల ఓట్లు అడిగెటోళ్లు తెలంగాణ ఓట్లెలా అడుగుతరు? ఎవరన్నా సెటిలర్లు వేస్తే మేం కూడా వద్దనం.

ఆప్షన్లపై వైఖరేంటి? ఉద్యోగుల విషయంలో ఆప్షన్లు ఉండొద్దని మేమంటున్నం. ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రల్నే పనిచేయాలంటున్నం. మా ఉద్యోగులు మాత్రమే ఇక్కడ పనిచేయాలంటున్నం. కాంగ్రెస్ నాయకుల్లారా! దమ్ముంటే, నిజాయితీ ఉంటే దీంట్లో మీ విధానమేమిటో బయట పెట్టుండ్రి. పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెసోళ్లు పొద్దున లెవ్వంగనే నన్ను తిట్టుడే పెడుతుండ్రు. ఈ బక్కప్యాదని చూసి అంత భయమెందుకు? ఈర్ష ఎందుకు? కేసీఆర్‌ను తిట్టడమే మీ బతుకు. ఇదే మీ ప్రచారమా? టీఆర్‌ఎస్ అచ్చంగా తెలంగాణ ప్రజల పార్టీ. మాకు బాస్ ఎవడూ లేడు. తెలంగాణ ప్రజలే మాకు బాస్‌లు. ఆంధ్రలో అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే అసెంబ్లీలో పోరాడింది మా ఎమ్మెల్యేలు. మీరేం చేసిండ్రు? నీటి కేటాయింపులు లేని గాలేరు-నగరి కోసం రఘువీరారేడ్డి పాదయాత్ర చేస్తుంటే మంత్రి డీకే అరుణ మంగళ హారతులు పట్టింది. లక్ష్మయ్య జెండా ఊపి జై కొట్టిండు. అందుకే కాంగ్రెస్ అంటే తెలంగాణ ప్రజలు ఛీ కొడుతుండ్రు.

మోతెలో పసుపు పరిశోధన కేంద్రం పసుపు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నరు. పంటకు ధరలేదు. తెలంగాణ ఉద్యమ మోతను మోగించిన మోతెలో పసుపు పరిశోధన కేంద్రాన్ని పెట్టిస్తా. ఆర్మూర్ ఎర్రజొన్న రైతులకు రూ.11 కోట్ల బాకీలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇప్పిస్తా. నిజాంసాగర్ కింద వేంపల్లి పథకాన్ని ఏర్పాటు చేయించి, ఏడువేల ఎకరాలకు నీరిప్పిస్తా. కౌలాస్‌నాలాను పెద్దగా చేసి 15వేల ఎకరాలకు అదనంగా నీళ్లు ఇప్పిస్తా. ప్రాణహిత-చే కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో అదనపు ఆయకట్లు సాగులోకి తెస్తా. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ చేయొచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిజాంసాగర్. అప్పుడు మూడులక్షల ఎకరాల్లో పండేవి. ప్రపంచంలోనే ఆ కాలంలో నిజామాబాద్‌కు గౌరవం, ఘనత దక్కింది. మళ్లీ నిజాంసాగర్‌కు మంచిరోజులు రావాలే. ఆయకట్టు పునరుద్ధరించాలే. మన సర్కార్ రాంగనే ఇదైతదని చెప్పలేం. అబద్దాలెందుకు ? హైదరాబాద్‌కి కృష్ణనీరు రావాలే. అప్పుడు సింగూరు నీళ్లను నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు అంకితం చేస్తా. ఇరిగేషన్ రంగానికి పూర్వవైభవం సాధించిపెడతా. నిజాంచక్కర ఫ్యాక్టరీకి పెట్టింది పేరుండే. బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలు చెరుకు, వరిపంటలకు నిలయంగా ఉండే. ఆర్మూర్‌లో పసుపు విరివిగా పండేది. అన్నిరకాల పంటలు పండేవి. ఇప్పుడు రైతులు కష్టాల్లో ఉన్నారు. ఒకప్పుడు చెరుకు తోటలకు రైలు పట్టాలు ఉండేవి. కానీ చెరుకు పంటనే మాయమాయే. నిజాంషుగర్స్ ఆగమాయే. సహకార చక్కెర ఫ్యాక్టరీ అడుగు నాశనమయ్యింది. మళ్లా పూర్వవైభవం తేవాలే. తెలంగాణ వచ్చింది ఎన్‌ఎస్‌ఎఫ్‌కు పూర్వవైభవం తెస్తా. ఆ బాధ్యత నేనే తీసుకుంటా. నిజామాబాద్‌లో నామ్‌కే వాస్తేగా తెలంగాణ యూనివర్సిటీని ఇచ్చిండ్రు. నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిండ్రు. రాజశేఖర్‌డ్డి మాత్రం కడప యూనివర్సిటీని కంప్లీట్ చేయించిండు. ఇదేమో అయ్యకుపట్టది. అవ్వకు పట్టది. యూనివర్సిటీకి అవసరమైన నిధులు ఇప్పించే బాధ్యత నాది. తెలంగాణ మొత్తంమీద రెండుమూడు జిల్లాల్లోనే కాగిత లంబాడీలు ఉన్నరు. అంతకుముందు ఎస్టీల్ల ఉండిరి. ఆల్లను బీసీల పెట్టిండ్రు. వారికి నష్టం చేసిపెట్టిండ్రు. తెలంగాణలో కాగిత లంబాడలకు అన్యాయం జరగనీయం. కేంద్రంతో మాట్లాడి ఎస్టీల్లో చేర్పిస్తా.

