-టీఆర్‌ఎస్ ప్లీనరీలో పండుగ శోభ.. -కాంగ్రెస్, బీజేపీలపై సమరశంఖం పూరించిన సీఎం శ్రీ కేసీఆర్ -పెద్ద సంఖ్యలో డిజిటల్ ఏసీలతో చల్లదనం -ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎన్నారైల ర్యాలీ
ప్లీనరీ విజయవంతంతో సంబురాలు
టీఆర్‌ఎస్ పార్టీ 17 వ ప్లీనరీ విజయవంతం కావడంతో అధికార పార్టీలో నూతనోత్సాహం ఉరుకలేస్తున్నది. కొంపల్లి వేదికగా సభ సక్సెస్ కావడంతో గులాబీశ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. కేసీఆర్ చేసిన ప్రసంగంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వచ్చే అక్టోబరు నెలాఖరు లేదా నవంబరు మొదటివారంలో నిర్వహించనున్న పార్టీ బహిరంగసభలో మరింత ఉత్సాహంతో పాల్గొనేందుకు శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
ప్రత్యేక సామూహిక నమాజ్ ప్లీనరీ శుక్రవారం జరుగడంతో సభకు హాజరైన ముస్లిం కార్యకర్తలు, నాయకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభ వేదికకు ఎడమవైపున ఏర్పాటుచేసిన నమాజ్ ప్రాంగణంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ముస్లిం మతగురువుల సమక్షంలో సామూహిక ప్రార్థనలు జరిపారు.
ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ ఎన్నారైలు
ప్లీనరీలో తెలంగాణ ఎన్నారైలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమారు 24 దేశాల నుంచి 125 మంది ప్రతినిధులు ప్లీనరీలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ ఎన్నారై కో-ఆర్డ్డినేటర్ మహేశ్ బిగాలా సారధ్యంలో తెలంగాణ భవన్ నుంచి చేపట్టిన భారీ కార్ల ర్యాలీ ఆకట్టుకుంది.
ఆటాపాటతో ఉత్సాహం కొంపల్లిలో జరిగిన పార్టీ ప్లీనరీ ఆటాపాటలతో హోరెత్తింది. సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ నేతృత్వంలోని బృందం పార్టీ ప్రతినిధుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రసమయి బృందానికి మంగ్లీతోడు కావడంతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ప్లీనరీలో సాంస్కృతిక బృందానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై కార్యక్రమాలు జరిగినంత సేపు మహిళా నాయకులు డ్యాన్స్‌లు వేశారు. బతుకమ్మ పాటలకు ప్లీనరీకి హాజరైన మహిళలు బొడ్డెమ్మలు వేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై ప్రత్యేకంగా రూపొందించిన నృత్యరూపకాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. ప్లీనరీ సందర్భంగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఎగురవేశారు. తెలంగాణ తల్లికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళ్లు అర్పించారు. సీఎం కేసీఆర్ సూచనతో.. ప్రతినిధులందరూ నిమిషంపాటు అమరుల కోసం మౌనం పాటించారు. ప్లీనరీలోకి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య స్వాగతోపన్యాసం చేయగా, ముగింపులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వందన సమర్పణ చేశారు. ప్లీనరీని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.