-దళిత బంధుపై అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన హుజూరాబాద్ దళితులు
-పథకాలు పప్పు బెల్లాల్లా పంచిపెట్టుడు కాదు
-ఆర్థిక ఎదుగుదల.. ఆత్మగౌరవమే లక్ష్యం
-దళితబంధుతో ఏ వ్యాపారమైనా పెట్టొచ్చు
-లబ్ధిదారులు పదివేలు జమ చేయాలె
-ప్రభుత్వం మరో పది వేలు ఇస్తది
-ఆ మొత్తంతో రక్షణ నిధి ఏర్పాటు
-దళితవాడల్లో సమగ్ర మౌలిక వసతులు
-దళితుల భూ సమస్యలన్నీ పరిష్కారం
-వ్యాపార లైసెన్సుల్లోనూ వారికి కోటా
-దళితులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయిస్తాం
-ఏ వ్యాధి ఉన్నా ఉచితంగా చికిత్స
-హుజూరాబాద్‌లోనే పైలట్ ప్రాజెక్టు
-దళిత బీమాకు ప్రభుత్వం సానుకూలం
-చిప్ కార్డులతో లబ్ధిదారుల ట్రాకింగ్

మనం పెట్టుకున్న కథేందంటే.. పైకి వద్దామా? వద్దా? మన రాష్ట్రంలో కూడా చేసి చూపిద్దామా? వద్దా? ఎప్పటికైనా గిట్లనే ఉందామా? కాదు.. గిట్ల చేసుకోవాలని ఓ మోడల్‌గా చూపిద్దామా? మీకు మళ్లొక్కసారి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా! మీరు పాల్గొంటున్నది ఉద్యమం. మీరు ఏమన్న ఎటమటం చేసిండ్రంటే మొత్తం కొంప ముంచుకుంటది సుమా! ఎత్తుకున్నమంటే ఎనక్కి చూడొద్దు. సిపాయిలా ఎత్తుకున్నమంటే అది ఏమన్నగానీ.. కొనముట్టేదాక పోవాలే. చాలా మొండిగా..దృఢమైన సంకల్పంతోని.. ధైర్యంగా ముందుకు పోవాలె.
ఏం చేయాల్నో నిర్ణయం మీదే
ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల్లో పది పైసలు కూడా వేస్ట్ కావొద్దు. అట్లా కావొద్దంటే ఇంతకుముందటి లెక్క కొద్దిగా భిన్నంగా జరుగాలె. పైసలు ఇచ్చి అవతల పడుడు కావొద్దు. ఆ డబ్బుతో కుటుంబం మొత్తం బాగుపడాలె. ఇటు ప్రభుత్వ అధికారులు కరెక్ట్‌గా పనిచేయాలె. అటు బస్తీలల్ల ప్రజలు కాపలాదారుల లెక్క ఉండాలె. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించుడే తప్ప ఫెయిల్ కావొద్దని చూస్తున్నం. హైదరాబాద్‌ల మార్వాడీవోళ్లకు రూ.10 లక్షలు ఇస్తే రెండేండ్లలో రూ.30 లక్షలు చేస్తరు. ఎందుకంటే.. ఇది చెయ్యి అని వాళ్లకు చెప్పే అక్కర లేదు. వాళ్ల దగ్గర ఆ విద్య ఉన్నది. మరి మనోళ్లకు ‘ఆ రూ.10 లక్షలు తీసుకొని ఏం చేయాలె?’ అనేది పెద్ద బలహీనతగా ఉన్నది. దాన్ని మనం అధిగమించాలె. నువ్వు ఏం చేయాల్నో నువ్వే నిర్ణయించుకోవాలె. ఒకాయిన బట్టల దుకాణంల పనిచేస్తున్నడు. మంచి అనుభవం ఉన్నది. బట్టల దుకాణం పెడితే బాగైతం అనుకుంటే పెట్టుకోవాలె. నేను మద్దతిస్తా.. మీరు జయించాలె.