ఎంప్లాయీ ఫ్రెండ్లీ సర్కార్… టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెదులుతుంది. ఎంపీకి కోపమొస్తెనో.. ఎమ్మెల్యేకి కోపమొస్తెనో చీటికి మాటికి బదిలీలుండవు. మూడేళ్లకోసారే ఉంటయ్. గత ప్రభుత్వాలు ఉద్యోగుల విషయంలో తప్పుడు విధానాలు అమలుచేసిండ్రు. వాళ్లు ప్రజల్లో భాగమే. ఉద్యోగులు గట్టిగా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతది. తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇప్పిస్తా. కేంద్ర ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచిపిస్తా. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకుండా చూస్తా. వారిని రెగ్యులరైజ్ చేసే బాధ్యత నేనే తీసుకుంటున్న. అంగన్‌వాడీ వర్కర్లు, ఆశ, ఐకేపీ కార్యకర్తలకు జీతాలు సరిపోవడంలేదు. మన సర్కార్ వచ్చాక కమిటీవేసి అధ్యయనం చేయిస్తా. వారిచేత పల్లెల్లో పచ్చదనం పెంచిపిస్తా. చిన్నపిల్లలకు చదువుచెప్పిస్తా. సివిల్‌సప్లై పనుల్లో భాగస్వాములను చేస్తా. వారి సేవలను సమర్థవంతంగా వినియోగించడానికి డ్యూటీ చార్ట్ తయారు చేయిస్తా. తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా తయారు కావాలే. అందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వమే రావాలే.

మతతత్వ శక్తులకు తావులేదు.. తెలంగాణలో మతతత్వ శక్తులకు తావులేదు. మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ గడ్డ. ఈ విషయాన్ని 1926లోనే మహాత్మాగాంధీ హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కాలేజీలో స్పష్టం చేశారు. గంగ, జమున తహజీబ్ అని చెప్పారు. ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గడ్డ తెలంగాణ. అలాంటి తెలంగాణలో టీఆర్‌ఎస్ వందకు వంద శాతం సెక్యులర్ పార్టీగానే ఉంటది. తెలంగాణ ముమ్మాటికీ సెక్యులర్‌గానే ఉండాలే. ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇప్పిస్తా. నాలుగు శాతం రిజర్వేషన్లకే కోర్టులో చిక్కులు ఎదురైతాయని అంటున్నరు. ఇరాదే పక్కా హై.. ఇమాన్‌దార్ హై. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి తొమ్మిదవ షెడ్యుల్‌లో చేర్పించి ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నరు. ఇక్కడెందుకు అమలుకాదు? తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు ఇప్పించే బాధ్యత నాదే. ఎస్టీలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 12% రిజర్వేషన్లు పక్కాగా ఇప్పిస్తాం. గిరిజన తండాలు, గోండు, చెంచు, కోయగూడాలను ప్రత్యేక పంచాయతీలుగా మార్పిస్తా. తెలంగాణలో బీడీ కార్మికులు, చేనేత కార్మికుల సమస్యలపై అవగాహన ఉంది. ఆ మేరకు పరిష్కారం చేస్తా. లేబర్ శాఖతో కొట్లాడి బీడీకార్మికుల సమస్యలను పరిష్కారం చేయిస్తా. ఈ ఎన్నికల్లో పోచంపల్లి చేనేత కార్మికుల కోసం నిజామాబాద్‌లో బిక్షాటన చేసినం.

