Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

హ్యాట్రిక్‌ ఖాయం.. మూడోసారీ విజయం బీఆర్‌ఎస్‌దే

కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ఇటీవల కాలంలో విపక్షాలపై, తమకు ఎదురు నిలబడే, తమను ప్రశ్నించేవారిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో బీజేపీ దాడులు చేయిస్తున్నదని చెప్పారు. ఎన్నికలు వస్తున్నందున రాష్ట్రంలోని నేతలను లొంగదీసుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నదని తెలిపారు. మంత్రులు గంగుల కమలాకర్‌, మల్లారెడ్డిపై ఈడీ, ఐటీలతో దాడులు చేయించారని, వద్దిరాజు, పార్థసారథి రెడ్డి, నామా నాగేశ్వరావు, ఎల్‌ రమణ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి.. ఇలా అనేక మందిపై ఐటీ, ఈడీ, సీబీఐలతో కేసులు పెట్టించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నదని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా నా కూతురు కవితను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈడీ విచారణకు పిలిచాయి. విచారణకు సహకరిస్తుంది. కేసులకు, అరెస్టులకు మనం భయపడతామా? ప్రజాక్షేత్రంలో గెలవలేని బీజేపీ.. కేసుల పేరుతో మననేతల వెంటపడుతున్నది’ అని కేసీఆర్‌ అన్నారు. న్యాయపరంగా, చట్టబద్ధంగా బీజేపీ ఆగడాలను ఎదుర్కొంటామని ప్రకటించారు. రాక్షసులు, పిచ్చి కుక్కలతో కొట్లాడే సమయంలో కొన్ని గాట్లుపడ్తాయని, అయినా వాటిని పొలిమేరలుదాటే వరకు తరమాల్సిందేనని కేసీఆర్‌ ఉద్ఘాటించారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పటాపంచలు చేశారు. షెడ్యూల్‌ మేరకే ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు. సర్వేలన్నీ బీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలనే ఇస్తున్నాయని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం తెలంగాణభవన్‌లో జరిగింది. ఇందులో కేసీఆర్‌ ప్రసంగం నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మళ్లీ గెలిచివస్తారంటూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన అధినేత.. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్నీ నొక్కి చెప్పారు. గెలుస్తామనే ధీమాతో ఇంట్లో పడుకోవద్దని హితవు పలికారు. ‘ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. రాబోయేది మన ప్రభుత్వమే. అదే సమయంలో మూర్ఖంగా ఉండొద్దు. ఎన్నికల్లో గెలిస్తేనే గౌరవం ఉంటుంది. దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్లోకి వెళ్లండి. వారి వెంటే తిరగండి. నేను చెప్పినట్టు వింటే గెలువడం సులువు. అవినీతికి, అక్రమాలకు దూరంగా ఉండండి. ఎలాంటి వివాదాలకూ అవకాశం ఇవ్వొద్దు’ అని అధినేత శ్రేణులకు సూచించారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించి, మూడో పర్యాయం అధికారాన్ని చేపట్టబోతున్నదని ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. సర్వేలన్నీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లే ఆలోచనేదీ లేదని ప్రకటించారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘2014లో 63 మంది ఎమ్మెల్యేలుంటే.. 2018 నాటికి 83కు పెరిగింది. ఇప్పుడు వంద దాటినం. రెండుసార్లు మనం గెలిచినం. మూడోసారి కూడా గెలుస్తం. ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. 99.99 శాతం రాబోయేది మన ప్రభుత్వమే. ఇక్కడున్న మీరంతా మరోసారి ఎమ్మెల్యేలు కావాలి’ అని కేసీఆర్‌ స్పష్టంచేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పెద్దగా సమయం లేదని, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సిద్ధమవ్వాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 2018 డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరిగిందని, డిసెంబర్‌ 11న ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. దీన్నిబట్టి చూస్తే మనకు అక్టోబర్‌- నవంబర్‌లలో ఎన్నికలు ఉండే అవకాశం ఉందన్నారు.

