Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

హైదరాబాద్‌లో యూరో టెక్ సెంటర్

-28 దేశాల పారిశ్రామిక వేత్తలతో అనుసంధానం -ఐటీ, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులకు మార్గం సుగమం -ఐటీ మంత్రి కేటీఆర్‌తో యూరోపియన్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రతినిధుల భేటీ -ప్రభుత్వపరంగా సహకరిస్తామని మంత్రి హామీ -రెండునెలల్లో సెంటర్ ప్రారంభం.. ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్

KTR

ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ తెలంగాణలో ఆవిష్కృతం కానుంది. 28 దేశాలతో అనుబంధం కలిగిన ఈ సంస్థ హైదరాబాద్‌లో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని గుర్తించిన సదరు సంస్థ తన సేవలను అందించేందుకు ముందుకొచ్చింది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో యూరోపియన్ దేశాలకు తెలంగాణ రాష్ర్టానికి మధ్య అనుసంధానానికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ ప్రతినిధుల బృందం గురువారం రాష్ట్ర సచివాలయంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమైంది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ఎలాంటి సేవలను అందించనుందో ప్రతినిధులు వివరించారు. ప్రభుత్వం సహకరిస్తే మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక నైపుణ్య పంపిణీ వంటి అనేకాంశాల్లో తోడ్పాటునందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. యూరోపియన్ దేశాలకు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్లను తెలంగాణకు రప్పించేందుకు సహకరిస్తామని, ఇక్కడున్న వనరులు, మౌలిక సదుపాయాల గురించి విష్ట్రుతంగా తెలియజేస్తామని చెప్పారు.

కేంద్రంతోపాటు ఇంక్యుబేటర్ సెంటర్‌ను నెలకొల్పి దేశ విదేశీ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్‌ను కల్పించేందుకు తమ సంస్థ సహకరిస్తుందని వివరించారు. దీనికి ప్రభుత్వం తరపున సహకారాన్ని అందించాలని కోరారు. తెలంగాణ ప్రాంతానికి మేలు కలిగించే ఏ ప్రాజెక్టునైనా తాము ఆమోదిస్తామని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. మరో రెండునెలల్లోనే హైదరాబాద్‌లోనే సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఆ సందర్భంగానే వివిధ దేశాల ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. మంత్రితో సెంటర్ ప్రతినిధుల చర్చల వివరాలను ఆ తర్వాత వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ టీ మీడియాకు వెల్లడించారు. యూరోపియన్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు ద్వారా తెలంగాణకు ఎంతో మేలు కలుగుతుందని ఆయన చెప్పారు. తనకు జర్మనీతో ఉన్న సంబంధాలతో వారితో చర్చించి ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణలో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పారిశ్రామీకరణకు అనువైన వాతావరణాన్ని వివరించడం ద్వారా సంస్థ ముందుకొచ్చిందన్నారు.

ఐటీతోపాటు బయోటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, తదితర రంగాలకు సంబంధించిన ఆధునిక నైపుణ్యం తెలంగాణకు అందుతుంది. అలాగే ఆయా దేశాలతో సంస్థకు ఉన్న పరిచయాల కారణంగా పెట్టుబడులకు అనువైన వాతావరణంగా విష్ట్రుతంగా ప్రచారంలోకి వస్తుంది. పెట్టుబడుల విస్తరణకు దోహదపడుతుంది. గ్లోబలైజేషన్ మార్కెట్ కల్పించే వాతావరణాన్ని కల్పిస్తుందని రమేశ్ చెప్పారు. సంస్థ ఏర్పాటు చేయనున్న నాలెడ్జ్ సెంటర్ ద్వారా ఆ దేశాల్లో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని తెలంగాణ అందుకోవడానికి వీలవుతుంది. ఉదాహరణకు మామిడి, దాని ఉత్పత్తులను ఏ విధంగా ఎగుమతి చేసుకోవచ్చో, మార్కెట్ సదుపాయాన్ని ఎలా కల్పించుకోవచ్చో ఈ కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. ఇంక్యుబేటర్ సెంటర్లను ఏర్పాటు చేసే బాధ్యతను కూడా ఈ సంస్థ చేపడుతుందన్నారు. దీనివల్ల ఎంటర్‌ప్రెన్యూర్లకు ఎంతో మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విభిన్న టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్లతో తెలంగాణకు సంబంధాలను నెలకొల్పడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.