ఆగమాగం కావద్దు… ఎన్నికలొచ్చినయ్. ఆగమాగంకావద్దు. గడబిడి అయితే మంచిదికాదు. విచారించి ఓటువేయండి. గాడిదకి గడ్డేసి ఆవుకు పిండితే పాలురావు. ముళ్లచెట్లకు నీళ్లుపోసి పండ్లు రమ్మంటే రావు. ఎంపీ సీట్లుకూడా టీఆర్‌ఎస్‌కే రావాలి. వానికేసి వీనికేసి గడ్డం పట్టుడెందుకు? గా పని గీ పని చేయమని ఇతరపార్టీల ఎంపీలను అడిగితే పనైతదా? గతంలో 35మంది ఎంపీలు గెలిసిండ్రు. మొన్నటిఎన్నికల్లో 33 మంది ఎంపీలుండ్రు. ఒక్కటన్నా మంచిపని తెచ్చిండ్రా? ఆ ఎంపీలే ఇప్పుడేం చేస్తరు? ఏం తెస్తరు? టీఆర్‌ఎస్ ఎంపీలే గెలిస్తే ఢిల్లీ మెడలు వంచుతరు. ప్రాజెక్టులన్నీ బాగా జరుగుతయ్. కౌలాస్, లుండి కాలువలు పూర్తయితయ్. ఆ ప్రాజెక్టుల కాడ నేనే కుర్చేసుకొని కూర్చుంట. పనిచేయిస్తా.

ముగ్గురు నేతలకు ఎమ్మెల్సీ పదవులు… నిజామాబాద్ రూరల్‌లో పదేళ్లపాటు అద్భుతంగా పనిచేసిన నా తమ్ముడు డాక్టర్ భూపతిడ్డికి ఈసారి టికెట్ ఇవ్వలేకపోయిన. ఆయనను కాపాడుకుంటా. కడుపులో పెట్టుకుంటా. ఎమ్మెల్సీ పదవి ఇస్తా. నిజామాబాద్ అర్బన్‌లోనూ టికెట్ ఇవ్వలేకపోయిన. బస్వా లక్ష్మినర్సయ్యకు కూడా ఎమ్మె ల్సీ పదవి ఇస్తా. టీఆర్‌ఎస్ గవర్నమెంట్ కోసం కాంగ్రెస్‌ను కాదని పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్‌ను ఎమ్మె ల్సీ చేస్తా. తెలంగాణలో 26-27 ఎమ్మెల్సీలు వస్తయ్. క్రమానుగుణంగా ఎమ్మెల్సీ అవకాశాలు ఇప్పిస్తా.

డీఎస్ ఈ జన్మలో సీఎం కాడు పాపం డీఎస్ సీఎం ఐతడని అనుకుంటుండు. అది ఈ జన్మ లో సాధ్యంకాదు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే దా సచ్చేదా! కాంగ్రెస్‌యే అధికారంలోకి రానప్పుడు డీఎస్ ముఖ్యమంత్రి ఎట్లయితడు చెప్పుండ్రి ! ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తదా? అంటూ కేసీఆర్ ప్రశ్నించడంతో సభికులు రాదు రాదు.. అంటూ ప్రతిస్పందించారు).

