Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఇక స్వామి దర్శనమే!

-సూత్రప్రాయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్
‌ -భక్తులు వైకుంఠంలో ఉన్న అనుభూతి పొందాలి
-ఆలయాలకు ఆదర్శంగా యాదాద్రి దివ్యక్షేత్రం
-అందరికీ కనిపించేలా మూ విరాట్‌ అభిషేకం
-ప్రహరీపై ప్రాచీన చిత్రకళ
-రోడ్డు విస్తరణ బాధితులకు అత్యాధునిక షాపులు
-పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
‌ -కొండపై ఆరుగంటల పాటు సుదీర్ఘంగా సాగిన పర్యటన

భక్తులకు వైకుంఠంలో సంచరిస్తున్న అనుభూతి కలిగేలా యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆలయాన్ని దూరం నుంచి దర్శించిన భక్తులకు భక్తిభావన ఉట్టిపడేలా దీపాలంకరణ ఉండాలని చెప్పారు. దేవాలయ ముందు భాగం కనుచూపు మేర నుంచి చూసినా అత్యద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఆలయ పునర్నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చిందని.. మిగిలిన కొద్దిపాటి పనులు కూడా చేసుకుంటే మే నెలలో ప్రధానాలయాన్ని పునఃప్రారంభించుకొనే అవకాశమున్నదని పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన ఆలయ పునర్నిర్మాణ పనులతోపాటు, మిగిలిపోయిన పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం యాదాద్రిలో పర్యటించారు. మధ్యాహ్నం 12.08 గంటలకు టెంపుల్‌సిటీపైకి హెలికాప్టర్‌లో వచ్చిన సీఎం.. అక్కడనుంచి ప్రత్యేక కాన్వాయ్‌ద్వారా కొండపైన బాలాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆశీర్వచనం అందించారు. ప్రత్యేక పూజల తర్వాత పునర్నిర్మాణంలో ఉన్న ఆలయ పరిసరాల్లో కలియతిరిగిన కేసీఆర్‌ నిర్మాణాలను అణువణువునా పరిశీలించారు. ఏయే పనులు చేపట్టాల్సి ఉన్నది? ఎన్నిరోజుల్లో పూర్తవుతాయి? అనే దానిపై దృష్టి సారించారు.

వసతుల కల్పనపై దృష్టి సారించాలి..
దేశ, విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు యాదాద్రి క్షేత్ర దర్శనానికి రానుండటంతో వారికి అన్ని వసతులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ప్రధానాలయంలోని మాడ వీధులు, ప్రాకార మండపాలు, బ్రహ్మోత్సవ మండపం, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లు, దర్శన సముదాయాలు, పూర్తికావొచ్చిన శివాలయం, విష్ణు పుష్కరిణి, భక్తుల స్నానగుండ నిర్మాణం, మెట్లదారి నిర్మాణం తదితరాలను సీఎం కేసీఆర్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా నిర్మాణాలను మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు పలు సూచనలు చేశారు. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో యాదాద్రి దేశంలోనే ఆదర్శంగా ఉండాలని, ఇందుకోసం అవసరమైన ఉద్యోగులను నియమించుకోవాలని చెప్పారు. క్యూ కాంప్లెక్సుల్లో వేచి ఉండే భక్తులకు ఆహ్లాదాన్ని కల్గించేలా ఏర్పాట్లు చేయాలని, శ్లోకాలు, భక్తిగీతాలు శ్రావ్యంగా వినిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. మెట్లదారి నుంచి వచ్చే భక్తులు నేరుగా క్యూలైన్‌ కాంప్లెక్స్‌కు చేరేలా నిర్మాణాలు ఉండాలని ఆదేశించారు. గుండంలో స్నానంచేసే భక్తుల సౌకర్యార్థం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులు, ఆలయ సిబ్బంది నివసించేందుకు ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. శిల్పులకు కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కొండపైన హరిత హోటల్‌లో మధ్యాహ్న భోజనం అనంతరం సీఎం కేసీఆర్‌.. మరోసారి కొండపైకి వెళ్లారు. శివాలయం పనులను పరిశీలించారు. కొండ దిగువన గుట్ట చుట్టూ చేపట్టిన ప్రహ్లాదుడి నిర్మాణాలను, బస్టాండ్‌, ప్రెసిడెన్షియల్‌ కాటేజీలు, కల్యాణకట్ట, పుష్కరిణి, అన్నదాన సత్రం తదితర పనుల పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. యాదాద్రి ఆలయం చుట్టూ నిర్మాణమవుతున్న రింగ్‌రోడ్డు లోపలివైపు ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటి, పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

