హైదరాబాద్ నగరాన్ని తలదన్నే రాజధానిని నిర్మించడం ఎవరి వల్ల సాధ్యం కాదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం భాగ్యనగరానికి మించిన రాజధానిని నిర్మిస్తామని చెప్తున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. మంగళవారమిక్కడ నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మీట్-2014 ఆవిర్భావ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని.. ప్రసంగించారు. హైదరాబాద్‌ను తానేఅ భివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకొంటున్నారని, నగరానికి 422 ఏళ్ల చరిత్ర ఉన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు.
-నగరానికి 422 ఏళ్ల చరిత్ర ఉంది -తానే అభివృద్ధి చేశానంటున్న బాబు దీనిని గుర్తించాలి -శాంతిభద్రతలపై మాదే భరోసా -భవన నిర్మాణ రంగాన్ని ఆదుకుంటాం -టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్

తెలంగాణ అభివృద్దే లక్ష్యంగా కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కొంతమంది నాయకులు ప్రచారం చేస్తున్నట్లు ఇతర ప్రాంతాలు, రాష్ర్టాల వారికి ఎటువంటి ఆందోళన అవసరం లేదన్నారు. శాంతి భద్రతల విషయంలో అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. గతంలో మాదిరిగానే అన్ని ప్రాంతాల వారు వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. ఉద్యమంలో భాగాంగానే హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనే నినాదాన్ని తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ అభివద్ధికి రాష్ట్ర రాజధాని నుంచి వచ్చిన ఆదాయమే ప్రధానమని, హైదరాబాద్ ప్రగతికి ఏ మాత్రం ఆటంకం కలిగినా తెలంగాణ ఆర్థిక పరిస్థితి మారిపోయే ప్రమాదముందనే అవగాహన తమకు ఉందని తెలిపారు. దివాలాకోరు రాజకీయాలు, చపలచిత్తం కలిగిన ప్రభుత్వాల వల్ల 2009 డిసెంబర్ నుంచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఇబ్బంది కలిగిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. దీనికి తెలంగాణ ఉద్యమం ఏ మాత్రం కారణం కాదని స్పష్టం చేశారు.
ముందుగా ప్రకటించినట్లు 2009లోనే రాష్ట్రం ఇచ్చి ఉంటే నగరానికి నష్టం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ప్రాంతాలకు, రాష్ర్టాలకు సంబంధం లేకుండా తెలంగాణ పరిపుష్టి కావాలని కాంక్షతో ఉన్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే దాడులు జరుగుతాయని, సీమాంధ్ర వారికి నష్టం జరుగుతుందని అబద్ధపు ప్రచారాలు చేశారని, అయినా ఒక్క ఘటన కూడా జరిగిన దాఖలాలు లేవనే విషయాన్ని విమర్శకులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తెలంగాణను అభివృద్ధి చేయాలనే తపనతో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన చరిత్రాత్మక సందర్భంలో జరుగుతున్న ప్రమాణ స్వీకారాన్ని పెద్ద సభ ద్వారా ఘనంగా జరుపాలని టీఆర్‌ఎస్ నాయకులు కోరినా.. కేసీఆర్ నిరాడంబరంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేయడం వైపే మొగ్గుచూపారని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో పేచీ తప్పదని స్పష్టంచేశారు. భవన నిర్మాణ రంగానికి తెలంగాణలో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. భవన నిర్మాణ రంగంలోని సమస్యలపై తాను గొంతెత్తుతానని హామీఇచ్చారు. హైదరాబాద్ నగరాన్ని ఇష్టారీతిన కాకుండా ఒక క్రమపద్ధతిలో నిర్మించుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవన్నారు. త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వంలో అర్బన్ డెవలప్‌మెంట్, మున్సిపాలిటీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యముంటుందన్నారు. తమ ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా ఉంటుంది తప్ప.. ఆటంకాలు సష్టించబోదని చెప్పారు. మూడు నెలల తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. భూమలు కొనాలనుకున్నవారు ఇప్పుడే కొనుగోలు చేయాలని సూచించారు. భవన నిర్మాణ రంగంలోని సమస్యలపై కేసీఆర్‌తో త్వరలో భేటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తానన్నారు.
సమస్యల పరిష్కారంపై చొరవ చూపండి: టీబీఎఫ్ భవన నిర్మాణ రంగంలో చాలా సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి చొరవ చూపాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ కేటీఆర్‌ను కోరింది. చైర్మన్ వెంకటరెడ్డి, ప్రెసిడెంట్ సీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ భవన నిర్మాణాలకు గ్రీన్‌చానల్ ద్వారా ఇన్‌స్టంట్ పర్మిషన్ ఇవ్వాలని కోరారు. తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టీబీఎఫ్ ప్రధాన కార్యదర్శి అమిరుద్దీన్, గోపాల్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.