–సీఎం కేసీఆర్
దళితుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సంకల్పించిన దళిత బంధు మహాయజ్ఞానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నాందీవాక్యం పలికారు. పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయ నిశ్చయించిన హుజూరాబాద్ నియోజకవర్గ దళిత ప్రతినిధులతో సోమవారం స్వయంగా సమావేశమై తెలంగాణ దిశదశను మార్చే మహత్తరమైన పథకం కార్యాచరణపై చర్చించారు. పథకం అమలు తీరుతెన్నులపై అధికారులకు, లబ్ధిదారులకు దిశానిర్దేశంచేశారు. అణగారిన వర్గాల ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా ప్రగతిబాట పట్టించేందుకు దృఢ సంకల్పంతో.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
దళిత బంధు ఉద్యమాన్ని విజయవంతం చేస్తే తెలంగాణ ఆదాయం కూడా పెరుగుతుంది. తెలంగాణలో దళిత సమాజం భాగం. ఇన్నాళ్లు ఆ జనాభాకు అవకాశం లేదు. పని చేయగలిగి, స్కిల్, శక్తి ఉండి కూడా చాన్స్ లేదు. అవకాశమొస్తే సిపాయిలుగా తయారవుతారు. రేపు నేను చేయబోయే కార్యక్రమంలో తెలంగాణ దళిత సమాజంలోని అనేక నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలు బయటికి వస్తాయి. అవి ఈ రాష్ట్ర ఎదుగుదలకు, తద్వారా దేశాభివృద్ధికి దోహదపడుతాయి.
చదువుకున్న మాకు ఎంతో ఉపయోగం
నేను పీజీ చదువుకున్న. నాలాంటి యువతకు ఉపాధి కోసం దళితబంధు పథకం ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు స్వయంగా ఇంత సమయం ఇచ్చి మాట్లాడడాన్ని నేను ఊహించలేదు. ఈ తరహా సమావేశాలకు గతంలో ఎన్నడూ వెళ్లలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మా దళిత యువతపైనే ఉన్నది.
–బీ అశ్విని, జమ్మికుంట
మా జీవితాలు బాగుపడ్తయ్
రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికినం. ఎంత కష్టపడ్డా పిల్లలను చదివించుకో వడం మాకు కష్టంగానే ఉన్నది. ఇలాంటి సమ యంలో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించారు. మా కష్టాలు తీరుతాయన్న నమ్మకం కలుగుతున్నది. కాయకష్టం చేసుకొని బతికే మా ఖాతాలో నెలాఖరులో వంద రూపాయలుంటె ఎక్కువ. అట్లాంటిది పది లక్షలు ఇస్తున్నారు. వాటితో మేం వ్యాపారాలు చేసుకుంటం. ఉపాధితో మా బతుకును మంచిగ మార్చుకుంటం.
–కోడపల్లి సుజాత, వంతడుపుల రజిత వీణవంక
తెలంగాణ దళితబంధు కేవలం ఒక కార్యక్రమం కాదని, ఒక ఉద్యమమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించబోయే విజయం మీద యావత్ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉన్నదన్నారు. అందరూ ఆ దిశగా దృఢ నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి, విజయాన్ని సాధించిపెట్టింది. ప్రతి విషయంలో ప్రతికూల శక్తులు ఎప్పుడూ ఉంటాయి. నమ్మిన ధర్మానికి కట్టుబడి మన ప్రయాణం కొనసాగించినప్పుడు తప్పక విజయం సాధ్యపడుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. అంబేద్కర్ కృషితో దేశమంతటా దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందని చెప్పారు. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో తెలంగాణ దళితబంధు అవగాహన సదస్సు నిర్వహించారు. హుజూరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో హాజరైనవారిని ఉద్దేశించి.. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఇది ఒక ఉద్యమం
