– సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారు.. – ప్రతిపక్షాల దుష్ప్రచారానికి సమాధానం చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీది గాలివాటమని తేలింది.. – బీజేపీ..అంటే బిల్డప్ జనతా పార్టీగా మారింది.. – ఉపఎన్నికలో విజయం మరింత బాధ్యత పెంచింది మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘనవిజయాలు సాధిస్తాం.. – టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్

ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, లేవనెత్తిన అర్థరహిత ప్రశ్నలన్నింటికీ హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ప్రజలే సమాధానం చెప్పారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. హుజూర్‌నగర్‌లో సాధించిన విజయం టానిక్‌లాంటిదని.. పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పా రు. ఉపఎన్నికలో బీజేపీ గాలిలో ఎగిరిపోయిందని.. రాష్ట్రంలో ఆ పార్టీ బిల్డప్ జన తా పార్టీగా మారిందని ఎద్దేవాచేశారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ విజయం కోసం కృషిచేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో సోమవారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ విజయం కోసం పనిచేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హుజూర్‌నగర్ విజయం తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందని, గత కొంతకాలంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ప్రజలే ఓట్ల రూపంలో సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ప్రజలకు సరైన పరిపాలన అందిస్తే వారే కడుపులో పెట్టుకుని దాచుకుంటారంటూ ముఖ్యమంత్రి చెప్పే మాటలకు.. ప్రజలపై సీఎంకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమే హుజూర్‌నగర్ ఫలితమన్నారు. ఉప ఎన్నిక ద్వారా ఏ పార్టీ బలం ఎంతో తేలిపోయిందని.. స్వయంగా టీపీసీసీ చీఫ్ సొంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని కేటీఆర్ చెప్పారు. కొంతకాలంగా బీజేపీ చేస్తున్న మాటల హడావుడి ప్రచార పటాటోపమని తేలిపోయిందని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు గాలివాటమేనని తేలిపోయిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న బలమేమిటో ఇప్పటికైనా గుర్తించాలని చురకలంటించారు. ప్రతిఎన్నికల్లో కొన్ని గుర్తులు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు నష్టం చేస్తున్నాయని.. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి తప్పు జరుగకుండా పరిష్కారం చూడాలని.. ఈ బాధ్యతను పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీసుకోవాలని సూచించారు.

హామీలు అమలుచేసి రుణం తీర్చుకోవాలి ఉప ఎన్నికలో విజయంతో టీఆర్‌ఎస్ శ్రేణులపై మరింత బాధ్యత పెరిగిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింతగా పనిచేయాలని మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి హుజూర్‌నగర్ ప్రజల రుణం తీర్చుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఇందుకోసం ప్రత్యేక కృషి చేయాలని చెప్పారు. హామీలను నెరవేర్చుకునేలా స్థానిక పార్టీ శ్రేణులు కూడా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. గతంలో హుజూర్‌నగర్‌లో అధికార దుర్వినియోగం, కక్ష్యసాధింపు చర్యలుండేవని.. కానీ ఇకనుంచి ఆ ప్రాంతంలో ఇలాంటి చర్యలు కనిపించవని పార్టీ నేతలకు హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల బాధ్యత స్థానిక నేతలదే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదని, ఈ ఎన్నికల బాధ్యతలను ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, నేతలు తీసుకుని ప్రణాళికాబద్ధంగా.. పక్కా వ్యూహంతో ముందుకు పోవాలని కేటీఆర్ సూచించారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని.. ఒక్క ఓటుతో ఓడిపోయిన సందర్భాలను గుర్తుచేసుకోవాలని సూచించారు. ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉన్నదని వివరించారు.

కేసీఆర్ పాలనకు పట్టం: మంత్రులు రాష్ట్రంలో ప్రతిఒక్కరి సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలపై సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజల్లో అపూర్వ స్పందన ఉన్నదని మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. హుజూర్‌నగర్ పార్టీ విజయం కోసం కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనకు పల్లె, పట్నం ప్రజలు ముగ్దులయ్యారన్నారు. ఈ ఎన్నిక సీఎం కేసీఆర్ నాయకత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహానికి దక్కిన ఫలితమని పేర్కొన్నారు. ఉపఎన్నిక ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన కృషిని ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎంపీలు మాలోతు కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, నోముల నర్సింహయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎన్ భాస్కర్‌రావు, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, చీఫ్‌విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్.. మంత్రి కేటీఆర్‌కు పూలమొక్క ఇచ్చి సన్మానించారు.