భారతదేశం ఒక సమాఖ్య దేశం. ఇందులో కేంద్రం, రాష్ర్టాలు పరస్పరం చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధిలో సహకరించుకోవాలి. ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధమైన బాధ్యత. ఈ స్ఫూర్తితోనే మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశ సమాఖ్య స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
కానీ గత కొంతకాలంగా.. కేంద్ర ప్రభుత్వ ధోరణి భిన్నంగా ఉంటూ రాష్ర్టాలను ఉక్కిరి బిక్కిరి చేసే విధంగానూ, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగానూ ఉంటున్నది. దేశ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఇలాంటి చర్యలు ఉంటున్నప్పుడు అది దేశ సమగ్రతకే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయాలు రాష్ర్టాల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నప్పుడు, దేశాభివృద్ధిలో తగిన వాటా దక్కనప్పుడు అది దేశాభివృద్ధికే గాక, సమాఖ్య స్ఫూర్తినే ప్రమాదంలో పడేస్తుంది.
- ఏటా తెలంగాణ రాష్ట్రం పన్నుల్లో భాగస్వామ్య వాటాగా రూ.2.72 లక్షల కోట్ల మొత్తాన్ని కేంద్రప్రభుత్వానికి చెల్లిస్తున్నది. కానీ కేంద్రం మాత్రం రూ.1.4 లక్షల కోట్లను మాత్రమే తెలంగాణకు తిరిగి ఇస్తున్నది.
సమస్య ఎక్కడున్నదంటే.. అధికారంలో లేనప్పుడు సమాఖ్య స్ఫూర్తి, కేంద్రం సహకారం, బాధ్యత గురించి మాట్లాడిన పార్టీలు, అధికారంలోకి రాగానే అవి కూడా పాత పాటనే పాడుతుండటం విషాదం. ఈ విధమైన ధోరణి దేశంలో ఒక విషవలయంగా మారింది. అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాటగా మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా ఘనతకెక్కిన మన దేశంలో ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, సంప్రదాయాల వారు సహజీవనం చేస్తున్నారు. మన ప్రాచీన ఇతిహాసాలు చెప్పిన ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తిని గౌరవిస్తూ, పాటిస్తూ విభిన్న వర్గాలు భిన్నత్వంలో ఏకత్వం విలువతో శాంతియుత జీవనం కొనసాగించటం మన దేశ ప్రత్యేకత. దీన్ని గౌరవించటం, కొనసాగించే బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ భుజస్కంధాలపై ఉంటుంది.
సమాఖ్య విధానంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలనేవి అతి ప్రధానమైనవి. ఒకరకంగా ఇదే మూలస్తంభం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దృఢమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమతుల్యత ఏర్పర్చే క్రమంలోనే హక్కులు, బాధ్యతలను రాజ్యాంగం వర్గీకరించింది. హక్కులు, బాధ్యతలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాగా విభజించారు. గమనించదగిన విషయమేమంటే.. ఉమ్మడి జాబితా ఆసరాతో కేంద్రం అనుచితంగా రాష్ర్టాల హక్కుల్లోకి చొరబడుతున్నది లేదా రాష్ర్టాల హక్కులను తరచుగా కబళిస్తున్నది. దీనికి తాజా ఉదాహరణలు.. ఈ మధ్యకాలంలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణ బిల్లులు. ఇలాంటి చట్టాలు రాష్ర్టాలకు ముఖ్యంగా రాజకీయంగా ప్రబలశక్తిగా లేని రాష్ర్టాలకు శరాఘాతాలుగా మారుతున్నాయి. దీనివల్లే చాలా సందర్భాల్లో రాష్ర్టాల హక్కులకు భంగం కలిగినప్పుడల్లా ఫెడరల్ ఫ్రంట్ నినాదం ముందుకొస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలు సమాఖ్యస్ఫూర్తికి వెన్నుదన్నుగా నిలవాల్సిన చారిత్రక బాధ్యత ఉన్నది.
