Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

గులాబీవనం తెలంగాణ , 50 లక్షలు దాటిన టీఆర్‌ఎస్ సభ్యత్వాలు..

-50 లక్షలు దాటిన టీఆర్‌ఎస్ సభ్యత్వాలు.. -సభ్యులందరికీ వ్యక్తిగత బీమా -ప్రజలు అపురూపంగా స్పందించారు -ప్రభుత్వ పనితీరుపై సంకేతమిచ్చారు -చేసిన వాగ్దానాలన్నీ నిలుపుకొంటాం -టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ -పార్టీ షెడ్యూలులో స్వల్ప మార్పులు -5నుంచి గ్రామ కమిటీలకు ఎన్నికలు -ఏప్రిల్ 24న ఎల్బీస్టేడియంలో విస్తృతస్థాయి సమావేశం.. రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక -27న పెరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ -28 వరకు కంప్యూటరీకరణ ప్రక్రియ

KCR-addressing-media-on-Membership-drive

టీఆర్‌ఎస్ సభ్యత్వాలు 50 లక్షలు దాటిపోయాయని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సభ్యత్వ నమోదుకు అపురూప, అనూహ్య స్పందన వచ్చిందని.. ఊహించిన దానికి మించి ప్రజల నుంచి ఆదరణ లభించిందని ఆయన పేర్కొన్నారు. వెల్లువలా వచ్చిన ఈ సభ్యత్వాలు తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందనకు తార్కాణంగా నిలిచాయని చెప్పారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతోపాటు చదువుకునే విద్యార్థులు సైతం ఉత్సాహంగా సభ్యత్వాలు స్వీకరించారని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణభవన్‌కు వచ్చారు. సభ్యత్వ ప్రక్రియ పరిశీలించి.. స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇతర సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం భవన్‌లోని మీడియా హాలులో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత సభ్యత్వాల ద్వారా పార్టీకి ఇప్పటివరకు రూ.5 కోట్లు సమకూరాయని కేసీఆర్ చెప్పారు. సభ్యులందరికీ గంపగుత్తగా కాకుండా ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా బీమా సౌకర్యం కల్పిస్తామని వివరించారు. సభ్యత్వాల కంప్యూటరీకరణ, క్రియాశీల సభ్యత్వాల్లో ఫొటోల స్కానింగ్ తదితర అంశాలు దృష్టిలో ఉంచుకుని సభ్యత్వ ప్రక్రియను ఈ నెల 28 వరకు పొడిగించినట్టు చెప్పారు. అలాగే పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చేశామని ఆయన వివరించారు. మార్చి 5వ తేదీ నుంచి 20 వరకు గ్రామ, 24నుంచి మండల కమిటీల ఎన్నికల నిర్వహణ జరుగుతుందన్నారు. ఏప్రిల్ 24న ఎల్బీ స్టేడియంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుపుకొని 27న పెరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వివరించారు.

30 లక్షలు అనుకుంటే..: వాస్తవానికి తాము సభ్యత్వ కార్యక్రమం తీసుకున్న రోజున 30 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా విధించుకున్నామని.. అయితే ప్రజా స్పందనతో అది 50 లక్షలు దాటిపోయిందని కేసీఆర్ తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సభ్యత్వ నమోదులో భాగస్వాములయ్యారని, ప్రభుత్వం బాగా పని చేస్తుందని సంకేతాలు ఇచ్చారని అన్నారు. సభ్యత్వ నమోదుకు అపురూప స్పందన వచ్చింది. ప్రజలు ఊహించిన దాని కంటే ఎక్కువగా భాగస్వాములయ్యారు. జంట నగరాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకున్నరు. చాలాచోట్ల విద్యార్థినీ, విద్యార్థులు కూడా సభ్యత్వం తీసుకున్నరు.

ఈ స్పందన చూస్తుంటే కచ్చితంగా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు ప్రవేశపెట్టి, ముందుకుపోతుందనే సందేశాన్ని ఇచ్చిండ్రు. భవిష్యత్తులో మరింతగా ఒళ్లు దగ్గర పెట్టుకొని పార్టీ, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరముందని వెల్లడైంది. సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కమిటీ సభ్యులు బాగా కష్టపడి పనిచేశారు. వారందరికీ అభినందనలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గ్గొన్నారు అన్నారు.

