– ఆంధ్రా బాబులు అప్పనంగా బ్రోకర్లకు కట్టబెట్టారు – మ్యానిఫెస్టో కచ్చితంగా అమలు చేస్తం – బంగారు తెలంగాణను చేసుకుంటం: ఆర్థిక మంత్రి ఈటెల
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా ముఖ్యమంత్రులు వైఎస్సార్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌లు తెలంగాణ భూములను బ్రోకర్లకు, వ్యాపారులకు అప్పనంగా కట్టబెట్టారు. ఎవడబ్బ భూములని వాళ్లకు దారదత్తం చేశారు. అక్రమంగా కబ్జాలు చేసుకున్న గురుకుల్ భూములను కూల్చుడే.. స్వాధీనం చేసుకునుడే అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
అదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వ్యాపారులు, అన్ని వర్గాలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలవరంపై ఏం జరుగుతోందో అందరికీ తెలుసని, కష్టాలు, కన్నీళ్లు తమకు కోత్తేమీ కాదన్నారు. పోరాటాలు చేస్తూనే ఉంటామని, న్యాయమైన కోర్కెలు సాధించుకుంటమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని, ఈ నెల క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని అంశాలన్నీ వెల్లడిస్తామన్నారు. బంగారు తెలంగాణను సాధించుకుంటామని, అందుకు అందరి సహకారాలు అవసరమన్నారు. అభివృద్ధిని చేసుకుందామని, దానికి సంబంధించిన వివరాలు అందించాలని కోరారు. సీనియార్టీ, సిన్సియార్టీలకు ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.
నాయకులు ప్రజలను, ప్రభుత్వాన్ని కాపాడాలని, అందుకు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులు, వ్యాపారులు నీతి, నిజాయితీతో మెలగాలని, ఫిర్యాదులోస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ పదవులు ప్రజలవేనని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, అలా చేయని నాడు రాజకీయాలను వీడుతానని ప్రతిజ్ఞ చేశారు. నాయకులను మాత్రమే కాదు ధర్మాన్ని, ప్రజలనే నమ్ముతానని స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.