-అత్యాధునిక టెక్నాలజీతో మొదటిదశలో 500 గోదాముల నిర్మాణం -మార్కెటింగ్‌శాఖతో ఉపాధిహామీ అనుసంధానం -ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు టాస్క్ -ఐటీ అండ్ పీఆర్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గిడ్డంగులను నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఇందుకోసం మార్కెటింగ్ శాఖతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని చెప్పారు. గురువారం సచివాలయంలో గోదాముల నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టీ హరీశ్‌రావుతోపాటు మంత్రి కేటీఆర్ ఆర్థిక, మార్కెటింగ్, గ్రామీణ అభివద్ధి శాఖ ముఖ్యకార్యదర్శులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ధాన్యం నిల్వ, విక్రయానికి అవసరమైన మార్కెటింగ్ వసతులు లేకపోవడంవల్ల రైతులు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారని, అందువల్ల నూతన గిడ్డంగుల నిర్మాణం చేపట్టాలని ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం మంత్రివర్గ ఉపసంఘం సమావేశ వివరాలను మంత్రి కేటీఆర్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం విక్రయాలకు మార్కెట్‌లో సరైన వసతులు లేకపోవడంతో మార్కెట్ యార్డుల్లోకి వచ్చిన ధాన్యం సైతం తడిసిముద్ద అవుతోందని కేటీఆర్ తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ఆరపెట్టడానికి అవసరమైన కళ్లాలు లేకపోవడంతో రైతులు రోడ్లపై ఆరబెట్టిన సందర్భంలో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారని, అలాగే మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయని, ఈ క్రమంలో ఈ సమస్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని ఆయన వివరించారు.
ఇందులోభాగంగా అన్ని హంగులతో కొత్త గిడ్డంగులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేటీఆర్ తెలిపారు. ఇందులోభాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ మార్కెటింగ్ శాఖతో అనుసంధానం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అవసరమైతే ముఖ్యమంత్రి ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడుతారని కేటీఆర్ తెలిపారు. గోదాముల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, దీనిపై ఇతర రాష్ర్టాల్లో అధ్యయనం చేయాలని అధికారులకు సూచించినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుత అవసరాల దష్ట్యా రాష్ట్రంలో 20 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులు అవసరమని గుర్తించినట్లు చెప్పారు. దశల వారీగా గిడ్డంగుల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించామని, మొదటిదశలో రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల 500 గోదాములను అన్ని జిల్లాల్లో నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. దీనిపై ఈనెల 30న మరోసారి ఉన్నతాధికారులతో మంత్రులు సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గోదాముల నిర్మాణానికి జిల్లాల్లో అనువైన స్థలం గుర్తించి ఆలోపు ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఒక్కో గిడ్డంగి నిర్మాణానికి రూ.4లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
నేడు 150 ఐటీ కంపెనీలతో సమావేశం.. ఇంజినీరింగ్ విద్యార్థులు ఐటీ రంగంలో రాణించడానికి అవసరమైన వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమి ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టీఏఎస్‌కే-టాస్క్)ను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి కే తారకరామావు వెల్లడించారు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కంపెనీలకు అవసరమయ్యేవిధంగా నైపుణ్యం పెంపొందించేలా శిక్షణ అందిస్తామని, ఇందుకోసం కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పద్ధతిలో సాఫ్ట్‌వేర్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నదని కేటీఆర్ తెలిపారు.
ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 7గంటలకు నగరంలోని తాజ్‌కృష్ణా హోటల్‌లో హైదరాబాద్‌లోని 150 ప్రముఖ ఐటీ కంపెనీల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐటీ పరిశ్రమను మరింత విస్తరించేందుకు, పెట్టుబడులు ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు. ఐటీ రంగం అభివృద్ధి కోసం త్వరలో అమెరికాలోని తెలుగు అసోసియేషన్‌తో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం జూలై మొదటి వారంలో తాను అమెరికా వెళ్లనున్నట్లు తెలిపారు. ఐటీ రంగం అభివృద్ధికి పెద్దఎత్తున రాష్ర్టానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. కొత్తగా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు సెట్‌అప్ పద్ధతిలో అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.