అక్టోబర్‌లోనే ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్‌పై కక్షసాధింపులకు పాల్పడితే సెప్టెంబర్‌లోనే వచ్చే అవకాశం ఉన్నదన్నారు. జూలై- ఆగస్టు నెలల్లో వ్యవసాయ పనులు ఉంటాయని వీటన్నింటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు జాగ్రత్తపడాలని, పూర్తిచేయని పనులు ఏమైనా ఉంటే పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలన్నారు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని, అయితే, ఎన్నికల సంఘం బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని, మూడు నెలల ముందే మనకు ఎన్నికల కోడ్‌ వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని సీఎం పేర్కొన్నారు. తాను చెప్పినట్టు వింటే మళ్లీ ఎన్నికల్లో గెలవడం సుళువవుతుందని కేసీఆర్‌ ఎమ్మెల్యేలకు సూచించారు. మూర్ఖంగా ఉండవద్దని, ఎన్నికల్లో గెలిస్తేనే గౌరవం ఉంటుందని ఉద్బోధించారు. ప్రతీ ఒక్కరు గెలువాలని, దీనికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా తాను ఎమ్మెల్యేలందరికీ పదేపదే చెప్పినప్పటికీ కొందరు పెడచెవినపెట్టారని, అలాంటి ఏడుగురికి మరోసారి టిక్కెట్టు ఇవ్వలేదని కేసీఆర్‌ గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో శ్రేణులనుద్దేశించి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

అడ్డంకులు ఎదురైనా ఆగలేదు.. వెనుదిరుగలేదు..
2000-2001లో ప్రత్యేక రాష్ట్రం కోసం నేను కదిలినరోజున జలదృశ్యంలోనే మన లక్ష్యాన్ని సుస్పష్టంగా చెప్పుకున్నం. అహింసాయుతంగా ఉద్యమాన్ని నడిపి రాష్ర్టాన్ని సాధించుకుందామని చెప్పిన. చెప్పినట్టుగానే మనం పోరాటం చేసినం. అడ్డంకులు సృష్టించినా మనం ఆగిపోలేదు. వెనుదిరగలేదు. పోరాటం చేస్తూనే పోయాం. కొన్ని విజయాలు.. మరికొన్ని అపజయాలు కూడా మూటకట్టుకున్నం. కానీ, లక్ష్యాన్ని వీడలేదు. ప్రయాణం ఆగలేదు. ఉద్యమం నుంచి రాష్ర్టాన్ని సాధించుకున్నప్పుడు మనకు 63 మంది ఎమ్మెల్యేలు ఉండె. ప్రభుత్వం ఉంటదో.. ఊడుతదో అని కాంగ్రెస్‌ వాళ్లు అనేవాళ్లు. మనం అస్థిరంగా ఉండాలన్న ఆలోచనతో కొన్ని శక్తులు పనిచేసేవి.

దూరదృష్టితోనే అభివృద్ధి సాధ్యమైంది..
ప్రజల కోసం తెలంగాణ అనేక పథకాలను అమలు చేస్తున్నది. పథకాలన్నీ ఎన్నికల కోసం ప్రవేశపెట్టినవి కావు. మ్యానిఫెస్టోలో పెట్టి కొన్ని, పెట్టకుండానే కొన్ని అమలు చేసినం. రైతుబంధు, దళితబంధు, రైతుబీమా.. ఇలా పథకాలను ప్రజల కోణంలో ఆలోచించి అమలు చేస్తున్నాం. రైతు అవసరం ఏమిటో.. ముసలమ్మ అవసరం ఏమిటో.. ఒంటరి మహిళలకు ఎలాంటి చేయూత కావాలో.. ఒక పారిశ్రామికవేత్తకు ఏం అవసరమో తెలుసుకుని పథకాలు రూపొందించుకున్నాం. దూరదృష్టితో ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమైంది. గ్రామీణ ఆర్థికవ్యవస్థ పటిష్టమైంది. ప్రజల వద్ద సంపద పెరిగింది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానానికి తెలంగాణ ఎదిగింది.

కూటములు కట్టారు.. కుట్రలు చేశారు
తెలంగాణ ఒక విఫల ప్రయోగం అని నిరూపించేందుకు కొందరు కుట్రలు చేశారు. ఎన్నికల్లో కూటములు కట్టి బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించాలని ప్రయత్నం చేశారు. కానీ, ప్రజలు రెండోసారి కూడా మనకే అధికారం ఇచ్చారు. మనపైనే విశ్వాసం ఉంచారు. ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాలి. రాష్ట్రంలో తాగునీటి గోసం తీర్చినం. సాగునీటి గోస తీరుస్తున్నం. నీటి విషయంలో పాలమూరు-రంగారెడ్డి పూర్తికావాల్సి ఉన్నది. రంగారెడ్డి, వికారాబాద్‌తోపాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతంలో కొన్ని పనులు జరగాల్సి ఉన్నాయి. నెల రోజుల్లోగా దీనిపై ఒక సమావేశం పెట్టి పనులపై అధికారులతో సమీక్షిస్తా. పాలమూరు జిల్లాలో దేవరకద్ర వద్ద ఉన్న చింతకుంటకు ఉద్యమ సమయంలో పోయినప్పుడు చెరువు తుమ్మలతో నిండిపోయి కనిపించింది. అదే చెరువు ఇప్పుడు మత్తడి దుంకేలా నీళ్లతో నిండింది. ఇదీ తెలంగాణ సాధించిన విజయం.

