-ప్రతి పేదవాడికీ ఆరోగ్యం.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం -హెల్త్ టూరిజాన్ని ప్రోత్సహిస్తాం -ప్రతి జిల్లాలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తాం -ఇండో గ్లోబల్ ఆరోగ్య సదస్సులో ఐటీ మంత్రి కేటీఆర్

ఆర్యోగ్యం ధనవంతులకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడకీ అందజేయడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, సాంకేతిక శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలోని కార్పొరేట్ వైద్యానికి చేయూతనిస్తూనే ప్రజారోగ్యానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేయనున్నదన్నారు. ఉన్నతమైన వాతావరణ స్థితి ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు కలిగిన హైదరబాద్ నగరాన్ని హెల్త్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇండో గ్లోబల్ అంతర్జాతీయ ఆరోగ్య పరిరక్షణ మూడురోజుల సదస్సును హోటల్ తాజ్‌కష్ణలో మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యపరిరక్షణ రంగానికి ప్రాధాన్యతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని అన్నారు. హైదరబాద్‌లో దాదాపు 30 దేశాలు పెద్దఎత్తున సదస్సు నిర్వహించడం చరిత్రాత్మకమన్నారు.
ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులందించే వైద్య విధానాన్ని క్రమబద్దీకరించి గ్రామీణ పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. హెల్త్ టూరిజానికి హైదరాబాద్ లో ప్రోత్సహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మల్టీస్పెషాలిటీ దవాఖానలను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిమ్స్ ఆస్పత్రిని ఎయిమ్స్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌లో తప్ప తెలంగాణ జిల్లాలో మెరుగైన ఆస్పత్రులు లేవని అదిలాబాద్, ఖమ్మం, వరంగల్ తదితర ఏజెన్సీ జిల్లాల్లో వైద్యం అందక రోగులు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యరంగానికి ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్‌ను రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్‌తోపాటు హెల్త్ కార్డులతో ఉచిత వైద్యాన్ని అందించనున్నదన్నారు. వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను తక్షణమే పూర్తిచేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కేటీఆర్ ప్రకటించారు.
బీబీనగర్ నిమ్స్‌ను తొమ్మిది నెలల్లోపు ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కేంద్రం సమన్వయంతో అందరికీ ఆరోగ్యం లక్ష్యాన్ని 2022 వరకు చేరుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. శ్రీనాథ్ రెడ్డి కమిటీ సిఫార్సులను అమలుచేసి ఆరోగ్య సేవల పన్నుల విధానాన్ని క్రమబద్ధీకరిస్తామన్నారు. సీఎం కేసీఆర్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండగా, అనివార్యకారణాల వల్ల రాలేకపోయారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్ తను మాట్లాడడంతోపాటు సీఎం పంపిన ప్రసంగ పాఠాన్ని సదస్సులో చదివి వినిపించారు. శుక్రవారం ప్రారంభమైన సదస్సు శని ఆదివారాలు కూడా కొనసాగనున్నది.
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు అందజేత వైద్య ఆరోగ్యరంగంలో విశిష్ట సేవలందించిన పలువురు వైద్యరంగ నిపుణలకు కేటీఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు అందజేశారు. ఇందులో అమెరికా తదితర దేశాల ప్రముఖులతోపాటు దేశంలో ప్రఖ్యాతిగాంచిన కాకర్ల సుబ్బారావు, హబీబ్ ఘటాలా, కేవీ కృష్ణారావు తదితర వైద్యరంగ నిపుణులు ఉన్నారు.
ఆరోగ్య పరిరక్షణ రంగంలో గణనీయ అభివృద్ధి: అర్హా రానున్న రోజుల్లో దేశీయ ఆరోగ్య పరిరక్షణ రంగం గణనీయంగా అభివృద్ధిని సాధించనున్నదని ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ సీడీ అర్హా తెలిపారు. 2017 సంవత్సరానికి ఇప్పుడున్న 70 బిలియన్ డాలర్లనుంచి 145 బిలియన్ డార్లకు చేరుకోనున్నదని వివరించారు. 2020 వరకు 280 బిలియన్ల డాలర్ల మేర దేశీయ రంగం అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన సదస్సు దేశంలో 29 రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు సదస్సు శుభాకాంక్షలు తెలిపింది. 60 ఏళ్ల పోరాటం, ఎన్నో త్యాగాలతో తెలంగాణ కల సాకారమయ్యిందని వక్తలు పేర్కొన్నారు. పధ్నాలుగు సంవత్సరాలపాటు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌దేనని వక్తలు కొనియాడారు. భవిష్యత్తులో తెలంగాణను కేసీఆర్ మరింత అభివృద్ధి చేయగలరనే విశ్వాసాన్ని వారు ప్రకటించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ పోషించిన పాత్రను తెలంగాణ సాధనలో కేసీఆర్ పోషించారని అన్నారు. కార్యక్రమంలో ఇండస్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎస్ బీ అనుమోలు, చైర్మన్ సీడీ అర్హా, శ్రీనివాస్‌బాబు, విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు.