Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఇందిరమ్మ రాజ్యం అంటే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం

ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ. అందరినీ పట్టుకపోయి జైళ్ల వేసుడు.. ప్రభుత్వాలు కూలగొట్టుడు.. గదేనా ఇందిరమ్మ రాజ్యమంటే. ఉన్నోడు ఉండి ఉండె. లేనోడు లేకనే ఉండె. మళ్లా ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట్లాడుతరు. ఎవలను గోల్‌ చేయడానికి? -సీఎం కేసీఆర్‌

ధరణిని తీసేసి భూమాతను తీసుకొస్తామని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారని.. అసలు అది భూమాతనా? లేక భూ’మేత’నా అని సీఎం కేసీఆర్‌ చురకలంటించారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే ధరణి పోతదని, మళ్లీ పాత రాత పుస్తకాలు ప్రత్యక్షమవుతాయని అన్నదాతలను హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అని మాట్లాడేందుకు కాంగ్రెస్‌ నేతలకు సిగ్గుండాలని నిప్పులు చెరిగారు. ‘ఇందిరమ్మ రాజ్యం అంటే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, కరువు కాటకాలు, ఉపాసాలు తప్ప ఇందిరమ్మ రాజ్యంలో ఏముంది?’ అని నిలదీశారు. మళ్లా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని, ఉన్నది నాశనం చేయడానికే వస్తున్నారని మండిపడ్డారు. సోమవారం మానకొండూర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్లగొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని, ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధితోపాటు రాబోయే రోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ఇవి ఎన్నికలు కావు.. తెలంగాణ బతుకు పోరాటమని, అనాలోచితంగా ఉంటే ఓటే కాటేస్తదని, దళారులు, పైరవీకారుల రాజ్యమే వస్తుందని హెచ్చరించారు.

ఇందిరమ్మ రాజ్యమంటే ఆత్మహత్యలే!
కాంగ్రెస్‌ పార్టీ 50 ఏండ్లు పరిపాలించి ఏం చేసిందనేది ప్రజలందరికీ తెలుసునని కేసీఆర్‌ పేర్కొన్నారు. వారి పాలనలో పత్తికాయలు పగిలినట్టు రైతులు గుండెలు పగిలి చచ్చిపోయారని, అప్పులపాలయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పుడు సిగ్గులేకుండా కాంగ్రెస్‌ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని, ఆ రాజ్యంలో ఏం జరిగిందో మనకు తెలియదా? అని ప్రశ్నించారు. ‘ఇందిరమ్మ రాజ్యం పొడుగూతా అన్నమే లేకుండె. తిన్నోడు తిన్నడు, ఎండినోడు ఎండిండు. ఇందిరమ్మ రాజ్యమే బాగుంటే ఎన్టీరామారావు ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది? రూ.2కు కిలో బియ్యం ఎందుకు పెట్టాల్సి వచ్చింది?’ అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యమే సక్కగ ఉంటే మనోళ్లు ఎందుకు బొంబాయి, హైదరాబాద్‌కు ఎక్కడెక్కడికో వలస పోయి కూలినాలి చేసుకుని బతకాల్సి వచ్చిందని నిప్పులు చెరిగారు. ‘తెలంగాణలో రోడ్లు కూడా సక్కగలేవు.. ఎవుసమే చేయరాదు.. జొన్నలు పండించుకోవాలి.. వడ్లు పండయని మాట్లాడిన్రు. మరి ఇవాళ 3 కోట్ల టన్నుల వడ్లు ఎక్కడి నుంచి వచ్చినయ్‌. ఎవరు పండిస్తున్నారు? కాంగ్రెసోడి అయ్య పండిస్తున్నాడా? అని సీఎం కేసీఆర్‌ నిలదీశారు.

ఉన్నది నాశనం చేసేందుకా మళ్లా వచ్చేది?
ప్రజలు వద్దు మొర్రో అంటున్నా వినకుండా జబర్దస్తీగా తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రల కలిపిందే కాంగ్రెస్‌ పార్టీ అని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. ‘ఎంత గోసపడ్డాం. మళ్లా 58 ఏండ్లు పట్టింది బయటపడటానికి. అక్కడితో ఆగిందా.. 1969లో ఉద్యమిస్తే కాంగ్రెసోళ్లు మన బిడ్డలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపిండ్రు. గులాబీ జెండా ఎత్తిన తర్వాత తెలంగాణ ఇస్తామని చెప్పి పొత్తుకు వచ్చిన్రు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మాట నిలుపుకోకుండా మళ్లా ధోకా చేసిన్రు. ఉద్యమాన్ని కూడా నీరు గార్చే కుట్రలు చేసిండ్రు. మళ్లా తెలంగాణ అంతా ధూంధాంలు పెట్టి, పక్షులు తిరిగినట్టు తిరిగి కొట్లాడితే, పార్టీల మద్దతు కూడగట్టి, ఆమరణ దీక్షకు దిగి మొండిగా నిలబడితే తప్పనిసరి పరిస్థితుల్లో దిగి వచ్చి తెలంగాణ ఇచ్చిన్రు’ అని కేసీఆర్‌ గుర్తుచేశారు. కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికీ అదేవిధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌ కరెంటు 24 గంటలు ఇచ్చి వృథా చేస్తున్నామని, 3 గంటలు ఇస్తే సరిపోతుందని అంటున్నాడని ఫైర్‌ అయ్యారు. ‘ఏ రైతు దగ్గరైనా 10 హెచ్‌పీ మోటర్‌ ఉంటుందా? నూట్లకు ఒకరి దగ్గర 7.5 హెచ్‌పీ మోటర్‌ ఉంటది. అంతకు మించి ఉండదు. ఒకవేళ ఉన్నా రాష్ట్రంలో 30 లక్షల పంపు సెట్లు ఉన్నయ్‌. మరి అవి ఎవరు కొనియ్యాలె. డబ్బులు ఎవరు ఇయ్యాలె. బాధ్యతారహితంగా మాట్లాడతరు. నోట్ల గల్లె మాటలు’ అని నిప్పులు చెరిగారు. కొలుపు చెప్పి అదే చెప్తున్నారని, వాళ్లకు ఓటేస్తే అదే చేసి తీరుతారని ప్రజలను హెచ్చరించారు. కాంగ్రెస్‌ వస్తే మళ్ల మన బతుకు బజారేనని, ధర్నాలు, బాలకిషన్‌ పాటలు, బతుకే ఉద్యమమా? అని ప్రశ్నించారు. అందుకే ఇది రైతుల జీవన్మరణ సమస్య అని, ఓట్లంటే మాములు విషయం కాదని, తలరాత రాస్తుందని, ఐదేండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తదని చెప్పారు.

విజయవంతంగా తెలంగాణ ప్రగతి
తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రగతి ప్రయాణం విజయవంతంగా సాగుతున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. స్వరాష్ట్రంలో పింఛన్‌ పెంచి అసహాయులు, నిస్సహాయులకు ఆసరాగా నిలిచామని చెప్పారు. ట్రాఫిక్‌ పోలీసులకు కూడా దేశంలో ఎక్కడా లేనివిధంగా 30శాతం అలవెన్స్‌ అందిస్తున్నామని, హోంగార్డులకు అత్యధిక వేతనాలను చెల్లిస్తున్నామని తెలిపారు. సంక్షేమం తర్వాత వ్యవసాయరంగం స్థిరీకరణపై దృష్టి సారించామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశామని, నీటి తీరువాలను రద్దు చేశామని గుర్తుచేశారు. 24 గంటల కరెంటు ఇస్తున్నామని, రైతుబంధు ఇస్తున్నామని తెలిపారు. రూ.5 లక్షల బీమా ఇస్తున్నామని, రైతులు పండిస్తున్న ధాన్యం మొత్తాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నష్టం వస్తున్నా భరించి మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొంటున్నదని వివరించారు. ఫలితంగానే భూముల రక్షణకు ధరణి తీసుకొచ్చామని తెలిపారు.వడ్లే పండవని చెప్పిన చోట ఇవాళ 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయని కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

కడియం శ్రీహరి ఉత్తమమైన వ్యక్తి
బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరి గురించి ఎక్కువ చెప్పాల్సింది ఏమీ లేదని, ఎమ్మెల్యే రాజయ్యను కూడా చిన్నచూపు చూడబోమని, మంచి హోదాలో ఉంటారని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో శ్రీహరి చరిత్ర పెద్దదని, మంత్రిగా ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా అభివృద్ధికి ఎట్ల తండ్లాడాడో, ఎంత పనిచేసిండో? అందరికీ తెలిసిందేనని వివరించారు. శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిస్తే ఘనపురం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. డియం శ్రీహరి మంచి, ఉత్తమమమైన నాయకుడని, మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

కమ్యూనిస్టులు బీఆర్‌ఎస్‌కే ఓటెయ్యాలి..
నల్లగొండ జిల్లా వట్టికోట ఆళ్వార్‌స్వామి పుట్టిన జిల్లా అని, నల్లా రాఘవరెడ్డి ఉద్యమాలు చేసిన గడ్డ అని, బాగా చైతన్యవంతమైన ప్రాంతమని సీఎం కేసీఆర్‌ వివరించారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరిన విధంగా నీళ్ల ప్రాజెక్టులతోపాటు అయిటిపాముల ఎత్తిపోతల తదితర పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం కమ్యూనిస్టులు పోటీలో లేనందున మీ ఓట్లు ఎవరికో వేసి మోరీలో వేయవద్దని, ప్రగతికాముకమైన బీఆర్‌ఎస్‌కే వేయాలని విజ్ఞప్తిచేస్తున్నట్టు చెప్పారు. రోడ్లపై ఉన్న జనాలను చూశాక లింగయ్య భారీ మెజార్టీతో గెలిచినట్టు నిర్ధారణ అవుతున్నదని, గెలుపును ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు.