సాగులో రోల్‌మాడల్‌
రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చాం. సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికి రోల్‌మాడల్‌గా నిలిచింది. యాసంగిలో సైతం తెలంగాణ రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. 54.5 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో యాసంగి పంట 16 లక్షల ఎకరాల్లోనే ఉన్నది. తెలంగాణ వ్యవసాయరంగంలో అనేక రికార్డులు సృష్టించింది. వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రస్తుత వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి బాగా పనిచేశారు.

ప్రకటనలు కాదు.. పరిశ్రమలు రావాలి
తెలంగాణలో పారిశ్రామిక విధానం కూడా అద్భుతంగా ఉన్నది. దేశంలో పారిశ్రామిక రంగంలో చెప్పుకునేవి గోల్‌మాల్‌ లెక్కలు ఉంటాయి. ఒకసారి నేను మధ్యప్రదేశ్‌కు వెళ్లిన. అక్కడ అప్పటికే ఓ పారిశ్రామిక ప్రదర్శన జరిగింది. 14.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వేదికమీద ప్రకటించారు. ప్రధాని మోదీ స్వయంగా పాల్గొన్నారు. అప్పుడు అక్కడి పరిశ్రమల మంత్రి యశోధరారాజే సింధియా మాత్రం నాతో మాట్లాడుతూ.. మా లెక్కలు ఏమున్నదిలే కానీ, మీ కొడుకు కేటీఆర్‌ హుషార్‌ ఉన్నాడు. పెద్ద కంపెనీలను తీసుకుపోతున్నడు అని అన్నారు. ఏపీలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నపుడు పారిశ్రామిక ప్రదర్శన (బిజినెస్‌ మీట్‌) పెట్టి 22.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఇటీవల అలాంటిదే ఓ ప్రదర్శన పెట్టి తమకు 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. అంటే ఒక్క ఏపీలోనే 35 లక్షల పెట్టుబడులు వచ్చినట్టా? నిజంగా అంత భారీ పెట్టుబడులను ఆ రాష్ట్రం భరించగలదా? ఒకవేళ నిజంగానే అన్ని వస్తే అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో తెలియదా? బిజినెస్‌ మీట్‌ల పేరుతో చాలా రాష్ట్రాలు చేసే ప్రకటనలు బోగస్‌. వాస్తవదూరంగా ఉంటాయి.

ప్రదీప్‌ చంద్రతో కలిసి తెచ్చిన విధానమిది
పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రదీప్‌ చంద్ర అనే ఐఏఎస్‌ అధికారి ఉన్నప్పుడు ప్రపంచంలోనే అతిగొప్ప పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని చెప్పిన. ఆయనతో కొన్ని గంటలు కూర్చున్న. అప్పుడు పరిశ్రమల శాఖ కూడా నా వద్దనే ఉండేది. అన్ని దేశాలు తిప్పిన. చివరకు అద్భుత పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చినం. ప్రతిరోజూ ఎవరో ఒకరు మన రాష్ట్ర పెట్టుబడి విధానాలను తెలుసుకుంటున్నరు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నరు. ఇప్పటివరకు రెండు లక్షల 80 వేల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి. ఇటీవలే లక్ష కోట్ల వరకు వచ్చాయి. ఇది మనం సాధించిన విజయం. ఐటీలోనూ మనం బెంగుళూరును దాటినం. ఉద్యోగ కల్పనలో మనం బెంగుళూరుకన్నా ముందున్నట్టు నాస్కామ్‌ ప్రకటించింది.

ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలె
మనం సాధించిన విజయాలు చూసి మురిసిపోవద్దు. అక్కడితోనే ఆగిపోవద్దు. సాధించామని గర్వం, అహంకారంతో ఉండడం మంచిది కాదు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. ఎలాగూ మనమే గెలుస్తమని ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చోవద్దు. నేల విడిచి సాముచేయొద్దు. పార్టీ చెప్పినట్టు నడుచుకోవాలి. నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులతో ఎమ్మెల్యేలు సఖ్యతతో ఉండాలి. సమన్వయంతో పనిచేసుకోవాలి. టీమ్‌ వర్క్‌ ఉండాలి. కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకోవాలి. ఏప్రిల్‌ నెలాఖరులోపు ప్రతీ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు జరగాలి. ప్రతీ 10 గ్రామాలను ఒక యూనిట్‌గా ఎమ్మెల్యేలు ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలి. గ్రామ కమిటీల నుంచి ఎంపీల వరకు అందరూ పాల్గొనాలి. నాయకుల మధ్య ఏమైనా పొరపొచ్చాలుంటే ఆత్మీయ సమ్మేళనాల్లో కూర్చొని పరిష్కరించుకోవాలి.

