-తెలంగాణను నిషేధించిన పీఠంపైనే ఉద్యమకారుడు కొలువుదీరాడు:సీఎం కేసీఆర్ -స్పీకర్‌గా చరిత్రలో నిలిచిపోతారు – ఆదర్శవంతంగా సభ నడపండి – సభానాయకుడిగా పూర్తిగా సహకరిస్తా – తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చుదాం – సిరికొండతో 30 ఏళ్ల అనుబంధం – ఉద్యమపథంలో వెన్నంటి ఉన్నారు – మధుసూదనాచారి అభినందన ప్రసంగంలో ముఖ్యమంత్రి -పదవీ బాధ్యతలు చేపట్టిన తెలంగాణ స్పీకర్ – ఎన్నికను ప్రకటించిన ప్రొటెం స్పీకర్ జానారెడ్డి – సగౌరవంగా తోడ్కొని వెళ్లిన సీఎం, విపక్షనేతలు – తెలంగాణ శాసన సభ్యుడినైన నేను అంటున్న ప్రమాణాలు చూసి ఆనందబాష్పాలొచ్చాయి -తెలంగాణ ఉద్యమకారులే నడుపుతున్న ప్రభుత్వమిది -శాసనసభలో ముఖ్యమంత్రి భావోద్వేగం

తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాధిపతిగా సిరికొండ మధుసూదనాచారి చరిత్రలో నిలిచిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన పీఠంపైనే తెలంగాణ ఉద్యమకారుడు శాసనసభాపతిగా కొలువుదీరడం అపూర్వఘట్టమని ఆయన అన్నారు. మధుసూదనాచారి హయాంలో తెలంగాణ శాసనసభ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్ర శాసనసభాపతిగా సిరికొండ మధుసూదనాచారి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను అభినందిస్తూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. అంతకు ముందు అసెంబ్లీసమావేశాలు ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన ప్రధాన ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి సిరికొండ మధుసూదనాచారి స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. పదవీబాధ్యతలు చేపట్టాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. సభానాయకుడు సీఎం కే చంద్రశేఖరరావు మధుసూదనాచారి స్థానం వద్దకు వెళి సాదరంగా ఆయనను తోడ్కొని స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేతలు రెడ్యానాయక్, భట్టి విక్రమార్క, బీజెపీ ఫ్లోర్‌లీడర్ డా కే లక్ష్మణ్, కిషన్ రెడ్డి, టీడీపీ ప్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు,తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం నేతలు ఖాద్రీ తదితరులు వెంట నడిచారు. జానారెడ్డి స్పీకర్ స్థానాన్ని మధుసూదనాచారికి అప్పగించారు. ఆయనను ఆలింగనం చేసుకుని అభినందించారు. వివిధ పార్టీల నేతలంతా సిరికొండను అభినందించారు. అనంతరం సభాపతిని అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ కోరింది ఇదే… మధుసూదనాచారితో తన అనుబంధాన్ని, తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించిన సేవలను ముఖ్యమంత్రి ప్రస్తుతించారు. అధ్యక్షా.. ఇది చారిత్రాత్మక ఘట్టం. తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సందర్భం. కొలువుదీరి ఉన్న తెలంగాణ శాసనసభ అధిపతిగా తమరు ఈ రోజు స్పీకర్‌గా పదవీబాధ్యతలు చేపట్టడం సభానాయకునిగా నాకు సంపూర్ణమైన సంతోషాన్ని కలిగిస్తున్నది.ఏ అస్తిత్వాన్ని ఉనికిని తెలంగాణ కోరుకుందో అదే నేడు నిజమైంది అన్నారు. సిరికొండ మధుసూధనాచారితో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు ముందునుంచి తెలంగాణ సాధన ఉద్యమ నిర్మాణంలో తనతో పాటునడిచి క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. బాల్యం మొదలుకుని స్పీకర్ పదవి చేపట్టేవరకు మధుసూదనాచారి అధిగమించిన దశలను కేసీఆర్ సభాముఖంగా వివరించారు. ఆంగ్ల సాహిత్యంలో పీజీ పూర్తిచేసిన విద్యాధికుడిగా శాయంపేట శాసన సభ సభ్యుడితోపాటు తదితర హోదాల్లో పనిచేసిన వివరాలను సభలో ప్రస్తావించారు. 2001 ముందు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించేనాటికి తనకు సిరికొండ అందించిన సహకారాన్ని తన జీవితంలో మరిచిపోలేని ఘట్టంగా సీఎం పేర్కొన్నారు. ఓటమిని సవాలుగా తీసుకుని భూపాలపల్లి నియోజక వర్గం నుంచి తిరిగి గెలవడం ద్వారా పట్టుదలకు మారుపేరుగా ఆయన నిలిచారన్నారు.