భారతదేశ అస్తిత్వం దానికదిగా విడియైనదీ, ప్రత్యేకమైనది కాదు. ఇది రాష్ట్రాలతో కూడినదే కాకుండా.. రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులపై ఆధారపడినది. ఇదంతా రాజ్యాంగబద్ధంగా నిర్వచించుకున్నది. అంటే.. ఏవో కొన్ని రాష్ర్టాల ప్రయోజనాల కోసం దేశంలోని మిగతా రాష్ర్టాల నుంచి వచ్చే పన్నులను అప్పనంగా వినియోగించాలని కాదు. Bimaru (బిమారు)గా పిలువబడుతున్న బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకు.. మిగతా రాష్ర్టాలు కేంద్రానికి ఇస్తున్న పన్నుల నిధులను వెచ్చించటం కాకూడదు. ఈ మధ్యకాలంలో ఇది కొంత మారినా.. కేంద్రం అనుసరిస్తున్న విధానం మాత్రం స్థూలంగా ఈ విధంగానే ఉంటున్నది. రాష్ర్టాల నుంచి వసూలు చేస్తున్న పన్నుల నుంచి ఆ రాష్ర్టాలకు వాటాగా దక్కాల్సిన నిధులను ఇవ్వకుండా కొన్ని రాష్ర్టాలకే వెచ్చిస్తున్న పరిస్థితి ఉంటున్నది. ఇది ఎంత మాత్రమూ అనుసరణీయం, ఆమోదయోగ్యం కాదు. దీంతో కొన్ని రాష్ర్టాల్లో నిధుల కొరతతో అభివృద్ధి కుంటుపడటమే కాదు, ఆ రాష్ర్టాలు వెనకబడిపోయే ప్రమాదం ఉన్నది. ఇక్కడ ఓ ఉదాహరణ చెప్పుకొందాం- ఒక కుటుంబంలో నలుగురు పిల్లలుంటే.. అందులో ఇద్దరు మంచిగా పనిచేస్తూ ప్రయోజకులుగా మారి ఉన్నతి దిశగా పయనిస్తుంటే.., మరో ఇద్దరు ఏ పని చేయకుండా అప్రయోజకులుగా మారి ఎదగకుండా ఉంటున్నప్పుడు.. వృద్ధి చెందుతున్న వారి నుంచి అప్రయోజకులకు ఫలాలు అందించటం సబబేనా? సక్రమమేనా? ఒకస్థాయి వరకు ఇది కొంత సమంజసమైనా.. ఇలాంటిది ఎంతకాలం అనే ప్రశ్న ముందుకువస్తుంది. ఇది సుదీర్ఘకాలం కొనసాగితే.. పర్యవసానం విపరీతాలకు దారితీస్తుంది. కష్టించి పనిచేస్తూ ప్రయోజకులైనవారు వృద్ధిలో వెనకబడిపోవటం ఒకవైపు జరిగితే.. అప్రయోజకులు పరాన్నభుక్కులై కుటుంబానికే భారంగా తయారవుతారు. ఇది అంతిమంగా కుటుంబ ప్రయోజనానికీ, అభివృద్ధికీ ఆటంకంగా మారుతుంది. ఈ నీతినే రాష్ర్టాలకూ వర్తింపజేసుకుంటే.. ఫలితమేంటో వేరే చెప్పాల్సిన పనిలేదు.
ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. ఏటా తెలంగాణ రాష్ట్రం పన్నుల్లో భాగస్వామ్య వాటాగా రూ.2.72 లక్షల కోట్ల మొత్తాన్ని కేంద్రప్రభుత్వానికి చెల్లిస్తున్నది. కానీ కేంద్రం మాత్రం రూ.1.4 లక్షల కోట్లను మాత్రమే తెలంగాణకు తిరిగి ఇస్తున్నది. నిజానికి పన్నుల వాటాలో రాష్ర్టానికి రావాల్సిన వాటాలో ఇది 50 శాతమే. దీన్నిబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి. కష్టపడుతున్నవానికి ప్రోత్సాహం అందాలి. ఫలితం దక్కాలి. అలా దక్కకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. ఒక పిన్న రాష్ట్రంగా తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని చూసి.. మరింత ప్రోత్సాహం అందించాల్సిన కేంద్రం నిధుల కొరతను సృష్టించటం, న్యాయంగా దక్కాల్సిన పన్నుల వాటాను కూడా ఇవ్వకపోవటం వివక్షగాక మరేం అవుతుంది?