తెలంగాణకు పెట్టుబడి రాని రోజున్నదా?
తెలంగాణాకు ప్రతిరోజూ ఎవరో ఒకరు పెట్టుబడి పేరుతో వస్తూనే ఉన్నరు. యాపిల్‌ కంపెనీ ఆయన వచ్చిండు. అమెజాన్‌ వచ్చింది. నిన్నగాక మొన్న ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ వచ్చిండు. ఆయన అయితే హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ముచ్చటపడ్డాడు. ఇక్కడి ప్రభుత్వ పనితీరు, టీఎస్‌ఐపాస్‌ గురించి వివరించేందుకు ఒక వీడియో వేసి చూపిస్తే.. ఆశ్చర్యపోయిండు. తాను ఇక్కడే పెట్టుబడి పెట్టబోతున్నట్టు ప్రకటించిండు. నన్ను, మన అధికారులను తైవాన్‌ రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించిండు. నాకన్నా మీరే గొప్ప అంటూ కితాబు ఇచ్చిండు. కొరియన్‌ కంపెనీ ఫెడెక్స్‌ సంస్థ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెడుతామని ముందుకొచ్చింది. 7వేల మందికి ఉపాధి ఇస్తామని శుక్రవారమే ప్రకటించింది. ఇట్లా అనేక సంస్థలు వస్తున్నాయి.

అటు అంబేద్కర్‌.. ఇటు అమరుల స్మారకం.. ఎందుకో తెలుసా?
రాష్ట్ర సచివాలయాన్ని చాలా గొప్పగా నిర్మించుకుంటున్నాం. సచివాలయం ముందే అమరవీరుల స్థూపం నిర్మించాం.. ఎందుకో తెలుసా? సచివాలయం వద్దకు వచ్చే ప్రజాప్రతినిధులకు.. అధికారులకు అది ఒక సందేశం. అమరుల త్యాగాలతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ‘బలిదానాలు చేసిన వారిని మరువవద్దు. మనం ఈ రోజు స్వరాష్ట్రంలో ఉండేందుకు వారే కారణం. వారి ఆకాంక్షలను నెరవేర్చడం మన కర్తవ్యం. అమరులే స్ఫూర్తిగా తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఈ కర్తవ్యాన్ని మరవకుండా అమరుల త్యాగాలు నిత్యం మనకు స్ఫురణకు వచ్చేలా స్మారకం గుర్తుచేస్తూ ఉంటుంది. అందుకోసమే దాన్ని అక్కడ నిర్మించాం.

ఇక సచివాలయానికి వెళ్లేదారిలో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహం కొలువుదీరుతున్నది. ఎందుకు? అంబేద్కర్‌ రాజ్యాంగ నిర్మాత. ఆయన నీడలో మన పాలన సాగాలి. అంబేద్కర్‌ ప్రబోధించిన విధంగా పేదలు, నిరాశ్రయుల పక్షాన మనం ఉండాలి. ఆయన ప్రవచించిన సిద్ధాంతాలను, విధానాలను మనం అనుసరించాలి. దీన్ని అనునిత్యం గుర్తుచేసేందుకే అక్కడ ఆయన విగ్రహం పెడుతున్నం. అమరవీరుల స్మారకమైనా, అంబేద్కర్‌ విగ్రహమైనా మన కర్తవ్యాన్ని నిరంతరం గుర్తుచేస్తాయి. వీటి వల్ల అధికారులు, ప్రజా ప్రతినిధుల ఆలోచనల్లో కొంతైనా మార్పు వస్తుందనేది నా భావన.