మేం ఉద్యమకారులం:కల్వకుంట్ల కవిత గులాబీ కండువా కప్పుకున్న వారంతా ఉద్యమకారులమేనని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ సాధన కోసం జైళ్లకు వెళ్లామని, ఆందోళనలు చేశామని చెప్పారు. తెలంగాణలో పునర్నిర్మాణంకోసం అధికారంలోకి వచ్చే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉందని అన్నారు. బీజేపీ, టీడీపీలకు ఓటువేస్తే ఆంధ్ర నేతలు వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడుల ఆంధ్ర ఆధిపత్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే అని చెప్పారు. 60 ఏళ్లుగా ఆంధ్రపాలకులకు అధికారం అప్పగించామని, అయినా తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. హైటెక్ సిటీతో గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు మూయించారని ప్రశ్నించారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ అభ్యర్థి బిగాల గణేష్‌గుప్త మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని కోరారు. ఆర్మూర్ అభ్యర్థి జీవన్‌డ్డి మాట్లాడుతూ స్పీకర్‌గా పనిచేసిన కాలంలోనే సురేష్ రెడ్డి ఆర్మూర్ ప్రాంత అభివృద్ధి కోసం చేసిందేమీలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రయోజనాల పరిరక్షణ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యమని జుక్కల్ అభ్యర్థి హన్మంత్‌షిండే అన్నారు. ఈ సభలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌డ్డి, జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి పాటిల్, అసెంబ్లీ అభ్యర్థులు బాజిడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌డ్డి, గంప గోవర్ధన్, ప్రశాంత్‌రెడ్డి , షకీల్‌తోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగాడ్డి, జిల్లా ఇన్‌చార్జి కరిమెల బాబూరావు, ముఖ్య నేతలు ఏఎస్ పోశె ట్టి, డాక్టర్ భూపతి రెడ్డి , బస్వా లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌లో ప్రాజెక్ట్ లెక్కడ? నిజామాబాద్ జిల్లాలో లెండి కాలువలు ఎందుకు పెండింగ్‌లో ఉన్నయ్? మంత్రులు, ఎంపీలు, సామంతులు ఇక్కడున్నరు కదా. ఇరిగేషన్ మంత్రి లేకుండిరా? ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ ముందుకు సాగదేమి? కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పెండింగ్‌లో ఎందుకుంటయ్? ఈ ప్రాజెక్టులను ముట్టేవాడు లేడు.. పట్టేవాడు లేడు. హైదరాబాద్-నిజామాబాద్ మధ్య బ్రాడ్‌గేజ్ సింగిల్ లైనే ఉంది. డబుల్ లైన్ కావాలంటే టీఆర్‌ఎస్ ఎంపీలుం సాధ్యమైతది. టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలుంటే సరిపోదు. తెలంగాణలో 17కు 17ఎంపీ సీట్లు గెలవాలే. అప్పుడే ముక్కుపిండి ప్రాజెక్టులు తెచ్చుకోగలుగుతం. కవిత, పాటిల్ గెలిచి ఢిల్లీకి పోవాలే. టీఆర్‌ఎస్ గవర్నమెంట్ తప్పక వస్తది. ప్రాజెక్టులకు క్లియరెన్స్ కావాలన్నా, ఢిల్లీని ఒప్పించి మెప్పించి వాటిని సాధించాలన్నా అంతటా టీఆర్‌ఎస్ ఎంపీలనే గెలిపించి బలమివ్వండి.

మానవత్వంతో పింఛన్లు మానవత్వంతో ఇచ్చేవి పింఛన్లంటరు. టీడీపీ ప్రభుత్వంలో 70 రూపాయలు ఇచ్చిండ్రు. కేంద్రం ఇచ్చే 200 రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసిందంతే. దీంతో పూట అన్నం కూడా రాదు. మన ప్రభుత్వంలో అట్లుండది. వితంతులు, వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 15వందలు ఇప్పించే బాధ్యత నాదే. పేదలకు మూడులక్షలతో ఇండ్లు కట్టిస్తా. కిచెన్, ఒక హాలు, పక్కాగా పడకగది ఉండే విధంగా కట్టిస్తా. జూన్ 2 తర్వాత వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు పన్నులు కట్టొద్దు. వాటిని నేనే మాఫీ చేయిస్తా. లక్షన్నరలోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయిస్తా. ఒకప్పుడు వ్యవసాయపరంగా ధనవంతమైన జిల్లాగా నిజామాబాద్ ఉండే. అంకాపూర్‌లాంటి గ్రామాలు భారతదేశంలోనే వెలుగులను వెదజల్లినయ్. ఆంధ్ర పాలనలో దెబ్బతిన్నయ్. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే మళ్లీ పూర్వవైభవం సాదిద్దాం. 2001లోనే నిజామాబాద్ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను ఎగురవేసిండ్రు. అదేస్ఫూర్తితో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను గెలిపిస్తరని సర్వేలు చెబుతున్నయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.