ఈ దళితబంధు ఆషామాషీ ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇది ఒక ఉద్యమం. మురిపించడానికి పంచిపెట్టే పప్పు బెల్లం అస్సలు కాదు. ఎలా తెలంగాణ సాధించుకున్నమో అలా ఇదీ సాధించాలి. రాత్రి పగలు, అడుగడుగు నేను మీ వెంట ఉంటా. ఒక సీఎం, ఒక ప్రభుత్వం మద్దతు ఉన్నంక ఎట్ల కాదు? ఆ సంకల్పం గుండెనిండా ఉండాలి. అప్పటి మందం ఉంటే ముందటికి పోదు. ఆర్థికంగా ఎదుగుదలనే కాకుండా, ఆత్మగౌరవం పెంపొందించడం. అవకాశం వస్తే కదా తెలిసేది! అంటరానివారంటూ దూరం పెట్టారు. ప్రపంచం మొత్తానికి దుర్మార్గమైన ముచ్చట ఇది. అణిచివేతకు గురవుతున్నరో వారికి బాధ ఉంటది. కానీ విశాల హృదయంతో ఆలోచిస్తే దేశానికి మంచిది. దళిత బంధు ఉద్యమాన్ని విజయవంతం చేస్తే తెలంగాణ ఆదాయం కూడా పెరుగుతుంది. తెలంగాణలో దళిత సమాజం భాగం. ఇన్నాళ్లు ఆ జనాభాకు అవకాశం లేదు. పని చేయగలిగి, స్కిల్, శక్తి ఉండి కూడా చాన్స్ లేదు. అవకాశమొస్తే సిపాయిలుగా తయారవుతారు. రేపు నేను చేయబోయే కార్యక్రమంలో తెలంగాణ దళిత సమాజంలోని అనేక నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలు బయటికి వస్తాయి. అవి ఈ రాష్ట్ర ఎదుగుదలకు, తద్వారా దేశాభివృద్ధికి దోహదపడుతాయి. చిన్న చిన్న వాటిని సవరించుకుంటా పోదాం. అప్పుడప్పుడు కొన్ని ఎదురుదెబ్బలు తగులుతాయి. కుంగిపోవద్దు. లక్ష్యం చేరే దాకా పట్టుదల వదలొద్దు. చదువుకున్న వారి మీద ఎక్కువ బాధ్యత ఉన్నది. సముద్రమంత ఓపిక కావాలి. మంచి పద్ధతితోని, చాలా నైపుణ్యంతోని, చక్కగా మాట్లాడాలి. అదే విజయానికి గొప్ప పునాది. మీరు ఎంచుకున్నది చిన్నపని కాదు. ధైర్యం నూరి పోసి విజయం సాధిస్తమనే విశ్వాసం కలిగించాలి. పిరికితనాన్ని తీసివేయాలి. మేం విజయం సాధించగలం అన్న విశ్వాసాన్ని కలిగించాలి. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తరతరాలుగా, దోపిడీకి, అణిచివేతకు, వివక్షకు గురై బాధతోని హాహాకారం చేస్తున్న ఒక సమాజం కృషి వల్ల అమృతం రాబట్టాలి.
ఏడాది కిందే మొదలుపెట్టాల్సి ఉండె
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలుత రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి సారించినం. ఇప్పటివరకు దానిని ఒక క్రమ పద్ధతిలో పెట్టినం. