హోంగార్డులపై వరాల జల్లు
– ఇది రెండో పోలీసు వ్యవస్థ – హోంశాఖకు వెన్నెముక – త్వరలో వెట్టి చాకిరీ నుంచి విముక్తి – తెలంగాణ హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ సభలో హోంమంత్రి నాయిని]
పోలీసు శాఖలో వెట్టిచాకిరీకి గురవుతున్న హోంగార్డులకు త్వరలోనే న్యాయం చేస్తామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. మొదటి పోలీసు వ్యవస్థకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తున్న హోంగార్డులు రెండో పోలీసు వ్యవస్థ అని అభివర్ణించారు. రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన తెలంగాణ హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ సభలో పాల్గొన్న హోంమంత్రి వారి సమస్యలు, ఇబ్బందుల పట్ల సానుకూలంగా స్పందించారు. పోలీసు జవాన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా హోంగార్డులు పనిచేస్తున్నారన్నారు. రూ.9000 వేతనంతో హోంగార్డుల కుటుంబాలు జీవించడం నిజంగా ఇబ్బందికరమేనన్నారు. హోంగార్డులు లేనిదే పోలీసు శాఖ ముందుకెళ్లలేదన్నారు. శాఖకు వెన్నెముక పనిచేస్తున్న హోంగార్డులను అన్నివిధాల ఆదుకుంటామన్నారు. హోంగార్డులకు త్వరలో బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
ఆరోగ్య భద్రత కింద రూ.లక్ష విలువ చేసే హెల్త్‌కార్డులు, వారంతపు సెలవులు, సర్వీసుల క్రమబద్దీకరణ, కానిస్టేబుళ్లతో సమాన హోదా, అలవెన్స్‌లు, మహిళ హోంగార్డులకు ప్రసూతి సెలవులు, ఐడీ కార్డుల జారీపై సీఎం కేసీఆర్, డీజీపీలతో చర్చించి సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. హోంగార్డులను వారికి నిర్దేశించిన విధుల్లోనే నియమించాలని అధికారులను ఆదేశించామన్నారు. అధికారుల ఇళ్లలో పని చేస్తున్న హోంగార్డులకు త్వరలోనే ఉపశమనం కల్గిస్తామని, వెట్టి చాకిరీ చేయిస్తున్న అధికారులపైనా చర్యలుంటాయన్నారు.
హోంగార్డుల పలు డిమాండ్లను హోంమంత్రి నాయినికి వివరించిన ఆ సంఘం గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వారి సర్వీసుల క్రమబద్దీకరణకు కృషి చేస్తానన్నారు. హోంగార్డ్స్ డీఐజీ అజయ్‌కుమార్ మాట్లాడుతూ హోంగార్డుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం, ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. హోంగార్డులు తమ డిమాండ్లపై హోంమంత్రి నాయినికి వినతిపత్రం సమర్పించారు. తమ కార్యక్రమానికి హోంమంత్రి రావడం అదృష్టమంటూ ఘనంగా సత్కరించారు.
కేంద్రంపై సుప్రీంకెళ్తాం.. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల నిర్వహణ అధికారాలను గవర్నర్‌కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖపై సుప్రీం కోర్టుకెళ్తామని హోంమంత్రి నాయిని చెప్పారు. ఈనెల 18న ఢిల్లీలో జరిగే సమావేశంలో కేంద్రం వైఖరి స్పష్టం కానున్నదని చెప్పారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కేంద్రం నిర్ణయంలో ఏం చేయడానికైనా సిద్ధమేనని నాయిని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.