దేశంలో అతి పిన్న రాష్ట్రంగా తెలంగాణ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అవతరణ కాలం నుంచీ ఓ భవిష్యత్ దార్శనికతతో ముందుకుపోతున్నది. అభివృద్ధి, సంక్షేమాల్లో తనకు సాటిలేదని చాటుతున్నది. సుదీర్ఘ ఆర్థిక, పారిశ్రామిక చరిత్ర ఉన్న పెద్ద రాష్ర్టాలతో ఓ పసికూనగా ఉన్న తెలంగాణ పోటీ పడుతున్నది. ఈ ఏడేండ్ల కాలంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని గణాంకాల్లో చూస్తే.. తెలంగాణ పురోగమనం అర్థమవుతుంది. ఈ గణాంకాలన్నీ కేంద్రప్రభుత్వ సంస్థలు చెప్పినవే కావటం గమనార్హం.
2020-21 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం.. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) విలువ రూ.9.8 లక్షల కోట్లు. ఇది 2014-15తో పోలిస్తే.. 94 శాతం అధికం. ఈ కాలంలో కేంద్రం 58 శాతం వృద్ధినే సాధించింది. జీఎస్‌డీపీ పరంగా దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. అలాగే.. దేశ జీడీపీలో 5 శాతం తెలంగాణ భాగస్వామ్యం ఉండటం గమనించదగినది. ఇది దేశంలోనే ఆరో అతిపెద్ద సహకార భాగస్వామ్యం. సగటు వార్షిక వృద్ధిరేటు దేశంలో 3.7 శాతం ఉంటే, అదే తెలంగాణలో 11.7 శాతం. తలసరి ఆదాయ వృద్ధిరేటులో మొత్తం 18 రాష్ర్టాలలో తెలంగాణ మూడో స్థానంలో నిలవటం గర్వకారణం. ఇక తలసరి ఆదాయంలో కూడా.. తెలంగాణ దేశంలోనే తలమానికంగా నిలిచింది. తెలంగాణలో తలసరి ఆదాయం 2020-21 నాటికి రూ.2.37 లక్షలకు చేరుకున్నది. ఇది దేశ తలసరి ఆదాయ పెరుగుదల కన్నా 1.84 రెట్లు ఎక్కువ. ‘అచ్ఛే దిన్ ఆయేగీ’ అని గొప్పలు పోయిన మోదీ పాలనలో.. దేశంలో తలసరి ఆదాయం రూ.1.28 లక్షలు మాత్రమే.
కాగ్ నివేదిక కూడా తెలంగాణ అభివృద్ధిని చాటిచెప్పింది. ఆ నివేదిక ప్రకారం.. తెలంగాణ పన్నుల ఆదాయంలో 90 శాతం పెరుగుదలను సాధించింది. 2014-15లో 35,146 కోట్లు ఉంటే.., అది నేడు 66,648 కోట్లకు చేరుకున్నది. సగటు వార్షిక వృద్ధిరేటులో దూసుకుపోయిన తెలంగాణ 11.52 శాతం సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. దేశంలో అతిపిన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ సాధించిన ఘనతను చెప్పటానికి ఈ గణాంకాలు చాలు.
తెలంగాణ వాయువేగంతో అభివృద్ధిలో పరుగులు తీయటానికి.. రాష్ట్రంలో అమలుచేస్తున్న సమతుల అభివృద్ధి విధానాలే కారణం. ప్రాథమికరంగంగా చెప్పుకొనే వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాలు, ద్వితీయ రంగాలుగా చెప్పుకొనే తయారీ, నిర్మాణరంగాలు, విద్యుత్, నీటి పారు దల, తృతీయరంగంగా చెప్పుకొనే వాణిజ్యం, స్థిరాస్తి వ్యాపారం, హోటళ్లు, ట్రాన్స్‌పోర్టు, సమాచార రంగం వంటి వాటికి అన్నింటికీ సమ ప్రాధాన్యమిచ్చి రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి విధానాలే తెలంగాణ పురోగమనానికి కారణంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమాల కోసం రూపకల్పన చేసిన వినూత్న సంక్షేమ పథకాల పాత్ర కూడా ఎంతో ఉన్నది. ఉదాహరణకు.. రైతుబంధు, రైతు బీమా, 24 గంటలు ఉచిత విద్యుత్, హరితహారం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్‌రూం ఇండ్లు లాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చటమే కాదు, పెనుమార్పులు తీసుకొచ్చాయి. ప్రాథమిక, తృతీయ రంగాల వాటా తెలంగాణ అభివృద్ధిలో 83.5 శాతం ఉన్నది. సేవారంగాన్ని చూస్తే.. 2014-15లో ఐటీ ఎగుమతులు 66,276 కోట్లు ఉంటే, నేడు అది 1.45 లక్షల కోట్లకు చేరుకున్నది. ఇది 120 శాతం వృద్ధి. దీని ఫలితంగా ఈ రంగం వల్ల 2014-15లో 3.71 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తే 2020-21లో ఆ సంఖ్య 6.28 లక్షలకు చేరుకున్నది. ఇదే సమయంలో 1.32 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించగా.. మరో 50 వేల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నది.