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి వర్గానికీ న్యాయంచేసే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నం. ప్రాధాన్యక్రమంలో ఒక్కో అణగారిన వర్గానికి ఆర్థిక చేయూతనందిస్తూ అభివృద్ధిపథంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నం. అందులో భాగంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టాం. దీనిని ఏడాదిన్నర కిందటే ప్రారంభించాల్సి ఉండె. కరోనా వల్ల చేపట్టలేకపోయాం. కొవిడ్ వల్ల రాష్ట్రం లక్ష కోట్లు మునిగింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతున్నది. ఎక్కడో ఒక చోట తిరిగి మొదలు పెట్టాలి కదా! అందుకే ఇప్పుడు దళితబంధును ప్రవేశపెడుతున్నం. రాష్ట్రంలో గిరిజన సోదరులు సుమారు 9% వరకు ఉంటారు. వారిలో చాలామంది పేదలే. దళితులు 15% వరకు ఉంటారు. వారి సంఖ్య ఈ మధ్య కాలంలో 18 నుంచి 20% వరకు పెరిగిందని లెక్కలు చెప్తున్నాయి. అదెలా ఉన్నా 9% ఉన్న గిరిజన సోదరుల వద్ద పోడు భూములు కాకుండా మొత్తంగా 20 లక్షల ఎకరాలు పట్టాభూములున్నాయి. అదే 18 నుంచి 20 శాతమున్న దళితుల వద్ద 13.96 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉన్నది. ఇదీ దళితుల పేదరికానికి ఒక నిదర్శనం. అదీగాక గిరిజనులపై సమాజంలో ఎలాంటి వివక్ష లేదు. కానీ దళితులపై వివక్ష కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోదళితులను ఆర్థికంగా బలోపేతం చేసి, తద్వారా సామాజిక వివక్ష నుంచి విముక్తులను చేయడమే లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేశాం. విమర్శలకు దిగకుండా, ప్రతిఒక్కరూ ఈ పథకం విజయవంతానికి కృషిచేయాలి. ముఖ్యంగా లెఫ్ట్ పార్టీల నేతలదే ఈ బాధ్యత. ముందుకు పోతున్నకొద్దీ పథకంలో మరిన్ని మార్పులు చేపట్టే అవకాశమున్నది. పథకం పర్యవేక్షణకు సీఎస్ సోమేశ్‌కుమార్, దళిత సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
దేశానికే ఆదర్శంగా నిలుస్తం
పట్టుబట్టి సాధిస్తే ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఈ పథకం మన దగ్గర విజయవంతమైతే పక్క రాష్ట్రంలో ఉన్న దళితులు కూడా మాకూ ఇలా కావాలంటరు. ఉద్యమం వస్తది. మనంచేసే పని మన మందమే కాదు, మన ఇండ్ల మందమే కాదు, తెలంగాణ సమాజమంతా విస్తరిస్తది. ఎవరైతే అవకాశాలు లేక, ఆర్థికంగా శక్తి లేక, చెప్పే వారు లేక, నైపుణ్యం లేక బాధపడుతున్నారో వారందరికీ ఇది ఒక మంచి అవకాశం. అంతకన్న ఏమి ఉంటది? నేను ఒక్కడినే కాదు కదా, ఇంతమంది ఎమ్మెల్యేలున్నరు, మంత్రులున్నరు, ఇంకా ఎంతోమంది ఉన్నరు. ఇంతమంది అనుకున్నంక విజయవంతం కాదా! ఇంత పెద్ద పనికి నడుం కట్టి మీరు ముందుకొచ్చారు. ఇంతకన్న మెరుగైన ఆలోచనలు తీసుకరావాలి. గొప్ప సలహాలను తీసుకోవాలి. గొప్ప విజయం సాధించి తెలంగాణ దళిత జాతికి వెలుగు దివ్వెలు కావాలి. ఆ గౌరవం మీకు దక్కుతది. యజ్ఞం హుజురాబాద్‌లో స్టార్ట్ కావాలి. హుజూరాబాద్ విజయం తెలంగాణ దళిత సమాజ విజయం అయితది. చరిత్రల మీ పేరు ఉంటది. చరిత్ర మాములు చరిత్ర కాదు.. దేశ చరిత్రకు పోతది. ఆ గౌరవం దక్కించుకోవాలి. ఆ పేరును నిలబెట్టుకోవాలి. మీ దగ్గర ఇచ్చే వెలుతురు రాష్ర్టానికి, దేశానికి విస్తరించాలి. గొప్ప ఉద్యమం కావాలని కోరుకుంటున్న. మీకు సంపూర్ణ విజయం సాకారం కావాలి.
