-టీఆర్‌ఎస్ గెలిస్తే నియోజకవర్గానికి లాభం -కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు మాత్రమే లాభం -చేసిన పనులు చెప్పి ఓట్లడుగుతాం -నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సభ -తాజా సర్వేలో టీఆర్‌ఎస్‌కు 54.64% ఓట్లు – మీడియాతో ఇష్టాగోష్ఠిలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్

హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగురటం ఖాయమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గానికి లాభమని, కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాత్రమే లాభమని అన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉపఎన్నిక షెడ్యూలు విడుదలైన తర్వాత చేసిన సర్వేలో టీఆర్‌ఎస్‌కు 54.64%, కాంగ్రెస్‌కు 42% ఓట్లు వస్తాయని తేలిందని తెలిపారు. ఎన్నిక మొదట్లోనే రెండు పార్టీల మధ్య 14% ఓట్ల తేడా ఉన్నదని, ఇక ప్రచారం మొదలుపెట్టి, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగితే టీఆర్‌ఎస్ ఓట్లు మరింత పెరిగే అవకాశమున్నదని చెప్పారు. బీజేపీకి 2.55%, ఇతరులకు 0.71% ఓట్లు రావచ్చని పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు దశలవారీగా సర్వేలు చేస్తామని తెలిపారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి సాంకేతికంగానే ఓడిపోయారన్నారు. ఉత్తమ్ గెలిస్తే ఏదో ముఖ్యమైన పదవి వస్తుందని చేసిన ప్రచారానికితోడు ట్రక్కు గుర్తు ఉండటంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓటమిపాలయ్యారని చెప్పారు. తమ ప్రభు త్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లడుగుతామని కేటీఆర్ తెలిపారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి పుష్కలంగా నీళ్లువచ్చి రైతులకు నీళ్లు అందుతున్నాయన్నారు. ఇటీవలి హుజూర్‌నగర్ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 12,500 ఓట్ల మెజార్టీ వచ్చిందని, నాలుగు ఎంపీపీలను తమ పార్టీ కైవసం చేసుకున్నదని గుర్తుచేశారు. కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు మోతీలాల్ తన సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. తాము ప్రతి ఎన్నికను సీరియస్‌గానే తీసుకుంటామని, నియోజకవర్గంలో ప్రచారం ఎలా నిర్వహించాలన్నదానిపై ఇంచార్జిలకు సూచనలు చేశామని చెప్పారు. అన్ని బూత్ కమిటీలతో ఇంచార్జిలు సమావేశమై.. సమన్వయంతో ప్రచారం కొనసాగిస్తారని, పూర్తిస్థాయి ఎన్నికల ప్రణాళికను త్వరలో ఖరారుచేస్తామని వివరించారు. నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ బహిరంగసభ ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తమ అభ్యర్థి సైదిరెడ్డి స్థానికుడని, కాంగ్రెస్ అభ్యర్థి స్థానికేతరురాలని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందన్న కేటీఆర్.. పది నెలలనాటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిర్వీర్యమైందన్నారు. ఆ పార్టీ నాయకత్వంమీద నమ్మకం లేక 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యారన్నారు. రైతులకు సీఎం కేసీఆర్ ఏం చేశారో వారికి తెలుసని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికస్థానాలు గెలిచామని.. ఓడిపోయిన ఒకటిరెండు సీట్లు కూడా వెంట్రుకవాసిలో పోయాయన్నారు. అటు ఈవీఎంలలోనూ.. ఇటు బ్యాలెట్ పోరులోనూ టీఆర్‌ఎస్ గెలిచిందని తెలిపారు. కాంగ్రెస్ నేతల మాటలకు విలువలేదన్న కేటీఆర్.. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు, తర్వాత అసెంబ్లీ ఎన్నికలప్పుడు పీసీసీ అధ్యక్షుడు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ సవాళ్లు విసిరారో గుర్తుచేశారు. ఉత్తమ్‌ది ఏనాడూ మాటమీద నిలబడే తత్వం కాదని మంత్రి కేటీఆర్ అన్నారు.
మున్సిపల్ ఎన్నికలపై దృష్టి.. మున్సిపల్ ఎన్నికలు రానున్న దృష్ట్యా ఎమ్మెల్యేలు, మంత్రులు వారివారి నియోజకవర్గాలపై దృష్టిపెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకే వారికి హుజూర్‌నగర్ బాధ్యతలు అప్పగించలేదన్నారు. మున్సిపల్ ఎన్నికలపై గురువారం హైకోర్టు తీర్పిస్తే నాయకులు ఆ హడావుడిలో ఉంటారన్నారు. హుజూర్‌నగర్ ఎన్నిక హడావుడితోపాటు.. మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తుండటంతో నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పష్టంగా చెప్పలేమని తెలిపారు. ఉద్యోగాల భర్తీపై కోర్టుల్లో ఉన్న కేసులను త్వరగా తేల్చే విధంగా అన్ని శాఖలు ప్రయత్నించాలని సీఎం సూచించారన్నారు. మెట్రో ప్రమాదంపై వెంటనే ఎల్‌అండ్‌టీతో సంప్రదింపులు జరిపి, మృతురాలి కుటుంబానికి సాయమందించేలా చర్యలు తీసుకొన్నామని, నిర్మాణ నాణ్యతపై స్వతంత్ర ఇంజినీర్లతో విచారణకు ఆదేశించామని చెప్పారు. పార్టీ గ్రామ, మండల కమిటీలు పూర్తయ్యాయని, వాటన్నంటినీ సీఎం కేసీఆర్‌కు నివేదించామని, ఇతర కమిటీలను ఎప్పుడు వేయాలనేది సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలి హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ ఇంచార్జీలను ఆదేశించారు. హుజూర్‌నగర్‌లో.. టీఆర్‌ఎస్ గెలిస్తే నియోజకవర్గానికి లాభం- కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు లాభమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణభవన్‌లో బుధవారం హుజూర్‌నగర్ ఉపఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహంపై విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా పలువురు ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు.
పార్టీ ఇంచార్జీలు తమకు అప్పగించిన మండలాలు, మున్సిపాలిటీలో తమ బృందాలతో పర్యటించాలన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఆసరా, నిరంతర విద్యుత్‌సరఫరా తదితర అంశాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పాలకీడు జెడ్పీటీసీ సభ్యుడు మోతీలాల్ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా మోతీలాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి, ఎమ్మెల్యే ఎన్ భాస్కర్ రావు, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు పాల్గొన్నారు.
పార్టీ అభ్యర్థి విజయానికి కృషిచేస్తా: శంకరమ్మ టీఆర్‌ఎస్ నేత శంకరమ్మ తెలంగాణభవన్‌లో మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, హుజూర్‌నగర్ ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపునకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతానని, పార్టీని వీడబోనని ఆమె స్పష్టంచేశారు. కేసీఆర్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నానని ఆమె వెల్లడించారు.