ప్రజలమనిషి భూపాల్‌రెడ్డి గెలవాలె
నల్లగొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పానని, కరోనాతో ఏడాది ఆలస్యమైనా అభివృద్ధికి పూనుకున్నామని కేసీఆర్‌ వెల్లడించారు. భూపాల్‌రెడ్డి ప్రత్యేకంగా తనను, మున్సిపల్‌ శాఖ మినిస్టర్‌ను తీసుకొచ్చి ఒక్క నల్లగొండ పట్టణానికే రూ.1400 కోట్లు మంజూరు చేయించుకొని అభివృద్ధి చేస్తున్నారని గుర్తుచేశారు. ‘కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రగల్భాలు మీకు తెలుసు. వాళ్ల డబ్బు అహంకారంతోని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు. ఇంతకు ముందే నాకు నకిరేకల్‌లో చెప్తున్నారు. నకిరేకల్‌లో గెలిచిన తర్వాత రామన్నపేట నుంచి నకిరేకల్‌ దాకా అందర్నీ పండవెట్టి తొకుతం అని మాట్లాడుతున్నరు కోమటిరెడ్డి. ఈ పండవెట్టి తొకేటోళ్లే కావాల్నా ఎమ్మెల్యేలు? వీళ్లేనా మనకు కావాల్సింది. భూపాల్‌రెడ్డి ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉన్న వ్యక్తి’ అని పేర్కొన్నారు. ‘పొద్దున్నే లేస్తే మీ మధ్యలో తిరిగేటోళ్లు కావాల్నా? గెలిచిన తెల్లారే హైదరాబాద్‌లో పడేటోళ్లు కావాల్నా? ఆలోచించాలి. మళ్ల భూపాల్‌రెడ్డిని గెలిపియ్యండి’ అని సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

కాంగ్రెసోళ్లందరూ కట్టగట్టుకుని మాట్లాడుతున్నరు. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తరట. మరి ఏం తెస్తరట అంటే భూమాత పెడతరంట. మరి అది భూమాతనా? భూమేతనా? అర్థం కాదు. మళ్లా వీఆర్వోలను తీసుకొత్తం. పాస్‌బుక్కుల మళ్లా 34 కాలమ్స్‌ పెడుతం. కౌలుదార్ల కాలమ్‌ పెడుతం.. అంటే రైతులకు, కౌలుదార్లకు జుట్లు, జుట్లు ముడేసుడా? కచీర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుడా? నోరులేని అమాయకపు రైతుల భూములను కబ్జా పెట్టేందుకా?

-సీఎం కేసీఆర్‌

ఎవరుంటే మంచిది? ఆలోచించాలె. రైతుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నది. నీటితీరువాను రద్దు చేసినం. 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నం. రైతుబంధు ఇస్తున్నం. అదృష్టం బాగాలేక రైతు చనిపోతే బీమా ఇస్తున్నం. 7,500 కొనుగోలు కేంద్రాలుపెట్టి ప్రతి ధాన్యం గింజనూ కొంటున్నం. ఇవన్నీ మీ కండ్లముందే జరుగుతున్నయి. కానీ కాంగ్రెస్‌ పార్టీ 50 ఏండ్ల పాలనలో కనీసం మంచినీళ్లుకూడా ఇయ్యలే. అందుకే అధికారంలో ఎవరుంటే మంచిదో ప్రజలే ఆలోచించి ఓటెయ్యాలె.

-సీఎం కేసీఆర్‌

ఆనాడు ఎట్లుండే? ఏం గతి ఉండే అసలు.. ఆ మోటరు కాలితే సర్పంచ్‌ల గోస ఎట్టుండె. రోజుకు రెండు మోటర్లు కాలుతుండె. భయంకరమైన బాధలు పడ్డాం. కాంగ్రెసోళ్లకు కనీసం మంచినీళ్లు కూడా ఇయ్య చాత కాలేదా. ఆలోచన చేయాలె. మళ్లా ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నరు.