ఇది దళిత ఉద్యమం
-పులుల లెక్క కావాలె
ఒక గొల్లోల్ల పిల్లగాడున్నడు. రోజూ మందను గుట్టపొంటి కొట్టుకపోయి మేపుకొస్తుంటడు. ఓ రోజు ఇంటికి రాంగ పులి పిల్ల దొరికింది. చిన్నగ మంచిగున్నదని దాన్ని తీసుకొచ్చిండు. దాన్ని గొర్ల మందల కలిపిండు. పాలు పోశి పెంచుతున్నడు. ఆ పులి గొర్లతోపాటే తింటున్నది, పంటున్నది. ఒక రోజు ఓ పెద్దపులి ఈ మందలకెళ్లి ఒక్క గొర్రెనన్న ఎత్తుకపోదామని అనుకున్నది. మందల ఓ పులిపిల్ల ఉండుడు సూశి ‘మందల ఒక పులి ఉన్నది.. నేను పోతే అది నాతోని కొట్లాడుతదా? ఏంది?’ అని ఆలోచిస్తున్నది. రెండుమూడు రోజులైనంక గొర్లన్నీ వాగుకాడ నీళ్లు తాగుతున్నయి. పులిపిల్ల నీళ్లుతాగి వస్తుంటే.. ఆ పెద్దపులి పిలిశింది. ‘ఏందిరా బై గొర్లతోటి తిరుగుతున్నవ్.. ఏంది కథ’ అని అడిగింది. ‘నేను గొర్రెనే కదా.. అందుకే గొర్లతోటి తిరుగుతున్న’ అని చిన్నపులి చెప్పింది. కాదు.. కాదు.. నువ్వు పులివి కావాల్నంటే నీళ్లల్ల నీ మొఖం సూడు అని పెద్దపులి అన్నది. అది నీళ్లల్లకు సూశింది. ‘నీ మొఖం.. నా మొఖం ఒక్క తీరుగనే ఉన్నది కదా. అంటే నువ్వు పులివే’ అని చెప్పింది. కావాల్నంటే గాండ్రించు అని అన్నది. అది పుట్టుతోనే పులి కదా.. గట్టిగ గాండ్రించింది. అప్పుడు చిన్నపులి ‘నేను గొర్రెను కాదు.. పులిని’ అని డిసైడ్ అయ్యింది. దళితులు కూడా పులులే. అవకాశం లేక, దారి సూపిచ్చేటోడు లేక ఇట్లున్నరు. మనం పులులైదామా? ఇట్లనే ఉందామా? పులి లెక్క కావాల్నంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనల్ని ఆగం పట్టిచ్చేటోళ్లను పక్కకువెట్టాలె. వాళ్లకు జెర సందిస్తే సగం నాశనం చేస్తరు. వాళ్లతోని వచ్చే ప్రమాదాలను ముందుగానే పసిగట్టాలె. మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ముందుకుపోవాలె. ఫస్ట్ స్టెప్‌లో ఈర్ష్య, ద్వేషాలను పోడగొట్టాలె. వారం పదిరోజులల్ల కేసులన్నింటినీ ఒడగొట్టాలె. అట్లయితే అందరం నవ్వుకుంట సంతోషంగా ఉంటం. ఒకరినొకరు గౌరవించుకొని, ప్రేమభావంతో ఉండే పరిస్థితులు రావాలె. ఇగ అక్కడి నుంచి మేం ఏం చేయాల్నో అది చేస్తం.
శ్రీశ్రీ ఆనాడే చెప్పాడు..
‘స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి.. సంబరపడగానే సరిపోదోయి….. ప్రతి మనిషి మరి ఒకరిని దోచుకునేవాడే.. తన సౌఖ్యం, తన భాగ్యం చూసుకునేవాడే.. స్వార్థమే అనర్థకారణం.. అది చంపుకొనుటే క్షేమదాయకం..’ అని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఒక సినిమా కోసం శ్రీశ్రీ ఈ పాట రాశారు. దురదృష్టవశాత్తు మన దేశంలో స్వార్థమే గొప్పదైంది. అది పెంచుకునుడే గొప్పగైంది. దాన్ని తుంచుకునుడు కాలేదు. అందుకే మనం వెనుకబడ్డాం. మార్పు కోరుకొనే వారు, ఆ సంకల్పం దృఢంగా ఉన్నవారు, ఒక్కటై పిడికిలెత్తి ముందుకు రావాలి. నిజంగా దళిత వాడల పరిస్థితి ఎలా ఉన్నదో మనకు తెలుసు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైనా చేద్దామని ప్రయత్నం చేశాం. అప్పుడు కొందరు ‘నువ్వు కూడా మాల మాదిగ కోసమే చేస్తవా!’ అన్నరు. ఎందుకన్నరు ఆ మాట? మాల మాదిగల కోసం ఇంకొకరు చేస్తే తప్పు అన్నట్లు ప్రచారం జరిగింది. ఏం జరుగలేదు అనను కానీ, కొంత జరిగింది. అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. సామాజిక రుగ్మతలు పూర్తిగా పోలేదు. ప్రతి కుటుంబం ఉన్నత స్థాయికి పోవాలి. దళితుల్లో దానయ్య పోయి డానియల్ అయ్యిండు. దళితులు అంటే ఊళ్లకు రావొద్దు, అంటొద్దు ముట్టొద్దు అంటివి. డానియల్ కాంగనే రమ్మంటివి. తప్పు ఎవరి దగ్గర ఉన్నది? ఆర్థికపరంగా మన సమాజంలో పరివర్తన జరిగి మనం బలపడితే చాలా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.
