-ఢిల్లీలో తెలంగాణభవన్‌కు భూమిపూజ
-వసంత్‌విహార్‌లో వేదమంత్రాల హోరు
-వర్షం పడినా నిరాటంకంగా పూజలు
-గులాబీ జెండాసాక్షిగా పొంగిన ఆనందం
-తరలి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు
-గులాబీమయమైన ఢిల్లీ పుర వీధులు
-సీఎం కేసీఆర్ చేతులమీదుగా చారిత్రక ఘట్టం

హస్తినలో..మన దస్కత్..
దేశ రాజధానిలో ఆత్మగౌరవ పతాకం రెపరెపలాడింది. రెండు దశాబ్దాల టీఆర్‌ఎస్ అప్రతిహత ప్రస్థానంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి ఢిల్లీ గడ్డ మీద గూడు సమకూరబోతున్నది. సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న చరిత్ర.. సగర్వ సదనంగా నిలువబోతున్నది.
ఏడేండ్ల అభివృద్ధి కీర్తికాంతులు ధగధగలాడుతుండగా తెలంగాణ ఆకాంక్షల ప్రతీకగా నిలిచిన టీఆర్‌ఎస్ ఢిల్లీ కార్యాలయం ‘తెలంగాణ భవన్’కు సీఎం కేసీఆర్ వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శాస్ర్తోక్తంగా భూమిపూజ చేసి, పునాదిరాయి వేశారు. ఓ చారిత్రాత్మక సందర్భానికి వేదికైన వసంత్‌విహార్‌లో తెలంగాణ కోలాహలం మిన్నంటింది. అదో పండుగ సంబురం.. ఓ కల నిజమైన అబ్బురం.
దేశరాజధాని ఢిల్లీలోని వసంత్‌విహార్ గులాబీ వనమైంది. దశాబ్దాల తెలంగాణ ఆత్మగౌరవానికి చిహ్నమై వెలుగులీనింది. తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకించి రెండు దశాబ్దాల టీఆర్‌ఎస్ ప్రస్థానంలో చరిత్రాత్మకఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయం ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భూమిపూజ చేశారు. ఈ పవిత్రకార్యంలో భాగస్వాములయ్యేందుకు తరలివచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విద్యార్థి నేతలతో ఢిల్లీ పురవీధులన్నీ గులాబీ మయమయ్యాయి. ఉదయం నుంచే ఢిల్లీలోని తెలంగాణభవన్‌సహా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు బసచేసిన ప్రాంతాల నుం చి వసంత్‌విహార్ దాకా కోలాహలం నెలకొన్నది. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ మరోవైపు ఢిల్లీ వసంతవిహార్‌లో పార్టీ కార్యాలయానికి భూమిపూజ ఏకకాలంలో జరగడంతో గులాబీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. పరస్పరం అలయ్ బలయ్ తీసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు.
అపూర్వఘట్టానికి వేదికైన వసంత్‌విహార్
ఢిల్లీ వసంత్‌విహార్‌లో 1,100 చ.మీ. స్థలంలో తెలంగాణభవన్ నిర్మాణానికి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భూమిపూజ నిర్వహించారు. ఉదయం 11 గంటలకు వేదపండితులు గోపీకృష్ణ, ఫణిశశాంక్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సీఎం కేసీఆర్ వసంత్‌విహార్ భూమిపూజ కార్యస్థలికి మధ్యాహ్నం 1.14కి చేరుకున్నారు. తొలుత యజ్ఞంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం భూవరాహస్వామి యజ్ఞంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం భూసంప్రోక్షణ, భూమిపూజ జరిపారు.అసాధారణ ఏర్పాట్లు
తెలంగాణభవన్ భూమిపూజ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ శ్రేణులు అసాధారణ ఏర్పాట్లు చేశాయి. హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, విద్యార్థి, ఉద్యమనాయకులకు ఎ లాంటి లో టురాకుండా చర్యలు తీసుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, వాస్తు నిపుణుడు సు ద్దాల సుధాకర్‌తేజ ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్, కే కేశవరావు, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్ అలీ, సత్యవతిరాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ర్ట చిన్ననీటి వనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్‌లతో కేసీఆర్ కొబ్బరికాయలు కొట్టించారు. తర్వాత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టేందుకు బారులుతీరారు.
హర్షణీయం: మహేష్ బిగాల
తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఒక ప్రాం తీయ పార్టీకి ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు కానుండటం సంతోషంగా ఉన్నదని టీఆర్‌ఎస్ ఎ న్నారై విభాగం అధ్యక్షుడు మహేశ్ బిగాల తెలిపారు.
గర్వంగా ఉన్నది: మంత్రి వేముల
ఢిల్లీ నడిబొడ్డున పార్టీ కార్యాలయానికి జరి గిన భూమిపూజలో టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తో కలిసి పాలుపంచు కోవడం గర్వంగా ఉన్నదని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా సాగిందని తెలిపారు. పార్టీ కార్యాలయ భవనం నమూనాలు కొన్ని సిద్ధమయ్యాయని, వాటిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఆమోదించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకభూమిక పోషించాలని టీఆర్‌ఎస్ కా ర్యకర్తగా తాను అభిలషిస్తున్నానని చెప్పారు.