-సీఎం కేసీఆర్‌

ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎట్ల రావాలె? అసలు వస్తయా? వీఆర్వోలు, అగ్రికల్చర్‌ ఆఫీసర్ల దగ్గరకు పోతే లంచమియ్యి అంటరు. లేకుంటే సంతకంపెట్టరు. అంటే మళ్లా దళారుల రాజ్యం. వీఆర్వోల రాజ్యం వస్తది. మల్లయ్యభూమి ఎల్లయ్యకు చేసి, మల్లయ్యభూమి పుల్లయ్యకు చేస్తరు. పట్టా భూములపై రైతులకు ఇప్పుడు కల్పించిన అధికారాలను, పెత్తనాన్ని మళ్లా అధికారులకు కట్టబెడ్తరు. మరి ప్రభుత్వం ఇచ్చిన అధికారాన్ని ఉంచుకుంటారా? పోడగొట్టుకుంటారా?

-సీఎం కేసీఆర్‌

తెలంగాణకు బీజేపీ ధోకా
తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ సర్కారు అన్నింటా ధోకా చేసిందని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 150 మెడికల్‌కాలేజీలు పెడితే, తెలంగాణకు ఒక్కటి కూడా ఇయ్యలేదని ధ్వజమెత్తారు. జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టాలని చట్టంలో ఉన్నా ఒక్కటి కూడా ఇయ్యలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చట్టాన్ని కూడా ఉల్లంఘించారని అన్నారు. రైతుల బోర్లకు మీటర్లు పెట్టాలని కండిషన్‌ పెట్టారని.. అలా చేయనందుకు ఏటా రూ.5 వేల కోట్ల చొప్పున 25 వేల కోట్లు తెలంగాణను ముంచారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ బీజేపీ సిగ్గులేకుండా ఎట్లా ఓట్లు అడుగుతున్నదని ప్రశ్నించారు. ‘బీజేపీకి ఒక్క ఓటైనా ఎందుకు వేయాలి? బీజేపీకి ఓటేస్త్తే మోర్లె వేసినట్టే. మనల కాననోనికి ఎందుకు ఓటేయాలె?’ అని ప్రశ్నించారు.

ఇల్లంతకుంట చుట్టూ నీళ్లే
‘ఇల్లంతకుంటలో నా క్లాస్‌మెట్లు, సిద్దిపేటల చదివిన మిత్రులు ఎందరో ఉన్నారు. ఎన్నోసార్లు ఇల్లంతకుంటలో పెండ్లిళ్లకు వచ్చిన. ఎటుచూసినా దుబ్బలే ఉండె. బతుకే లేకుండె. దేవుని దయతో పండితే వానకాలం. చివరకు గడ్డిలేక పశువులను కూడా అమ్ముకునే ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇల్లంతకుంట వద్ద అన్నపూర్ణ రిజర్వాయర్‌ వచ్చింది. 35 వేల ఎకరాలు పారుతున్నది. ఇప్పుడు ఇల్లంతకుంట చుట్టూ నీళ్లే కనిపిస్తున్నయ్‌’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎన్నో సమస్యలు పరిష్కరించానని, మరికొన్ని ఉన్నాయని అన్నారు. ‘అన్నపూర్ణ, రంగనాయక్‌సాగర్‌, మిడ్‌మానేరు, తోటపల్లి రిజర్వాయర్ల పనులు మన కండ్ల ముందే జరిగినయ్‌. బెజ్జంకి మండలంలో ఎంతటి కరువుండె. ఎంత దెబ్బతిన్నం. ఎంత అవస్థ ఉండె. రేపు ఇంకా నీళ్లు రావాలె. ఇంకా జరగాలె. అవన్నీ కూడా చేసుకుందాం’ అని భరోసా ఇచ్చారు. బాలకిషన్‌ ఎమ్మెల్యే అయినంక, కాకముందు మానకొండూరు, ఇల్లంతకుంట, బెజ్జంకి ఎట్ల ఉండే? ఇయ్యాల ఎట్ల ఉన్నయ్‌, మళ్లా ముందుకు తీసుకుపోదామా? వెనకకుపోదామా? అనేది ఆలోచించాలని ప్రజలను కోరారు. బాలకిషన్‌కు ఓటేస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి కొనసాగుతుందని హామీ ఇచ్చారు. 70-80వేల మెజార్టీతో మరోసారి గెలిపిస్తే మానకొండూర్‌ నియోజకవర్గం మొత్తం దళిత కుటుంబాలకు దళితబంధు ఇచ్చే బాధ్యత తనదేనని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. చెప్పుడు మాటలు వినకుండా.. అభివృద్ధి జరుగుతున్నది నిజమా? అబద్ధమా? అని ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.