హుజూరాబాద్‌తో దళితబంధు ఆగదు
దళితబంధు ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంతో ఆగిపోదు. ముందుగా దళితుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన సాగాలి. ఆ తరువాత ప్రభుత్వ అందిస్తున్న సహకారంతో దళితులు ఎంతగా అభివృద్ధి సాధిస్తున్నారో? ఎలాంటి మార్పులు వస్తున్నాయో అధ్యయనం చేయాలి. ఎక్కడో ఒక చోట ఆయా అంశాలపై ఒక ప్రయోగం చేస్తేనే వాటిని తెలుసుకునే అవకాశముంటుంది. అదేవిధంగా ఎక్కడ ఎలాంటి సమస్యలున్నాయి? వాటి పరిష్కారానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే అంచనా ఏర్పడుతుంది. ఇక్కడి ఫలితాలను బట్టి ఆపై సంవత్సరానికి 2, 3 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని విస్తరింపజేస్తాం. ఒక్కరోజు సమావేశంతో ఇది ముగిసిపోదు. ఇంకా ఎన్నోసార్లు రావాల్సి ఉంటుంది. ఇట్లా మాట్లాడుకోవడం వల్లే పథకం అమలులో తలెత్తుతున్న సమస్యలు, అమలు తీరుతెన్నులు తెలుస్తాయి. దళితుల్లో అవగాహనస్థాయి గతం కంటే ఎంతో పెరిగింది. అది చాలా సంతోషించాల్సిన విషయం. దళితబంధు పథకంపై ఏమి చర్చించుకుంటున్నారని కొందరిని అడిగినప్పుడు, ఒకరు ఆటో ట్రాలీలు తీసుకోవాలనుకుంటున్నానని, ఇంకోమె పాడిపశువులను తీసుకుందామనుకుంటున్నాని, మరొకామె ఎరువుల దుకాణం పెడదామనుకున్నామని చెప్పడమే అందుకు నిదర్శనం. ప్రభుత్వం ఒక స్కీం తీసుకొస్తమని అనుకుంటే, అందుకు తగిన ఉపాధి మార్గాన్ని లబ్ధిదారులే ఎంచుకుంటరు. ఇక్కడ కేవలం చదువుకున్న యువతకు మార్గదర్శనం చేయాలి. దళితబంధు ఒక ఉద్యమం. తెలంగాణ జాతి సమున్నతి కోసం అమలు చేసేది. ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇందులో ఇతర పార్టీలకంటే టీఆర్‌ఎస్ నేతలపైనే బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందరినీ కలుపుకుపోవాలి. విభేదాలకు తావులేకుండా పథకాన్ని, ఉద్యమంలా ముందుకు తీసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి . నిజాయితీగా ఉండాలి. చీప్‌గా ఆలోచించవద్దు. మన పని మనం తప్పకుండా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో రాజకీయాలు చేయవద్దు. విమర్శలు రాకుండా కార్యక్రమాన్ని చేపట్టాలి. పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేయాలి.