– ముఖ్యమంత్రి కేసీఆర్‌

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్నం
మహారాష్ట్ర రాజకీయాల్లో భారత రాష్ట్రసమితి సంచలనం సృష్టించబోతున్నదని, బీఆర్‌ఎస్‌లో చేరికలు భారీగా పెరిగాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రతిరోజూ మహారాష్ట్రకు చెందిన అనేకమంది నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతామంటూ ఫోన్లు చేస్తున్నారని, ఇక్కడకు వచ్చి కలిసివెళ్తున్నారని అన్నారు. నాందేడ్‌ సభ విజయవంతం కావడం, తెలంగాణ పథకాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో అక్కడి ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నదని అన్నారు. సీఎం కిసాన్‌ యోజన పేరుతో ప్రతీ రైతుకు రూ.6వేలు ఇవ్వాలని నిన్ననే నిర్ణయించారని చెప్పారు. ఒక్కసారి కేసీఆర్‌ వచ్చిపోతేనే అక్కడి ప్రభుత్వం ఏడాదికి ఆరువేలు ఇస్తున్నదని, ఇక మహారాష్ట్రలో గులాబీజెండా వస్తే ఇంకెంత మేలు జరుగుతుందోనని రైతులు ఆలోచిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. మహారాష్ట్రలో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తున్నదని చెప్పారు. రాబోయే జిల్లాపరిషత్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీచేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం (బీఆర్‌ఎస్‌వీ)కార్యకలాపాలను విస్తరించాలని సీఎం కేసీఆర్‌ శ్రేణులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ నుంచి సభ్యత్వ నమోదుతోపాటు కార్యక్రమాలను విసృత పరిచాలని ఆదేశించారు.

ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ
‘ట్యాంక్‌బండ్‌ వద్ద 125 అడుగల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏప్రిల్‌ 14 తేదీన అంబేద్కర్‌ మహాశయుడి పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించుకుంటాం. దీనికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ప్రతినిధులు రావాలి. జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. అదే రోజున ఎన్టీఆర్‌ స్టేడియంలో ఒక సభ కూడా ఉంటుంది. కళా ప్రదర్శనలుంటాయి. అలాగే, ఏప్రిల్‌ 30వ తేదీన రాష్ట్ర నూతన సచివాలయాన్ని ప్రారంభించుకుంటాం. 2, 3వేల మందితో సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం. మంత్రులు తమ తమ పేషీల్లో ఏప్రిల్‌ 30 నుంచే అందుబాటులో ఉంటారు. అలాగే, జూన్‌ 1వ తేదీన అమరవీరుల స్మృతిజ్యోతిని ఆవిష్కరించుకుంటాం’ అని కేసీఆర్‌ చెప్పారు.

అవినీతిని సహించే ప్రసక్తే లేదు
రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి ఇప్పటివరకు అవినీతి మరక అంటకుండా పాలన సాగించామని కేసీఆర్‌ చెప్పారు. ‘గతంలో కాంగ్రెస్‌ హయాంలో రోజుకో స్కాం వెలుగులోకి వచ్చేది. గడిచిన 9 ఏండ్లలో కడుపుకట్టుకొని రాష్ర్టాభివృద్ధి కోసం పనిచేశాం. ఇదే పంథాను ఇకముందూ కొనసాగిద్దాం’ అని అన్నారు. ‘ఇది ఎన్నికల సంవత్సరం. ఎవరు తప్పుచేసినా మొత్తం పార్టీ బద్నాం అవుతుంది. ప్రభుత్వ పథకాల్లో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోను సహించే ప్రసక్తే లేదు. ఎన్నికల్లో పోటీచేయడానికి కూడా పార్టీనే నిధులు ఇస్తున్నప్పుడు ఇక అవినీతి, అక్రమాలకు తావు ఉండొద్దు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు. అవినీతికి పాల్పడేవారు తమ కొంపను తామే కాలపెట్టుకున్నట్టు. అలాంటివారిని ఎవరూ కాపాడలేరు. ప్రతిపక్షాలు కాచుకొని కూర్చున్నాయి. వారికి ఎట్టి పరిస్థితుల్లోను అవకాశం ఇవ్వవద్దు’ అని సీఎం కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు హితవు పలికారు.

ఏప్రిల్‌ 27న బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభ
ఏప్రిల్‌ 27న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభను నిర్వహించాలని, అక్టోబర్‌లో వరంగల్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవాలని పార్టీ విస్తృత సమావేశంలో నిర్ణయించారు. దీంతోపాటు ఏప్రిల్‌ 25వ తేదీన ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ సూచించారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ, మండల కమిటీలు, రైతుబంధు కమిటీలు, పార్టీ ముఖ్యనేతలందరినీ ఆహ్వానించాలని చెప్పారు. తొలుత గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ జెండా ఆవిష్కరణతోపాటు కార్యక్రమాలు జరుగుతాయని.. అనంతరం వారు నియోజకవర్గ కేంద్రానికి వచ్చి అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. పార్టీ అనుబంధ సంఘాలను కూడా పిలుచుకోవాలని, 2-3 వేల మందితో కార్యక్రమాలుండాలని చెప్పారు. ఎజెండాకు సంబంధించిన సర్క్యులర్‌ను త్వరలోనే జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలకు పంపిస్తామని కేసీఆర్‌ తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.