నిషేధింపబడ్డ చోటే.. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని సీమాంధ్ర ఆధిపత్య అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. హన్మకొండ ఎమ్మెల్యేగా ఉన్న ప్రణయ్ భాస్కర్ సభలో మా తెలంగాణ ప్రాంతంలో అంటూ సమస్యలు ప్రస్తావిస్తే ఆనాటి స్పీకర్ తెలంగాణ అనే పదం వాడరాదని నిషేధించాడని తెలిపారు. అప్పటి స్పీకర్ తెలంగాణ లేదు.. గిలంగాణ లేదు అని మాట్లాడిన మాటలు తన చెవుల్లో ఇప్పటికీ గింగురుమంటున్నాయన్నారు. ఏ స్థానం నుంచైతే తెలంగాణ పదం నిషేధానికి గురయ్యిందో అదే స్పీకర్ స్థానంలో తెలంగాణ ఉద్యమకారుడు శాసనసభాపతిగా కొలువుదీరారని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే అసెంబ్లీలో తెలంగాణ పదం నిషేధానికి గురైంది. ఇక్కడే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం కావడం మరిచిపోలేని చారిత్రక ఘట్టం అని అన్నారు.
ఆనంద బాష్పాలు..: తెలంగాణ శాసనసభ సభ్యుడనైన నేను అంటూ నిండు సభలో ఒక్కో సభ్యుడు సోమవారం ప్రమాణం చేసిన ఘట్టాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. అరవై ఏండ్ల కల కొలువు దీరిన మధుర ఘట్టాన్ని చూసి తాను ఆనందబాష్పాలు రాల్చినట్లు తెలిపారు. అది తెలంగాణ ఉద్యమకారులే తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న అపురూప ఘట్టంగా ఆయన అభివర్ణించారు. కొలువుదీరిన తెలంగాణ అసెంబ్లీ సన్నివేశం తెలంగాణ ప్రజలలో సభ్యుల వ్యక్తిగత జీవితంలో జీవితాంతం మరిచిపోలేని ఘటనగా మిగిలిపోతుంది అని సీఎం అన్నారు.
ఆదర్శవంతమైన సభగా పేరుతేవాలె.. మధుసూదనాచారి తెలంగాణ శాసన సభకు దేశంలోనే ఆదర్శవంతమైన సభగా పేరుతీసుకురావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సభానాయకునిగా దానికి తన పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. మంచి సంప్రదాయాలకు శ్రీకారం చుట్టాలని ఆయన సూచించారు. స్పీకర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మధుసూదనాచారి గొప్ప స్పీకర్‌గా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు.
కోటి ఆశల కొలువిది.. స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో తమవైపు చూస్తున్నారని సభలో ఆసీనులైన సభ్యులనుద్దేశించి సీఎం అన్నారు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల కోటి ఆశలకు తెలంగాణ అసెంబ్లీ ప్రతిరూపమని అభివర్ణించారు. ప్రజల ఆకాంక్షలు కార్యరూపం దాల్చాలంటే పరస్పర సహకారంతో పార్టీలకతీతంగా భేషజాలు లేకుండా ముందుకు సాగుదామని సహచర సభ్యులకు పిలుపునిచ్చారు. ప్రజలే కేంద్ర బిందువులుగా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని హామీ ఇచ్చారు. తన అభ్యర్ధనమేరకు మధుసూదనాచారిని స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అన్ని పార్టీలకు ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఇదే స్పూర్తిని కొనసాగించి ప్రజల ఆకాంక్షలను నేరవేర్చేందుకు తనకు సహకరించాలని కోరారు.