స్వతంత్ర భారత చరిత్రలో మున్నెన్నడూ, ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకానికి రూపకల్పన చేసి దళితుల అభ్యున్నతికి చారిత్రక నిర్ణయం తీసుకున్నది. ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలను అందజేస్తున్నది. ఇది తెలంగాణ సామాజిక జీవనంలో విప్లవాత్మక మార్పులకు కారణం కానున్నది.
ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాల పాత్ర విశిష్టమైనది. దేశాభివృద్ధిలో ప్రతిపక్షాల పాత్ర విడదీయలేనిది. కానీ రాష్ట్రంలో జాతీయపార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరు వినాశకరంగా, ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నది. తెలంగాణ అన్నిరంగాల్లో పురోభివృద్ధి సాధిస్తున్నా.. ఏ అభివృద్ధీ జరగటం లేదని నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. అబద్ధపు విష ప్రచారాలకు దిగుతున్నాయి. ఉదాహరణకు.. కరోనా కష్టకాలంలో.. కేంద్రప్రభుత్వం రూ.ఏడు వేల కోట్ల సాయం అందించిందని ఓ జాతీయపార్టీ అంటున్నది. కానీ వాస్తవానికి కేంద్రం నుంచి రాష్ర్టానికి అందింది.. కేవలం రూ.290 కోట్లు మాత్రమే. ఇదేదో ఆ రాష్ట్ర పార్టీ నేతలు చెప్పింది కాదు, స్వయంగా పార్లమెంటులో కేంద్ర మంత్రులే ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇలాంటి అబద్ధాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించటం ఏ ప్రయోజనాల కోసమో అర్థమయ్యే విషయమే. రాజకీయ మనుగడ కోసం కండ్లముందున్న వాస్తవాన్ని చూడ నిరాకరించటం రాజకీయ దివాళాకోరుతనమే తప్ప మరేమీ కాదు.
ఈ సందర్భంలోనే.. కొన్ని నిజాలను చూడాలి. తెలంగాణలో అమలుచేస్తున్న మిషన్ కాకతీయ, భగీరథ పథకాలకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ కేంద్రానికి చెప్పింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా తెలం గాణకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఇవ్వాలి. కానీ కేంద్రం మహారాష్ట్రకు కేటాయించింది. జలశక్తి మంత్రిత్వశాఖ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. నిధులు కేటాయించలేదు. హైదరాబాద్‌కు కేటాయించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును ఏ కారణం చేత రద్దుచేశారో కేంద్రానికే తెలియాలి. మౌలాలి దగ్గరలో ఉన్న 21 ఎకరాల భూమిని అమ్మి డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి వినియోగిస్తామన్నా కేంద్రం మోకాలడ్డటం ఎలాంటి సహకారం కిందికి వస్తుందో!
నిజానికి కేంద్రప్రభుత్వం పురోగమిస్తున్న రాష్ర్టాల అభివృద్ధి గమనాన్ని ప్రోత్సహించాలి. చేదోడుగా నిలువాలి. సమగ్రాభివృద్ధి దిశగా దూసుకుపోతున్న తెలంగాణ ప్రగతిని దేశాభివృద్ధిలో భాగంగానే కేంద్రం పరిగణించాలి, చేయూతనందించాలి. రాష్ర్టాల ఉన్నతే అంతిమంగా దేశ ఉన్నతి. అందుకోసం కేంద్రం కుటుంబ పెద్ద తరహాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాష్ర్టాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. జాతీయ అభివృద్ధి కౌన్సిల్, నీతిఆయోగ్ లాంటి కేంద్ర సంస్థలు.. కరోనా కష్టకాలంలోనూ అభివృద్ధి బాటలో పయనిస్తున్న రాష్ర్టాల విజయగాథను చెప్పాలంటే.. తెలంగాణ పురోగమనాన్ని ఉదాహరణగా చెప్పాలి.
(వ్యాసకర్త: లోకసభ సభ్యులు, చేవెళ్ల)
డాక్టర్ రంజిత్‌రెడ్డి