అందరికీ వ్యక్తిగత బీమా..: సభ్యత్వ నమోదు ద్వారా పార్టీకి రూ.5 కోట్ల మొత్తం వచ్చిందని, ఇంకా 3-3.50 కోట్ల వరకు రావాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో పార్టీ ఖజానాలో ఉన్న రూ.4 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామని చెప్పారు. సభ్యత్వం తీసుకున్న 50 లక్షల మందికి పైగా సభ్యులందరికీ కచ్చితంగా ఇన్సూరెన్స్ వర్తిసుందని వివరించారు. ఇతర పార్టీల మాదిరిగా గంపగుత్తగా ఇన్సూరెన్స్ చేయడం లేదని.. ప్రతి ఒక్కరికీ వారి పేర్ల మీద వ్యక్తిగత ఇన్సూరెన్స్ ఉంటుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్ సభ్యత్వ కాపీని కంపెనీలకు పంపి వారి పేర్ల మీద బీమా చేస్తామన్నారు. దీనివల్ల మంచీ చెడు జరిగినపుడు వారి కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

ఈ నెల 28 వరకు గడువు పెంపు..: టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు శుక్రవారంతో ముగిసినప్పటికీ… చాలాచోట్ల గతంలో తీసుకున్న పుస్తకాలు ఉండిపోయాయని, ఆన్‌లైన్ కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా ఇంకా పూర్తి కాలేదని కేసీఆర్ చెప్పారు. ఇప్పటివరకు 9.53 లక్షల సభ్యత్వ వివరాలను కంప్యూటరీకరించినట్లు తెలిపారు. క్రియాశీల సభ్యత్వానికి సంబంధించి ఫొటో కూడా ఉంటుందని కంప్యూటర్‌లో నమోదు చేసేందుకు 10-15 నిమిషాల సమయం పడుతుందన్నారు. ఇలా చాలా సమయం తీసుకుంటున్న దరిమిలా ఈనెల 28 వరకు ఆ ప్రక్రియకు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు.

పార్టీ నిర్మాణ షెడ్యూలు ఇది..: గతంలో ప్రకటించిన పార్టీ షెడ్యూల్‌లో జరిగిన స్వల్ప మార్పులను సీఎం కేసీఆర్ వెల్లడించారు. మార్చి 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 15 రోజుల వ్యవధిలో గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు ఉంటుందన్నారు. తెలంగాణభవన్ నుంచి సభ్యత్వ నమోదు జాబితా ప్రతి గ్రామానికి వెళుతుందని, అందులో పేర్లు ఉన్న వారే పోటీ చేస్తారని తెలిపారు. అధిష్ఠానం నియమించిన ఎన్నికల అధికారులు వెళ్లి ఎన్నికలు నిర్వహిస్తారని వివరించారు. వచ్చేనెల 20 లోపు గ్రామ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక పూర్తవుతుందని, ఆ తర్వాత ఆ జాబితా భవన్‌కు చేరేందుకు నాలుగు రోజుల వ్యవధిని ఇచ్చామని పేర్కొన్నారు.

అనంతరం మార్చి 24 నుంచి ఏప్రిల్ ఆరో తేదీ వరకు మండల పార్టీ ఎన్నికలు జరుగుతాయన్నారు. వీటి తర్వాత జిల్లా కమిటీల ఎన్నికలు పది జిల్లాల్లో ఒకేరోజు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆ తేదీలను పార్టీ ప్రకటిస్తుందన్నారు. గతంలో ఏప్రిల్ 24న పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని కొంపల్లిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ వేదికను ఎల్బీ స్టేడియంకు మార్చారు. ఏప్రిల్ 24న ఎల్బీ స్టేడియంలో పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని తెలిపారు. ఏప్రిల్ 27న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.

అవినీతిరహితంగా ప్రభుత్వ పంథా..: సభ్యత్వ నమోదును ఆదరించినందుకు కేసీఆర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నెలల తరబడి సభ్యత్వ నమోదును పొడగించే మూస ధోరణిలా కాకుండా నిర్ణీత సమయంలో ఊహించిన దాని కంటే అనూహ్యంగా సభ్యత్వ నమోదు జరిగిందన్నారు. రెట్టించిన ఉత్సాహంతో పట్టుదల, చిత్తశుద్ధితో అన్ని పథకాలను అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు కచ్చితంగా అందిస్తామని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. 2018లోగా రాష్ట్రంలో అదనంగా 23వేల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులో వస్తుందన్నారు. చత్తీస్‌గడ్ నుంచి మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్తును కూడా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన పారిశ్రామిక విధానాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.