మెచ్చుకోలు.. మందలింపులు
ఆలయ పునర్నిర్మాణ పనుల్లో కొన్నింటిపై అసంతృప్తి వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్‌.. కొన్ని పనులు అత్యద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. యాదాద్రి గెస్ట్‌హౌస్‌ లిఫ్ట్‌ పనులు పూర్తి కాకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. బంగారు తాపడం చేసిన కలశాలు, విగ్రహాల ఏర్పాట్లపై నెలకొన్న జాప్యాన్ని అధికారుల దృష్టికి తీసుకురాగా.. నెలఖారులోగా పూర్తి చేస్తామని సీఎంకు సమాధానమిచ్చారు. ఇండోర్‌ నుంచి తెప్పించిన అధునాతన క్యూలైన్లను పరిశీలించి.. వాటిని విశాలంగా, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా అమర్చాలని సూచించారు. నిర్మాణం పూర్తికావచ్చిన ఈవో కార్యాలయం, స్వామివారి పల్లకీ గద్దె, అద్దాల మండపంను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. రెయిలింగ్‌ పనులను చూసి మెచ్చుకున్నారు. అద్దాల మండపాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైతే ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చైనా వెళ్లి అక్కడ ఏడు కిలోమీటర్ల దూరం లైట్లతో నిర్మించిన మాల్‌ను సందర్శించి రావాలని సూచించారు. శివాలయంలో రుత్విక్కుల కోసం నిర్మించిన మండపాన్ని చూసి అద్భుతంగా కట్టారని కితాబిచ్చారు. భక్తుల నుంచి కానుకలు స్వీకరించి రిటైర్డ్‌ పూజారులు, పేద బ్రహ్మణ పెద్దలు తమ భుక్తిని వెళ్లదీసుకునేలా యాదాద్రి లోపల ఒడిశాలోని పూరి జగన్నాథ్‌ ఆలయంలో మాదిరిగా మండపం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే పూరి ఆలయాన్ని సందర్శించాలని ఆదేశించారు.

ఆనవాయితీని కొనసాగించాలి
గర్భగుడిలో పూజల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తాపడం చేసిన దేవతామూర్తుల ప్రతిమలను పరిశీలించారు. ఆండాళ్‌ ఆళ్వార్‌ అమ్మవారి గుడిని, పరకామణిని పరిశీలించారు. మూలవిరాట్‌ దర్శనం తర్వాతే క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని, మున్ముందు కూడా దీనినే కొనసాగించాలని ఆలయ అర్చకులకు సూచించారు. కళాఖండాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దే క్రమంలో హడావుడి వద్దని అన్నారు. తిరుపతిలో మాదిరిగా యాదాద్రిలో స్వామివారికి సేవలందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మూలవిరాట్‌కు అభిషేకం చేసే సందర్భంలో నిర్వహించే పూజా కార్యక్రమాలు భక్తులకు స్పష్టంగా కన్పించేలా ప్రధానద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని సూచించారు. కనుచూపుమేర నుంచైనా అత్యద్భుతంగా వీక్షించేలా ఆలయ ముఖభాగాన్ని తీర్చిదిద్దాలని అన్నారు. భక్తులు వైకుంఠంలో సంచరించిన అనుభూతి కలిగేలా ప్రాచీన, నవ్యతలను జోడించి తుదిమెరుగులు దిద్దాలని పేర్కొన్నారు. ప్రాచీన చిత్రకళ ఉట్టిపడేలా అలంకృత రూపంలో ఆలయం చుట్టూ ప్రహరీకి మరింత శోభను తీసుకురావాలని చెప్పారు. శిల్పసంపదపై అధ్యయనం కోసం దేశంలోని వివిధ ఆలయాలను సందర్శించి రావాలని అధికారులకు సూచించారు. ప్రహ్లాద చరిత్ర, నారసింహుడి చరిత్రను తెలియపరిచే శిల్పాలతో ఆలయప్రాంగణం మొత్తం అలంకరించాలన్నారు. క్యూలైన్లను భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా విశాలంగా నిర్మించడంతోపాటు, ప్రహరీని అనుకొని ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు.

నిర్వాసితులకు అత్యాధునిక దుకాణాలు
ఆలయానికి వచ్చేదారిలో చేపట్టనున్న రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోతున్నవారిని అన్నివిధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. దాదాపు గంటపాటు బాధితులతో మాట్లాడిన సీఎం.. కోల్పోతున్న దుకాణాలకంటే గొప్పగా షోరూంల తరహాలో అన్ని వసతులతో విశాలంగా కట్టిస్తామని చెప్పారు. 200 గజాలలో ఉచిత ఇంటి స్థలాలను కూడా కేటాయిస్తామని తెలిపారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కొండపైన పాత పద్ధతిలోనే దుకాణాలు కేటాయిస్తామని ప్రకటించారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లుచేశారు. రాచకొండ జాయింట్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ సంతోష్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఈవో గీత, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి, స్థపతి వేలు, వాస్తు సలహదారు సుద్దాల సుధాకర్‌ తేజ తదితరులు ఉన్నారు.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
యాదాద్రి భువనగిరి ప్రతినిధి, మార్చి 04 (నమస్తే తెలంగాణ): రోడ్డు విస్తరణలో భాగంగా కోల్పోతున్న దుకాణాల స్థానంలో షోరూంల తరహాలో కొత్తవి కట్టిస్తామంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ఇవ్వడంపై వాటి యాజమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఉచితంగా 200 గజాల ఇంటిస్థలం కూడా కేటాయిస్తామని ప్రకటించడంతో సంబురాలు చేసుకుంటున్నారు. తమతో గంటసేపు సుదీర్ఘంగా చర్చించిన సీఎం.. ఊహించని రీతిలో వరాల జల్లులు కురిపించారని చెప్తున్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి చొరువతో న్యాయం జరిగిందని, రోడ్డు విస్తరణకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.