-పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వక విధానం -టీ పారిశ్రామికవేత్తల సమ్మేళనంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్

విశ్వనగరమైన హైదరాబాద్‌ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని టీఆర్‌ఎస్ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన తెలంగాణ పారిశ్రామికవేత్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌కు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ సుదీర్ఘకాలంలో నగరం అభివృద్ధి పథంలో ముందుకు సాగింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనువైన సమశీతోష్ణ స్థితి హైదరాబాద్‌లో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ప్రజలు తరలివచ్చి ఈ నగర అభివృద్ధిలో పాలు పంచుకున్నారు. జాతి, కుల, మత ప్రస్తావన లేకుండా అందరూ ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నారు. అందుకే ఇది మినీ ఇండియాగా మారింది. భౌగోళికంగా ఈ నగరం తెలంగాణ ప్రభుత్వంలో ఉంటుంది. ఐనా ఇది ప్రపంచ నగరం. అందరికీ చెందుతుంది. ఎవరైనా నిశ్చింతగా ఇక్కడ జీవించవచ్చు అని ఆయన చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఎలాంటి శంకలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పెట్టుబడులకు ఎర్ర తివాచీ పరుస్తామని, హైదరాబాద్ బ్రాండ్‌ఇమేజ్ పెంచుతామని చెప్పారు. కేసీఆర్ నేతత్వంలో రానున్న ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వక సంబంధాలు నెరుపుతుందని, సింగిల్ విండో విధానం అమలు చేసి పారిశ్రామికవేత్తలకు సహకరిస్తుందన్నారు. తెలంగాణ అభివద్ధిపై కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. నిర్మాణాత్మకమైన సూచనలు ఎవరిచ్చినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక కారిడార్.. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం తాము అనేక ప్రణాళికలను సిద్ధం చేశామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌కు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. సంగారెడ్డి, భువనగిరి, షాద్‌నగర్ పట్టణాలను కలుపుతూ ఈ రీజినల్ రింగ్ రోడ్డు ఉంటుందని ఈ పరిధిలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించి ఇండస్ట్రీయల్ కారిడార్లను నిర్మిస్తామని చెప్పారు. ఈ పరిధిలో అనేక శాటిలైట్ టౌన్‌షిప్పులు కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకోసం భారీవ్యయంతో ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును సమర్థంగా అమలు చేస్తామన్నారు.
దీని ద్వారా రానున్న 25 ఏళ్లలో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 50 లక్షల ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 72 కి.మీ. ప్రతిపాదించిన మెట్రో రైలు మార్గాన్ని 250 కి.మీ. వరకు విస్తరించాలని నిర్ణయించామని చెప్పారు. ఫలితంగా నగరంలో రవాణా వ్యవస్థ బలోపేతమవుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ హైదరాబాద్ బ్రాండ్‌ఇమేజ్ పరిరక్షిస్తామన్నారు. తెలంగాణను అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయని, కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటికే దీనిపై పూర్తి అధ్యయనం జరిగిందని చెప్పారు. సంపన్న ప్రాంతమైన సీమాంధ్రకే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వంకూడా కేంద్రంతో పోరాడి ప్రత్యేక స్టేటస్ హోదాను సంపాదిస్తుందన్నారు.
కేంద్రంలో ఎవరున్నా.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందులుటాయనే వాదనను కేటీఆర్ తోసిపుచ్చారు. కేంద్రంలో పదేళ్లుగా యూపీఏ ప్రభుత్వం కొనసాగిన కాలంలోనే గుజరాత్‌లో మోడీ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి సాధించిందని గుర్తుచేశారు. అభివృద్ధి సాధించాలనే సంకల్పం ఉంటే ఇవేవీ అడ్డురావని, ఆ సంకల్పం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో ఇవాళ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నా, రేపు మరో ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి విషయంలో అంతా రాజకీయాలు పక్కన పెట్టాలని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్ని రాజకీయాల మాట్లాడినా ఆ తర్వాత మాత్రం రాజకీయవాదులుగా కాకుండా రాజనీతిజ్ఞులుగా వ్యవహరించాలని ఆయన అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు.
అవినీతి నిర్మూలనే లక్ష్యం జూన్ రెండో తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్ అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నారని కేటీఆర్ చెప్పారు. పార్టీ సభ్యులెవరైనా అవినీతికి పాల్పడితే సస్పెండ్ చేసి, చర్యలు తీసుకుంటామని టీఆర్‌ఎస్ శాసనసభ, పార్లమెంటు సభ్యుల సమావేశంలోనే హెచ్చరించారని తెలిపారు. ఐదేళ్లల్లో 100 శాతం హామీలను నెరవేరుస్తామన్నారు. ఈ లక్ష్యంతోనే దేశంలోనే అతి పెద్ద సంస్థ కోల్ ఇండియాకు చైర్మన్‌గా ఉన్న నర్సింహరావును ప్రభుత్వంలో పని చేసేందుకు కేసీఆర్ ఆహ్వానించారని, ఆయన కూడా సకల వైభోగాలను వదిలిపెట్టి సొంత ప్రాంతానికి సేవలందించేందుకు వస్తున్నారని కొనియాడారు.
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభాన్ని కూడా వీలైనంత త్వరలో అధిగమిస్తామన్నారు. మొదటి మూడేళ్ల వరకు సమస్యలు ఉంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. హైదరాబాద్‌కు 420 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.. కానీ ఒకాయన తానే హైదరాబాద్‌ను నిర్మించానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఆయన వయసెంతో తెలుసుకోవాలన్నారు. చార్మినార్, గోల్కొండ వంటి అనేక నిర్మాణాలు ఒక్క ఏడాదిలోనే నిర్మాణం కాలేదని గుర్తు చేశారు.
సమస్యల ఏకరువు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఆవిర్భావంతో తలెత్తే సమస్యలను పారిశ్రామికవేత్తలు కేటీఆర్‌తో ఏకరువు పెట్టారు. పన్నులు, వ్యాట్, సీఎస్‌టీ, జీఎస్‌టీ వంటివి తగ్గింపు, ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్స్ పెంపు వంటి అంశాలను వారు వివరించారు. స్థానిక నాయకుల వేధింపుల నుంచి పరిశ్రమలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు రవిప్రసాద్ ఎలిశెట్టి, సురేశ్ సింఘాల్, బేషంబర్ దయాల్‌జీలు తెలంగాణలో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటోన్న సమస్యలపై మాట్లాడారు. కార్యక్రమంలో టీ శ్రీధర్, శేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.