ఉద్యోగం పోతదనే సందేశం ఇచ్చినం
ఈ మధ్య కాలంలనే ఒక దళిత మహిళను పోలీసులు కొట్టి సంపిన్రు. అసలు ఏం జరిగిందని నేను ఉన్నతాధికారులను అడిగిన. పోలీసులదే తప్పు.. వాళ్లే కొట్టి సంపిన్రు అని చెప్పిన్రు. గంత దుర్మార్గంగ ఉంటే ఎట్ల? ఏం యాక్షన్ తీసుకుంటరని అడిగితే.. సస్పెండ్ చేస్తమని చెప్పిన్రు. సస్పెన్షన్ చేస్తే మళ్లా ఒస్తరు కదా! గట్టిగ పనిష్మెంట్ ఇయ్యాలె.. ఉద్యోగం నుంచి పీకేస్తే గట్టిగ మెసేజ్ పోతదని అన్న. మళ్లా ఎవరన్నా దళితులను ముడితే ఉద్యోగం పోతదనే భయం ఉంటదని చెప్పిన. మొన్ననే ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల నౌకరి తీసేశినం. మీరు గ్రౌండ్‌లో చాలా ఐకమత్యంగా ఉండి, చెప్పుడు మాటలు పట్టుకోక, దృఢమైన సంకల్పంతోని ముందుకు సాగినప్పుడే మనం పూర్తిస్థాయిలో విజయం సాధిస్తం. దీనికి అకుంఠిత దీక్ష, వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉండాలె. మన దగ్గర కొంత మంచి జరిగితే.. ఆ వెలుతురు రాష్ట్రం మొత్తం ప్రసరిస్తది. స్మార్ట్‌ఫోన్ యుగం కాబట్టి అబద్ధాలు చెప్పే పరిస్థితి ఉండది.
మహిళా శక్తిని అణిచివేస్తున్నరు
మనదేశంలో ఉన్న దరిద్రం మరే దేశంలోనూ లేదు. ఈ పని ఆడోళ్లు చేసేదని, ఈ పని మొగోళ్లు చేసేదని పెట్టిండ్రు. ఆడోళ్లు వంటపనే చేయాలంటరు.. ఇదేమన్న రాజ్యాంగంలో ఉన్నదా? ఆ పని కూడా ముఖ్యమైనదే. అది అనుత్పాదక రంగం. ప్రతిభ ఎక్కువ ఉన్న వాళ్లను ఉత్పాదక రంగంలో పెట్టుకుంటరు. కొద్దిగ ప్రతిభ తక్కువ ఉన్నవాళ్లను అనుత్పాదక రంగంలో పెట్టుకుంటరు. ఆడవాళ్లలో గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్లు లేరా? ఓ కల్పనాచావ్లా.. మన భారత సంతతి అమ్మాయి.. మొన్న బండ్ల శిరీష మన తెలుగు సంతతి అమ్మాయి.. అంతరిక్షంలోకి పోయి వచ్చిన్రు. అవకాశం కల్పిస్తే గొప్ప పనులుచేసే ఆడవాళ్లు ఎందరో ఉన్నారు. నువ్వు ఆడ మనిషివి కాబట్టి వంటింట్లనే ఉండాలి.. నాకు చాతకాకున్నా గానీ బజారుకు పోవాలి.. అనుకోవడం పెద్ద వైరుధ్యం. మహిళలలో ఉన్న నైపుణ్యాన్ని, వారికి భగవంతుడు, ప్రకృతి ఇచ్చిన గొప్ప శక్తిని అణిచివేస్తున్నాం. దీన్ని సప్రెషన్ ఆఫ్ స్కిల్స్ అంటారు. ఇట్లాచేస్తే ఇగ దేశం ముందట పడతదా! దళితుల పేరు చెప్పి 20% మంది ఉన్న వీళ్లను చావగొడ్తిరి. 50% ఉండే మహిళలను అట్ల సావగొడ్తిరి. కులం పేరు పెట్టి, మతం పేరు పెట్టి.. ఇంకో పేరు పెట్టి.. దేశంలో ఉన్న ఎంతో గొప్ప మహిళాశక్తిని తెలివిలేక నువ్వు తుడిచిపెడుతున్నవు కదా! ఈ దేశాన్ని నువ్వు చంపుకుంటున్నవు. తెలివి తక్కువ నాయకులు, తెలివి తక్కువ పాలకులు, తెలివి తక్కువ ప్రాపగండా చేసేవాళ్లు చేసిన దుర్మార్గమిది. ఈ దాష్టీకం మనకు సంక్రమించిన దౌర్భాగ్యం. దీనిపై చర్చలు, పోరాటాలు జరుగుతున్నయి. ప్రపంచంలో విజ్ఞత ఉన్నవారు దీనిగురించి చెప్తున్నరు. తెలుసుకున్నవారు పైకి వస్తున్నరు.. తెలుసుకోలేనివారు వెనకనే ఉంటున్నరు.