కేసీఆర్ భావోద్వేగం -చాలా మందికి తెలియదు. టీఆర్‌ఎస్ పార్టీ స్థాపన 2001లో జరిగినా ఉద్యమానికి రూపమిచ్చే కార్యక్రమం ఏడాదికి ముందే 2000 సంవత్సరంలోనే ప్రారంభమైంది. అందులో మధుసూదనాచారి కీలకపాత్ర పోషించారు. -మాది 30 ఏళ్ల అనుబంధం. రాజకీయాల్లో కలిసిమెలిసి ఉన్నాం. ఉద్యమంలో అనుక్షణం నా వెన్నంటి ఉన్నారు. ఉద్యమ పంథా రూప కల్పనలో, ఉద్యమానికి రాజకీయ రూపం, విధివిధానాల నిర్దేశంతో సహా అన్నింటా మధుసూదనాచారి సహకారం ఉంది. -పట్టుదలకు మధుసూదనాచారి మరోపేరు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఓ సారి విఫలమైనా పట్టుదలతో పనిచేసి రాజకీయ దురంధరులపై విజయం సాధించారు. -ఏ అస్తిత్వాన్ని ఉనికిని తెలంగాణ కోరుకుందో అదే నేడు నిజమైంది.
-హన్మకొండ ఎమ్మెల్యేగా ఉన్న ప్రణయభాస్కర్ మా తెలంగాణ ప్రాంతంలో… అంటూ సమస్యలను చెబుతుంటే ఇదే స్థానంనుంచి తెలంగాణ లేదు..గిలంగాణ లేదు.. ఆ పదం వాడొద్దు అంటూ అన్న మాటలు ఇంకా నా చెవుల్లో గింగురుమంటున్నాయి.
-ఏ స్థానంనుంచి తెలంగాణ పదం నిషేధానికి గురైందో అదే స్థానంలో తెలంగాణ ఉద్యమకారుడు కొలువుదీరడం అపూర్వఘట్టం. -నిన్న ఇక్కడ తెలంగాణ శాసనసభ సభ్యుడనైన నేను అంటూ ఒక్కో శాసనసభ్యుడు ప్రమాణం చేస్తుంటే నా కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి.
కళ్ళు చెమరుస్తున్నాయి -ఆదర్శవంతంగా సభను నడిపిద్దాం -తెలంగాణ అభివృద్ధికి సభ వేదిక కావాలి -నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుదాం -స్పీకర్ మధుసూదనాచారి
ఒక మహత్తరమైన, చారిత్రాత్మక ఘట్టం. మీ అందరి అభిమానం చూస్తుంటే నా కళ్ళు చెమరుస్తున్నాయి. ఇంత గొప్ప అవకాశం కల్పించిన సభకు శిరస్సువంచి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. మంగళవారం శాసనసభ స్పీకర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. తన ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు పలికిన సభ్యులందరికీ ఆయన కతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఒక ఉన్నత సంప్రదాయం కొనసాగించారని.. దానికి అనుగుణంగా అన్ని పార్టీల సభాపక్షనేతలు తనను బలపరిచారని ఆయన పేర్కొన్నారు.
స్పీకర్‌గా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించాం, సాధించిన రాష్ట్రం అన్నిరకాలుగా పురోగామి దిశలో పయనించాలి. అభివృద్ధి సాధించాలి. ఆ కార్యాచరణలో ముందుకు సాగడానికి ఈ గౌరవ సభ వేదిక కావాలి అని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం సాకారం అవుతుందని, తమ జీవితాల్లో వెలుగు వస్తుందన్న నమ్మకంతో ఉద్యమంలో కలిసివచ్చిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల దృష్టి ఇపుడు ఈ చట్టసభ వైపు ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభ్యులు వ్యవహరించాలని సూచించారు.
ఈ ప్రజాస్వామ్యసౌధం కీర్తి దేశంలో ఇనుమడింపజేయాలని, అత్యున్నత విలువలతో తెలంగాణ శాసనసభ అందరికీ ఆదర్శం కావాలని ఆయన ఆకాంక్షించారు. సభాపతిగా తన విధినిర్వహణలో రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా, ఈర్ష్య, అసూయలకు తావులేకుండా పనిచేస్తానని సిరికొండ స్పష్టంచేశారు. సభను నడిపించడంలో అందరి పూర్తి సహకారం ఉండాలని అభ్యర్థించారు. నూతన ప్రభుత్వ లక్ష్యాలు, అలాగే ఎన్నికైన శాసనసభ్యులందరి ఆకాంక్షలు నెరవేరాలని సిరికొండ ఆకాంక్షించారు.