పదిహేను రోజుల్లోనే అనుమతి ఇచ్చేందుకు తగిన యంత్రాంగాన్ని ప్రస్తుతం రూపొందిస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కమిటీ సభ్యులు సత్యవతి రాథోడ్, పురాణం సతీష్ పాల్గొన్నారు.అంతకుముందు సాయంత్రం 6.45 గంటలకు తెలంగాణ భవన్‌కు వచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సభ్యత్వ నమోదు కంట్రోల్ రూంను పరిశీలించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బొంతు రామ్మోహన్ కంప్యూటరీకరణ ప్రక్రియ వివరాలను వివరించారు.

నోరు మంచిదైతే ఊరు మంచిది కేంద్ర ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ చేరుతుందనే ప్రచారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.అసలు ఆ అంశంపై చర్చ జరగనే లేదు.ఆ చర్చ వచ్చినపుడు చూద్దాం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ మిమ్మల్ని చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు అని విలేకరులు చెప్పినపుడు అన్నపుడు నోరు మంచిదైదే… ఊరు మంచిదవుతుంది కదా అని కేసీఆర్ చమత్కరించారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో మీడియాతో కేసీఆర్ కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

సచివాలయంలో నియంత్రణపై మీడియానే సంప్రదిస్తా..: సచివాలయంలో మీడియాపై నియంత్రణ మీద కేవలం చర్చ మాత్రమే జరిగిందని ఓప్రశ్నకు ముఖ్యమంత్రి బదులిచ్చారు. అప్రజాస్వామికంగా వ్యవహరించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. అయితే సచివాలయంలో ఇప్పుడున్నంత విచ్చలవిడిగా మాత్రం పరిస్థితి ఉండరాదని స్పష్టం చేశారు. శనివారం మధాహ్నం 2-4 గంటల మధ్యలో ప్రెస్ అకాడమిలో సమావేశానికి వస్తున్నానని, అక్కడే ఏం చేయాలనే దానిపై జర్నలిస్టు సంఘాలతో మాట్లాడతానన్నారు. వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అది చంద్రబాబు సంస్కారానికే వదిలేస్తా..:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్ర ఉండబోదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని విలేకరులు తెలిపినపుడు అది వాళ్ల సంస్కారానికే వదిలేస్తం అని కేసీఆర్ అన్నారు. మేంమాత్రం కచ్చితంగా తెలంగాణ చరిత్రను పాఠ్యాంశాల్లో చేరుస్తున్నం. ఏపీలో ఎవరైనా ఒకటీ, అరా మహానుభావులు ఉంటే కూడా చేరుస్తం అని చెప్పారు.

అసెంబ్లీ సమావేశాల తేదీపై నేడు స్పష్టత..: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల పది లోపు ఏదో ఒకరోజు ప్రారంభమవుతాయని కేసీఆర్ చెప్పారు. అయితే తేదీలను ఇంకా నిర్ణయించలేదని, శనివారం అసెంబ్లీకి వెళ్లి స్పీకర్‌ను ఈ విషయమై సంప్రదిస్తామని చెప్పారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం సీట్లకు పార్టీ అభ్యర్థుల పేర్లు శనివారం సాయంత్రం ప్రకటిస్తామని సీఎం చెప్పారు.

కేంద్ర బడ్జెట్ వచ్చాకే మన బడ్జెట్‌పై స్పష్టత..:తెలంగాణ బడ్జెట్ లక్షకోట్లు ఉంటుందా? అన్న ప్రశ్నకు కేంద్ర బడ్జెట్ వస్తే తప్ప రాష్ట్ర బడ్జెట్ మీద సంపూర్ణ అవగాహన రావడం కష్టమని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం అసలు మన రాష్ట్రం ఆదాయమెంత అనేది కచ్చితంగా వివరాలు లేవని.. ఇప్పటిదాకా అన్నీ అంచనాలేనని చెప్పారు.గతంలో 120కి పైగా కేంద్ర ప్రభుత్వ పథకాలుండేవని, ఇప్పుడు 66కు కుదించారని, కేంద్రం ఏపథకానికి ఎంతిస్తదనేది తేలాలన్నారు. తర్వాతే అంచనా వస్తుందన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.