తెలంగాణ భవన్‌లో ఆదివారం అంబర్‌పేట, ధూల్‌పేట, ఉప్పల్ ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, హైదరాబాద్ ఇప్పుడు టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నదన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలు ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయని మంత్రి చెప్పారు. రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ చుట్టూ చీకట్లు కమ్ముకుంటాయని అన్నారుగానీ, ఇప్పుడు హైదరాబాద్‌లోనే కాదు.. ఆదిలాబాద్‌లోని గోండు గూడాల్లో కూడా కరెంటు కోతలు లేవన్నారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ నగరంలోనే నాలుగు గంటలపాటు కరెంటు కోతలు అమలయ్యేవని, పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు దగ్గర ధర్నా కూడా చేసిన సందర్భం ఉందన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ చుట్టూ రూ.2వేల కోట్లతో విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఒక గ్రిడ్ నుంచి కరెంటు కట్ అయినా మరో గ్రిడ్ నుంచి తీసుకునేలా… 24 గంటల పాటు కరెంటు ఉండేలా విద్యుత్ ఐలాండ్ నిర్మించబోతున్నారని మంత్రి చెప్పారు.

ఒకప్పుడు ముంబైని నెవర్ స్లీప్ నగరం అనేవారని… కానీ ఇప్పుడు హైదరాబాద్‌ను నెవర్ స్లీప్ (సెకను కరెంటు పోకుండా) నగరంగా చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. రూ.5.30 లక్షలతో నిర్మించే డబుల్ బెడ్ రూం ఇండ్లు దేశంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శమని, నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా ఇండ్లు నిర్మించాలనే ఆలోచన చేయడానికి కూడా ధైర్యం కావాలన్నారు. తాను రెండు రోజుల కిందట మధ్యప్రదేశ్ వెళ్లినపుడు అక్కడ ప్రభుత్వ పక్కా గృహాల గురించి వాకబు చేస్తే… ఒక దగ్గర రూ.75వేలు, మరో దగ్గర రూ.లక్షతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని… కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంతో పేదల ఇండ్లు సాకారం కావడం దేశానికే ఒక రోల్ మోడల్ అని కొనియాడారు. గత 30 ఏండ్లలో ఎన్నడూలేని విధంగా రిజర్వాయర్లలో నీటి కొరత ఏర్పడిందని, జంట జలాశయాలు, సింగూరులోనూ నీళ్లు లేవన్నారు.
కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరించినందున నగరంలో తాగునీటి సంక్షోభం తప్పిందన్నారు. రెండేండ్ల తర్వాత రావాల్సిన గోదావరి జలాల్ని… సీఎం కేసీఆర్ ప్రతీక్షణం పనుల్ని పర్యవేక్షించి రెండు నెలల్లోనే తీసుకువచ్చారని చెప్పారు. సీఎం ముందుచూపుతో వ్యవహరించకపోతే హైదరాబాద్ నగరం ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొనేదన్నారు. చెన్నై, బెంగళూరులాంటి నగరాల్లో కంటే హైదరాబాద్‌లోనే ఒక వ్యక్తికి ఇచ్చే నీటి పరిమాణం (పర్ కాపిటా వాటర్) ఎక్కువ అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీళ్లు అందిస్తున్న ఘనత కూడా హైదరాబాద్‌కే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి పేదల పక్షపాతి అయినందున గ్రేటర్ హైదరాబాద్‌లో నిరుపేదల నల్లా, విద్యుత్ బిల్లుల బకాయిలను మాఫీ చేశారని, తద్వారా 15 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు.
కాంగ్రెస్, టీడీపీ హయాంలో పేదల గుడిసెల్ని బుల్డోజర్లతో కూల్చివేసేవారని, కానీ సీఎం కేసీఆర్ లక్ష మందికిపైగా నిరుపేదలకు గుడిసెలు ఉన్న స్థానంలోనే పట్టాలిచ్చారన్నారు. షాదీ ముబారక్ ద్వారా ప్రతి నిరుపేద ఇంట్లో అమ్మాయి పెండ్లికి ప్రభుత్వం రూ.51వేలను ముందుగానే వారి ఖాతాలో వేస్తుందన్న హరీశ్‌రావు, తాను మధ్యప్రదేశ్‌లో ఇలాంటి పథకాన్ని చూసినపుడు ప్రభుత్వపరంగా ఒక హాల్‌లో చేపట్టే సామూహిక వివాహాల్లో పెండ్లి చేసుకున్న వారికి కేవలం రూ.25వేలు.. అందునా సామాగ్రి ఇస్తున్నారని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్‌లో కష్టపడే కార్యకర్తకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందని, అందుకే వరంగల్ ఎంపీగా గెలిచిన దయాకర్ నిదర్శనమన్నారు. పేదవాడైన దయాకర్‌కు పార్టీ టికెట్ ఇచ్చి… గెలిచిపించిందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ ఎవరైతే ప్రజల మధ్య ఉంటరో వారికే అవకాశాలు వస్తాయన్నారు. టీఆర్‌ఎస్ నేత గట్టు రామచంద్రారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్, అంబర్‌పేట, ఉప్పల్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిలు సుధాకర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.